అథ పురుషసూక్తం:
ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞ పతయే
దైవీ స్వస్తిరస్తు నః   స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శమ్ నో
అస్తుద్విపదే  శం చతుష్పదే       ఓం శాంతిః శాంతిః శాంతిః
సహస్ర శీర్షా పురుషః  సహస్రాక్ష సహస్రపాత్

స భూమిం విశ్వతో వృత్వా అత్య తిష్ఠ దశాంగుళం

పురుష వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం
ఉతామృతత్వ స్యేశానః   యదన్నే నాతి రోహతి

ఏతావానస్య మహిమా అతో జాయాగుశ్చ పూరుషః
పాదోస్య  విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి

త్రిపాదూర్ధ్వ ఉదై త్పురుషః పాదోస్యేహాஉஉభవాత్పునః
తతో విష్వణ్ వ్యక్రామత్ సాశనానశనే అభి

తస్మాద్విరాజాయత విరాజో ఆది పురుషః
సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమి మథో పురః  

యత్పురుషేణ హవిషా   దేవా యజ్ఞమతన్వత
వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మఃశ్శరద్ధవిః

సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః
దేవా  యద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం

తం యజ్ఞం బర్హిసి ప్రౌక్షన్ పురుషం జాత మగ్రతః 
తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే

తస్మాద్  ద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం
పశూగు స్తాగు శ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే

తస్మాద్  ద్యజ్ఞాత్ సర్వహుతః ఋచఃసామాని జఙ్ఞిరే
ఛందాగ్ సి జఙ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత

తస్మాదశ్వా అజాయంత యే కేచో భయాదతః
గావోహ జఙ్ఞిరే తస్మాత్ తస్మా జ్ఞాతా అజావయః

యత్పురుషం వ్యదధుః కతిథా వ్యకల్పయన్
ముఖం కిమస్య కౌ బాహూ కావూరూ పాదా వుచ్యేతే

బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్య కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ మ్  శూద్రో అజాయతః

చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత
ముఖాద్ఇంద్రశ్చాగ్నిశ్చ  ప్రాణద్వాయురజాయత

నాభ్యా ఆసీదంతరిక్షం  శీర్ష్ణో ద్యౌః సమవర్తత
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ తథా లోకాగ్ం అకల్పయన్

వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణాం తమసస్తుపారే
సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాஉஉ స్తే

ధాతా పురస్త్యాద్య ముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చతశ్రః
తమేవవిద్యానమృత ఇహ భవతి  నాన్యః పంథా అయనాయ విద్యతే

యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి  ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానః సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః

అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ  విశ్వకర్మణః సమవర్తతాది
తస్యత్వష్టా విదధ ద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే

వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతేయనాయ

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే
తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః

యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః
పూర్వో యో దేవేభ్యోజాతః నమో రుచాయ బ్రాహ్మయే

రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబృవన్
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్ వశే
హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం
అశ్వినౌ వ్యాత్తమ్ ఇష్టం మనిషాణ  అముం మనిషాణ  సర్వం మనిషాణ

ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞ పతయే
దైవీ స్వస్తిరస్తు నః   స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శమ్ నో
అస్తుద్విపదే  శం చతుష్పదే       ఓం శాంతిః శాంతిః శాంతిః

పురుష సూక్తం:

వేదములలో చెప్పబడిన పురుష సూక్తం:

వైదిక ధర్మములో శ్రుతులు స్మృతులు అని రెండు విధములైనవి చెప్పబడినవి. శ్రుతులు అనగా ఎ సమయములోనైనాను సత్యమే. స్మృతులు అనగా ఆ యా సమయ సందర్భములనుబట్టి విధి విధానములు మారుతూ ఉంటాయి. శ్రుతులు ఋషులు విని అనుభూతి చెంది వ్రాసినవి.    

అయిదు సూక్తములు వైష్ణవులకు ముఖ్యమయినవి. అవిపురుషసూక్తం, నారాయణసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, మరియు నీళాసూక్తం.

పురుషసూక్తం ఋగ్వేదము 10 వ మండలం లో 16 శ్లోకములతో చెప్పబడినది. తత్తదుపరి శుక్ల యజుర్వేదం లోని వాజసనేయి సంహిత లోను, కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ అరణ్యకములోను, సామవేదములోను, మరియు అథర్వణవేదము లోను, అల్ప మార్పు చేర్పులతోనూ ఉన్నది.   

అన్ని వేదములలోను ఉన్న పురుషసూక్తమును వేదవ్యాసుడు శృతులసారాంశము అని మహాభారతములో పేర్కొన్నారు. శౌనక, ఆపస్తంభ, బోద్ధాయన మహర్షులు కూడా పురుషసూక్తము యొక్క ఔచిత్యాన్ని పొగిడారు.  

పురుషసూక్తములో ఆదిపురుషుడి గురించి చెప్పబడినది. ఆదిపురుషుని రూపమయిన నారాయణుని వీరపురుషునిగా వర్ణిస్తుంది పురుషసూక్తము. సృష్టికి మూలకారణము నారాయణుడే అని చెప్తుంది.  ఆయనకీ అనంతమయిన తలలు, నేత్రములు, కాళ్ళు, ఉన్నాయని చెప్తూ ఆయనే సర్వత్ర వ్యాపించియున్నాడు అని చెప్తుంది. ఆ నారాయణుడు అన్నిటికీ అతీతుడు అని చెప్తుంది పురుషసూక్తము. సృష్టి మొత్తము ఆయనలోని నాలుగవ భాగమని, మిగిలిన మూడు భాగములు వ్యక్తీకరించలేదు అని చెప్తుంది పురుషసూక్తము.

బ్రహ్మం పురుషుడు. ఆయన పని ఏమీ చేయటం లేదు. ఆదిపురుషుని రూపమయిన నారాయణుని నాలుగు రూపములుగా చేస్తే వాటిలో ఒకరూపము  అనిరుద్ధ నారాయణుడు. ఈ మొదటి నాలుగు విధములయిన రూపములను  విశాఖ యూపము అంటారు. నువ్వు ఏ పని ఎందుకు చేయవు అని ఆది నారాయణుని రూపమయిన అనిరుద్ధ నారాయణుడు ఆది  నారాయణుని అడుగుతాడు. దానికి ఆది  నారాయణుడు ఈ విధముగా బదులు ఇస్తాడు. ఓ  అనిరుద్ధ నారాయణా, నీవు ఒక యజ్ఞము చేయుము. నీ ఇంద్రియములే దేవతలు. వారే ఋత్విక్కులు. నీ శరీరమే హవిస్సు. హవిస్సు అనగా మనము పెట్టే ఆహారము.  నీ హృదయమే మందిరము.  ఆ హవిస్సును నేను స్వీకరిస్తాను.  ఆ యజ్ఞము ద్వారా నీ శరీరము త్యాగము చేయబడినది. ఆ త్యాగము చేసిన శరీరమునుండి అనేక విధములయిన ప్రాణులు సృష్టించబడుతారు. కొన్ని కల్పములముందు నీవు ఈ పనిని చేశావు.  

ఆ యజ్ఞమును సర్వహుత్ యజ్ఞము అందురు. ఇందులో తన శరీరమునే ఆఖరికి హవిస్సుగా త్యాగము చేయాలి. ఈ సృష్టి అనేది యజ్ఞము అనే కర్మకాండ ద్వారా ఆ విధముగా ఏర్పడినది.  ఈ సృష్టి అనే యజ్ఞములో ఎవరిని ప్రార్థించారు? ఆదిపురుషుడయిన నారాయణునే. దీనిని ఎవరు నిర్వర్తించారు? బ్రహ్మ అనగా  ఆదిపురుషుని సృజనాత్మకశక్తి అయిన అనిరుద్ధ నారాయణుడు.  యజ్ఞమునకు ఋత్విక్కులు అనగా పురోహితులు ఎవరు? దేవతలయిన అనిరుద్ధ నారాయణుని ఇంద్రియములు. అనగా తన శరీరములోని ఇంద్రియములే దేవతలు.  యజ్ఞమునకు త్యాగము చేసే అనగా బలికి ఇచ్చే పశువు ఎవరు? తిరిగి ఆ అనిరుద్ధ నారాయణుడే. మందిరము యొక్క వేదిక ఏది? ప్రకృతియే వేదిక. అగ్ని ఎవరు? ఆది పురుషుని హృదయమే అగ్ని. దేనిని త్యాగము చేశారు? తిరిగి ఆ ఆది పురుషునిలో భాగమయిన లేదా రూపమయిన అనిరుద్ధ నారాయణుడే త్యాగము చేయబడ్డాడు. అనగా ఈ సృష్టి మొత్తము ఆ ఆదిపురుషుని లోని భాగమే. 

ఒక రకముగా ఈ పైన పొందుపరచినదంతయు ప్రేమ సందేశమును తెలియబరుస్తున్నది. పురుషుడే తనను తాను ఈ సృష్టి కార్యక్రమములో ఆహుతి చేసుకుంటున్నాడు. తద్వారా వివిధ ప్రపంచములను సృష్టిస్తున్నాడు.  ఈ సృష్టి కార్యక్రమము వేరే ఎక్కడ జరుగుట లేదు. ఆ ఆది పురుషునిలోనే జరుగుతున్నది.  అనగా ఈ సృష్టి కార్యక్రమము ఆ ఆదిపురుషుడే తనలోనుండే చేస్తున్నాడు, తనే చేస్తున్నాడు, నడుపుతున్నాడు, తనలోనే ఆహుతి చేసికుంటున్నాడు.  పురుష సూక్తములోని ముఖ్య సందేశము ఇదే.

వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతేయనాయ 

కోటి సూర్యకంతులతో వెలిగే ఈ ఆదిపురుషుడు, సమస్త అంథకారములకు అతీతుడు. ఆ పరమాత్మను నా హృదయములో తెలుసుకున్నాను.  ఈ ఆదిపురుషుడుని ఈ విధముగా ఎవరు తెలుసుకొంటారో వాడు అమృతత్వమును తప్పక పొందుతాడు. దీనికి మించి మార్గము లేదు. 

పురుష సూక్తం

ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞ పతయే
దైవీ స్వస్తిరస్తు నః   స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శమ్ నో
అస్తుద్విపదే  శం చతుష్పదే       ఓం శాంతిః శాంతిః శాంతిః
మేము పవిత్రుడయిన ఆదిపురుషుడిని ప్రార్థిస్తున్నాను. ఈ యజ్ఞము శాంతియుతముగా జరగాలని ప్రార్థిస్తున్నాను. ఎవరికొరకై ఈ యజ్ఞము చేస్తున్నామో, ఆ ఆదిపురుషుడిని ప్రార్థిస్తున్నాను. ఆ దేవతలు అనగా ఇంద్రియములు మాకు సహకరించుగాక. వారు అందరికి సహకరించుగాక. ఆ సృష్టి సామ్రాజ్యము విస్తరించుగాక. పక్షులు, పశువులు శాంతిగా ఉండుగాక. ఓం శాంతిః శాంతిః శాంతిః

ఎవరు మంగళకరాన్ని అనుగ్రహిస్తారో, ఆ భగవంతున్ని ప్రార్థిద్దాం.. యజ్ఞము సవ్యముగా పరిసమాప్తమగుటకు ప్రార్థిద్దాం. యజ్ఞము  నిర్వర్తించే వ్వారికై ప్రార్థిద్దాం. మనకు దేవతలు శుభము చేయుగాక. మానవులందరికీ మేలు జరుగుగాక. చెట్టు చేమలు ఊర్ధ్వ ముఖముగా పెరుగుగాక. మనవద్ద వసిస్తున్న ద్విపద జీవులకు మంగళకరమవుగాక. చతుష్పాద జీవులకు మేలు జరుగుగాక.

సహస్ర శీర్షా పురుషః  సహస్రాక్ష సహస్రపాత్

స భూమిం విశ్వతో వృత్వా అత్య తిష్ఠ దశాంగుళం

ఆదిపురుషుడికి సహస్ర తలలు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు, ఉన్నవి. భూమిని చుట్టిన తదుపరి దానికంటే పది అంగుళములు అధికముగా ఉన్నాడు.

b)భగవంతుడు వేలాది తలలు గలవాడు. వేలాది కన్నులు గలవాడు. వేలాది పాదాలు గలవాడు. భూమండలం యావత్తు వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.

అనగా భగవంతుడు సర్వత్రా నెలకొని యున్నాడు.  ఆయన సర్వవ్యాపి. ఆయన మనలోనూ వెలసియున్నాడు. అనగా పరిమితిలేని భగవంతుడు పరిమితిగల మనిషి, చెట్టు, పుట్ట, పశువు, జంతువూ, పక్షి, పురుగు, ప్రాణి, కొండ, కోన అన్నిటిలోనూ వెలసియునాడు. చరాచర ప్రపంచము అంతా వెలసియున్నాడు.  దానికి అధికముగానూ యున్నాడు. అనగా అతీతము (అధికముగానూ) యున్నాడు.

పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం

ఉతామృతత్వ స్యేశానః   యదన్నే నాతి రోహతి

భూత వర్తమాన మరియు భవిష్యత్కాలములు మూడూ ఆ ఆదిపురుషుడే. ఆ ఆదిపురుషుడే  అమృతత్వుడు

b. మునుపు ఏది ఉన్నదో, ఏది రాబోతున్నదో, సమస్తం భగవంతుడే. మరణము లేని ఉన్నత స్థితికి అధిపతి అయినవాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచమును అతిక్రమించినవాడు కనుక..

ఏతావానస్య మహిమా అతో జాయాగుశ్చ పూరుషః
పాదోస్య  విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి
అట్టిది ఆయన మహత్యము. వ్యక్తీకరించిన సృష్టి ఆ పరమాత్మలో ఒక భాగము. మిగిలిన మూడు భాగములు వ్యక్తీకరింబడనివి.
B. స్థిర మనస్సుతో అనగా ప్రాణశక్తి నియంత్రణ చేసి ప్రశాంతతో విచారిద్దాం ఇక్కడ కానవస్తున్నదంతయూ భగవంతుని మహిమే. కాని ఆ భగవంతుడు వీటన్నిటికంటే శ్రేష్టుడు. ఉద్భువమయినవన్నీ ఆ భగవంతుని పావు భాగం మాత్రమె. ఆయన ముప్పాతికభాగం వినాశం కాని గగనం లోనే ఉన్నది.
ఆయన అపరిమితుడు. పరిమితమయిన పావు భాగము అనగా మాయ అని మనము తెలిసికొనలేకున్నాము. ప్రపంచమే ఒక మహాయజ్ఞము. పుట్టినది గిట్టితున్నది, గిట్టినది తిరిగి పుడుతున్నది. ఈ చక్ర భ్రమణమే ఒక మహాయజ్ఞము.  ప్రాణవాయువును తీసుకొని అపానవాయువును వాడుతున్న రీతిన కొన్ని తీసుకొని కొన్నిటికి దేనికీ తగులము లేకుండా ఉండాలి. అనగా మాయలోనే జీవించాలి. కాని దానికి తగులము లేకుండా జీవించి ఆనందము పొందాలి. దానికి ప్రతిగా ఈ అగ్నికి ఆజ్యము పోసి చేసే యాగములు. నెయ్యి మొదలగు ఆహుతులను  అర్పించి, వర్షములు అవ్వి తిరిగి పొందుతాము. దేవతలకు కావలిసినవి ఇచ్చి మన జీవనమునకు కావలిస్నావి పొందటము అంటే ఇదే.  ఉదాహరణకి: ఆవుకి కావలసిన గడ్డి గాదెం మనము ఇచ్చి వాటినుంచి పాలు పొందటము. ఈ విధముగా పరస్పరము సహాయము చేసికొని ఆనందము పొందాలి.   దీనినే దేవతలను మెప్పించటము, వారినుండి వర్షము ఇత్యాదులను పొందటము. ఒక శక్తిని ఇవ్వటము దానికి ప్రతిగా శక్తిని పొందటము. ఇదియే జీవనరీతి, యాగము, మహాయజ్ఞము. సృష్టి సైతము ఇటువంటి మహాయజ్ఞము వలననే సంభవించినది.
సృష్టి పూర్వ సృష్టి అని ఉత్తరసృష్టి అని రెండు విధములు.  భగవంతుడు తననే ఆహుతించుకున్నాడు.  ఈ ప్రపంచమును సృష్టించాడు.
పూర్వ సృష్టి: భగవంతుడే ప్రపంచము, ప్రాణులు గానూ సృష్టించుకున్నాడు. 
ఉత్తరసృష్టి: ఆ ప్రాణులు జీవింప ఆహారము వంటి ఇతర పదార్ధములుగా పరిణమించాడు.  
త్రిపాదూర్ధ్వ ఉదై త్పురుషః పాదోస్యేహాஉஉభవాత్పునః
తతో విష్వణ్ వ్యక్రామత్ సాశనానశనే అభి
వ్యక్తీకరించబడని ఆదిపురుషుడు, పైకి లేచినది. వ్యక్తీకరించబడిన ఆది పురుషుడు అనగా మాయ, క్రిందే ఉండిపోయాడు (యింది). అక్కడినుండి చరాచర ప్రాణులు వ్యక్తీకరించబడినవి.
B. భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉన్నది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచముగా ఆవిర్భవించినది. తరువాత భగవంతుడే ఆయా ప్రాణుల, జడపదార్థము లన్నిటిలోను వ్యాపించాడు.
తస్మాద్విరాజాయత విరాజో ఆది పురుషః
సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమి మథో పురః  
విరాట్పురుషుడి నుండి పురుషుడు అనగా జీవుడు వ్యక్తీకరించాడు. అక్కడినుండి దైవీ శక్తులు,  భూమి, మనుష్యులు, పశువులు, వ్యక్తీకరించారు.
B. పూర్వ సృష్టి:  ఆదిపురుషుడినుండే విరాట్పురుషుడు అనగా బ్రహ్మాండం  ఆవిర్భవించాడు(ది). బ్రహ్మాండంతోపాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరములను సృష్టించాడు. 
యత్పురుషేణ హవిషా   దేవా యజ్ఞమతన్వత
వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మఃశ్శరద్ధవిః
దైవీ శక్తులు అనగా దేవతలు యజ్ఞము చేశారు. దానికి బలిపశువుగా ఆ విరాట్పురుషుడినే త్యాగము చేశారు.  వసంత ఋతువు నెయ్యిగాను, గ్రీష్మ ఋతువు ఇంధనముగాను, మరియు హేమంత ఋతువు అభిషేకముగాను ఉపయోగించబడినవి.
B. ఉత్తరసృష్టి: భగవంతున్ని ఆహుతి వస్తువుగా చేసికొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నేయ్యిగాను, గ్రీష్మకాలం ఇంధనముగాను, శరత్కాలం నైవేద్యము అయినది.
సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః
దేవా  యద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం
యజ్ఞమునకై చుట్టూ పరిచే కర్రలు ఏడు, సమిథలు లేదా ఇంధనము ఇరువదిఒక్కటి, దానిలో బలిపశువుగా పురుషుడిని బంధించారు.
B. యజ్ఞానికి పంచభూతాలు,రాత్రి పగలు, కలిసి ఏడూ పరిధులయినవి.  ఇరవయిఒక్క తత్వాలు సమిధలు అయినవి. దేవతలు యాగమును ఆరంభించారు. బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.  
ప్రకృతిలోని వివిధ అంశములు ఈ ప్రపంచ యాగములో వివిధ అంగములుగా రూపుదాల్చాయి. మొదట యజ్ఞము పరిధులు, పరిధియన్నది యజ్ఞ కుండం సరిహద్దురేఖ.  దుష్ట శక్తులనుండి (opposite forces) యజ్ఞమును రక్షించే నిమిత్తము ఈ సరిహద్దురేఖ అమర్చబడుతుంది. ఇక్కడ కుశగ్రాసము చెట్లు లేవు. ఎందుకంటే అప్పటికి సృష్టే ఆరంభము కాలేదు. అందుచేత యజ్ఞములో మట్టి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అనే పంచ భూతములు, రాత్రి పగలు పరిధులుగా అమర్చబడ్డాయి. ఇవి బాహ్య ప్రకృతిని సూచిస్తున్నవి.  యజ్ఞమునకు సమిధలుగా అంతః ప్రకృతి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, అనే జ్ఞానేంద్రియములు అయిదు,
కాలు, చేయి, నోరు, మర్మాంగము, గుదము, అనే కర్మేంద్రియములు అయిదు,
ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన అనే పంచ ప్రాణములు అయిదు,
మనో బుద్ధి చిత్తము అంతఃకరణ అనే నాలుగు,
ధర్మం అధర్మం అయిన ఇరువదిఒక్క తత్వాలు, అనేవి అంతరంగిక ప్రకృతి.
తం యజ్ఞం బర్హిసి ప్రౌక్షన్ పురుషం జాత మగ్రతః 
తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే
ఆ దేవతలు మొదట ఉద్భవించిన పురుషుడిని పవిత్రమయిన దర్భ మీద  త్యాగము చేశారు.  తత్తదుపరి సాధ్యులు, ఋషులు అందరూ త్యాగము చేశారు.
B. మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడయిన బ్రహ్మపై నీళ్ళు చల్లారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరెవరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు.
స్వర్గములో వసించేవారు దేవతలు. వైకుంఠవాసులు సాధ్యులు. బ్రహ్మపై నీళ్ళు చల్లారు. పవిత్రీకరించారు. ఇట్టి విధులతో యజ్ఞమును ప్రాంరంభించారు.
 తస్మాద్  ద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం
పశూగు స్తాగు శ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే
సర్వులను త్యాగము చేయబడ్డ అట్టి యజ్ఞమును సర్వహుత యజ్ఞము అందురు. పెరుగుతో కలిసిన వెన్నను ప్రోగు చేశారు. వాటినుండి వాయు చరములుపక్షులు, వనచరములుక్రూరమృగములు, గ్రామ చరములుపెంపుడు జంతువులు ఉద్భవించినవి.
B. ప్రపంచయజ్ఞమయిన  ఆ యజ్ఞము నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించినది. పక్షులను, జింక పులివంటి వన్య మృగములను, పశువు వంటి సాధు మృగములను బ్రహ్మ సృష్టించాడు.
తస్మాద్  ద్యజ్ఞాత్ సర్వహుతః ఋచఃసామాని జఙ్ఞిరే
ఛందాగ్ సి జఙ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత
సర్వహుత యజ్ఞమునుండి ఋక్కులు, సామములు, ఉద్భవించినవి. వాటినుండి వ్యాకరణము ఉద్భవించినది.  దానినుండి యజుస్సులు అనగా సంప్రదాయ సూత్రములు వెలువడినవి.
B. ప్రపంచయజ్ఞమయిన  ఆ యజ్ఞము నుండిఋగ్వేదమంత్రములు, సామవేద మంత్రములు, గాయత్రీ ఛందస్సులు ఉద్భవించినవి. దానినుండే యజుర్వేదం సముద్భవించినది.    
తస్మాదశ్వా అజాయంత యే కేచో భయాదతః
గావోహ జఙ్ఞిరే తస్మాత్ తస్మా జ్ఞాతా అజావయః
వాటినుండి రెండు వరుసల దంతములు గల అశ్వములు ఇతర జంతువులు, వాటినుండి ఆవులు, వాటినుండి మేకలు గొర్రెలు ఉద్భవించినవి.
B. అందులోనుండే గుర్రాలు, రెండు వరసలు దంతములుగల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించినవి.

యత్పురుషం వ్యదధుః కతిథా వ్యకల్పయన్
ముఖం కిమస్య కౌ బాహూ కావూరూ పాదా వుచ్యేతే
పురుషుడిని విభజించినప్పుడు, ఎన్ని భాగములుగా విభజించారు? వాడి నోరు ఏది? వాడి చేతులు ఏవి? తొడలు, పాదములు ఏవి?
B. బ్రహ్మను దేవతలు బలి ఇచ్చినప్పుడు, ఆయనను ఏ ఏ రూపములుగా చేశారు? ఆయన ముఖము ఏదిగా అయ్యినది? చేతులుగా ఏది చెప్పబడినది? తొడలు, పాదాలుగా ఏవి చెప్పబడినవి?
బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్య కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ మ్  శూద్రో అజాయతః
బ్రాహ్మణుడు ఆయన ముఖము నుండి, క్షత్రియుడు ఆయన చేతుల నుండి, వైశ్యుడు ఆయన తొడల నుండి, మరియు శూద్రుడు ఆయన పాదములనుండి వ్యక్తీకరించాడు.
B. ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. అనగా బ్రహ్మ జ్ఞానము తెలిసినవాడిని బ్రాహ్మణుడు అంటారు.  చేతులు క్షత్రియుడుగా అయినది. అనగా అంతః శత్రువులను ఎదుర్కొనే శక్తి గలవాడు. తొడలు వైశ్యుడుగా అయినది. అనగా బ్రహ్మజ్ఞానమును అధ్యయనము చేయ నిచ్చేవాడు.  పాదములు శూద్రుడుగా అయినది. అనగా నేర్పరితనము గలవాడు.  
చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత
ముఖాద్ఇంద్రశ్చాగ్నిశ్చ  ప్రాణద్వాయురజాయత
చంద్రుడు ఆయన మనస్సునుండి, నేత్రములనుండి సూర్యుడు, ఆయన నోటినుండి ఇంద్రుడు, మరియు అగ్ని, ఆయన శ్వాసనుండి వాయువు ఉద్భవించినవి.
B. మనస్సునుండి  చంద్రుడు ఉద్భవించాడు. కంటినుండి సూర్యుడు ఉద్భవించాడు. ముఖము నుండి ఇంద్రుడు, అగ్ని ఉద్భవించారు. ప్రాణంనుండి వాయువు ఉద్భవించాడు.
నాభ్యా ఆసీదంతరిక్షం  శీర్ష్ణో ద్యౌః సమవర్తత
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ తథా లోకాగ్ం అకల్పయన్
ఆయన నాభినుండి మధ్యప్రదేశము, ఆయన శిరస్సునుండి ఆకాశము, ఆయన పాదములనుండి భూమి, ఆయన చెవ్వులనుండి దిక్కులు, ఈ విధముగా ప్రపంచము ఏర్పడినది.
B. నాభి నుండి అంతరిక్షము  ఉద్భవించినది. శిరస్సు నుండి స్వర్గము  ఉద్భవించినది. పాదములనుండి భూమి ఉద్భవించినది.. చెవినుండి దిశలు  ఉద్భవించినవి.  అట్లే సమస్త లోకములు ఉద్భవించినవి. ఏ భగవంతుడు వేయి తలలు కలవాడని పేర్కొనబడ్డాడో, ఎవడు తననే యజ్ఞ వస్తువుగా గావించుకొని ఈ ప్రపంచాన్నిమనము జీవింప అమర్చించాడో ఆ భగవంతుడికి  మనకూ ఉన్న సంబంధము ఏమిటి? ఈ ప్రపంచాన్ని ప్రాప్తించుకున్న మనము చేయవలసినది ఏమిటి? ఆయనను తెలుసుకోవటమే.
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణాం తమసస్తుపారే
సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాஉஉ స్తే
ఈ అంథకారమునకు (అజ్ఞానమునకు) సూర్యుడికి అతీతముగానున్న ఈ పురుషుడుని నాకు తెలుసు.  ఈ జన్మలోనే ఆయనను తెలుసుకున్న మనిషి అమృతత్వుడు అనగా శుద్ధ జ్ఞాన స్వరూపుడు అవుతాడు. మోక్షమునకు వేరే మార్గము లేదు.
B. సమస్త రూపములను సృష్టించి, పేర్లను కూర్చి, ఏ భగవంతుడు క్రియాశీలుడయి ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించేవాడూ, అంధకారమునకు సుదూరుడూ అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను. ఆ భగవంతుడిని నేను తెలుసుకున్నాను అన్న ఋషి వచనాన్ని, ఆ భగవంతుడిని నేను ఇంకా తెలుసుకోవాలి అని గ్రహించి మనము కార్యోన్ముఖులము కావాలి. ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని పొందిన ఋషులు తమ జీవితములో ఆవిష్కరించుకొన్న సనాతన సత్యమును మనము సాధనగా అనుష్టించాలి. అప్పుడు ఆ సత్యాన్ని మనము కూడా ప్రాప్తించు కోవచ్చు. అదే మనము చేయదగినది. ఇలా ఆ భగవంతుడిని తెలుసుకున్నందున,  పొందినందున ఏమి లభించును?
ధాతా పురస్త్యాద్య ముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చతశ్రః
తమేవవిద్యానమృత ఇహ భవతి  నాన్యః పంథా అయనాయ విద్యతే

 ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో చక్కగా చూశాడో, ఆయనను ఇలా గ్రహించినవాడు ఇక్కడే, అనగా ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.  మోక్షానికి మరో మార్గము లేదు.

యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి  ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానః సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః
ఈ విధముగా యజ్ఞమునకై దేవతలు ఆ పురుషుడిని త్యాగం చేశారు. ఇది మొట్టమొదటి ధర్మము. ఈ మహాత్ములు స్వర్గమును పొందారు. మన ఆది ఋషులు, దేవతలు ఆ స్వర్గములో నివసిస్తున్నారు.
B. దేవతలు ఈ యజ్ఞము ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమ ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభములో ఎక్కడ యజ్ఞము ద్వారా భగవంతున్ని ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నతలోకాన్ని ప్రాపించుకొంటారు.
దేవతలు ఈ మహా ప్రపంచ యజ్ఞమును నిర్వర్తించినందున ఉన్నత లోకముల ను చేరుకున్నారు. ఈ యజ్ఞమును చేసేవారు సైతము ఆ లోకములను చేరుకోగలరు.  ఈ యజ్ఞము చేయటము ప్రధాన ధర్మమని, దీనిని ఆచరించేవారు మహాత్ములని శ్లాఘించటం గమనార్హం    

అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ  విశ్వకర్మణః సమవర్తతాది
తస్యత్వష్టా విదధ ద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే
ఈ జగత్తు నీరు, భూమి, అగ్ని, వాయువు, మరియు ఆకాశములతో విశ్వకర్మనుండి వచ్చినది. విశ్వకర్మ ఆదిత్యుడు, ఇంద్రుడు, మరియు ఇతర దేవతలకి అతీతుడు. త్వష్టా అనగా సూర్యుడు ఉదయమున ఉదయించి తన ప్రకాశమును ప్రదర్శిస్తాడు. మొదట్లో ఈ మృత ప్రపంచము సర్వము అంథకారములో ఉండెడిది.  సూర్యప్రకాశాముతో వెలుగొందెడి ఈ ప్రపంచము పరమాత్మ ప్రసాదమే.
B. నీటినుండి, భూ సారాంశమునుండి, ప్రపంచము ఉద్భవించినది. ప్రపంచాన్ని సృజించిన భగవంతునినుండి, శ్రేశ్ఠుడయిన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ (పధ్నాలుగు లోకములు నిండిన) రూపాన్ని చక్కదిద్ది దాన్లో వ్యాపించియున్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్ట్యాదిలో ఉద్భవించినది. 
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతేయనాయ
మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశమానుడూ, అంధకారమునకు సుదూరుడూ అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలిసుకొనేవాడు, ఇక్కడే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు. ముక్తికి మరో మార్గము లేదు.
ఒకవ్యక్తి  ముక్తిని భగవంతుని ఎందుకు ఆకాంక్షించాలి?    

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే
తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః
సూర్యుడు ప్రాణులకి పతి. ఆకాశములో తిరుగుతూ రాత్రింబగళ్ళు కలుగ జేయును. ఆయనకు జన్మలేదు. ఆయన అందరికీ ఆత్మ.  ఆయన తనను తాను జగత్తులో వివిధ రకములుగా వ్యక్తీకరించుకుంటాడు. జ్ఞానులు జగత్తు మూలము అయిన పరమాత్మను తెలుసుకుంటారు. ప్రజాపతి  మూల పురుషుడు. మరీచి మొదలగు ఋషులు ఆ స్థానము పొందారు.
B. భగవంతుడు ప్రపంచములో క్రియాశీలుడై వరలుతున్నాడు. జన్మలేనివాడుగా ఉంటూనే ఆయన అనేక రూపములలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజస్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మవంటి వారు సైతం మరీచి మొదలయిన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు. 
భగవదనుభూతి విశిష్టత ఇక్కడ ప్రస్తావించబడినది. మానవుడు పొందదగిన పదవులలో అత్యుత్తమమయినది బ్రహ్మపదం. కోట్లాది సంవత్సరాలుగా కొనసాగే మహా ప్రళయ సమయములో అనగా ఈ సృష్టి అంతమునకు వచ్చినప్పుడు ఆయన పదవీకాలము కూడా సమాప్తమగుతుంది. కాని భగవదనుభవము పొందిన ముక్తుడయిన మహాత్ముల స్థితి అజరామరము..    
 
యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః
పూర్వో యో దేవేభ్యోజాతః నమో రుచాయ బ్రాహ్మయే
పరబ్రహ్మన్ నుండి సూర్యదేవుడు వ్యక్తీకరించాడు. ఇతర దేవతలగురించి ఆ సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆయనను దేవతలగురించి ఆవాహన చేయాలి. ఆ సూర్యుడే ఈ దేవతలకి పెద్దయిన హిరణ్యగర్భుడు.
B. ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతలకంటె పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడయిన భగవంతునికి నమస్కారము.  
రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబృవన్
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్ వశే
దేవతలు శుద్ధ జ్ఞాన బ్రహ్మను స్థాపించారు.  పరిపూర్ణ సత్యము ఆయనే అని ప్రచారము చేశారు. ఎవరైతే ఏ సాధకుడయితే శుద్ధ జ్ఞాన బ్రహ్మత్వము పొందుతాడో ఆ సాధకుడు స్వయముగా శుద్ధ జ్ఞానబ్రహ్మ పదవిని పొందుతాడు.
B. భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు, దేవతలు ఆదిలో దానిగురించి ఇలా అన్నారు.  భగవంతుని అన్వేషించేవారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకొన్నాడంటే అతనికి దేవతలు వశవర్తులై ఉంటారు.
హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం
అశ్వినౌ వ్యాత్తమ్ ఇష్టం మనిషాణ  అముం మనిషాణ  సర్వం మనిషాణ

ఓ పరమాత్మా, సరస్వతి పార్వతి మరియు లక్ష్మి మీ సహాయి దేవతలు. రాతింబవళ్ళు మీ రెండు దిక్కులు. అశ్వినీ దేవతలు నీ నోరు. ఓ, పరమాత్మా, నాకు ఇష్టమయిన శుద్ధ జ్ఞానమును ప్రసాదించు. అమృతత్వమును ప్రసాదించు. 
ఓం శాంతిః  ఓం శాంతిః  ఓం శాంతిః
B. లజ్ఞా స్వరూపిణి అయిన హ్రీదేవి, సిరులకు ఆలవాలమయిన లక్ష్మీదేవి, నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్యరూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం. ఓ భగవంతుడా మమ్ములను కరుణించు.
రేయింబవళ్ళు కాలమును సూచిస్తుంది. ఎలా ఒక దేహాన్ని దాని  పార్శ్వాలు భరించునో, అట్లే సృష్టికి కాలము ఆధారభూతము. నక్షత్రములు సృష్టిని సూచిస్తాయి. మనము చూసే ఈ జగత్తు భగవంతునిలో ఒక భాగము మాత్రమె. అత్యదికభాగము ఊర్ధ్వలోకములో ఉన్నది. కంటికి కానవచ్చే ఈ సృష్టి ఇంత మహిమాన్వితమయినది, అపారమయినది. ఈ సృష్టికి కర్త అయిన ఆ భగవంతుడు ఎంతటి మహిమాన్వితుడో అని మనము గ్రహించాలి.   
 



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana