ఆధ్యాత్మిక రామాయణం
ఆధ్యాత్మిక రామాయణం
సాధకుడు అహంకారము వర్జించి, యోగసాధనతో మనస్సును స్థిరము చేసుకొని, మల విక్షేపణ ఆవరణ దోషములను తొలగించుకొని, శుద్ధాత్ముడై, పరమాత్మతో లయమగుటకు ఉన్నదే ఈ మానవజన్మ.
ఆదిభౌతిక ఆటంకములనగా శారీరక రుగ్మతలు, ఆదిదైవిక ఆటంకములనగా మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక ఆటంకములనగా ధ్యానపరమయిన రుగ్మతలు. వీటినే మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు అంటారు.
శారీరక రుగ్మతలనగా జ్వరము, తలకాయనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగునవి.
మానసిక రుగ్మతలనగా మనస్సుకు సంబంధించినవి. అనగా ఆలోచనలు మొదలగునవి.
ధ్యానపరమయిన రుగ్మతలనగా నిద్ర, తంద్ర, విసుగు, మరియు బద్ధకము మొదలగునవి.
సాధకుడు అనగా ధ్యానయోగి పరమాత్మతో ఐక్యతకు ఈ మూడు రకములయిన విషయములయందు జాగ్రత్త వహించవలయును. అనగా స్థిరమైన మనస్సుకి ఈరకములయిన విషయములను వైరాగ్యముతో అణగద్రొక్క వలయును.
కారణశరీరమునకు తమోగుణ ప్రభావమువలన మల మరియు ఆవరణ దోషములు, రజోగుణమువలన విక్షేపణదోషములు కలుగును.
మురికిబట్టిన లాంతరుచిమ్నీ లోపలి జ్యోతిని కనబడనీయదు. అలాగే మనలోని తమోగుణ అజ్ఞానము అనే మురికి అనే మలదోషము వలన మనలోని పరమాత్మ మనకి కనబడడు. కర్మబంధం, అజ్ఞానం అనగా యదార్థస్వరూపం గుర్తించడానికి వీలు లేక మరుగునపడితే మలదోషముఅంటారు.
ఆవరణ అనగా దాచేశక్తి. చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమపడి, యదార్థమైన త్రాడును గుర్తించము. అదేవిధముగా తమోగుణముతో కూడిన అజ్ఞానము అనే మనోచంచలత వలన కలిగేదే ఆవరణ దోషము. ఈ దోషము మనలోని పరమాత్మని మరుగున పరిచేటట్లు చేస్తుంది.
నిలకడలేక అటూఇటూ చెదిరిన మనోవ్యాపారములను విక్షేపణ దోషము అంటారు.విక్షేపణ అనగా వితరణాశక్తి. రజోగుణము వలన కలిగేది అహంకార పూరితమైనది విక్షేపణ దోషము. రాగ ద్వేషములు, సుఖదుఃఖములు, స్వార్థము, ప్రేమ, వాత్సల్యము, దయ, సంతోషము, తృప్తి, అసంతృప్తి, కామ, క్రోధ, లోభ, మోహ, మద మరియు మాత్సర్యము అనే అరిషడ్వర్గములు మొదలగునవి విక్షేపణ దోషము.
బ్రహ్మము స్వయముగా మార్పుచెందక వివిధ నామరూపాములుగా అగుపించటమే సృష్టి.
ఆవరణముచే యదార్థము కప్పబడియుండును. విక్షేపముచే యదార్థరూపము ఇంకొక రూపముగా కనిపించును. చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించెదము. ఇక్కడ చీకటి ఆవరణ. పాము అని భ్రమించటం విక్షేపణదోషము. వాతతత్వం తమోగుణమునకు, పైత్యతత్వంరజో గుణమునకు, శ్లేష్మతత్వం సత్వ గుణములకు ప్రతీక.
ఈ మల, ఆవరణ మరియు విక్షేపణ దోషముల వలన కారణశరీరమునకు 1) దేహవాసన అనగా కర్తృత్వ, భోక్తృత్వములు, 2)
ధన, పుత్ర మరియు ధార అనే ఈషణత్రయము, కీర్తివాసనలు, 3)
శాస్త్రవాసన, 4)
లోకవాసనలు కలుగును. వీటివలననే, అవిద్య, భయం లేదా అహంకారము అనే అస్మిత, రాగద్వేషాలు, మరియు తన శరీరము మీద మోహము అనే అభినివేశములు కలుగును.
పేరు
|
చక్రము
|
సమిష్టిలోకం
|
వ్యష్టిలోకం
|
సమాధి
|
సహదేవ(శేషాద్రి)
|
మూలాధార
|
భూ
|
పాతాళ
|
సవిచార సంప్రజ్ఞాత
|
నకుల(వేదాద్రి)
|
స్వాధిష్ఠాన
|
భువర్
|
మహాతల
|
సవితర్క లేదా సాలోక్యసంప్రజ్ఞాత
|
అర్జున(గరుడాద్రి)
|
మణిపుర
|
స్వర్
|
తలాతల
|
సానంద లేదా సామీప్య సంప్రజ్ఞాత
|
భీమ(అంజనాద్రి)
|
అనాహత
|
మహర్
|
రసాతల
|
సస్మిత లేదా సాయుజ్య సంప్రజ్ఞాత
|
యుధిష్ఠిర(వృషభాద్రి)
|
విశుద్ధ
|
జన
|
సుతల
|
అసంప్రజ్ఞాత లేదా సారూప్య
|
శ్రీకృష్ణ(వెంకటాద్రి)
|
ఆజ్ఞా
|
తపో
|
వితల
|
సవికల్ప లేదా స్రష్ట
|
పరమాత్మ(నారాయణాద్రి)
|
సహస్రార
|
సత్య
|
అతల
|
నిర్వికల్ప
|
మోక్షము అనే దానికి రాజు పరబ్రహ్మ. ఆయనకి
జ్ఞానశక్తి క్రియాశక్తి మరియు
ఇచ్ఛాశక్తి అని ముగ్గురు భార్యలు. మొదటి భార్యకు పెద్దవాడయిన శుద్ధాత్మ, రెండవభార్య కు మూడవవాడు అహంకారం మరియు నాలుగవవాడయిన
వైరాగ్యేచ్ఛ, మూడవ భార్య కి రెండవవాడు మోక్షేచ్ఛ గల సాధకుడు అనే పుత్రులు జన్మించిరి. శ్రీవశిష్టమహర్షి క్రియా యోగ ప్రథమగురువు. ఆ
సద్గురువు సలహా మేరకు క్రియాయోగయాగ సంరక్షణార్థము పరమాత్మ దయవలన సాధకునిలోని శుద్ధాత్మ అహంకారములను సాధకుని
ప్రస్తుత క్రియాయోగ గురువు శ్రీ విశ్వామిత్రమహర్షి వెంట పంపుతాడు. సాధకునిలోని శుద్ధాత్మ తనకు
తానుగా స్వయంప్రకాశముతో విరాజిల్లుటకు దానికై సాధకునిలోని అహంకారము ను
నియంత్రించుటకు మరియు తనలోని నకారాత్మక శక్తులను సంహరించుటకు ప్రస్తుత క్రియాయోగ గురువు శ్రీ
విశ్వామిత్రమహర్షి వెంట ఉండమని సాధకునికి ఇచ్చిన ఆత్మావబోధ. త్రోవలో అనగా ఆధ్యాత్మిక మార్గములో
అడ్డువచ్చిన త్రాటకి యను నకారాత్మకశక్తి
అయిన మనస్సును కప్పియున్న ఆవరణము అనే రాక్షసిని సంహరిస్తాడు శుద్ధాత్మ సహాయముతో
సాధకుడు.. అనగా సాధకుని మూలాధారచక్రము జాగృతి చెందినదని తాత్పర్యము. మలవిక్షేపణఆవరణ దోషములను తొలగించుకుంటేనే
మోక్షప్రాప్తి. అందుకు సంతోషించిన శ్రీ
విశ్వామిత్ర మహర్షి వివిధములగు ప్రాణాయామ పద్ధతులను శ్వాసను నియంత్రించుటకు
సాధకునికి గురువు తెలియబరుస్తాడు.
శ్రీ విశ్వామిత్ర మహర్షి యాగమును
ధ్వంసము చేయుటకు వచ్చిన సుబాహువు అనగా
మలదోషము అనే రాక్షసిడిని ఆగ్నేయాస్త్రముతో సంహరించుతాడు సాధకుడు. ఇంకొక రాక్షుడయిన
మారీచుని అనగా విక్షేపణ అనే దోషమును మానవాస్త్రమును
సంధించి నూరు యోజన ముల దూరముననున్న సముద్రములో బడవైచును. అనగా సాధకునిలోని
స్వాదిష్ఠాన మణిపుర చక్రములు జాగృతిచెందినవని అర్థము. మూలాధారము ఇచ్ఛాశక్తికి, స్వాదిష్ఠాన చక్రము క్రియాశక్తికి,
మణిపురచక్రము జ్ఞానశక్తికి ప్రతీకలు.
యాగసమాప్తము అనగా క్రియాయోగము నేర్పిన
తదుపరి సీతా అనగా కుండలినీ శక్తి స్వయంవరమునందు పాల్గొనుటకు మిథిలా నగరమునకు అనగా
ఏకాంతమునకు తీసుకొని వెళ్తారు శ్రీ
విశ్వామిత్ర మహర్షి. మార్గమధ్యములో
శ్రీరాముడు రాతిగా యున్న అహల్యను నాతిగా చేసి శాపవిమోచనముకలుగజేస్తాడు.
గౌతమ—అహల్య:
గౌతముని భార్య అహల్య. గౌతముడు భార్య
అహల్యకు ఆథ్యాత్మిక బోధ చేస్తూ ఉంటాడు. ఆవిడ మనస్సు ఆసమయములో చంచలముగా ఉంటుంది.
ప్రాపంచిక విషయముల వైపుకి మళ్ళియుంటుంది. దానికి కారణములు ఇంద్రియములు.
ఇంద్రియములకు రాజు ఇంద్రుడు అనగా మనస్సు.
అది గ్రహించినగౌతముడు భార్య అహల్యను ‘న హల్య’ అహల్య (కదలకూడదు) అంటాడు. కదలకుండా
రాయి లాగ నిశ్చలముగా ఉండమంటాడు. దీనినే అహల్య మనస్సు ఇంద్రుడు పయిన లగ్నమగుట మరియు
గౌతముని శాపము పొందుట అందురు. రాముడు వచ్చి శాపవిమోచనము కలుగచేయుట అందురు.
ఆథ్యాత్మిక విషయములు మనస్సు చంచలముగా ఉంటే బోధపడవు. బోధపడవలయునన్న మనోనిశ్చలత
అత్యంత ఆవశ్యకము. మనోనిశ్చలతయే ధ్యానము. అట్టి మనోనిశ్చలతా పరిస్థితులో మాత్రమె
రాముడు అనగా పరమాత్మ శక్తి మూలాధారమువద్దనున్న కుండలినీ శక్తిని జాగృతి చేయగలదు.
అప్పుడే మనుష్య జన్మకు సార్ధకత. ధ్యానముచేయని మనుజుడు పశువుకు సమానము. తమతమ
దైనందిక పనులు చేసికుంటూ ధ్యానముతో పరమాత్మ సామ్రాజ్యములో ప్రవేశమునకు అర్హత
సంపాదించవలయును. తత్తదుపరి మనుజులు తమతమతమ
దైనందిక పనులు చేసికుంటూ ధ్యానము తీవ్రతరము చేసికుంటూ పరమాత్మతో ఐక్యము
అవ్వవలయును.
సీతా స్వయంవరములో శివధనుస్సును విరవబోయి
అనగా కుండలినీశక్తిని జాగృతి పరచబోయి రావణాసురుడు
అనగా తీవ్ర అహంకారము భంగపడి అవమానముతో లంకా నగరమునకు అనగా సంసారమునకు
తిరిగివెల్తాడు. అనగా క్రియాయోగాసాధన చేయనివాడు కుండలినీని జాగృతి పరచలేదు.
సాధకునిలోని శ్రీరాముడు శుద్ధాత్మ
శివధనుస్సును విరిచి జనకుని పుత్రిక అనగా శాంతము యొక్క పుత్రిక అయిన సీతను అనగా కుండలినీశక్తిని వివాహమాడుతాడు అనగా జాగృతి
పరచుతాడు. పరశురాముని అనగా తీవ్రసాధన
కోరికమేరకు అతని ధనుస్సును అనగా మేరుదండములోని బాణమును సంధించి అనగా రుద్రగ్రంధి విచ్ఛేదన చేసి తన శక్తిని తెలియజెప్పుతాడు.
ఇంకా విష్ణుగ్రంధి విచ్ఛేదన జరగకుండా
పట్టాభిషేకముచేయుటకు నిర్ణయించుట అనగా
పరిపూర్ణముక్తి కలగకుండానే పరిపూర్ణుడుగా నిర్ణయముచేయుట దోషభూయుక్త మయినది.
సాధకునిలోని మంధర అనగా మనస్సు ప్రోద్భలముతో తను ఎప్పుడో
ఇస్తానన్న రెండు వరములను అనగా
క్రియాయోగసాధన మరియు మోక్షము ఇప్పుడే ఇమ్మని పరమాత్మ ను బలవంతపెడుతుంది ఇచ్ఛాశక్తి. సాధకుని తీవ్రమయిన
ఇచ్ఛాశక్తికి లొంగి 1) 14 సంవత్సరములు వనవాసము చేయుట (అనగా
త్రేతాయుగములో 14 సంవత్సరముల
క్రియాయోగసాధన అనేది యుగధర్మము) మరియు 2) పట్టాభిషేకం(అనగా
సాధకునికి పరిపూర్ణముక్తి) అనే రెండు
వరములను ప్రసాదిస్తాడు పరమాత్మ. 14 సంవత్సరముల
క్రియాయోగసాధనలో ఇంకా పూర్తిగా అణగారని సాధకునిలోని అహంకారము శుద్ధాత్మతోడనే
ఉంటుంది. భార్య ఊర్మిళను(నిద్ర) అత్తమామల
సేవలకయి నియోగించి అన్న వదినలవెంట వారి సేవకై అడవులకేగుతాడు లక్ష్మణుడు. నిద్రను
మరిచి సాధకునిలోని అహంకారము కేవలము పరమాత్మ పైననే నిమగ్నముచేయుటయే దీనిలోని
అంతరార్ధము. పరిపూర్ణమైన మోక్షము లభించనంతవరకు ఆ సమయములో సుమిత్రకి(క్రియాశక్తి)
మరో పుత్రుడయిన శత్రుఘ్నుడు(వైరాగ్యేచ్ఛ), కైకేయి(ఇచ్ఛాశక్తి) పుత్రుడయిన
భరతుడు(సాధకుడు) అయోధ్యలో(మోక్షసామ్రాజ్యము) ఉండరు. 14 సంవత్సరముల క్రియాయోగ తీవ్రసాధనకై సంకల్పించిన సాధకుడు తనలోని కుండలినీ శక్తిని జాగృతిపరచి
అహంకారమును నిర్మూలించి శుద్ధాత్మను వ్యక్తపరచుటకు ఉద్యమిస్తాడు.
గుహుడు అనగా శుద్ధబుద్ధి సాధకుడిలోని శుద్ధాత్మ కుండలినీ మరియు
అహంకారములను సంసారమనే సరయూ నదిని తన చిత్తమనేనావలో దాటిస్తాడు. అనగా సాధకుని స్వాధిష్ఠానచక్రము
జాగృతి చెందినదని అర్థము. ఆ మువ్వురూ
భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు చేరతారు. అక్కడనుండి చిత్రకూటమునకు వెడలి వాల్మీకి
మహర్షి ఆశ్రమమునకు చేరతారు. భరద్వాజ మహర్షి వాల్మీకి మహర్షి అనే సకారాత్మక శక్తుల
సహాయముతో ఆ చిత్రకూటమునందు ఒక పర్ణశాలను నిర్మించుకొని ప్రశాంతముగా కాలమును
గడుపుతూ ఉంటారు. అనగా కూటస్థములో దృష్టి నిలిపి ధ్యానము చేస్తూఉంటాడు
సాధకుడు.
మామగారింటికి వెళ్ళిన భరతుడు అయోధ్యకు
వస్తాడు. అనగా శుద్ధబుద్ధికై శాంతికై ఏకాంతములో పరితపిస్తూ మోక్షమార్గమును
అన్వేషిస్తూ ఉంటాడు సాధకుడు. శ్రీరామ
లక్ష్మణ సీతాదేవీలు అడవికేగిన వృత్తాంతం తెలిసికొని చింతాక్రాంతుడవుతాడు. అనగా
శుద్ధబుద్ధి ఇంకా దూరమవటము తెలిసికొని తల్లి కైకేయిని అనగా తన ఇచ్ఛాశక్తిని మందలించుతాడు.
అనగా ఇంకా స్వాధిష్ఠానమునకు పరిమితము చేస్తున్న ఇచ్ఛాశక్తిని మందలించుతాడు. తన సాధనను తీవ్రతరము చేయుటకు సేనాసమేతుడయి శ్రీరామ లక్ష్మణ సీతాదేవీలను
తిరిగి అయోధ్యకు తీసికొని వచ్చుటకు బయలుదేరి వెళ్తాడు. అనగా సకారాత్మక సేనను
సమాయత్తపరచి అహంకారమును నియంత్రించి కుండలినిని జాగృతి పరచి మోక్షము పొందుటకు
సమాయత్తమావుతాడు. గుహుని అనగా శుద్ధబుద్ధి
సహాయముతో భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు చేరతాడు. పర్ణశాలను చేరుకొని శ్రీరామ లక్ష్మణ
సీతాదేవీలను తిరిగి అయోధ్యకు రమ్మని రాజ్యమును ఏలమని బ్రతిమిలాడుతా డు. అనగా
సకారాత్మకశక్తుల సహాయముతో మోక్షము ప్రసాదించమని శుద్దాత్మని కోరతాడు. పూర్తిగా
క్రియల సహాయముతో కర్మ నివృత్తి చేసికొనకుండా మోక్షము ప్రసాదించబడదని శుద్ధబుద్ధి
చెప్తుంది. సాధకుని కోరిక మేరకు తన పాదుకలను ఒసంగుతాడు. అనగా సంప్రజ్ఞాత సమాధిని
ఒసంగుతాడు. మూలాధార(సవితర్క), స్వాధిష్ఠాన(సవిచార
లేదా సామీప్య), మణిపుర(సానంద లేదా
సాలోక్య), మరియు
అనాహతలలో(సస్మిత లేదా సాయుధ్య) వచ్చు సమాధులను సంప్రజ్ఞాత లేదా సగుణ సమాధులంటారు
అనగా దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహముతోకూడిన సమాధులు.
విశుద్ధ(సారూప్య), ఆజ్ఞా( సవికల్ప లేదా స్రష్ట)
సహస్రార(నిర్వికల్ప) వచ్చు సమాధులను అసంప్రజ్ఞాత లేదా నిర్గుణ సమాధులంటారు. అనగా
దేవుడు ఉన్నాడు అనే సందేహరహిత సమాధులు.
14 సంవత్సరములకు ఒక్క నిమిషము ఎక్కువయినా
సహించను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అనగా సంప్రజ్ఞాత లేదా సగుణ సమాధులకు తృప్తి
చెందని సాధకుడు అసంప్రజ్ఞాత సందేహరహిత నిర్వికల్పసమాధికై 14 సంవత్సరములు నిర్దుష్టమయిన ప్రయత్నము
చేయుటకు నిర్ణయించు కుంటాడు.
కొంతకాలమయిన తదుపరి శ్రీరాముడు తమ్ముడు
లక్ష్మణుడు మరియు భార్య సీతాదేవీలను తోడ్కొని చిత్రకూటమునుండి బయల్దేరుతాడు.
అత్రిమహర్షిని సందర్శిస్తారు. విరాధుడు అనే రాక్షసుని సంహరించి శరభంగుని
ఆశ్రమమునకు తదుపరి సుతీక్ష్ణుని ఆశ్రమమునకు చేరుతారు. సకారాత్మకశక్తుల సహాయముతో
సాధకుడు తనలోని ఇంకా మిగిలియున్న అహంకారమును నిర్మూలించుకుంటూఉంటాడు. అక్కడినుండి
అగస్త్యుని ఆశ్రమమును సందర్శిస్తారు. అగస్త్యుని నుండి గొప్ప ధనుర్భాణములను
ఖడ్గమును స్వీకరిస్తారు. అనగా సాధనను తీవ్రతరముచేస్తాడు. అక్కడినుండి బయల్దేరి పంచవటి చేరుతారు. అక్కడ జటాయువు అనే పక్షితో స్నేహము
చేసికుంటారు. అనగా సాధకుడు ధైర్యముతో సాధన చేస్తూ ఉంటాడు. సాధకునిలోని సాధనాతీవ్రతకు సకారాత్మకశక్తులు
తోడ్పడుతూ ఉంటాయి.
సాధకుని శుద్ధబుద్ధిని భంగముచేయ
పొడసూపుతున్న శూర్పణఖ అనే కామమును తనలోని
లక్ష్మణుడు అనే శుద్ధ అహంకారము నిర్వీర్యము చేస్తుంది. ఇక్కడ అహంకారము అనగా తనే అని అర్థము. నకారాత్మక సోదరులందరినీ సాధకునిలోని శుద్ధబుద్ధి నిర్వీర్యము చేస్తుంది.
మాయాసంసారములోని కామమునకు రాజు
విజృంభించి కోరికను పంపుతాడు. కోరిక మాయా బంగారు లేడి ఆకృతి ధరించి సీతను అనగా
సాధకునిలోని కుండలినీశక్తిని అనగా వ్యష్టిమాయను మభ్యపెడతాడు. సాధకునిలోని
వ్యష్టిమాయయొక్క బలమయిన కోరిక మేరకు ఆ బంగారు లేడిని తెచ్చుటకు కొంచెము శుద్ధత తగ్గిన బుద్ధి వలన సాధకునిలోని అహంకారము వ్యష్టిమాయకి కాపలాగా
మిగులుతుంది.. అనగా కొంచెము శుద్ధత తగ్గిన
బుద్ధి కోరికలను పెంచుతుంది. కానీ సాధకునిలోని నేను ఒక గిరి
గీచుకొని అది దాటకూడదని అనుకుంటుంది.
దానినే లక్ష్మణరేఖ అని అంటారు. కొంచెము శుద్ధత తగ్గిన బుద్ధి కోరికలను
పెంచుతుంది. ఆ సమయములో ఆ కోరికలు మితిమీరినవని అర్ధము. సమయమునకు వేచి చూచుచున్న
రావణాసురుడు సాధువు వేషముతో వచ్చి ఆ గిరిని సీత దాటి బిచ్చము వేయునట్లు చేసి
ఆకాశమార్గమున లంకకు ఎత్తుకెల్తాడు. సాధువు వేషముతో అనగా ఆ సమయములో కోరికలు
మంచివిగానే అనిపిస్తాయి. శుద్ధత తగ్గిన బుద్ధివలన వ్యష్టిమాయ సాధకుని కోరికల
రాజ్యమునకు వెళ్తుంది. త్రోవలో జటాయువు
అనగా సాధకునిలోని ధైర్యము అడ్డుపడి రక్షింపజూస్తాడు. ఆ పక్షి ఱెక్కలు నరికి
పడేస్తాడు రావణాసురుడు. బలమయిన కోరికలముందు ధైర్యమువీగిపోయినదని వ్యష్టిమాయ తన
బలమును చూపినదని అర్థము. కిష్కింధాసమీపమున
సీత తన ఆభరణములను ఒక వస్త్రమందు మూటగట్టి క్రిందకు విడిచి పెట్టును. సకారాత్మక
శక్తులు అడ్డుపడి రక్షింప జూస్తాయి. అప్పుడు వ్యష్టి మాయ తిరిగి సాధకుని
వశములోనికి స్వల్పముగా వస్తుంది.
శ్రీరాముడు మారీచుని సంహరించి పర్ణశాలకు
వచ్చి సీతను లక్ష్మణుని ఇరువురిని గాంచక చింతాక్రాంతుడవుతాడు. తిరిగి సాధకునిలోని
బుద్ధి శుద్ధబుద్ధి వైపుకు దారితీస్తుంది.
లక్ష్మణుడు పర్ణశాలకు తిరిగి వస్తాడు. సాధకునిలోని అహంకారము సరియిన మార్గము
నకు దారితీస్తుంది. సరియిన మార్గమున పడిన సాధకునిలోని అహంకారము మరియు శుద్ధబుద్ధి ఇరువురు ధైర్యముతో
కుండలినీశక్తిని పైచక్రములలో జాగృతి కొరకైతీవ్రప్రయత్నములను చేయుటకు ఉద్యమిస్తారు.
సాధకునిలోని తను అనే అహంకారము మరియు శుద్ధబుద్ధి వ్యష్టిమాయ కోరికలరాజు
అధీనమైయున్నదను విషయమును గ్రహిస్తారు.
సాధకుడు పశ్చాత్తాపముతో తనలోని మోక్షమునకు ప్రతిబంధకమయిన కబంధుడు అనే
చింతను నిర్మూలిస్తాడు. అనగా అనాహతచక్రము జాగృతి చెందుతుంది. నిర్మూలించబడిన చింతవలన సాధకునికి సుగ్రీవుని సహాయము అనగా మంచి శబ్దము అయిన ఓంకారము అప్పుడు వినబడుతుంది.
శబరిని అనగా ఓంకారమును వినుట అనే
సంతోషమును సాధకుడు ప్రదర్శించ గలుగుతాడు.సాధకుడు ఋష్యమూక పర్వత సమీపమునకు
చేరుతారు. అనగా సాధకుడు ఆజ్ఞా చక్రమును జాగృతి పరుస్తాడు. తపోలోకమునకు చేరతాడు.
ఇది వ్యష్టిలో సాధకుని లోని వితలలోకము. హను=చంపటం, మాన్ = మనస్సు. హనుమాన్ అనగా స్థిర మనస్సు. సుగ్రీవము
అనగాఓంకారము. స్థిరమనస్సు ద్వారానే ఓంకారమును వినుట సాధ్యము. అనగా మనస్సు స్థిరమైన సాధకునికి ఓంకారము
తోడవుతుంది.
మనస్సు స్థిరమయిన బుద్ధి స్థిరమగును.
సుగ్రీవుని భార్యను అనగా ఓంకారానందమును అపహరించి అతనిని హింసిస్తున్న సుగ్రీవుని
సోదరుడయిన వాలిని సంహరిస్తాడు శ్రీరాముడు అనే స్థిరబుద్ధి. ఓంకారము వినబడకుండా
సాధకుని హింసిస్తూ ఉంటుంది వాలి అను అంతర్గత భయము. సాధకుని లోని అంతర్గత భయము పోంగానే ఓంకారము
స్థిరమనస్సు మరియు సకారాత్మకసేన బుద్ధి ఇంకా స్థిరబడును. దక్షిణ దిశగా
హనుమంతుని పంపుతాడు. అనగా స్థిరమనస్సు
మూలాధారమువద్దకు వెళ్తుంది. లంకయందున్న
సీతజాడను తెలిసుకుంటారు. అనగా మూలాధారమువద్దనున్న కుండలినీ లేదా వ్యష్టిమాయను
కనుగొంటుంది. జాంబవంతుడు హనుమంతుని శక్తి
సామర్ధ్యములను శ్లాఘిస్తాడు. హనుమంతుడు 100
యోజనముల దూరమున్న సముద్రమును దాటుతాడు. అనగా
ధైర్యముతో మోహమును దాటిన స్థిరమనస్సు మూలాధారమువద్దనున్న కుండలినీ లేదా
వ్యష్టిమాయను సమీపిస్తుంది. లంకాపురిని కాపలా కాస్తున్న లంకినీ రాక్షసిని వధించి
ముందరకేగుతాడు. అనగామోహమును దాటి లంకినీ అనే లోభమును జయిస్తుంది సాధకుని
స్థిరమనస్సు. అశోకవనమునందున్న రాక్షసుల
కాపలాలోయున్న ఒక అశోకవృక్షముక్రింద శోకముతో కూడియున్న సీతను(కుండలినీ) కనుగొంటాడు.
అశోకవనము అనగా అచంచలమైన సంకల్పములు..
సాధకుని లోని చంచలమైన సంకల్పములే కుండలినీ జాగృతిచెందకుండుటకు కారణము. అది
శోకమునకు దారితీయును. శ్రీరాముడు ఒసంగిన
అంగుళీయకమును ఆమెకి ఒసంగి త్వరలోనే ఆయన వచ్చి చెర విడిపిస్తాడని ధైర్యం చెప్తాడు.
ఆమె శ్రీరామునికొసంగిన చూడామణిని తీసికుంటాడు. అప్పుడు స్థిరమనస్సు(హనుమాన్) వలన
కలిగిన ఆత్మ(శ్రీరాముడు)బోధతో సాధకునికి(భరతుని కి) కుండలినీ జాగృతిచెందును అనే
ఊరట కలుగుతుంది.
స్థిరమనస్సు(హనుమాన్) వలన చంచలమైన
సంకల్పములు మరియు అడ్డువచ్చిన నకారాత్మకశక్తులన్నియు ధ్వంసము అవుటను చూచి ఓర్వలేని
కోరికలరాజు రావణుడు అంతే తీవ్రతతో
స్థిరమనస్సును భంగపరచుటకు నకారాత్మక శక్తులనన్నిటినీ కూడగట్టుటకు
ఉద్యమిస్తాడు. కాని సాధకునిలోని
సత్వగుణము(విభీషణుడు) కోరికలరాజుని ఎదుర్కుంటాడు. నకారాత్మకశక్తుల విజ్రుంభణయే
స్థిరమనస్సు(హను మాన్)తోకకు నిప్పు అంటించుట. తోక అనగా నిశ్చయము. స్థిరమనస్సు
నకారాత్మకశాక్తుల ప్రయత్నమును వమ్ముచేయుటయే లంకా పట్టణమునందలి భవనములకు నిప్పు
అంటించుట. స్థిరమనస్సు శక్తి సామర్ధ్యములకు కార్యదక్షతతకు సేవానిరతికి శుద్ధబుద్ధి
చాలా సంతోషిస్తుంది. స్థిరమనస్సు ఇంద్రియములను జయించుటయే ఇంద్రజిత్ నుజయించుట. సాధకునిలోని ఆజ్ఞాచక్రము జాగృతి చెందును.
విభీషణుడు అన్న రావణుని సీతమ్మను
శ్రీరామునికి మర్యాదపూర్వకముగా అప్పజెప్పి క్షమాపణ కోరమంటాడు. సాధకునిలోని
సత్వగుణము కోరికలరాజును తన కోరికలను వశములో ఉంచుటకు ప్రయత్నముచేస్తుంది. దానికి
కుపితుడైన రావణుడు తమ్ముడు విభీషణుని లంకనుండి వెళ్ళగొడుతాడు. సాధకునిలోని
సత్వగుణము సంసారములోని లౌకికత్వమునకు ఇమడలేక
దూరమవుట మరియు ఆధ్యాత్మితకకు దగ్గిరఅవుటయే విభీషణుడు శుద్ధబుద్ధిని
(శ్రీరాముని) శరణుకోరుట. శుద్ధబుద్ధి సత్వగునముయోక్క చేరికతో ఇంకా బలోపేతమవుతుంది.
సకారాత్మకశక్తులన్నీశుద్ధబుద్ధి ఆజ్ఞకు బద్ధులయి నిశ్చయాత్మకముగా లౌకికత్వమునకు అలౌకికత్వమునకు
వారధినేర్పరుస్తాయి. సంసారములో ఉంటూనే అనగా మాయలో ఉంటూనే మాయను దాటుటకు సాధకుడు
ప్రయత్నము చేయవలయును.
సీతమ్మను వదులుకొనుటకు కోరికలరాజు
సనేమిరా ఇష్టపడడు.ఇక్కడ సీతమ్మ అనగా లౌకికానందము. అనగా ఆధ్యాత్మికకు దూరముచేయు
వ్యష్టి మాయ(కుండలినీ)కు లోనయ్యి సాధకుడు పొందుదామనుకునే లౌకికానందము. భగవత్
సామ్రాజ్యమునందు ప్రవేశించ నిశ్చయించిన సాధకు నిలోని సకారాత్మకశక్తులకు నకారాత్మకశక్తులకు తీవ్ర మైన సంఘర్షణ
ఏర్పడుతుంది లేదా జరుగుతుంది. రోషపూరితుడ
యిన ఇంద్రజిత్తుతన బాణములతో లక్ష్మణుని మూర్ఛపూరితుడిగా చేస్తాడు. ఇంద్రజిత్తు అనగా విపరీతము సకారాత్మకముగా
అయ్యి లక్ష్మణుని అనగా సాధకునిలోని
అహంకారమును పూర్తిగా నిర్వీర్యుడ్ని చేస్తుంది. హనుమంతుడు అనగా స్థిరమనస్సు
లక్ష్మణుని అనగా ఆ నిర్వీర్యమయి శుద్ధమయిన అహంకారమును సకారాత్మకముగా
పునర్జీవితుడ్ని చేస్తుంది.
కుంభకర్ణుడు అనగా మహా భయంకరము మరియు
ఆధ్యాత్మిక ఘోర ప్రతిబంధకము అయిన తమోగుణము. పిమ్మట కోరికలరాజు పుత్రుడు
మహాబలశాలియగు ఇంద్రజిత్తుని అనగా విపరీతమును సంహరిస్తాడు లక్ష్మణుడు అనగా శుద్ధ
ఆత్మతత్వము.
కోరికలకు మూలకారణము మణిపురచక్రము.
ధ్యానములో కుండలినీ ఇడ పింగళ సూక్ష్మనాడుల మధ్యనున్న సుషుమ్ననుండి సహస్రారములోనికి
చేరవలయును. సుషుమ్నకు ఎడమ ప్రక్కనున్న ఇడ లేదా సుషుమ్నకు కుడి ప్రక్కనున్న
పింగళలగుండా వెళ్ళగూడదు. అట్లావెళ్ళిన యడల విపరీత పరిణామములు చోటుచేసికొనును.
మణిపురచక్రమువద్ద కుండలినీ ఇడ సూక్ష్మనాడిగుండా వెళ్తే అంతులేని కోరికలు క్రోధము
ఉత్పన్నమవుతాయి. రావణుని కడుపులో
బాణమువేసి నిహతుడ్ని చేయుట అనగా కుండలినీశక్తిని సరిగ్గా సుషుమ్న సూక్ష్మనాడిగుండా
సహస్రారమునకు వెళ్ళుటకు దిశానిర్దేశము ఇచ్చుట.
శ్రీరాముడు విభీషణుని అనగా లంకకు రాజుని చేస్తాడు. అనగా శుద్ధబుద్ధి
సత్వగుణము ను లౌకికమునకు
అధిపతిచేయును. సీత అగ్నిప్రవేశముచేసి తన
పవిత్రతను నిరూపించుకొంటుంది. పంచభూతములలోనిదే అగ్ని. సీత అనగా ప్రకృతి అనగా కుండలినీశక్తి అనగా వ్యష్టి మాయ. .
ప్రకృతి తన స్వభావమును పోగొట్టుకొనదు అనుటకు ప్రతీకయే ఈ సీత అగ్నిప్రవేశము.
సాధకుని శుద్ధబుద్ధి పరిపూర్ణమయిన శుద్దాత్మగా పరిణితిచెందుటయే శ్రీరామరాజ్యపట్టాభిషేకము.
Very good, Guru Garu. Articulated very well.
ReplyDelete