పతంజలి యోగ శాస్త్రము 1-42

యోగ శాస్త్రములో 196 యోగ సూత్రములు ఉంటాయి. 196 యోగ సూత్రములు నాలుగు పాదములుగా విడగొట్టబడి యుంటవి. వాటిలో మొదటిది అయిన  సమాధి పదము గురించి చర్చిద్దాము.
1.సమాధి పదము:  సమ = సమానము,  పరమాత్మతో, సమానము అవటము. అనగా శ్వాస సహిత స్థితి నుండి  శ్వాసరహిత స్థితికి చేరటము
1.1. అథ యోగానుశాసనం
      అథ యోగ= కలయిక లేక ఐక్యము అగుటకు, వలసిన అనుశాసనం= క్రమశిక్షణ.
కలయిక లేక ఐక్యము అగుటకు వలసినది  క్రమశిక్షణ.
1.2. యోగః చిత్త వృత్తి నిరోధః
యోగః= కలయిక లేక ఐక్యము, చిత్త= ఆలోచనా, వృత్తి= సరళిని, నిరోధః=నిలవరిస్తుంది. 
 కలయిక లేక ఐక్యము ఆలోచనా సరళిని నిలవరిస్తుంది.
1.3. తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం
తదా= అప్పుడు,  ద్రష్టుః =దర్శించును, చూచును, స్వరూపో= స్వరూపమును, అసలు రూప, అవస్థానం=స్థితిని.
అప్పుడు (నీవు నీ) అసలయిన నిజరూపస్థితి స్వరూపమును దర్శించుదువు లేక చూచుదువు.
వేగముగా పరుగెత్తుతున్న వాహనములోనికి ఎక్కుట కష్టము. అది నిలకడగా ఉన్నప్పుడు మాత్రమె నీవు సురక్షితముగా ఎక్కగలవు.  వాయువేగముకంటే అతి వేగముతో కూడిన ఆలోచనా సరళిగల మనస్సుయొక్క  నిజరూపస్థితి స్వరూపమును దర్శించుటకు మార్గము సుగమము అగుటకు మార్గము ఒక్కటే. అది మనస్సును ఆలోచనారహితస్థితికి చేర్చటము ఒక్కటే మార్గము.
1.4. వృత్తిః సారూప్యమితరత్ర.
వృత్తిః=దాని పధ్ధతి లేక ప్రకృతి,  సారూప్యమ్= రూపము, ఇతరత్ర= ఇంకొక విధముగా 
(లేనియడల) ఆ మనస్సుయొక్క పధ్ధతి లేక ప్రకృతి మరియు రూపము ఇంకొక విధముగా ఉండును.
1.5. వృత్తయః పంచతవ్యః క్లిష్టాక్లిష్టాః
వృత్తయః= ఆ మనస్సుయొక్క పధ్ధతి లేక ప్రకృతి, పంచతవ్యః= అయిదు విధములుగా (ఉండును)  క్లిష్టాక్లిష్టాః= అవి క్లిష్టములు  అక్లిష్టాః=సులభతరములు  
ఆ మనస్సుయొక్క పధ్ధతి లేక ప్రకృతి, అయిదు విధములుగా (ఉండును). అవి (ఆ అయిదు విధములు) క్లిష్టములు  మరియు సులభతరములు అని రెండు రకములు. 
1.6. ప్రమన విపర్యయ వికల్ప నిద్రాస్మృతయః
ప్రమన=అవగాహన, విపర్యయ= అనవగాహన, వికల్ప= గ్రహింపు, నిద్రా= నిద్ర,  స్మృతయః=స్మృతి
అవి: అవగాహన, అనవగాహన, గ్రహింపు, నిద్ర, మరియు స్మృతి 
నీవు ఆ పై నపొందు పరచినట్లు అయిదు విధములుగా ప్రకృతిని అర్థము చేసికొనవచ్చు. అది సరి అయిన క్రమములో లేదా సరి కాని క్రమములో ప్రకృతిని అర్థము చేసికొనుటకు దారితీస్తుంది.  అది సద్భావము లేదా అభావముతో కూడిన నిద్రకి దారితీస్తుంది. అదే సద్భావము లేదా అభావముతో కూడిన ఆలోచనలు స్మృతిలో గూడు కట్టుకొని ఉంటాయి.
1.7. ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని
ప్రత్యక్ష= ప్రత్యక్షము, అనుమానము= అనుమానము, ఆగమాః= సాక్ష్యము,  ప్రమాణాని= సరియిన గ్రహింపు.
ప్రత్యక్ష= ప్రత్యక్షము, అనుమానము= అనుమానము, ఆగమాః= సాక్ష్యము,  ప్రమాణాని= అనేవి ప్రమాణములు.
ప్రత్యక్షము, అనుమానము, సాక్ష్యము, అనేవి ప్రమాణములు.
1.8. విపర్యయో మిథ్యా జ్ఞానమతద్రూప ప్రతిష్టం
విపర్యయో=తప్పుడు, మిథ్యా జ్ఞానమ్ =అవిద్యలేక అజ్ఞానం, అతద్రూప= దానిరూపము కాదు,  ప్రతిష్టం= అని స్థిరపరచడమయినది
మనస్సు యొక్క రూపము తప్పుడుది అయిన అవిద్య లేక అజ్ఞానం కాదు అని స్థిరపరచడమయినది.
1.9. శబ్ద జ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః
శబ్ద=భాష  జ్ఞాన= జ్ఞానము,  అనుపాతీ=అనుసరించును,  వస్తు=పదార్థము శూన్యో= శూన్యమయిన, వికల్పః=భావము
కేవలము భాషాజ్ఞానమును అనుసరించి ఏర్పరచుకొనుభావము అసలు పదార్ధమును గ్రహించలేదు.  
1.10 అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా 
అభావ= స్థిరములేని  ప్రత్యయా = భావము, అలంబనా= ఆధారము,  వృత్తి= స్వభావము నిద్ర= నిద్ర.
స్థిరములేని ఆధారము గల భావము యొక్క స్వభావము నిద్ర.
1.11. అనుభూత విషయా సంప్రమేషః స్మృతిః
అనుభూతి= అనుభూతితో కూడిన, విషయా= విషయ, సంప్రమేషః=తస్కరించకుండా  స్మృతిః= స్మృతి
అనుభూతితో కూడిన మరవలేని విషయమే స్మృతి.
1.12. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః
అభ్యాస వైరాగ్యాభ్యాం= అభ్యాస వైరాగ్యాములతో, తన్నిరోధః=మనస్సునున్నిరోధించ వీలగును. 
1.13. తత్ర స్థితౌ యత్నోభ్యాసః
తత్ర స్థితౌ= ఆ స్థిర స్థితిలో యత్నోభాసః= చేసే ప్రయత్నమే అభ్యాసము.
 ఆ స్థిర స్థితిలో మనస్సును ఉంచుటకు చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసము.
1.14. స తు దీర్ఘకాల నైరంతర్యం సత్కారాసేవితో దృఢభూమిః
స తు =ఈ ప్రయత్నము, దీర్ఘకాల= దీర్ఘకాల, నైరంతర్యం= నిరంతరం, సత్కారాసేవితో=నేర్పుతో ఓర్పుతో,  దృఢభూమిః=దృఢనిశ్చయముతో
ఈ ప్రయత్నము దీర్ఘకాల నిరంతరం నేర్పుతో ఓర్పుతో దృఢనిశ్చయముతో చేయవలయును.
1.15. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం
దృష్ట= కనబడును, అనుశ్రవిక= వినబడును, విషయ= విషయము,  వితృష్ణస్య=తగులము,  వశీకార=జరుగును,  సంజ్ఞా=అర్థము చేసికొనడం, వైరాగ్యం= వైరాగ్యం
మనస్సు ప్రతిస్పందించకుండుటకు, వస్తువును ప్రత్యక్షముగా గ్రహించినను లేక ఇతరులనుండి ఆ వస్తువుగురించి విన్నను, దేనికి తగులము ఉండకూడదు. అప్పుడు మనస్సును పూర్తిగా వశము చేసికొన్నట్లు గుర్తించవచ్చు.

1.16. తత్ పరం పురుష ఖ్యాతేర్ గుణ వైతృష్ణం
పురుష ఖ్యాతేర్=ప్రకృతి పురుష జ్ఞానము కలిగిన, గుణ వైతృష్ణం= గుణ వైవిధ్యమయిన     తత్=ఆ, పరం=పర వైరాగ్యము.
ప్రకృతి పురుష జ్ఞానము కలిగిన వైవిధ్యమయిన గుణము కలిగిన  ఆ వైరాగ్యము పర వైరాగ్యము.
1.17. వితర్క విచారానందాస్మితాస్వరూపానుగమాత్ సంప్రజ్ఞాతః
వితర్క విచారానందాస్మితాస్వరూపానుగమాత్ = వితర్క అనగా విశిష్టమైన అనగా కేవలము తర్కముతో కూడినది, విచారించుట, ఆనందము, అస్మిత అనగా మోహము, స్వరూపముల సంబంధము వలన,  సంప్రజ్ఞాతః= కలిగేది సంప్రజ్ఞాతసమాధి. 
వితర్క అనగా విశిష్టమైన అనగా కేవలము తర్కముతో కూడినది, విచారించుట, ఆనందము, అస్మిత అనగా మోహము, స్వరూపముల సంబంధము వలన కలిగేది సంప్రజ్ఞాతసమాధి.
1.18.విరామ ప్రత్యయాభ్యాసపూర్వః సంస్కారశేషేన్యః
విరామ=ముందు చెప్పిన వితర్క, విచార, ఆనంద, అస్మిత, స్వరూప భావనలను విడుచుటకు,  ప్రత్యయా=హేతువగు లేదా కారణమగు వైరాగ్యమునకు,  అభ్యాసపూర్వః = అభ్యాసము ముందు కలుగునట్టి, సంస్కారశేషః =వృత్తిరహితమగు సంస్కారమాత్ర శేషము,   అన్యః= సంప్రజ్ఞాతసమాధి అనబడును.  
ముందు చెప్పిన వితర్క, విచార, ఆనంద, అస్మిత, స్వరూప భావనలను విడుచుటకు,   హేతువగు లేదా కారణమగు వైరాగ్యమునకు, అభ్యాసము ముందు కలుగునట్టి వృత్తిరహితమగు సంస్కారమాత్ర శేషము సంప్రజ్ఞాతసమాధి అనబడును.  అనగా పై భావనలను విడుచుటకు వైరాగ్యమే కారణము. ఆ వైరాగ్యమును అభ్యాసము చేయవలయును. అట్టి వైరాగ్యాభ్యాసము  ముందు కలుగునట్టి వృత్తిరహితమగు సంస్కారమాత్ర శేషమును సంప్రజ్ఞాతసమాధి అనబడును.
1.19.  భవ ప్రత్యయో విదేహ ప్రకృతిలయానాం
విదేహ= స్థూల దేహము వదిలిపెట్టిన వారికి,  ప్రకృతిలయానాం=సూక్ష్మ కారణప్రకృతిలో లీనమగు మనస్సు గలవారికి,  భవ ప్రత్యయో = సంసార హేతువు అగును.
స్థూల సూక్ష్మ దేహములను వదిలిపెట్టిన వారికిని, సూక్ష్మ,కారణప్రకృతిలో లీనమగు  వారికి సంసారము హేతువు అగును. అనగా తిరిగి పునర్జన్మ కలుగును.
1.20. శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం
ఇతరేషాం =ఇతరులకన్నను, ప్రకృతి,లయలకన్నను భిన్నులగు యోగులకు, శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకః = శ్రద్ధా పూర్వకమును, వీర్య పూర్వకమును, స్మృతి పూర్వకమును, సమాధి పూర్వకమును, మరియు  ప్రజ్ఞాపూర్వకమును అగును.
పునర్జన్మ ఎత్తేవారికంటే అనగా  ప్రకృతి, లయలకన్నను భిన్నులయిన వారు యోగులు.  శ్రద్ధా పూర్వకమును, వీర్య పూర్వకమును, స్మృతి పూర్వకమును, సమాధి పూర్వకమును, మరియు  ప్రజ్ఞాపూర్వకమును అగును. అనగా యోగులకు శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి  మరియు  ప్రజ్ఞా అనునవి సమాధికి పూర్వము కలుగును.
1.21. తీవ్ర సంవేగానామాసన్నః
తీవ్ర సంవేగానామ్ = తీవ్ర వైరాగ్యులకు, ఆసన్నః= సమాధి దగ్గిరపడినది.
తీవ్ర వైరాగ్యులకు  సమాధి సమయము దగ్గిరపడినది.
1.22.మృదుమధ్యాధి మాత్రత్వాత్ తతోపి విశేషః  
 (తీవ్ర సంవేగానామ్ = తీవ్ర వైరాగ్యులకు)మృదుమధ్యాధి మాత్రత్వాత్= మృదుత్వము, మధ్య త్వము, అధిక త్వము, మాత్రత్వాత్= ఆతీవ్ర వైరాగ్యులందు, తతోపి విశేషః= ఆ సమాధిప్రాప్తులందు తర తమ భావము ఏర్పడును.
(తీవ్ర వైరాగ్యులకు) మృదుత్వము, మధ్య త్వము, అధిక త్వము,  ఆ తీవ్ర వైరాగ్యులందు,  ఆ సమాధిప్రాప్తులందు తర తమ భావము ఏర్పడును.
1.23. ఈశ్వర ప్రణిధానాద్వా
వా=అట్లుగానిచో, ఈశ్వర ప్రణిధానాత్= ఈశ్వర ఉపసనమువలన కలుగును.
కేవలము ఈశ్వర అనగా ఈక్షణములను,  శ్వరములుగా ఉపయోగించి కూటస్థములో ధ్యానము చేసిన సమాధి కలుగును.   కూటస్థము అనగా రెండు నేత్రముల మధ్యప్రదేశము.
1.24. క్లేశకర్మవిపాకాశయైరపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః
క్లేశ= అవిద్యాది క్లేశములచేతను, కర్మ=శుభ అశుభ కర్మలచేతను, విపాక= సుఖ దుఃఖ ఫలముల చేతను, ఆశయైః=సంస్కారములవాసనలచేతను,  అపరామృష్టః=తాకబడని,  పురుష విశేష= ఒకానొక పరుషుడు, ఈశ్వరః= ఈశ్వరుడు
అవిద్యాది క్లేశములచేతను, శుభ అశుభ కర్మలచేతను, సుఖ దుఃఖ ఫలముల చేతను,  సంస్కారములవాసనలచేతను, కార్యకారణ సిద్ధాంతము చేతను తాకబడని, ఒకానొక పరుషుడు  ఈశ్వరుడు.

1.25. తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వబీజం  
తత్ర= ఆ ఈశ్వరునియందు, సర్వజ్ఞత్వబీజం= సర్వజ్ఞత్వజ్ఞానం నిరతిశయం= పరాకాష్ఠ నొందినది.
ఆ ఈశ్వరునియందు సర్వజ్ఞత్వజ్ఞానం  పరాకాష్ఠ నొందినది.
1.26. పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్  
(అట్టి ఈశ్వరుడు) పూర్వేషామపి=పూర్వములోకూడ,  గురుః= గురువు,  కాలేన= కాలముచే, అనవచ్ఛేదాత్= త్రాకబడడు.
(అట్టి ఈశ్వరుడు) పూర్వములోకూడ గురువు. అనగా ఆయనే ఆదిపురుషుడు. ఆయన కాలమునకు అతీతుడు.
1.27. తస్యవాచకః ప్రణవః
తస్య= అట్టి ఈశ్వరునకు, వాచకః= వాచకము,  ప్రణవః=ఓంకారము.
అట్టి ఈశ్వరునకు వాచకము ఓంకారము.  
1.28. తత్ జపః తదర్థభావనం
తత్ జపః = ఆ ఓంకారము జపించుటవలన, తదర్థభావనం= దాని అర్థము తెలియును.
ఆ ఓంకారము జపించుటవలన దాని అర్థము తెలియును.
1.29. తతః ప్రత్యక్ చేతనాధిగమోప్యన్తరాయాభావశ్చ
తతః=ఆ ఈశ్వర ప్రణిధానముచే, ప్రత్యక్ చేతన=తనయొక్క, అధిగమోపి=సాక్షాత్కారమును  అన్తరాయాభావశ్చ= విఘ్నములు లేకుండుటయు
ఆ ఈశ్వర ప్రణిధానముచే అంతర్ముఖుడగుటవలన  విఘ్నములు లేకుండును. 
1.30. వ్యాధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యా విరతి భ్రాంతి దర్శనాలబ్ధభూమికత్వా నవస్థితత్వాని చిత్త విక్షేపాస్తేన్తరాయాః
వ్యాధి స్త్యాన సంశయః ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధభూమికత్వాని  అనవస్థితత్వాని చిత్త విక్షేపాః తే అన్తరాయాః
1) వ్యాధి, 2)స్త్యానము=మనస్సు విషయమునందు లగ్నము కాకుండుట, 3) సంశయము, 4) ప్రమాదము, 5) ఆలస్యము, 6)అవిరతి=రతి విషయములందు పాల్గొనుట, 7)భ్రాంతిదర్శనము=యోగసాధనములుకాని అనేక దేవతలు వగైరా  రూపములను దర్శించుట, 8) అలబ్ధభూమికత్వము=యోగసాధనకు ఉపయోగించు వృద్ధిసూచనలు కానరాకుండుట, 9) అనవస్థితత్వము=స్థిరము కుదరకుండుట, అనునవి,    చిత్తస్థైర్యభంగకరములు.  అవి యోగమునకు అంతరాయము కలిగించును.
1.31. దుఃఖ దౌర్మనస్యాంగ మే జయత్వ శ్వాస ప్రశ్వాసాః విక్షేప సహభువః
దుఃఖ= భౌతిక, సూక్ష్మ, మరియి కారణ శరీరముల దుఃఖము, దౌర్మనస్య=చిత్తక్షోభము లేక మనస్తాపము,  అంగ  మే జయత్వ= ఆసనసిద్ధిలేకుండుట, శ్వాస ప్రశ్వాసాః= శ్వాస నిశ్వాసల నియంత్రణ లేకుండుట, విక్షేప సహభువః=ఇవి చిత్త విక్షేపములు.
భౌతిక, సూక్ష్మ, మరియి కారణ శరీరముల దుఃఖము, చిత్తక్షోభము లేక మనస్తాపము,   ఆసనసిద్ధిలేకుండుట, శ్వాస నిశ్వాసల నియంత్రణ లేకుండుట,  ఇవి చిత్త విక్షేపములు.
1.32.  తత్ప్రతిషేధార్ధమేకతత్వాభ్యాసః
తత్ప్రతిషేధార్ధమ్=1.31.లోచెప్పిన చిత్తవిక్షేపములను నివారించుటకు, ఏకతత్వాభ్యాసః= ముఖ్యతత్వమును అభ్యసింపవలయును.
చిత్తవిక్షేపములను నివారించుటకు, ముఖ్యతత్వమును అభ్యసింపవలయును.
1.33. మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖ దుఃఖపుణ్యాపుణ్యవిషయాణాం భావనాతశ్చిత్త ప్రసాదనం
సుఖదుఃఖపుణ్యాపుణ్యవిషయాణాం= సుఖవిషయమునను, దుఃఖవిషయమునను, పుణ్యవిషయమునను, పాపవిషయమునను, మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం=(1)మైత్రీ, (2)కరుణ, (3)ముదిత అనగా సంతోషము (4)ఉపేక్షల అనగా సమభావముల యొక్క  భావనాతః= భావించుటవలన, చిత్త ప్రసాదనం= చిత్తము నిర్మలమగును.
సుఖవిషయమునను, దుఃఖవిషయమునను, పుణ్యవిషయమునను, పాప విషయము నను, (1)మైత్రీ, (2)కరుణ, (3)ముదిత అనగా సంతోషము (4)ఉపేక్షల అనగా సమభావముల యొక్క  భావనల వలన, చిత్తము నిర్మలమగును.
1.34. ప్రచ్చర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య
ప్రాణస్య=ప్రాణశక్తిని, ప్రచ్చర్దన విధారణాభ్యాం వా= ఉచ్ఛ్వాస నిశ్వాసములను రెండింటినీ వీలయినంత నిలుపుదల చేయటము 
ప్రాణశక్తిని అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను రెండింటినీ వీలయినంత నిలుపుదల చేయటము వలనను చిత్తము నిర్మలమగును.
1.35. విషయవతీవా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితినిబంధినీ
వా=అట్లుగానిచో, విషయవతీ= విషయములయందు ఉత్సాహముగల, ప్రవృత్తి=యోగి చిత్తవృత్తి, ఉత్పన్నా=పుట్టినదై,  మనసః= మనస్సునకు, స్థితినిబంధినీ= స్థైర్యకారణమగును.  
అట్లుగానిచో, విషయములయందు ఉత్సాహముగల చిత్తవృత్తి  పుట్టినదై,   యోగి మనస్సునకు, స్థైర్య అనగా స్థిరత్వమునకు  కారణమగును.
అనగా  యోగియొక్కమనస్సు చిత్తవృత్తివిషయములయందు కేంద్రీకృతమై  ఉండును. ఆ చిత్తవృత్తివిషయములను ఆశ్రయించిన మనస్సు స్థిరత్వమునకు కారణమగును.
1.35. విశోకావా జ్యోతిష్మతీ
వా= లేదా, విశోకా=శోకించని,  జ్యోతిష్మతీ=మనస్సు జ్యోతి మాదిరి కాంతివంతమగును. అనగా ఆలోచనలు ఉండవు. అణగారిపోవును.
లేదా, శోకించని మనస్సు జ్యోతి మాదిరి కాంతివంతమగును. అనగా ఆలోచనలు ఉండవు. అణగారిపోవును.
1.37. వీతరాగవిషయం వా చిత్తం
వీతరాగవిషయం వా= రాగద్వేషములు వీడిన యోగి,  చిత్తం= మనస్సు
లేదా,  రాగద్వేషములు వీడిన మనస్సు కలవాడై యుండుట వలన, యోగి స్థిరత్వము చెందును.
1.38. స్వప్ననిద్రా జ్ఞానాలంబనం వా  
స్వప్ననిద్రా జ్ఞాన= స్వప్నావస్థ లోని జ్ఞానము, నిద్రా జ్ఞాన= గాఢనిద్రా వస్థ లోని జ్ఞానము,  ఆలంబనం వా= ఆధారము గల మనస్సు స్థిరత్వము పొందును.
స్వప్నావస్థ లోని జ్ఞానము, గాఢనిద్రావస్థ లోని జ్ఞానము, ఆధారము గల సాధకుని మనస్సు స్థిరత్వము పొందును.
1.3. యథాభిమతధ్యానాద్వా
యథాభిమత్= తనకు ఇష్టమయిన పదార్థము యొక్క, ధ్యానాత్= ధ్యానించుట వలన, వా= లేక.
లేక. తనకు ఇష్టమయిన పదార్థము పై ధ్యానించుట వలన, సాధకుని మనస్సు స్థిరత్వము పొందును.  
1.40. పరమాణు పరమ మహత్వాన్తోస్య వశీకారః
అస్య=ఈ చిత్తమునకు, పరమాణు= పరమాణువును, పరమ మహత్వాన్తః=అనంతమైన పదార్ధమును,   వశీకారః= వశము చేసికొనగలుగును.
ఈ చిత్తమునకు పరమాణువును, అనంతమైన పదార్ధమును, వశము చేసికొనగలుగును.
అనగా మనః స్థిరత్వముగల సాధకుడు సూక్మాతిసూక్ష్మమయిన పరమాణువును, గరిష్టమునకు గరిష్టమయినపదార్ధమును నియంత్రించగలుగుతాడు.
1.41.క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేర్గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థతదంజనతా సమాపత్తిః
అభిజాతస్య=ఉత్తమ జాతి, మణేఃఇవ=రత్నమునకువలె, క్షీణవృత్తేః= వృత్తిరహితమగు  స్వచ్ఛ మనస్సునకు, గ్రహీతృ=జ్ఞాతయగుపురుషునియందును,  గ్రహణ గ్రాహ్యేషు=ఇంద్రియములయందును, పంచ తన్మాత్రలయందును, స్థూల, సూక్ష్మ, మరియు కారణ   స్థితుల యందును, తత్థ్సతదంజనతా= ఏకాగ్ర స్థితినొంది ఆ విషయములకు సమానమగు ఆకారమునుగాని పొందుట, సమాపత్తిః=సంప్రజ్ఞాత సమాధి అనబడును.
ఉత్తమజాతి రత్నమునకువలె  జ్ఞాతయగు పురుషునియందు వృత్తిరహితమగు  స్వచ్ఛమనస్సునకు, ఇంద్రియములయందును, పంచ తన్మాత్రలయందును, స్థూల, సూక్ష్మ, మరియు కారణ   స్థితుల యందును, ఏకాగ్రత స్థితినొందియుండుటను  సంప్రజ్ఞాత సమాధి అనబడును.
1.41. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః
తత్ర= గ్రహీత గ్రహణ గ్రాహ్య సమాపత్తులలో,  శబ్దార్థ జ్ఞాన వికల్పైః= శబ్దము యొక్క అర్థములో జ్ఞానము యొక్క వికల్పములచేత,  సంకీర్ణా= వ్యాప్తమగునది,  సవితర్కా సమాపత్తిః= సవితర్క సంప్రజ్ఞాత సమాధి అనబడును.  
గ్రహీత గ్రహణ గ్రాహ్య సమాపత్తులలో శబ్దము యొక్క అర్థములో జ్ఞానము యొక్క వికల్పములచేత లేదా తేడా వలన కలుగునది  సవితర్క సంప్రజ్ఞాత సమాధి అనబడును.
1.43. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్థ మాత్ర నిర్భాసా నిర్వితర్కా
स्मृति परिशुद्धौ= स्मृति परिशुद्ध, अर्थ मात्रनिर्भासा= केवल ग्राह्यपदार्थ को प्रकाशित करना, स्वरूप शून्ये=  अपना ही स्वरुप नहीं होना,  निर्वितर्का= निर्वितर्का समाधि कहते है!
స్మృతి పరిశుద్ధౌ= స్మృతి, పరిశుద్ధమవగా,  అర్థమాత్ర నిర్భాసా= కేవలము గ్రాహ్య పదార్ధమును ప్రకాశవంతం చేయటకు, స్వరూప శూన్యేవా= తన స్వరూపము పోగొట్టుకొనుట,   నిర్వితర్కా= నిర్వితర్క సమాధి 
సవితర్క సంప్రజ్ఞాతసమాధిలో గ్రహింపదగిన వస్తువు, గ్రహించుటకు వలసిన శబ్దము, గ్రహించుటకు వలసిన జ్ఞానము, అను మూడు విషయములు మనస్సున ఉండును.  నిర్వితర్క సమాధిలో ఈ మూడు అనగా గ్రహీత గ్రహణ గ్రాహ్యము అను మూడు విషయములు మనస్సున ఉండవు. ఈ స్థితిలో చిత్తమున కేవలము ధ్యేయ వస్తువు మాత్రమె చిత్తమున నిలిచియుండును. వాస్తవానికి మూడు విషయములు ఒక్కటిగా అగును.
1.44. ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మ విషయా వ్యాఖ్యాతా
ఏతయాఏవ=ఈ సవితర్క నిర్వితర్క సమాధి నిరూపణము చేతనే,  సూక్ష్మ విషయా = సూక్ష్మ విషయ ములు, సవిచారా నిర్విచారా చ= సవిచార సమాధియు,  నిర్విచార సమాధియు అనబడును.
స్థూల భూతముల విషయములో ఈ సవితర్క నిర్వితర్క సమాధి నిరూపణము చేశాము. అదేవిధముగా   సూక్ష్మ భూతముల విషయములో,  సవిచార సమాధియు,  నిర్విచార సమాధియు అనబడును.
1.45. సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానం
సూక్ష్మ విషయత్వం చ= సూక్ష్మ గ్రాహ్య సమాపత్తిలోని, ఆలింగ పర్యవసానం= ఆలింగమే అనగా రూపరహితమే  దాని  పర్యవసానం
సూక్ష్మ గ్రాహ్య సమాధిలోని, ఆలింగమే అనగా రూపరహితమే  దాని  పర్యవసానం.
1.46. తా ఏవ సబీజస్సమాధిః
తా ఏవ= సూక్ష్మ గ్రాహ్య సమాధిలోని,  సబీజస్సమాధిః= సబీజ సమాధి అంటారు.
సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు నాలుగు సబీజ సమాధులు అంటారు.
1.47. నిర్విచార వైశారద్యే ధ్యాత్మ  ప్రసాదః
నిర్విచార వైశారద్యే= నిర్విచార సమాధియండు నిర్మలత్వము కలిగిన సాధకునికి,  ఆధ్యాత్మ  ప్రసాదః= నిఖిల పదార్ధ విషయక యదార్ధ జ్ఞానము
నిర్విచార సమాధియండు నిర్మలత్వము కలిగిన సాధకునికి నిఖిల అనక సర్వ పదార్ధ విషయక యదార్ధ జ్ఞానము కలుగును.  
1.48. ఋతంభరా తత్ర ప్రజ్ఞా
తత్ర= ఆ ఆధ్యాత్మ అనగా పరమాత్మ ప్రసాదమునందు,  ప్రజ్ఞా=కలుగు నిర్మలబుద్ధికి,  ఋతంభరా=  పరమ సత్యము అను పేరు.
ఆ ఆధ్యాత్మ అనగా పరమాత్మ ప్రసాదమునందు కలుగు నిర్మలబుద్ధికి,  ఋతంభరా=పరమ సత్యము అను పేరు. దీనినే ఋతంభరా అంటారు.
1.49. శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయా విశేషార్థత్వాత్
శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యామ్= శాస్త్ర, అనుమాన ప్రమాణము వలనను, మరియు ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మలబుద్ధి, విశేషార్థత్వాత్= విశేషార్థత్వత్వము గలది, అన్య విషయా= వేరగు విషయము
శాస్త్ర, అనుమాన ప్రమాణము వలన కలిగే జ్ఞానము కంటే ఉత్తమమైనది అనగా వేరగు విషయము ఈ ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మలబుద్ధి.  ఈ ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మలబుద్ధి విశేష మయిన అర్థము గలది.
1.50. తజ్జః సంస్కారోన్య సంస్కారప్రతిబంధీ
తజ్జః సంస్కారః=నిర్వికారసమాధిచే ఋతంభరా ప్రజ్ఞా సంస్కారము వలన కలిగిన, అన్యసంస్కార= చిత్త విక్షేప సంస్కారములకు,  ప్రతిబంధీ= ప్రతిబంధకము
నిర్వికారసమాధిచే ఋతంభరాప్రజ్ఞా కలగును. ఆ ఋతంభరాప్రజ్ఞా సంస్కారము చిత్తవిక్షేప సంస్కారము లను నిరోధించును. 
1.51. తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః
తస్యాపి= ఆ ఋతంభరాప్రజ్ఞా సంస్కారము సయితము,  నిరోధే= నిరోధము కలుగగా,  సర్వనిరోధాత్= పాత కొత్త సంస్కారములన్నియు నిరోధింపబడుట వలన,  నిర్బీజః= నిర్బీజమగును. 
ఆ ఋతంభరాప్రజ్ఞా సంస్కారమునకు సయితము నిరోధము కలుగును. పాత కొత్త సంస్కారములన్ని యు నిరోధింపబడుట వలన నిర్బీజమగును. దానినే నిర్వికల్ప లేక నిర్బీజ లేక అసంప్రజ్ఞాత సమాధి అంటారు.  




  



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana