సృష్టి జన్మ సాధన Part 2 రచన: కౌతా మార్కండేయశాస్త్రి

ధ్యానము ఎందుకుచేయాలి?

ఆకలి వేసినపుడు ఆహారంకావాలి. అదేవిధంగా శరీర సమతుల్యతకి ధ్యానం అవసరం. ఊహ వచ్చినప్పటినుంచి చచ్చిపోయేంత వరకు, శాంతిసౌఖ్యములకై, కుల మత విచక్షణ, వర్గ భేదం, వర్ణ భేదం, లింగ భేదం లేకుండా అందరూ చేయదగ్గది ధ్యానం. రోజులో ఎంతో కొంత సమయం, ఉదయం, సాయంత్రం, రాత్రి వెచ్చించి సద్గురువు ద్వారాగాని, సద్గురువుకి సంబంధించిన యోగదా సత్సంగ సమితి, రాంచి, లాంటి సంస్థల ద్వారాగాని ధ్యాన పద్ధతులు నేర్చుకొని అభ్యసించవలయును.

సృష్టి – ప్రళయం:

ఒకటి అనేకం అవటంసృష్టి. అదే బిగ్ బాంగ్(Big Bang Theory) సిద్ధాంతము.. అదే బిందు విస్ఫోటనం. అనేకం మరల ఆ ఒక్కటిలో చేరటం ప్రళయం. నీటిలో పడవ ఉండవచ్చు. పడవలో నీరు ఉండకూడదు. అదే విధంగా సంసారంలో (నీరు) వ్యక్తి (పడవ) ఉండవచ్చు. వ్యక్తి (పడవ) లో సంసారం (నీరు) ఉండకూడదు. రోజూ బిడ్డని త్రిప్పుకొని వచ్చే పనిమనిషి డబ్బు తక్కువ ఇచ్చారని పనిమానివేసిన చందమున, సంసారం మీద అతి మోహం పనికి రాదు. నీవు అద్దె ఇంటిలో ఉంటున్న విధముగా, పరమాత్మ ఇంటిలో అద్దెకి ఉంటున్నట్లుగా భావించవలెను. ఈ ప్రపంచం అనే రంగస్థలములో పరమాత్మ దర్శకుడు, వ్యక్తి సూత్రధారుడు. పరమాత్మ మెచ్చుకునేటట్లుగా తన పాత్రను పోషించాలి.
సర్వమూ పరమాత్మే
జ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నః అన్నాదఏవచ
                                                విష్ణుసహస్ర నామం 130
విష్ణు సహస్ర నామంలో పరమాత్మ గురించి అన్నః అన్నాద ఏవ చ అని వస్తుంది.
అన్నము (ఆహారము), పరమాత్మే, అన్నము ఆరగించే వాడు కూడా పరమాత్మే.
అనగా ఆహారము శక్తి,  ఆహారమును (ఆశక్తిని) ఆరగించేది కూడా శక్తే.

ఎంతవెచ్చించాలి ధ్యానము కొఱకు?

ఒక్కొక్క గ్రహములో ఒకే వస్తువు వివిధ రకములైన తూనిక తూగును.
దానికి కారణం ఆ గ్రహముయొక్క ఆకర్షణశక్తి. అనగా ఆ గ్రహముయొక్క ఆకర్షణ శక్తిని బట్టి బరువు ఆధారబడును. అటులనే విద్యా విషయములలో ప్రమాణములు గూడా ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి హెచ్చు తగ్గులుగా ఉంటూఉంటాయి. అటులనే యుగధర్మములను బట్టి, వారివారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి, తెలివి తేటలు గాని, ధ్యానసిద్ధి గాని ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఒక్కొక్కడు 5 లేక 6 సంవత్సరముల వయసు లోనే సంగీత ప్రావీణ్యత, సైకిలు, మోటారుసైకిలు, కారు, వగైరాలు నడిపే ప్రావీణ్యత కలిగి ఉండును. ఈ ప్రావీణ్యత కలిగి ఉండుటకు కారణము వారివారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించియే. అనగా పూర్వ జన్మ కృషి ఫలితములే ఈ జన్మలో వారికి సహాయభూతముగా ఉంటూ ఉన్నవి. ఒక బండ పగలగొట్టటానికి 20దెబ్బలు అవసరమనుకుందాము. ఒకడు 18 దెబ్బలు కొట్టి విసిగి పోవును. మిగిలిన 2 సుత్తి దెబ్బలు కొట్టగానే ఆ బండ పగిలి పోవును. ఆ బండ పగలటానికి కారణము ఆ వ్యక్తియొక్క గొప్పతనము కాదు. ఆ బండ పగలడానికి కారణము దానికి కావలిసిన దెబ్బలు పడటమే. అటులనే క్రిందటి జన్మలలో బాగా కృషి చేసివచ్చిన వ్యక్తి ఈ జన్మలో స్వల్ప కృషితోనే పైకొస్తాడు. క్రిందటి జన్మలలో కృషి చేయని వ్యక్తి ఈజన్మలో ఇఛ్ఛా శక్తితో దృఢ నిశ్చయంతో కృషి చేసిన తప్పక ఫలితం సంక్రమించును. దాన్నే కర్మ అందురు. కనబడనిది కర్మ. ఆ కనబడని కర్మనే దైవం అందురు.
బుద్ధిః కర్మాణుసారిణీ అనుటకు కారణమిదే.
సాధారణ జీవితానికి దూరంగా త్రేతాయుగములో 14 సంవత్సరముల అరణ్యవాసము అనగా యోగసాధన, ద్వాపర యుగములో 12 + 1 = 13 సంవత్సరముల అరణ్యవాసము నిర్ణయించబడినది. అనగా యోగసాధన యుగధర్మములను అనుసరించి వచ్చినవే. ఆ అరణ్యవాససమయములో యోగసాధనా ధ్యానమే వారు చేసినది. ప్రస్తుత కలియుగములో ఒక నియమిత కాలమును నిర్ణయించుకొని, ఉదయం, సాయంత్రం, రాత్రి ధ్యాననిమజ్ఞులై ఉండాలి. ఆవిధంగా కనీసం 10, 20, 30 నిమిషములు ఎంత సమయము చిక్కితే అంత, గ్రాహస్థాశ్రమధర్మములు నిర్వర్తించుకుంటూ, వీలు లేదా సమయము చిక్కినపుడల్లా టి. వి. ప్రోగ్రాములు, పోచికూలి ఖబుర్లు మానివేసి లేదా చాలా వరకు తగ్గించి, ధ్యానం చేస్తే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని సాధిస్తాడు మానవుడు. విద్యార్థులలో జ్ఞాపకశక్తి, పఠనాశక్తి, సృజనాత్మకత పెరుగును. పెద్దలయడ గౌరవము కూడా వృద్ధిచెందును. అంతేగాదు. ఉద్రేక పూరక స్వభావము తగ్గి శాంతం, సహనము వృద్ధి చెందును. కనుక ప్రస్తుత ప్రపంచములో ధ్యానం మరింత అవసరం.

మూడవనేత్రం:

ధ్యానపరుడైన వ్యక్తికి స్థిరదృష్టి ఏర్పడినపుడు భ్రూమధ్యంలో కూటస్థంలో మూడవ కన్ను తెరుచుకొనును. ఆత్మజ్యోతి దర్శనం అగును. లేదా కుడి చెవులో ఓంకార నాదం వినబడును. ఐదు భుజములు ఉన్న నక్షత్రము సత్ అనగా పరమాత్మ. సృష్టికి అతీతమైన పరమాత్మ నీలం లేదా నలుపు సృష్టిలో ఉన్న భగవంతుడు. లేదా తత్ లేదా శుద్ధ సత్వమాయ. బంగారం రంగు వలయం ఓంకారము.  
శబ్దం ఒక సెకనుకు 1140 అడుగులు ప్రయాణము చేయును.  220C లో 344 మీటర్లు ప్రయాణము చేస్తుంది.
కాంతి కిరణము ఒక సెకనుకు 3 x 108 మీటర్లు ప్రయాణము చేయును.
కనుక శబ్దం వినబడుతే శబ్దంలోను, కాంతి కనబడితే కాంతిలోనూ లయంఅవుతే పరమాత్మ దర్శనం అవుతుంది. ఏదేని పాట వినబడుతున్నపుడు ఆ శబ్దాన్ని అనుసరించి వెడితే ఆ పాట ఎక్కడినుండి వచ్చునో ఆ మూలము (source) తెలియవచ్చును. పరమాత్మ సృష్టిఫాక్టరీ (factory) నుండి  వచ్చే శబ్దమే ఓంకారము. కనుక ఆ ఓంకారశబ్దమును అనుసరించి వెళ్ళిన ఆ ఓంకార శబ్దమునకు మూలమైన పరమాత్మ దర్శనమగును.

మహాభారతము (గొప్ప వెలుగు):

మహాభారతము అనగా గొప్ప వెలుగు. స్థిరధ్యానమునకు ఎన్నో అనుకూల మరియు ప్రతికూల శక్తులు శరీరము లోపల బయట ఎదురగును. బయటి ప్రతికూల శక్తులను నిర్జన ప్రదేశములకు వెళ్ళి నిరోధించవచ్చును. కాని అంతఃశక్తులు నిర్జన ప్రదేశములకు వెళ్ళినంత మాత్రమున మనోఫలకముల నుండి చెరిగిపోవు.
చంచలంహిమనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం గీత 6-34
చంచలప్రాణం స్థిరప్రాణమయితే అది స్థిరమనస్సుకి దారి తీస్తుంది. ఆ నిశ్చలచిత్తము జీవన్ముక్తికి సోపానము. కనుక ప్రతి వ్యక్తి హనుమాన్ అవ్వాలి. హను అనగా చంపటం, మాన్ అనగా మనస్సుని. అనగా మనస్సుని స్థిరం చేయటమే హనుమాన్. మనస్సుని స్థిరం చేసుకొని బ్రహ్మ జ్ఞానముతో పండిపోయిన హనుమాన్ ఎఱ్ఱటి పెదవులు గల వాడయ్యెను. అందుకనే అహంకారం, భయం, సంస్కారాలు, రాగ ద్వేషములు మొత్తంగా అరి కట్టాలి. మహా భారతంలోని పాత్రలన్నీ ఈ అంతఃశక్తుల ప్రతీకలే. అర్జునుడు అనగా సాధకుడు అని అర్థం.
న చైతద్విద్మః కతరన్నోగరీయో యద్వా జయేమ యదివానోజయేయుః
                                                                                       గీత 2 - 6
ఈ యుద్ధమున మనము గెల్చుదుమో లేక వారే గెల్చుదురో చెప్పలేము.

అర్జునుడు అనగా సాధకుడు ముందుగా తనలోని ఈ సాధనలో ముందుకు వెళ్ళగలనా లేదా అనే భయాన్ని అనగా భీష్ముణ్ణి చంపవలెను. భీష్ముడు భయానికి, అహంకారానికి ప్రతీక. విద్య మొదలు పెట్టుటకు ముందుగానే విద్యార్ధి ఉద్యోగం వచ్చునో లేదో అని భయపడి ఆలోచించి చదవకూడదు. ఉద్యోగం రానీ, రాకపోనీ అనేనిర్భయం విద్యార్ధికి అవసరం. ఆ తరువాత సంస్కారాల్ని, తనలో సంస్కారాల ప్రతీక అయిన ద్రోణుణ్ణి చంపాలి. సంస్కారాలు మంచివి అనగా బంగారు సంకెళ్ళు, చెడువి అనగా ఇనపసంకెళ్ళు, రెండూ చంపవలెను. చివరిగా రాగద్వేషాలు అనగా తనలోని కర్ణుణ్ణి చంపవలెను. కర్ణుడు రాగద్వేషాలకి ప్రతీక. ఎవరి ఇంట్లోనైనా వ్యక్తి చనిపోతే మనం అంత బాధపడము. ఆ వ్యక్తితో సన్నిహిత సంబంధము లేదు కనుక మనం అంత బాధపడము. అదే మన ఇంట్లో వ్యక్తి చనిపోతే మిక్కిలి బాధపడతాము. కారణము ఆ వ్యక్తితో ఉన్న సన్నిహిత సంబంధమువలననే. కనుక మనము బాధ పడటానికి, పడకపోవటానికి కారణము కేవలం మోహమే. కనుక సాధకుడు (ఇక్కడ అర్జునుడు), తనలోని భీష్ముణ్ణి (భయాన్ని), ఆతరువాత సంస్కారాల్ని (ద్రోణుణ్ణి), చివరిగా తనలోని రాగద్వేషాలను (కర్ణుణ్ణి) చంపుకోవలయును. అప్పుడు ఆత్మ జ్యోతి దర్శనమగును.
శబ్దము కంటే వెలుగు వేగము గనుక ఆ వెలుగులో లయమైతే గొప్ప వెలుగు (మహా భారతము)  కనబడుతుంది).
అందుకనే గీత మొదటి శ్లోకము ధర్మ క్షేత్రే కురు క్షేత్రేఅనగా క్షేత్రే క్షేత్రే ధర్మకురు అనగా ప్రతి క్షేత్రంలోనూ ధర్మం అనగా యోగా ధ్యానం చేయమని చెప్పినది.

స్వధర్మ – పరధర్మ:

శ్రేయాన్ స్వధర్మోవిగుణ: పరధర్మాత్ అనుష్టితాత్              గీత 3 - 35

 బిడ్డకి తల్లి పుట్టినప్పటినుంచి పాలు, సాత్వికాహారం, ఇచ్చి పెంచుతుంది. అంతే గాని, సారాయి, గుట్కా (పొగాకు) సిగరెట్ వగైరాలు ఇచ్చి పెంచదుకదా. ఎందుకంటే ఈ సారాయి, గుట్కా (పొగాకు), సిగరెట్ వగైరాలు సహజమైన ఆహారం కాదు కనుక. అదే విధముగా ఇంద్రియధర్మములు అనుసరించుట అనునది పరధర్మం. కత్తిని కూరగాయలు కోసుకోవటానికి ఉపయోగించటం అనేది అవసరము ధర్మ బద్ధము. కత్తిని హత్య చేయటానికి ఉపయోగించటం అనేది అనవసరము, అధర్మబద్ధము. అదే విధముగా ఇంద్రియములు కూడా ధర్మబద్ధముగా ఉపయోగించుటకు మాత్రమే ఉన్నవి. అధర్మబద్ధముగా ఉపయోగిస్తే వాటి దుష్ఫలితములు జన్మ జన్మకీ అనుభవించక తప్పదు. ఆత్మ ధర్మము పాటిస్తే సత్ఫలితము. ఇంద్రియధర్మము అధర్మంగా ఉపయోగిస్తే దుష్ఫలితము. కనుక ఆత్మధర్మమే అనగా స్వధర్మమే ఆచరిందపగినది. పరధర్మము అనగా ఇంద్రియధర్మము భయావహము.

భగవద్గీత:

భగవద్గీత కలియుగమునకు 38 సంవత్సరముల పూర్వము, ద్వాపరయుగాంతమున  బోధించబడినది.
గీత బోధించబడిన సమయములో శ్రీకృష్ణుని వయసు షుమారుగా 87 సంవత్సరములు.
శ్రీకృష్ణుని అవతారకాలము ఉపాధి వయస్సు షుమారుగా 125 సంవత్సరముల 8 నెలలు.
గీతలో మొదటి శ్లోకము ర్మక్షేత్రే కురు క్షేత్రే
గీతలో ఆఖరి శ్లోకము ఆఖరి పాదము ధృవా నీతిర్ మతిర్ మ
మొదటి పాదము మొదటి అక్షరము
గీతలో ఆఖరి శ్లోకము ఆఖరి పాదము ఆఖరి అక్షరము మ.
కలిపితే ధమ అనగా ధర్మము అని అర్థం. అనగా గీత మొత్తం ధర్మబోధే.
గీతా ని తిరగరాస్తే తాగీ అనగా త్యాగం అని అర్థం.
మల, విక్షేపణ, ఆవరణ దోషములు త్యాగం చేయమని అర్థం.
18  అనే సంఖ్య గీతలో చాలా ముఖ్యమైనది.
గీతలోని అధ్యాయములు 18
మహాభారత యుద్ధంజరిగినది 18 రోజులు
మొత్తం కౌరవ + పాండవసేన = 11 + 07 = 18 అక్షౌహిణీలు
 మహాభారత పర్వములు 18
అక్షౌహిణీ  అనగా
ఏనుగులు 21870   2+1+8+7+0 = 18
రథములు 21870   2+1+8+7+0 = 18
గుఱ్ఱములు 68610   6 + 8+ 6+ 1+ 0 = 18
నేలమీద యుద్ధ చేసే సైనికులు 109350   1+ 0+ 9+ 3+ 5+ 0 = 18

బ్రహ్మ జ్ఞానులు:

దిగంబరోపివా చ సాంబరోవాత్వగంబరోపివాచిదంబరస్థః
ఉన్మత్తద్వాపిచబాలవద్వాపిశాచవద్వాపిచరత్యవన్యామ్
చిదాకాశమున సదా విహరించు జ్ఞానస్వరూపియగు జీవన్ముక్తుడు దిక్కులే వస్త్రములుగా గలవాడై గాని, వస్త్రధారియై గాని, చర్మధారియై గాని, పిచ్చివానివలె గాని, బాలునివలె గాని, పిశాచమువలె గాని భూమియందు సంచరించుచున్నాడు.
పరా పశ్యంతి ప్రియా, వైఖరి:
పరావాక్ మూలచక్రస్థః పశ్యంతి నాభిసంస్థితః
హృదిస్థా మధ్యమా జ్ఞేయా వైఖరీ కంఠదేశగా
 పరావాక్కు మూలాధారంలోను, పశ్యంతి వాక్కు మణిపురంలోను, మధ్యమావాక్కు అనాహతచక్రంలోను, విశుద్ధచక్రంలో వైఖరీవాక్కు ఉండును.
ఆపస్తంభసూత్రము: అసంగో శబ్దో శరీరో స్పర్శశ్చ మహాన్ శుచిః
పరమాత్మ అవయవరహితుడు, శబ్దస్పర్శాదిగుణరహితుడు, సూక్ష్మాతి సూక్ష్ముడు, తర్కమునకు అతీతుడు, మహాత్ముడు, శుద్ధుడు.
ఆపః అనగా నీరు. సంసారము నీరులాంటిది. సంసారము అనే స్తంభమునకు ఆధారము ప్రాణశక్తి. జడమైన ఈ శరీరమును పరమాత్మను జతచేసే సూత్రము (దారము) ప్రాణశక్తి. క్రియాయోగసాధన చేయవలయును. ప్రాణశక్తిని నియం త్రించ వలయును. ప్రాణాయామముతో ఈ ప్రాణశక్తిని నియంత్రించిన యడల మనస్సు నిశ్చలమగును. అది ముక్తికి సోపానము. క్రియాయోగసాధనద్వారా ప్రాణశక్తిని నియంత్రించి మోక్షసిద్ది పొందటమే ఆపస్తంభసూత్రము.

కొన్ని ముఖ్య శ్లోకములు:

తపఃపరంకృతయుగే త్రేతాయుగం జ్ఞానముచ్యతే
 ద్వాపరేయజ్ఞమిత్యాహుః దానమేవకలౌయుగే
కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలి యుగంలో దానం అనన్యభక్తి ఉత్తమమైనవి.
కృతేత్ అస్థిగతాః త్రేతాయాం మాంస మాస్రితాః ద్వాపరే రుధిరశ్చైవ కలౌత్వన్నాదిషు స్థితాః
ప్రాణులు కృతయుగంలో శల్యమును, త్రేతాయుగంలో మాంసమును, ద్వాపర యుగంలో రక్తాన్ని, కలియుగంలో అన్నాన్ని ఆశ్రయించుకొని ఉందురు..
కృతేతు మానవాధర్మాః త్రేతాయాం గౌతమస్మృతాః ద్వాపరేశంఖలిఖితాః కలౌ పరాశరాఃస్మృతాః
కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపర యుగంలో శంఖస్మృతి, కలియుగంలో పరాశరస్మృతి అనుసరించెదరు.
అంధేతమసి మజ్జంతి పశుభిర్యేయజంతితే హింసానామభవేద్ధర్మో నభూతో నభవిష్యతి.
ఎవరైనా జంతువులను వధించి బలి పూజాది కర్మలు చేయుదురేని, అంధ తమస్సగు నరకములో పడుదురు. ప్రాణి హింస భూత, భవిష్యత్, వర్తమానములలో గూడా మహాచెడ్డ అధర్మమగునే గాని ధర్మము కానే కాదు.

కొన్ని గూడార్థములు:

1) వైకుంఠం: పంచభూతములను సమ్మేళనము చేయగల శక్తి గలది.
2) మూషిక వాహనం: నీలోని తామసగుణాన్ని అణగ ద్రొక్కుము లేదా
 విడిచి పెట్టుము.
3) పులివాహనం: నీ లోని అహంకారాన్ని విసర్జించుము.
4) నందివాహనం: జ్ఞానస్వరూపమునకు గుర్తు.
5) హంస: హంస పాలు, నీళ్ళు వేరుచేయునట్లుగా, మంచి, చెడు అర్థం చేసి కొని ప్రవర్తించుము.
ఒక శ్వాస + నిశ్వాస = హంస
6) గరుడ: జ్ఞానారూఢుడివి అవ్వు.
7) భాగవతమ్: భ భక్తి, గ జ్ఞా న, వ వైరాగ్యమ్, త తత్త్వజ్ఞాన, మ్ ముక్తి
8) సింహం: మూడు సంవత్సరములకు ఒకసారి రతిలో పాల్గొనును. కామమును వశములో ఉంచుకొనుము.
9) ఏనుగు: నిశితదృష్టి, శుద్ధ శాఖాహారి, బలమైనది.
10) నారద: నారం జ్ఞా నం దదాతి ఇతి నారద: విస్తారమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు.
పరమాత్మనాటకము:
కంటిలో నలుపు, తెలుపు రెండూ అవసరమే. కన్ను పూర్తిగా నల్లగా ఉన్ననూ చూడలేము. కన్ను పూర్తిగా తెల్లగా ఉన్ననూ చూడలేము కనుక కంటిలో నలుపు, తెలుపు రెండూ అవసరమే. సంసారంలో దుఖము (నలుపు), సుఖము (తెలుపు) రెండూ అవసరమే. లేకపోతే పరమాత్మ నాటకం రక్తి కట్టదు.
కుంతి—కర్ణుడు:
యోగేన నాభిందృష్ట్వా అని వ్యాస మహాభారతంలో ఉన్నది.
మహాభారతంలోని పాత్రలు అన్నీ వేదాంతానికి చిహ్నములు. (Esoteric symbols). మహాభారతంలో దూర్వాసమహర్షి (కోపంఎక్కువ) కుంతీదేవికి ఒక మంత్రం ఉపదేశించును. కుంతీదేవి ఈ మంత్రము పని చేయునో లేదో అని పరీక్ష జేయదలుచును.
వైరాగ్యము అనగా వై=వైవిధ్యమయిన రాగ్యము= మోహము. ప్రతివ్యక్తికి ఏదోఒక దానిపై  మోహము ఉంటుంది. పరమాత్మపై మోహమే వైవిధ్యమయిన రాగ్యము. 
కుంతీదేవి వైరాగ్యానికి ప్రతీక. వైరాగ్యానికి ప్రతీక అయిన కుంతీదేవి పరీక్ష జేయదలచినది కనుక ఆమె వైరాగ్యము ఆ సమయములో క్షీణించినది. ఆ సమయములో ఆమె మంత్రంతో ప్రార్థించుటవలన సూర్య భగవానుడు అనగా పరమాత్మచైతన్యం సంసారచక్రములలో ప్రధానమైన నాభి వెనకాల ఉన్న మణిపూరచక్రములో చూచును.. వెలుగులేనిది అన్నం వండలేని విధంగా అన్ని పనులూ పరమాత్మ చైతన్యంయొక్క సాక్షీభూతంతోనే చేయబడతాయి. మణిపూరచక్రము ఆత్మనిగ్రహశక్తికి ప్రతీక. కుంతీదేవికి ఆ సమయములో ఆత్మనిగ్రహశక్తి క్షీణించియున్నది. వైరాగ్యవంతుడైన సాధకునికి ఆత్మనిగ్రహశక్తి క్షీణించినయడల రాగద్వేషములకు తావునిచ్చును. కర్ణుడు రాగద్వేషములకు ప్రతీక. రాగద్వేషములకు ప్రతీక అయిన కర్ణుడు పుట్టెను. సాధకుడు సాధన కడు జాగరూకతతో చేయవలయును.

ఆత్మావబోధ:

ఆలోచనలు మనకి బైటనుంచి వచ్చును. ఆత్మావబోధ లోపలినుండి వచ్చును. ఒకడు మంచి పుస్తకము చదువుచున్నపుడు, ఆ పుస్తకము, ఆ పుస్తకములోని విషయము, ఆ పుస్తకము చదువుచున్న మనిషి ఒకటి అగును. ఆ సమయములో ఆ గదిలోనికి ఎవరు వచ్చుచున్నారో, ఎవరు బయటికి వెళ్ళుచున్నారో కళ్ళు చూచుచున్నా, చూడక పోయినా గమనించవు. గమనించినా గుర్తించలేవు. అదేవిధముగా పరమాత్మ మీద ఆధారపడి, పరమాత్మతో తాదాత్మ్యం జెందియున్న బ్రహ్మవద్వరీయులు కేవలం పరమాత్మ కొఱకే సంసారంలో ఉండెదరు. అట్టి స్థితిలో వారు ఏమి చేసినా, వ్రాసినా, తింటున్నా, నడుస్తున్నా, పరిగెత్తుతున్నా అంతా ఆ పరమాత్మే అనుకుంటారు. యోగిరాజు, క్రియాయోగ ప్రదాతలు అయిన శ్రీశ్రీలాహిరీమహాశయమహారాజ్ కేవలం శాఖాహారి. ఆయనను ఒక భక్తుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టినపుడు చేపలు వండిపెడతాడు. పరమాత్మ చైతన్య  మత్తులో ఎల్లవేళలా ఉండే శ్రీ శ్రీ లాహిరీ మహాశయ మహారాజ్ అనాలోచితంగా తిన్నారు. మరియొక భక్తుడు గూడా వండి పెడితే శ్రీ శ్రీ లాహిరీ మహాశయ మహారాజ్ కోపగించుకొని మందలించారు. మన ఇతి హాసములలో కొన్ని చోట్ల కవి రూపంలోనున్న యోగి తను వ్రాస్తున్న కవితలో సరియైన పదములు తట్టక స్నానము లేదా వాహ్యాళి నుండి తిరిగి వచ్చుసరికి ఆయా పదములు లేదా పాదములు వ్రాసియుండుటను జూసి అశ్చర్యచకితులై అక్కడే ఉన్న భార్య, పిల్లలు, శిష్యులు మొదలగువారిని అడిగితే మీరేగదా ఇప్పుడు వచ్చి వ్రాసి వెళ్ళారు అంటారు. అనగా ఆత్మావబోధవలన తట్టిన పదములను, పాదాలను, తనకు తానుగానే వచ్చి పరమాత్మ చైతన్య మత్తులోఉండి వ్రాసే మహానుభావులకు మామూలు స్థితి వచ్చే సరికి తానే వచ్చి వ్రాసి వెళ్ళానంటే నమ్మలేరు. అనగా ఆత్మావబోధ అంత గొప్పది. ఎందుకంటే అది పరమాత్మ చైతన్యము తప్ప వేరే గాదుగనుక. న్యూటన్ కనిపెట్టిన భూమ్యాకర్షణ సిద్ధాంతం (law of gravity) ఐన్స్టీన్ కనిపెట్టిన తారతమ్య సిద్ధాంతం (theory of relativity) ఆత్మావబోధవలన కలిగినవే.

ధ్వని:

ధ్వనికి మూడు ముఖాలు ఉంటాయి. శబ్ద అర్థ ప్రత్యయ అని.

ఈ మూడు అనగా శబ్దము అర్థము ప్రత్యయ (మానసికసంగ్రహత) కలిపి ధ్వని అందురు. ఈ మూడు అనగా శబ్దము అర్థము ప్రత్యయ అనునవి ఒకే మూర్తియొక్క మూడు ముఖాలు. ప్రఖ్యాత శాస్త్రవేత్త (scientist) ఐన్స్టీన్ కదలని రాళ్ళు, రప్పలు కూడా శబ్దాన్ని కలుగజేయును. ఎందుకంటే వాటిలోనుండి ఓజఃశక్తి (Cosmic Radiation) వస్తూ ఉంటుంది కనుకఅని నిరూపించారు. అక్షరమే క్షరము అగును. కారణశరీర ఒత్తిడివలన అక్షరము పరాశబ్దాన్ని కలుగ జేయును. అక్షరము నుండి పుట్టిన పరాశబ్దం అనంతమైన స్థలాన్ని పుట్టిస్తుంది. ఆ స్థలము (space) (దేశము) అనంతకాలాన్ని సృష్టిస్తుంది. దీన్ని పశ్యంతి అందురు. కాలము మధ్యమకు అనగా పాత్రకి (particle) కారణమగును. చివరికి ఈ మధ్యమ అనగా పాత్ర వైఖరికి (ఉచ్ఛారణకి) (utterance) దోహదపడును. ఈ వైఖరి ధరకి అనగా వ్యక్తిత్వ బలమునకు (individual strength) ప్రతిరూపము. ఈ ధరనే వ్యక్తీకరణ (manifestation) లేదా మాట అందురు.
ఆరుప్రమాణములు:
1) ప్రత్యక్ష 2) అనుమాన 3) ఉపమాన 4) శబ్ద 5) అర్థపత్తి 6) అనుపలబ్ధి
ప్రకృతి
భూమిరాపోనలోవాయుఖంమనోబుద్ధిరేవచ                     గీత 7 - 4
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని పరమాత్మ ప్రకృతి ఎనిమిది విధములుగా ఉండును. వీటిలో అహంకారము మాత్రమే మనకి కనబడును అనగా అర్థము అగును. మిగిలిన ఏడు విధములైన సూక్ష్మప్రకృతి మనకు కనబడదు. ఈ ఎనిమిది విధములుగా ఉన్న ప్రకృతిని అష్టవసువులు అంటారు. అష్ట వసువులలో ఆఖరివసువు అహంకారమును భీష్ముడు అంటారు. ప్రకృతి అనగా గంగ. గంగ అనగా నీరు. నీరు ప్రకృతిలోని భాగమే కదా. అందువలన గంగ అనగా ప్రకృతి. యోగి కాని వాడికి పరమాత్మయొక్క సూక్ష్మప్రకృతిలోని ఏడు తత్త్వములు కనబడవు. అనగా అర్థం చేసుకొనలేడు. గంగ ఏడుగురు బిడ్డలను గంగలో పడవేయటమనగా సాధారణ మానవునికి ఈ ఏడుసూక్ష్మ తత్త్వములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధియొక్క తత్త్వములు కనబడవు. అర్థము చేసుకొనలేడు. అనగా ప్రకృతి మరుగు పరచుతుంది. ఆఖరి తత్త్వమైన అహంకారమే ఈ మరుగును గ్రహించకపోవుటకు కారణము. మానవప్రయత్నము అతిముఖ్యము
అథిష్ఠానం తథా కర్తా కరణమ్ చ పృథక్ విధమ్             గీత 18 - 14
కర్మాచరణ విషయమున
1) శరీరము 2) కర్త 3) ఇంద్రియములు 4) క్రియలు 5) దైవము కారణము.
కనుక మానవుడు చేసే ప్రతి కర్మకూ తనయొక్క సంకల్పమే కారణము. దైవము ఆఖరి కారణము.
వెలుతురు లేకుండా ఏ పనీ చేయలేము, ఏ పని జరగని చందమున, పరమాత్మ లేనిది ఏదీ జరగదు. కానీ ఆ మంచి చెడు కర్మలకు ఆ పరమాత్మ కారణము గాని కారణము.
వ్యక్తిని చంపుటకు కారణమయిన కత్తిని తీసుకెళ్ళి జైలులో పెట్టరు. ఆ కత్తితో పొడిచినవాడిని తీసుకెళ్ళి జైలులో పెట్టెదరు. శిక్షకు సంకల్పము ప్రధాన కారణము.  
జీవుని నివాసస్థానము:
చక్రవ్యూహము - మాయ
శకటవ్యూహము - కర్మ
పద్మవ్యూహము - మోహము
ఈ మూడు వ్యూహములు అనగా చక్ర వ్యూహము (మాయ), శకట వ్యూహము (కర్మ), పద్మవ్యూహము (మోహము) లే జీవుని నివాసస్థానము.
నాలుగువ్యూహములు:
1) వాసుదేవుడు: పరమాత్మవ్యూహము
2) సంకర్షణ: జీవుడు (ని) వ్యూహము
3) ప్రద్యుమ్న: మనస్సు (యొక్క) వ్యూహము
4) అనిరుద్ధ: అహంకారము (యొక్క) వ్యూహము
 సాధకుడు అహంకారము వర్జించి, యోగసాధనతో మనస్సును స్థిరము చేసుకొని, మల విక్షేపణ ఆవరణ దోషములను తొలగించుకొని, శుద్ధాత్ముడై, పరమాత్మతో లయమగుటకు ఉన్నదే ఈ మానవజన్మ.

పద్మవ్యూహము మోహము అభిమన్యుడు:

అభి సర్వత్ర మనుతే ప్రకాశతే ఇతి అభిమన్యు
మహాభారతము (గొప్ప వెలుగు) అనగా పరమాత్మ చైతన్యమే గొప్ప వెలుగు. ఆ పరమాత్మ చైతన్యము(గొప్పవెలుగు)కై జరిగే సాధకుని సాధనకి అనుకూలముగానున్న శక్తులకు, ప్రతికూలముగానున్న శక్తులకు జరిగే యుద్ధమే మహాభారతం (గొప్ప వెలుగు అనగా పరమాత్మ చైతన్యం). అభిమన్యుడు అనగా ఆత్మజయుడు లేదా ఆత్మనిగ్రహుడు.
మోహము అనే పద్మవ్యూహములో అభిమన్యుడు చిక్కుకొనెను. మోహము నకు సంబంధించిన అ) దుర్యోధన (కామ),  ఆ) దుశ్శాశన (క్రోధం),  ఇ) కర్ణ (లోభ),  ఈ) శకుని (మోహం), ఉ) శల్య (మదం), ఊ) కృతవర్మ (మాత్సర్యం), ఋ) ద్రోణ (సంస్కారములు),ౠ) జయద్రధ లేదా సైంధవ (అభినివేశ) అనే దుష్టశక్తులు అభిమన్యుణ్ణి చుట్టుముడతాయి. కాని సాధకుడు అనగా అభిమన్యుడు ధైర్యంగా ఆత్మనిగ్రహంతో స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను మూడింటినీవదిలి వాటిని అధిగమించెను. తద్వారా సమ్యక్ సమాధితో వెలుగొందెను.
ధారణ, ధ్యాన, సమాధి మూడింటినీ కలిపి సమ్యక్ సమాధి అంటారు. సమ్యక్ సమాధి పొందిన సాధకుడు ఈ భౌతిక ప్రపంచములో లేదా భవసాగరంలో ఇమడలేడు. అందువలన మహాసమాధి అనగా పరమాత్మతో ఐక్యం చెందుతాడు. ఆ విధంగా పరమాత్మతో ఐక్యం చెందుటయే అభిమన్యుని నిష్క్రమణ.

ద్వాదశ ఆదిత్యులు - ఏకాదశ రుద్రులు:

ద్వాదశ ఆదిత్యులు:     ఆదిత్యానాం అహంవిష్ణుః        గీత 10 - 21
 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువును.
ఒక్కొక్క మాసములో ఒక్కొక్క రాశిలో సూర్యభగవానుడు సంచరించుటను సంక్రమణములు అందురు. అందులో కర్కాటకరాశిలో సూర్యుని సంచరించుటను కర్కాటక సంక్రమణము
మకరరాశిలో సంచరించుటను మకరసంక్రమణము లేదా మకర సంక్రాంతి అందురు.
అవి చాలముఖ్యమైనవి.
కర్కాటకసంక్రమణమునుండి ఆరునెలలవరకు దక్షిణాయనము అందురు.
మకరసంక్రమణమునుండి ఆరుమాసములవరకు ఉత్తరాయనము అందురు.
12 సంక్రణములను 12 విధములైన సూర్యప్రకాశములుగా లేదా 12 ఆదిత్యులుగా చెప్పబడినది.
12 విధములైన సూర్య ప్రకాశములు, 12 రకములైన నామములతో పిలవబడుచున్నవి.
కతమా ఆదిత్యాఇతి ద్వాదశావైమాసః     బృహదారణ్యకం    3—9—5
1) ధాతా 2) మిత్రుడు 3) ఆర్యముడు 4) శుక్రుడు 5) వరుణుడు 6) అంశువు 7) భగుడు 8) వివస్వంతుడు 9) పూష 10) సవిత 11) త్వస్త 12) విష్ణువు
ఏకాదశ రుద్రులు
రుద్రాణాంశంకరశ్చాస్మి
           గీత 10 - 23
రుద్రులలో శంకరుణ్ణి.
కతమే రుద్రా ఇతి దశమే పురుషె బృహదారణ్యకం 3—9—5
1)(హరుడు 2) బహురూపుడు 3) త్రయంబకుడు 4) అపరాజితుడు 5) వృషాకపి 6) శంభువు 7) కపర్ది 8) రైవతుడు 9) మృగవ్యాధుడు 10) సర్వుడు 11) కపాలి. వీరు ఈ ఏకాదశ రుద్రులు
ముఖ్య ప్రాణము మరియు 10 ప్రాణములు కలిపి ఏకాదశ రుద్రులు.
ఇవి ఆశ్రయించిన మనస్సు, ఐదు జ్ఞానేంద్రియములు, మరియు ఐదు కర్మేంద్రియములు కలిపి ఏకాదశరుద్రులుగా పిలవబడుతున్నారు

1) ఐదు జ్ఞానేంద్రియములు అనగా త్వక్ (చర్మం), చక్షు (కళ్ళు, శ్రోత్ర (చెవులు), జిహ్వ (నాలుక) మరియు ఘ్రాణ (ముక్కు)
2) ఐదు కర్మేంద్రియములు అనగా వాక్ (నోరు), పాణి (చేతులు), పాద (పాదములు), పాయువు (ముడ్డి), ఉపస్థ (శిశినము)
3) మనస్సు లేదా అంతఃకరణ.
వీరినే ఏకాదశ రుద్రులు అంటారు.
వర్ణములు-ఆశ్రమములు:
మూడున్నర చుట్టలు చుట్టుకొని పాము మాదిరి మూలాధారచక్రంలో నిద్రించియున్న శక్తిని కుండలినిశక్తి అందురు. కుండలిని శక్తి మేరుదండములో ముడ్డిలో తలకాయ క్రిందికి, తోక పైకి ఉంచి నిద్రాణమై యుండును. మేరుదండములోని చక్రములు అన్నింటినీ కలిపి కులము అందురు. కుండలిని శక్తిని కులకుండలిని అందురు.  
జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే బ్రాహ్మణః.
జన్మతో ప్రతి వ్యక్తీ శూద్రుడే. వాడికర్మనుబట్టి బ్రాహ్మణుడగును.
చాతుర్ వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః     గీత 4 – 13
ప్రతి చక్రమునకు ఒక రంగు రుచి కొన్ని దళములు శబ్దము ఉండును. అసలు యోగసాధనయే చేయక  నిద్రావస్థలోయున్న కుండలినీశక్తి ని కలిగియున్న మనిషి శూద్రుని క్రింద మరియు కలియుగములో ఉన్నట్లు లెక్క. వాడి హృదయము నల్లగాయున్నట్లు పరిగణిస్తారు.
జాగృతిజెందిన కుండలినీశక్తి మూలాదారమును స్పృశిస్తే ఆసాధకుడు తనను పరమాత్మతో అనుసంధానం పొందనీయక అడ్డుకునే అంతఃశ తృవులను ఎదుర్కొనే క్షత్రియుడుగాను, కలియుగములోయున్నను,   స్పందనా హృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు.` ఇది పసుపు వర్ణములో ఉంటుంది.
జాగృతిజెందిన కుండలినీశక్తి స్వాధిష్ఠానమును స్పృశిస్తే ఆసాధకుడు పునర్జన్మనెత్తిన ద్విజుడుగాను, ద్వాపరయుగములోయున్నట్లు,   శ్రద్ధా హృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు. ఇది తెలుపు వర్ణములో ఉంటుంది.
జాగృతిజెందిన కుండలినీశక్తి మణిపురచక్రమును స్పృశిస్తే ఆసాధకుడు వేదపారయణజేసేవిప్రుడుగాను,త్రేతాయుగములోయున్నట్లు,   స్థిరహృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు. ఇది ఎరుపు వర్ణములో ఉంటుంది.         
జాగృతిజెందిన కుండలినీశక్తి అనాహత,చక్రమును స్పృశిస్తే ఆసాధ కుడు బ్రహ్మజ్ఞానమునకు అర్హుడైన బ్రాహ్మణుడుగాను, కృతయుగ ములోయున్నట్లు,  స్వచ్ఛమైన హృదయము కలిగియున్నట్లు పరిగణిస్తారు.  ఇది నీలము వర్ణములో ఉంటుంది.
సాధకుడు కూటస్థములోదృష్టి పెట్టి సాధన చేయవలయును.  సాధకునికి కూటస్థములో నలుపు వర్ణము కనబడితే శూద్రవర్ణము లేదా కులముగాను,  పసుపు వర్ణము కనబడితే క్షత్రియ వర్ణము లేదా కులముగాను, తెలుపువర్ణము కనబడితే ద్విజ లేక వైశ్య వర్ణము లేదా కులముగాను, ఎరుపు వర్ణము కనబడితే విప్ర వర్ణము లేదా కులముగాను, నీలము వర్ణము కనబడితే బ్రాహ్మణ వర్ణము లేదా కులముగాను, నిర్ణయించారు. 
ఈవిధముగా శూద్ర, , ద్విజ, విప్ర, బ్రాహ్మణ కులములు వారి వారి సాధనా ప్రగతినిబట్టి నిర్ణయించారు.
యోగసాధననుబట్టికాక జన్మనుబట్టి కులము నిర్ణయించ బడుటవలన అవి కాలక్రమేణ అనేకానేక కులములుగానేర్పడి దేశముయొక్క ఐక్యతకు, బధ్రతకు ముప్పు వాటిల్లుతున్నది.
శ్రీరాముడు(పరమాత్మచైతన్యం) దూరంగా ఉన్నప్పుడు, చివరకు ఆదిశెషు (మూలాధారశక్తి) లక్ష్మణుడుకూడా దూరమై, పెద్దనోట్లు ఖర్చు అయిన తరువాత చిల్లరడబ్బులమీద ఆధారపడే వ్యక్తిలాగా, కుండలినీశక్తిని (సీతాదేవి) జటాయువు (జటలు శిరస్సులో ఉంటాయి అనగా శిరస్సులోఉండే ఓజఃశక్తి) రక్షింపజూస్తుంది.  ఆ ఓజఃశక్తికూడా ఖర్చు అయి నిస్సహాయంగా అనగా రెక్కలువిరిగిన పక్షిలాగా కూలిపోతుంది. అనగా ఆ ఓజఃశక్తి కూడా క్షీణిస్తుంది.  అప్పుడు కుండలినీశక్తి (సీతాదేవి) అహంకారానికి ప్రతీక అయిన రావణుని అధీనంలో ఉండి పరమాత్మకై (శ్రీరామునికై) నిరీక్షించటం సీతాపహరణం కథ.
మంథర (మన్ ధర) అనగా అనిశ్చయాత్మకమైన మనస్సుకి ప్రతీక.
కైకేయి కోరికల కు ప్రతీక. సుమిత్ర మంచిస్నేహితుడికి ప్రతీక.  మరియు కౌశల్య మంచి సలహాలుఇచ్చేదానికి ప్రతీక.
అనగా సుమిత్ర మరియు కౌశల్యల సాహచర్యము వలన కైకేయియొక్క కోరికలు అదుపులో ఉంటూ వచ్చాయి.
దశరథ అనగా 10 ఇంద్రియముల నాయకుడు నిశ్చయాత్మకమైన బుద్ధికి ప్రతీక.   
అనిశ్చయాత్మకమైన మనస్సు(మంథర) వలన నిశ్చయాత్మకమైన బుద్ధి (దశరథ  అనగా 10 ఇంద్రియముల నాయకుడు) మాటవినక పరిపూర్ణ పక్వతచెందని సాధకునికి(భరతునికి) పట్టం అనగా అధికారము ఇవ్వమంటుంది. పరమాత్మ శ్రీరాముడు త్రేతాయుగ ధర్మాన్ని అనుసరించి 14 సంవత్సరముల యోగాభ్యాసధ్యానము తరువాత(భరతునికి) దర్శనము ఇస్తానంటాడు. అదే శ్రీరామ అరణ్యవాసము.  బుద్ధి (దశరథ అనగా 10 ఇంద్రియముల నాయకుడు) మాట వినకపోవటమే దశరథ (బుద్ధి) నిర్యాణము.
మాయ (ప్రకృతి/సీతాదేవి) సాధారణ మానవునికి చావదు. ఇది చూపటమే సీతాదేవి(మాయ/ప్రకృతి)అగ్నిప్రవెశఘట్టం.
అగ్నిప్రవేశముచేసిన సీతామాతప్రకృతికి ప్రతీక.
అగ్నిప్రకృతికి ప్రతీక. నీరు నీటిని ఏమీ చేయలేదు. ప్రకృతికి ప్రతీక అయిన సీతను ప్రకృతికి ప్రతీక అయిన అగ్ని ఏమీ చేయలేదు.
అదేవిధముగా యథాతథంగా అయోనిజని (సీతాదేవి/ మాయ/ప్రకృతి) అగ్నినుండి బయటికి తీసుకు రావటమును ప్రతిబింబించేదే ఈ  సీతాదేవి (మాయ/ప్రకృతి)అగ్నిప్రవెశఘట్టం.. ఏ యోనినుండి పుట్టినది కానిది అయోనిజ. అయోనిజ కేవలము పరమాత్మ అధీనము.  పరమాత్మ అధీనములో మాత్రమే మాయ పనిజేస్తుంది.
హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్ష వధలలో ఉద్దేశ్యం:
 అహంకారంతో మ్రగ్గుతున్న సాధకునికి నీవు నరుడివికావు, సింహానివి అని తెలియజెప్పటం. నరుడు సింహావతారమెత్తి అనగా నరసింహావతారం ఎత్తి, సింహ (గట్టి) ప్రయత్నం చేస్తే అహంకారంనుండి బయటికి రాగలవు అని ఉద్భోధించటము హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్షవధలలో (స్థూలశరీర  నిర్మూలనము/బ్రహ్మగ్రంథి ఛేదన) ఉద్దేశ్యం. సంసారంలో (నీటిలో) మునిగిపోయి ధ్యానసాధనలో సాధకుని పృథ్వీతత్వాన్ని (మూలాధారం) అనగా ప్రారంభప్రయత్నాన్ని జ్ఞానదంతములతో సంసారం (నీరు) లో నుండి పైకి తీసుకువచ్చి వ(వరిష్ఠమైన) రాహ (రాస్తా లేదా త్రోవ) లోకి తీసుకు వెళ్ళటమే వరాహ అవతార ఉద్దేశ్యం మరియు హిరణ్యాక్ష (సంసారకన్ను) వధ.  
అహంకార కామ మత్తులో ఉన్నరావణుని, కుంభం లాగించి నిద్రమత్తుతో ఉన్న కుంభకర్ణుల (సూక్ష్మశరీర నిర్మూలన/రుద్రగ్రంథి ఛేదన) వధ గావించి ధ్యానసాధనలో ముందుకి పంపించుటయే శ్రీరామావతార ఉద్దేశ్యం. 
మిగిలిన శిశువు లాంటి అమాయకత్వం) ఉన్న శిశుపాలుడు (శిశు అనగా చిన్నపిల్లవాడు), మరియు దంతావక్తృడు (దంతా అనగా దంతాలువచ్చే శిశు అనగా చిన్నపిల్లవాడు) యొక్క వధ (కారణశరీర నిర్మూలన/విష్ణుగ్రంథిఛేదన) లలో శ్రీకృష్ణావతారం ఉద్దేశ్యం.  

ఆఖరి మాట:

మానవజన్మ, ముముక్షత్వం, మహాపురుష దర్శనం దుర్లభమైనవి. ఈరోజు కాకపోయినా రేపైనా మనం ఎంత తిరిగినా స్వంత ఇంటికి చేరితేనే హాయి. మన స్వంత ఇల్లు పరమాత్మ. ఇంకొక శరీరంలో అనగా పశు, పక్ష్యాదులలో ఇది సాధ్యము కాదు. దేవతలైనా మానవజన్మ ఎత్తవలసినదే ముక్తికొఱకై. కనుక ధ్యానంచెయ్యండి. ధ్యానంచేయించండి.

                               హరి ఓం తత్ సత్

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana