మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు

మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు

సాధకుడు అహంకారము వర్జించి, యోగసాధనతో మనస్సును స్థిరము చేసుకొని, మల విక్షేపణ ఆవరణ దోషములను తొలగించుకొని, శుద్ధాత్ముడై, పరమాత్మతో లయమగుటకు ఉన్నదే మానవజన్మ.
ఆదిభౌతిక ఆటంకములనగా శారీరక రుగ్మతలు,  ఆదిదైవిక ఆటంకములనగా మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక ఆటంకములనగా ధ్యానపరమయిన రుగ్మతలు. వీటినే మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు అంటారు.
శారీరక రుగ్మతలనగా జ్వరము, తలకాయనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగునవి.
మానసిక రుగ్మతలనగా మనస్సుకు సంబంధించినవి. అనగా ఆలోచనలు మొదలగునవి.
ధ్యానపరమయిన రుగ్మతలనగా  నిద్ర, తంద్ర, విసుగు, మరియు బద్ధకము మొదలగునవి.
సాధకుడు అనగా ధ్యానయోగి పరమాత్మతో ఐక్యతకు ఈ మూడు రకములయిన విషయములయందు జాగ్రత్త వహించవలయును. అనగా స్థిరమైన మనస్సుకి ఈరకములయిన విషయములను  వైరాగ్యముతో అణగద్రొక్క వలయును.  
కారణశరీరమునకు తమోగుణ ప్రభావమువలన మల మరియు ఆవరణ దోషములు, రజోగుణమువలన విక్షేపణదోషములు కలుగును.
మురికిబట్టిన లాంతరుచిమ్నీ లోపలి జ్యోతిని కనబడనీయదు. అలాగే మనలోని తమోగుణ అజ్ఞానము అనే మురికి అనే మలదోషము వలన మనలోని పరమాత్మ మనకి కనబడడు. కర్మబంధం, అజ్ఞానం అనగా యదార్థస్వరూపం గుర్తించడానికి వీలు లేక  మరుగునపడితే మలదోషముఅంటారు.
ఆవరణఅనగాదాచేశక్తి.చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమపడి, యదార్థమైన త్రాడును గుర్తించము. అదేవిధముగా తమోగుణముతో కూడిన అజ్ఞానము అనే మనోచంచలత వలన కలిగేదే ఆవరణ దోషము. ఈ దోషము మనలోని పరమాత్మని మరుగున పరిచేటట్లు చేస్తుంది.
నిలకడలేక అటూఇటూ చెదిరిన మనోవ్యాపారములను విక్షేపణ దోషము అంటారు.విక్షేపణ అనగా
 వితరణాశక్తి. రజోగుణము వలన కలిగేది అహంకార పూరితమైనది విక్షేపణ దోషము.  రాగ 
ద్వేషములు, సుఖదుఃఖములు, స్వార్థము, ప్రేమ, వాత్సల్యము, దయ, సంతోషము, తృప్తి, 
అసంతృప్తి, కామ, క్రోధ, లోభ, మోహ, మద మరియు మాత్సర్యము అనే అరిషడ్వర్గములు 
మొదలగునవి విక్షేపణ దోషము.
బ్రహ్మము స్వయముగా మార్పుచెందక వివిధ నామరూపాములుగా అగుపించటమే సృష్టి.
ఆవరణముచే యదార్థము కప్పబడియుండును. విక్షేపముచే యదార్థరూపము ఇంకొక రూపముగా కనిపించును. చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించెదము. ఇక్కడ చీకటి ఆవరణ. పాము అని భ్రమించటం విక్షేపణదోషము. వాతతత్వం తమోగుణమునకు, పైత్యతత్వంరజో గుణమునకు, శ్లేష్మతత్వం సత్వ గుణములకు ప్రతీక.
 ఈ మల, ఆవరణ మరియు విక్షేపణ దోషముల వలన కారణశరీరమునకు 1) దేహవాసన అనగా కర్తృత్వ, భోక్తృత్వములు, 2) ధన, పుత్ర మరియు ధార అనే ఈషణత్రయము, కీర్తివాసనలు, 3) శాస్త్రవాసన, 4) లోకవాసనలు కలుగును. వీటివలననే, అవిద్య, భయం లేదా అహంకారము అనే అస్మిత, రాగద్వేషాలు, మరియు తన శరీరము మీద మోహము అనే అభినివేశములు కలుగును.                       



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana