ఉపాదాన నిమిత్త మరియు సాధన కారణములు
వేదం నిస్త్రైగుణ్యోభవ అనగా త్రిగుణములను విసర్జించు అని చెప్పటమే కాక ఈశ్వరప్రణిధానము భక్తి లేదా పరిపూర్ణముగా భగవంతునికి అంకితమగుట ఆత్మ శోధన మొదలగు వాటి ద్వారా పరిష్కార మార్గము చూపించును. పురుషుడు అనగా పరబ్రహ్మ మాత్రమే సర్వ చేతనా స్వరూపుడు సర్వ వ్యాప్తుడు సర్వశక్తి స్వరూపుడు. మిగిలినదంతా జడమే అంటుంది వేదము.
ప్రకృతియే ద్రవ్య (ఉపాదాన) నిమిత్త మరియు సాధన కారణములు.
ద్రవ్య కారణము మట్టి.
నిమిత్త కారణము కుమ్మరి, సాధనా కారణము అనగా కుండలు చేసే పనిముట్టు మూడున్నూ ప్రకృతియే.
సత్వ రజస్ తమస్ అనే మూడు గుణములే ద్రవ్యము. ఈ మూడింటినీ కలిపి బ్రహ్మాండముఅంటారు. ఈ మూడు గుణముల వ్యక్తీకరణే సమిష్టిలో మహత్ అంటారు. వ్యష్టిలో బుద్ధి అంటారు.
బుద్ధినుండి రాయి వఱకు ఉన్నదంతా ఈ మూడు గుణములు కలిసిన ఒకే వస్తువు. తేడా ఏమిటంటే స్థూలం సూక్ష్మం పరమ సూక్ష్మం. కారణము పరమ సూక్ష్మం.
కార్యం అనేది స్థూలం. అన్ని భావములను ప్రోగుచేసి బుద్ధికి చేరవేయటము అనేది మనస్సు పని. ఏమి చేయాలి అనేది బుద్ధి (సమిష్టి లోని మహత్) నిర్ణయిస్తుంది. ఈమహత్ నుండి అహంకారము దాని తరువాత సూక్ష్మ పరమాణువులు వచ్చినవి. ఈ సూక్ష్మ పరమాణువులు కలిసి బాహ్య జగత్తు ఏర్పడినది. ఈ ప్రకృతికి మూడు గుణముల కలయికకు అతీతమైనవాడు పురుషుడు. ఈ పురుషుడు, బుద్ధి లేక మనస్సు,తన్మాత్రలు, స్థూల, సూక్ష్మ, పరమ సూక్ష్మ పదార్థము కాదు.
Comments
Post a Comment