సంక్షిప్త రామాయణం
రామాయణం
అయోధ్యకు రాజు దశరథుడు. ఆయనకి కౌసల్య సుమిత్ర మరియు కైకేయి అని ముగ్గురు భార్యలు. పుత్రకామేష్టి యాగము వలన మొదటి
భార్య కౌసల్యకు పెద్దవాడయిన శ్రీరాముడు, రెండవభార్య సుమిత్రకు మూడవవాడు లక్ష్మణుడు
మరియు నాలుగవ వాడయిన శత్రుఘ్నుడు, మూడవ భార్య కైకేయికి రెండవవాడు భరతుడు అనే
పుత్రులు జన్మించిరి. శ్రీ వశిష్ట మహర్షి
సలహా మేరకు యాగసంరక్షణార్థము దశరథుడు శ్రీరామ లక్ష్మణులను శ్రీ విశ్వామిత్ర
మహర్షి వెంట పంపుతాడు. త్రోవలో త్రాటక యను
రాక్షసిని సంహరిస్తాడు శ్రీరాముడు. అందుకు సంతోషించిన శ్రీ విశ్వామిత్ర మహర్షి
వివిధములగు అస్త్రశస్త్రములనుశ్రీరామ లక్ష్మణులకు ఒసంగుతాడు. శ్రీ విశ్వామిత్ర
మహర్షి యాగమును ధ్వంసము చేయుటకు వచ్చిన సుబాహుసుబాహువు అనే రాక్షసిడిని
ఆగ్నేయాస్త్రముతో సంహరించుతాడు. ఇంకొక రాక్షుడయిన మారీచుని పయిన మానవాస్త్రమును
సంధించి నూరుయోజనములదూరముననున్న సముద్రములో బడవైచును.
యాగసమాప్తము తదుపరి
శ్రీరామ లక్ష్మణులను వెంటబెట్టుకొని సీతా స్వయంవరము నందు పాల్గొనుటకు మిథిలా
నగరమునకు తీసుకొని వెళ్తారు శ్రీ విశ్వామిత్ర మహర్షి. మార్గమధ్యములో శ్రీరాముడు రాతిగా యున్న అహల్యను
నాతిగా చేసి శాపవిమోచనముకలుగజేస్తాడు. సీతా స్వయంవరములోశివధనుస్సును విరవబోయి రావణాసురుడు భంగపడి అవమానముతో లంకా నగరమునకు
తిరిగివెల్తాడు. శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను వివాహమాడుతాడు. భరతుడు
మాండవిని, లక్ష్మణుడు ఊర్మిళను, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహమాడుతారు. పరశురాముని కోరికమేరకు అతని ధనుస్సును కూడా
అందు బాణము సంధించి తన శక్తిని తెలియజెప్పుతాడు. తన తమ్ములు మరియు వారి వారి
భార్యలతో తండ్రిదశరధుడు తల్లులు కౌసల్య సుమిత్ర మరియు కైకేయిలతో అయోధ్యానగరమునకు
చేరతాడు శ్రీరామచంద్రమూర్తి.
తండ్రిదశరధుడు
శ్రీరామునికి పట్టాభిషేకము చేయదలంచి వశిష్టుని సలహామేరకు ముహూర్తము నిశ్చయింపజేస్తాడు.
దాసి మంధర ప్రోద్భలముతో తను ఎప్పుడో ఇస్తానన్న
రెండు వరములను ఇప్పుడే ఇమ్మని దశరథుని బలవంతపెడుతుంది కైకేయి. తప్పని
పరిస్థితుల్లో 1) శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసము చేయుట మరియు 2) కైకేయి పుత్రుడు భరతుని పట్టాభిషేకం అనే రెండు వరములను ప్రసాదిస్తాడు దశరథుడు.
తదుపరి శ్రీరాముడు తన భార్య సీతతో కలిసి 14 సంవత్సరములు వనవాసమునకు బయల్దేరుతాడు. తన భర్త ఎక్కడ ఉంటె అదే
తన అయోధ్య అని భార్య సీత వేడుకోగా భార్యని, అన్న లేనిది తను ఉండలేనని వేడుకొనగా సుమిత్ర పుత్రుడయిన లక్ష్మణుని వారి వారి తీవ్రమయిన కోరికల మేరకు తన వెంట
తీసుకొని వెళ్తాడు శ్రీరాముడు. భార్య ఊర్మిళను
అత్తమామల సేవలకయి నియోగించి అన్న వదినలవెంట వారి
సేవకై అడవులకేగుతాడు లక్ష్మణుడు. ఆ సమయములో సుమిత్రకి మరో పుత్రుడయిన శత్రుఘ్నుడు, కైకేయి పుత్రుడయిన భరతుడు అయోధ్యలో ఉండరు. శ్రీరాముడు భార్య మరియు లక్ష్మణ సమేతముగా అడవులకేగిన తదుపరి పుత్రవియోగ దుఃఖముతో
అసువులు బాస్తాడు దశరథుడు.
గుహుడు శ్రీరామ లక్ష్మణ సీతాదేవీలను సరయూ నదిని తన నావలో తనకు
కలిగిన మహాద్భాగ్యముగా దాటిస్తాడు. ఆ మువ్వురూ భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు చేరతారు.
అక్కడనుండి చిత్రకూటమునకు వెడలి వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు చేరతారు. ఆ చిత్రకూటమునందు ఒక పర్ణశాలను నిర్మించుకొని
ప్రశాంతముగా కాలమును గడుపుతూ ఉంటారు.
మామగారింటికి వెళ్ళిన భరతుడు అయోధ్యకు వస్తాడు. శ్రీరామ లక్ష్మణ
సీతాదేవీలు అడవికేగిన వృత్తాంతం తెలిసికొని చింతాక్రాంతుడవుతాడు. తల్లి కైకేయిని
మందలించు తాడు. సేనాసమేతుడయి శ్రీరామ లక్ష్మణ సీతాదేవీలను తిరిగి అయోధ్యకు
తీసికొని వచ్చుటకు బయలుదేరి వెళ్తాడు. గుహుని సహాయముతో భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు చేరతాడు. పర్ణశాలను చేరుకొని శ్రీరామ లక్ష్మణ సీతాదేవీలను తిరిగి అయోధ్యకు
రమ్మని రాజ్యమును ఏలమని బ్రతిమిలాడుతాడు. సత్యపరాక్రమశీలుడయిన శ్రీరాముడు
పితృవాక్య ఉల్లంఘన చేయను అంటాడు. భరతుని కోరిక మేరకు
తన పాదుకలను ఒసంగుతాడు. శ్రీరామ పాదుకలను ఆయన ప్రతినిధి రూపములుగా భావించి నందీగ్రామమున స్థాపిస్తాడు భరతుడు.
14 సంవత్సరములకు ఒక్క నిమిషము ఎక్కువయినా సహించను. ఆత్మసమర్పణ చేయుదునని అన్న
శ్రీరామునితో ప్రతిజ్ఞ చేస్తాడు. అన్న రాకకై నిరీక్షిస్తూ ఉంటాడు. అన్నకు బదులుగా
అన్న పాదుకలే రాజ్యము ఏలుతున్నట్లుగా భావిస్తాడు.
కొంతకాలమయిన తదుపరి శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు మరియు భార్య
సీతాదేవీలను తోడ్కొని చిత్రకూటమునుండి బయల్దేరుతాడు. అత్రిమహర్షిని సందర్శిస్తారు.
విరాధుడు అనే రాక్షసుని సంహరించి శరభంగుని ఆశ్రమమునకు తదుపరి సుతీక్ష్ణుని ఆశ్రమమునకు
చేరుతారు. అక్కడినుండి అగస్త్యుని ఆశ్రమమును సందర్శిస్తారు. అగస్త్యుని నుండి
గొప్ప ధనుర్భాణములను ఖడ్గమును స్వీకరిస్తారు. అక్కడినుండి బయల్దేరి పంచవటి
చేరుతారు. అక్కడ పర్ణశాలను నిర్మించుకొని సుఖముగా కాలము వెళ్ళబుచ్చుతూ ఉంటారు.
అక్కడ జటాయువు అనే పక్షితో స్నేహము చేసికుంటారు. ఆ పక్షి వారికి వలసిన సకల
సహాయములు చేయుచూ ఉంటుంది.
కొంతకాలమునకు రావణుని
సోదరి శూర్పణఖ అక్కడికి వస్తుంది. శూర్పణఖ
రావణుని సోదరి. శ్రీరాముని అందమునకు మోహితురాలవుతుంది. కామపీడితఅయి శ్రీరాముని ఆశ్రయించగా
స్వామి నిరాకరించగా లక్ష్మణుని ఆశ్రయిస్తుంది. క్రోధముతో లక్ష్మణుడు ఆవిడ ముక్కు చెవులు కోసి పంపుతాడు.
తన పరాభావమును సోదరులు ఖర దూషణులతో చెప్పుకొని విలపిస్తుంది. ఖర దూషణులు ఇద్దరూ 14000 మంది రాక్షసులతో శ్రీరాముని వధించుటకు పూనుకుంటారు. వారందరినీ శ్రీరామచంద్రమూర్తి
వధిస్తారు.
ఖర దూషణుల వధ వార్తను
విన్న లంకాధిపతి రావణాసురుడు కుపితుడయి మారీచుని పంపుతాడు. మాయా బంగారు లేడి ఆకృతి
ధరించి సీతను మభ్యపెడతాడు. సీత యొక్క బలమయిన కోరికమేరకు ఆ బంగారు లేడిని తెచ్చుటకు
శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుని ఆమెకి కాపలాగా పెట్టి వెళతాడు. ‘ఓ సీతా, ఓ
లక్ష్మణా’ అని అరుస్తూ మారీచుడు శ్రీరాముని బాణమునకు మరణిస్తాడు. మారీచుని
మోసపూరితమయిన పన్నాగమును గ్రహించలేని సీత శ్రీరామునికి ప్రమాదమువాటిల్లినదని
భావిస్తుంది. ఆ పర్ణశాల చుట్టూ ఒక గిరి గీచి అది ఎట్టి పరిస్థితులలోను దాటవద్దని
చెప్పి ఒదిన ప్రోద్భలంతో లక్ష్మణుడు అన్నకు సహాయ నిమిత్తము వెతుక్కుంటూ వెళ్తాడు.
దానినే లక్ష్మణరేఖ అని అంటారు. సమయమునకు
వేచి చూచుచున్న రావణాసురుడు సాదు వేషముతో వచ్చి ఆ గిరిని సీత దాటి బిచ్చము
వేయునట్లు చేసి ఆకాశమార్గమున లంకకు ఎత్తుకెల్తాడు. త్రోవలో జటాయువు అడ్డుపడి
రక్షింపజూస్తాడు. ఆ పక్షి ఱెక్కలు నరికి పడేస్తాడు రావణాసురుడు. కిష్కింధాసమీపమున సీత
తన ఆభరణములను ఒక వస్త్రమందు మూటగట్టి క్రిందకు విడిచి పెట్టును.
శ్రీరాముడు మారూచుని
సంహరించి పర్ణశాలకు వచ్చి సీతను లక్ష్మణుని ఇరువురిని గాంచక చింతాక్రాంతుడవుతాడు. లక్ష్మణుడు
పర్ణశాలకు తిరిగి వస్తాడు. శ్రీరామలక్ష్మణులు ఇరువురుసీత కొరకై వెతుకుతూ అవసానదశాలో రెక్కలు తెగి
పడియున్న జటాయువు ద్వారా రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లిన వృత్తాంతం తెలిసికుంటారు.
తదుపరి మరణించిన జటాయువుకు అంత్యక్రియలు జరిపిసీత
కొరకై వెతుకుతూ ముందరికి వెళ్తూ మార్గములో కబంధుడు అనే రాక్షసుని
సంహరిస్తారు. వాడికి శాపవిమోచనము కలిగి తిరిగి గంధర్వపు జన్మను పొందుతాడు. దానికి
కృతజ్ఞతగాఆ గంధర్వుడు సీతని వెదకుటకై వానరరాజు అయిన సుగ్రీవుని సహాయము అడగమని
చెప్తాడు. సుగ్రీవుని సహాయము అడుగుటకు ముందుకి ఏగుతారు. శ్రీరామలక్ష్మణులు పంపాసరోవరమార్గమును జేబట్టి
పోవుచు మార్గములో భక్త శబరి ఆశ్రమమునకు దర్శిస్తారు. ఆమె ప్రేమపూర్వకమైన
ఆతిథ్యమును స్వీకరించి ఋష్యమూకపర్వత సమీపమునకు చేరుతారు. అక్కడ సుగ్రీవునితోను
హనుమంతుని తోను స్నేహము ఏర్పడుతుంది. హనుమంతునికి దొరికిన సీత ఆభరణములను
సుగ్రీవుడు శ్రీరామునికి చూపుతాడు. అవి గుర్తుపట్టిన శ్రీరాముడు దుఃఖితుడవుతాడు.
సుగ్రీవుని భార్యను
అపహరించి అతనిని హింసిస్తున్న సుగ్రీవుని సోదరుడయిన వాలిని సంహరిస్తాడు శ్రీరాముడు.
దానికి కృతజ్ఞతగా తనను హనుమంతునితో సహా తన వానరసేనను శ్రీరాముని సేవకై నియోగిస్తాడు. వానరులందరినీ అన్ని దిక్కులా వెతికి రమ్మని
పంపుతాడు సుగ్రీవుడు. దక్షిణ దిశగా హనుమంతుని మరియు కుమారుడయిన అంగదుని పంపుతాడు.
వారు సముద్రతీరమును చేరుకొని అక్కడ జటాయువుయొక్క అన్న సంపాతిని కలుస్తారు.
సముద్రపు అవతలి తీరమున లంకయందున్న సీతజాడను తెలిసుకుంటారు. జాంబవంతుడు హనుమంతుని
శక్తి సామర్ధ్యములను శ్లాఘిస్తాడు. హనుమంతుడు 100 యోజనములదూరమున్న సముద్రమును దాటుతాడు. లంకాపురిని కాపలాకాస్తున్న లంకినీ
రాక్షసిని వధించి ముందరకేగుతాడు. అశోకవనమునందున్న రాక్షసుల కాపలాలోయున్న
ఒకఅశోకవృక్షముక్రింద శోకముతో కూడియున్న సీతను కనుగొంటాడు. శ్రీరాముడు ఒసంగిన
అంగుళీయకమును ఆమెకి ఒసంగి త్వరలోనే ఆయన వచ్చి చెర విడిపిస్తాడని ధైర్యం చెప్తాడు.
ఆమె శ్రీరామునికొసంగిన చూడామణిని తీసికుంటాడు.
అడ్డువచ్చిన రాక్షసులందరినీ వధిస్తూ ఆ వనమునంతను ధ్వంసము చేస్తున్న హనుమంతుని
బ్రహ్మాస్త్రము వేసి బంధించి తీసుకెళ్ళి రావణుని ఆజ్ఞ మేరకు ఆయన ముందర నిలబెడతాడు.
హనుమంతుని వధించమంటాడు రావణుడు. దూతను వధించకూడదు అతనికి ఏదయినా శిక్షవేసి
పంపమంటాడు రావణుని సోదరుడు విభీషణుడు. అప్పుడు ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞమేరకు
హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తారు. హనుమంతుడు లంకా పట్టణమునందలి భవనములకు నిప్పు
అంటిస్తాడు. ఆ తరువాత శ్రీరాముని వద్దకుజేరి జరిగిన వృత్తాంతం విశదీకపరుస్తాడు.
హనుమంతుని శక్తి సామర్ధ్యములకు కార్యదక్షతతకు సేవానిరతికి శ్రీరాముడు చాలా
సంతోషిస్తాడు.
విభీషణుడు అన్న రావణుని సీతమ్మను శ్రీరామునికి మర్యాదపూర్వకముగా అప్పజెప్పి
క్షమాపణ కోరమంటాడు. దానికి కుపితుడైన రావణుడు తమ్ముడువిభీషణుని లంకనుండి వెళ్ళగొడుతాడు.
శరణుకోరిన విభీషణుని తన పక్షములో చేర్చుకుంటాడు శ్రీరాముడు. తదుపరి సేనా సమేతముగా
సముద్రపు తీరమును చేరతాడు. నలుడి పర్యవేక్షణలో శ్రీరాముని దయతో లంకా పట్టణమును
కలుపుతూ సముద్రము మీద వారధి నిర్మిస్తారు. రావణునికి హితవు చెప్పుటకు అంగదుని
రాయబారిగా పంపుతాడు. కాని రావణుడు అంగదుని
మాటలు పెడచెవినిబెట్టి శ్రీరామునితో యుద్ధమునకే సంసిద్ధుడవుతాడు. సీతమ్మను
వదులుకొనుటకు సనేమిరా ఇష్టపడడు. ఇరు సైన్యములకు ఘోరమయిన యుద్ధము జరుగుతుంది. ఇరు
సైన్యములలో ఎందఱో అసువులు పోగొట్టుకుంటారు. లక్ష్మణుని చేతిలో విరూపాక్షుడు
చచ్చిపోతాడు. అగ్నికేతువు రశ్మికేతువు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు ధూమ్రాక్షుడు
వజ్రదంష్ట్రుడు అకంపనుడు ప్రహస్తుడు కుంభకర్ణుడు దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు మహోదరుడు
త్రిశిరుడు మహాపార్శ్యుడు అనువారు శ్రీరాముని తీక్ష్ణ బాణములచే హతమవుతారు. రోషపూరితుడయిన
ఇంద్రజిత్తుతన బాణములతో లక్ష్మణుని మూర్ఛపూరితుడిగా చేస్తాడు. జాంబవంతుని
సూచనమేరకు హనుమంతుడు హిమాలయపర్వతములలోనున్న దివ్యఔషధములుగల సంజీవని పర్వతమును
పెకలించుకొని తీసికొని వస్తాడు. ఆ దివ్యఔషధముల సుగంధములను ఆఘ్రాణించిన లక్ష్మణుడు మూర్ఛనుండి
తేరుకుంటాడు. హనుమంతుడు సంజీవని పర్వతమును తిరిగి యథాస్థానంలో ఉంచి వస్తాడు.
తదుపరి జరిగిన యుద్ధమందు కుంభకర్ణుని పుత్రులగు కుంభనికుంభులు యూపాక్షుడు
శోణితాక్షుడు ప్రజంఘుడు కంపనుడు మకరాక్షుడు అను రాక్షస నాయకులు వధించ బడిరి.పిమ్మట
రావణుని పుత్రుడు మహాబలశాలియగు ఇంద్రజిత్తుని సంహరిస్తాడు. లక్ష్మణుడు. విరూపాక్షుడు
మహోదరుడు ఉభాయులను సుగ్రీవుడు సంహరిస్తాడు.
అంగదుడు మహాపార్శ్వుని సంహరిస్తాడు. ఆఖరికి విభీషణుని సలహా మేరకు రావణుని కడుపులో
బాణమువేసి నిహతుడ్నిచేస్తాడు.
శ్రీరాముడు విభీషణుని లంకకు రాజుని చేస్తాడు. సీత అగ్నిప్రవేశముచేసి తన
పవిత్రతను నిరూపించుకొంటుంది. శ్రీరాముడు సీతా సమేతముగా సపరివారముగా పుష్పక
విమానములో అయోధ్యచేరుతాడు. అన్నను చూచిన భరతుడు ఆనందభరితుడవుతాడు. శ్రీరామునికి
రాజ్యపట్టాభిషిక్తుడ్ని చేసి సంతుష్టుడవుతాడు.
Comments
Post a Comment