రామాయణము 2 అయోధ్యాకాండ
తేషామపి మహాతేజా రామో
రాతికరః పితుః
స్వయంభూరివ భూతానాం బభూవ
గుణవత్తరః --------------- 1
ఆ నలుగురిలోనూ
మహాతేజసంపన్నుడగు శ్రీరాముడు అందరికంటెను గొప్ప గుణవంతుడు. అందువలన సమస్త
ప్రాణికోట్లకు బ్రహ్మదేవునివలె తండ్రికి విశేష ప్రీతిపాత్రుడై ఉండెను.
సాహి రూపోపపన్నశ్చ
వీర్యవాన్ అనసూయకః
భూమావనుపమః
సూనుర్గుణైర్దశ రథోపమః
-------- 2
శ్రీరాముడు మంచి రూపసి.
పరాక్రమశీలుడు. అసూయలేనివాడు. భూమిమీద ఆయనకుసాటి వీరుడు ఇంకొకడులేదు. సద్గుణములయంద
పది శరీరములకు సమానుడు. తండ్రికి వారు నలుగురు యోగ్యులయిన పుత్రులు.
సచ నిత్యం ప్రశాన్తాత్మా
మృదుపూర్వం చ భాషతే
ఉచ్యమానోపి పరుషం నోత్తరం
ప్రతిపద్యతే -------------- 3
ఆయన సదా
ప్రశాంతచిత్తులు. మృదుభాషణము చేయువారు.
ఎవరైనను కఠినముగా మాట్లాడినచో ప్రత్యుత్తరము ఈయక మౌనముగా ఉందురు.
కదాచిత్ ఉపకారేణ
కృతేనైకేవ తుష్యతి
న స్మరతి అపకారాణాం శతమపి
ఆత్మవత్తయా ------ 4
ఎవరైనా ఒక్కసారి ఉపకారము
ఒనర్చినప్పటికి దానిచే సదా సంతుష్టి చెందేవారు. తప్పుచేసినవారు ఎంతమందియైనను
వారిని జ్ఞాపకముంచుకోరు.
శీలవృద్ధైః జ్ఞానవృద్ధైః
వయో వృద్ధైః చ సజ్జనైః
కతయాన్నస్త వై నిత్యం
అస్త్ర యోగ్యాన్తరేష్వపి
--------------------- 5
అస్త్రశాస్త్రములను
అభ్యాసము చేయుటకు ఉపయుక్తమయిన సమయమందును మధ్య మధ్య అవకాశము కలుగజేసికొని వారు – ఉత్తమచరిత్రయందును, జ్ఞానమందును, వయస్సునందును అధికులయిన
పెద్దలతో సదా సంభాషించుచుందురు.
బుద్ధిమాన్ మధురాభాషీ
పూర్వభాషీ ప్రియంవదః
వీర్యవాన్నచ వీర్యేణ
మాహతా స్వేన విస్మితః
------------------- 6
శ్రీరాములవారు బుద్ధిమంతులు, మధురభాషనము చేయువారు, వచ్చినవారితో తానె
ముందుగా మాటలాడుదురు. వారికి ప్రీతికరమయిన మాటలనే బలపరాక్రమములు
కలిగియున్నప్పటికిని వానిచే గర్వమును ఎప్పుడును పొందకుందురు.
నచానృతకథో విద్వాన్
వృద్దానాం ప్రతిపూజకః
అనురక్తః ప్రజాభిశ్చ
ప్రజాశ్చాపి అనురజ్యతే --------- 7
శ్రీరాముని నోటినుండి
అసత్యవాక్కు ఎన్నడు వెలువడదు. ఆయన
విద్వాంసుడు. పెద్దవాళ్ళను సదా గౌరవించేవారు.
ప్రజల పైన శ్రీరామునికి, శ్రీరాముని పైన ప్రజలకు పరస్పర విశేష అనురాగము కలదు.
సానుక్రోశో జితక్రోధో
బ్రాహ్మణః ప్రతిపూజకః
దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం
ప్రగ్రహవాఞ్ఛుచిః ------- 8
శ్రీరాముడు పరమదయాళువు.
క్రోధమును జయించినవారు. బ్రాహ్మణులను (బ్రహ్మవేత్తలను) పూజించువారు. దీనులపైన, దుఃఖము కలవారి పైన, వారి మనంబున విశేషమగు దయ
ఉండును. ఆయన ధర్మము తెలిసినవాడు. ఇంద్రియములను సదా వశమందు ఉంచుకొనువారు.
బాహ్యాభ్యంతరములయండు పవిత్రులై యుండువారు.
నాశ్రేయసి రతో యశ్చ న
విరుద్ధ కథారుచిః
ఉత్తరోత్తర యుక్తీనాం
వక్తా వాచస్పతిర్యథా -------- 9
శ్రీరాముడు అమంగళకరములగు
నిషిద్ధ విరుద్ధ కార్యములందు ఎన్నడును
ప్రవర్తించరు. శాస్త్ర నిషిద్ధమయిన
వాక్యములను వినుటయందు రుచిచూపించరు. న్యాయయుక్త మయిన పక్షమును సమర్ధించుటయందు
బృహస్పతివలె అనేక యుక్తులను వచించు చుందురు.
ఆరోగస్తరుణో వాగ్మీ
వపుష్మాన్ దేశాకాలవిత్
లోకే పురుష సారజ్ఞః
సాధురేకో వినిర్మితః
---------------- 10
ఆయన శరీరము
రోగరహితమయినది. తరుణవయస్సు కలిగియున్నది. ఆయన మంచి వక్త. అందమయిన సౌందర్యవంతమయిన
శరీరముతో వారు శోభిల్లుచుందురు. దేశాకాలతత్వములను తెలిసిన జ్ఞానులు. లోకమునందలి
సాధు పురుషుల సారము మూసపోసినట్లుంటారు వారు.
సతు శ్రేష్ఠైః
గుణైర్యుక్తః ప్రజానాం పార్దివాత్మజః
బహిశ్చర ఇవ ప్రాణోబభూవ
గుణతః ప్రియః -----------------11
ఆయన శ్రేష్ఠగుణములతో
కూడుకొనియున్నవారు, తమ సద్గుణములవలన వారు తన ప్రాణములు ప్రజల రూపములో బయట సంచరించుచున్నవా అన్నట్లుగా చూచెడివారు. అనగా ప్రజలను తన తోటి ప్రాణులుగా
ప్రియముగా చూచేడివారు.
సర్వవిద్యావ్రతస్నాతో
యథావాట్ సాఙ్గవేదవిత్
ఇష్వస్త్రేచ పితుః
శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః
------ 12
భరతుని అన్నయైన
శ్రీరామచంద్రుడు అనగా ప్రకాశమునకు అతీతమయిన శ్రీరామచంద్రుడు సమస్తవిద్యలయందును ఉద్దండులు. వేదములను గూర్చి
సంపూర్ణ జ్ఞానము కలవారు. అనగా ప్రాణాయామ నిరతులు.
దృఢ భక్తిః స్థిరప్రజ్ఞో
నాసద్గ్రాహీ న దుర్వచః
నిస్తంద్రీ రప్రమత్తశ్చ
స్వదోషపరదోషవిత్ ----------- 13
పెద్దలయడల గురువులయడల
విశేషభక్తిగలవారు. వారు స్థితప్రజ్ఞులు.
సద్గ్రాహీ. చెడ్డ మాటలను ఎన్నడూ పలకరు. సోమరితనము, ప్రమత్తత లేనివారు.
తనదోషములను పరులదోషములను లెస్సగా తెలిసినవారు.
శాస్త్రజ్ఞశ్చ
కృతజ్ఞశ్చ పురుషాంతరకోవిదః
యః ప్రగ్రహానుగ్రహ
యోర్యథా న్యాయం విచక్షణః
------------ 14
వారు శాస్త్రజ్ఞులు. అనగా
శ్వాసను అస్త్రముగా ఉపయోగించుట తెలిసినవారు.
ఉపకారముచేసినవారికి కృతజ్ఞత తెలియబరిచేవారు. జనులలో తారతమ్యమును
ఎరిగినవారు. నిగ్రహము, అనుగ్రహము రెండూ
తెలిసినవారు. న్యాయము అన్యాయముల విచక్షణ రెండూ తెలిసినవారు.
దశరథుడు మంత్రులతో
సమాలోచన చేసెను. అట్టి సుగుణమూర్తి అయిన శ్రీరామచంద్రుని పట్టాభిషేకము చేయవలెనని
తలపోసేను. దానికి వారు దశరథునీతో ఇట్లనిరు:
ధర్మజ్ఞః సత్యసంధశ్చ
శీలవానసూయకః
క్షాన్తః సా స్వయితా
శ్లక్ష్ణః కృతజ్ఞో విజితేంద్రియః
మృదుశ్చ స్థిరచిత్తశ్చ
సదా భవ్యః అనసూయకః
ప్రియవాదీ చ భూతానాం
సత్యవాదీ చ రాఘవః ------ 15
ఓ రాజా, శ్రీరాముడు ధర్మజ్ఞః
సత్యసంధుడు, శీలవంతుడు, అసూయలేనివాడు, ఓర్పు గలవాడు, దీన దుఃఖ జన బాంధవుడు, మృదుభాషి, స్థిరచిత్తుడు, ఇంద్రియము లను
జయించినవాడు, సదా మంగళకరమయిన కార్యములను చేయువాడు, అసూయ లేనివాడు, ప్రియవాది, మరియు సత్యవాది.
సత్యవాదీ మహేష్వాసో
వృద్ధసేవీ జితేంద్రియః
స్మిత పూర్వాభిభాషీ చ
ధర్మం సర్వాత్మ నాశ్రితః
సమ్యగ్యోక్తా శ్రేయసాం చ
న నిగృహ్య కథారుచిః --------- 16
శ్రీరాముడు సత్యవాది.
గొప్ప ధనుర్ధారి. పెద్దలను సేవించువాడు. ఇంద్రియములను జయించినవాడు. చిరునగవుతో
మాట్లాడువాడు. సంపూర్ణ హృదయముతో ధర్మమును ఆశ్రయించినవాడు. ధర్మయుక్తమయిన పనులను
చేయువాడు. అందరి శ్రేయస్సు కోరువాడు. చెడు కార్యములయందు రుచిలేనివాడు.
కామతస్త్వం ప్రకృత్యైవ
నిర్ణీతో గుణవాన్ ఇతి
గుణవత్యపి తు స్నేహాత్
పుత్ర వక్ష్యామి తే హితం
భూయో వినయం ఆస్థాయ భవ
నిత్యం జితేంద్రియః ------- 17
దశరథుడు పుత్రునితో
ఇట్లనెను:
నాయనా శ్రీరామా, పుష్యమీ నక్షత్ర యోగము
నందు నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. నీవు స్వభావసిద్ధముగానే
గుణవంతుడవు అయిఉన్నావు. నీ విషయములో అందరి నిర్ణయము అట్లనే యున్నది. నీవు
గుణవంతుడవు అయియున్నను, స్నేహవశమున నీకు ఒకింత హితము చెప్పుచున్నాను. నీవు
అధికవినయమును ఆశ్రయింపుము. జితేంద్రియుడివి అయియుండుము.
కామక్రోధ సముత్థాని
త్యజస్వ వ్యసనానిచ
పరోక్షయా వర్తమానో వృత్వా
ప్రత్యక్షయా తథా ------- 18
కామ క్రోధముల వలన జనించు
వ్యసనములను సమూలముగా వదిలిపెట్టుము.
పరోక్షముగా ప్రత్యక్షముగా లోక వృత్తాంతములను తెలిసుకొనుము. న్యాయవిచారణ
చక్కగా జరుపుము.
తత్ యావదేవ మే చేతో న
విముహ్యతి రాఘవ
తావదేవాభిషిఞ్చస్వ చలాహి
ప్రాణినాం మతిః ------- 19
నా మనస్సునందు మోహము
ఆచరించకముందే నీవు యువరాజు పదవియందు అభిషిక్తుడవు కమ్ము. ఎందుకంటే ప్రాణులయొక్క
మతి చంచలమయినది.
నీ సోదరుడు భరతుడు
సజ్జనుడు. ఆచారవ్యవహారములు కలవాడు. అగ్రజుడయిన నిన్ను నీ ఆజ్ఞను అనుసరించువాడు. ధర్మాత్ముడు, దయాళువు. జితేంద్రియుడు.
మంథర యనునది కైకేయిదేవి
దాసి. కైకేయి మంథరతో ఇట్లనెను: ‘నేను శ్రీరామునియందు
భారతునియందు నాకు భేదము లేదు. మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకము చేసేదడు అనే
వార్త నాకు పరమ ఆనందము కలుగజేసినది’, అనెను. దానికి మంథర ఇట్లనెను: శ్రీరాముడు రాజయిన ఆ
తరువాత పరంపరానుగతముగా ఆతని పిల్లలకే రాజ్యాధికారము పొందుదురు. భరతుని పరంపర వేరగును. పూర్వము యుద్ధములో
మహారాజు నీకు ఇచ్చెదనిన వరములు రెండూ ఇప్పుడే కోరుకొనుము. ఆ వరములకు బదులుగా ‘భరతుని పట్టాభిషేకము, మరియు శ్రేరాముని వనవాసము’ కోరుకొనుము. ఆ దాసి అయిన
మంథర కైకేయిదేవిని అట్లు రెండు వరములు
కోరుకొను నట్లుగా ఒప్పించెను. అటుపిమ్మట
కైకేయిదేవి అలిగి దశరథుని వరములు ఇచ్చునట్లుగా ఒప్పించెను.
దశరథుడు భార్య కైకేయితో
ఇట్లనెను:
సత్యం దానం తపః త్యాగో
మిత్రతా శౌచామార్జవం
విద్యాచ గురు శుశ్రూషా
ద్రువాణ్యేతాని రాఘవే --------- 20
సత్యము, దానము, తపస్సు, త్యాగము, మిత్రత్వము, పవిత్రత, సరళత్వము, విద్య, గురు శుశ్రూషను ఈ
సద్గుణములన్నియు శ్రీరామునియందుస్థిరముగానున్నవి.
క్షమా యస్మిన్ తపః త్యాగః
సత్యం ధర్మః కృతజ్ఞతా
అప్యహింసా చ భూతానాం
తమృతే కా గతిర్మమ -----------21
క్షమ, తపస్సు, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత, సర్వభూతదయ అను ఈ
సుగుణములు ఎవనియందు నిండియున్నవో, అట్టి శ్రేరాముడు లేనిచో నా గతి ఏమగును?
న కించిత్ దాహాహితమ
ప్రియం వచో న వేత్తి రామః పరుషాణి భాషితుం
కథం తు రామే హ్యభిరామ
వాదిని బ్రవీషి దోషాన్ గుణనిత్య సమ్మతే
-----22
శ్రీరాముడు ఎవ్వరితోను
హితముకానట్టియు, అప్రియమయిన వాక్యములను పలకడు. కటువుగా సంభాషణ చేయటము ఆయనకు తెలియదు. ఆయన
సద్గుణవంతుడు. సదా సన్మానము పొందు అతనిలో దోషమును ఎటుల ఎంచుచున్నావు కైకా?
దశరథుని మంత్రి సుమంతుడు.
ఆయన మహారాజుతో ఇట్లనెను:
తుష్టా వాస్య తదా వంశం
ప్రవిశ్య స విశాంపతేః
శయనీయం నరేంద్రస్య తదా
సాధ్య వ్యతిష్ఠతః ---------------- 23
మంత్రి సుమంతుడు లోనికి
ప్రవేశించెను. దశరతును వంశమును కీర్తించెను. రాజుయొక్క శయనగృహము వద్దకు వెళ్లి
నిలబడెను.
దుఖితుడైయున్న దశరథుడు
తేరుకొనేను. సుమంతునితో శ్రీరాముని పిలుచుకొని రమ్మని తెలిపెను.
దశరథుడు కైకేయిదేవి
మందిరములోనున్నాడు. ‘మీ తండ్రిగారు నిన్ను
వెంటనే అక్కడికి రమ్మన్నారు’, అని మంత్రి
సుమంతుడు శ్రీరామునితో పలికెను.
న పితుశ్చరణౌ
పూర్వమభివాద్య వినీతవత్
తతోవవందే చరణౌ కైకేయ్యాః
సుసమాహితః --------- 24
వెంటనే శ్రీరాముడు
తండ్రివద్దకు వచ్చెను. ఆయనకు పాదాభివందనము చేసెను. తదుపరి పినతల్లి కైకేయి
పాదములకు శిరస్సు వంచి నమస్కరించెను.
శ్రీరాముడు తన తండ్రి
ముఖము విచారముతో కూడుకొని యుండుట గమనించెను. ‘అమ్మా, తండ్రిగారు ఇట్లా
విచారముతో కూడుకొని యుండుటకు కారణమేమి?’ అని పినతల్లి కైకేయిని
అడిగెను.
యతో మూలం నరః పశ్యేత్
ప్రాదుర్భావమిహాత్మనః
కథం తస్మిన్ న వర్తేత
ప్రత్యక్షే సతి దైవతే
------ 25
ప్రతి వ్యక్తి జన్మకు
మూలకారకుడు తండ్రి. ఆయన ప్రత్యక్ష దైవము.
తండ్రి జీవించియుండ గానే ఆయనకు అనుకూలమగు ఆచరణను ఏ వ్యక్తి చేయకుండ ఉండగలడు?
అప్పుడు కైకేయి ఇట్లనెను:
‘మీ తండ్రిగారు
నాకు లోగడ రెండు వరములు ఇచ్చిరి. ఇప్పుడు ఇవ్వకుండిరి’ అనెను.
ధర్మమూలమిదం రామ విదితం చ
సతామపి
తత్ సత్యం న త్యజేద్ రాజా
కుపితస్త్వత్కృతే యథా -------- 26
రామచంద్రా, సత్యము ధర్మానికి మూలము.
ఇది సత్ పురుషులయొక్క నిశ్చయమై యున్నది. మహారాజు నీగురించి నామీద కోపగించుకోని తన
యా సత్యమును విడనీయకుండుగాక.
నీ తండ్రి నీకు
చెప్పలేకపోవచ్చు. ఆయన ఆజ్ఞను పాలించువాడివైతివేని నేను నీకు చెప్పెదను. ఆ కైకేయి
అమ్మ మాటలువిని కలతచెంది శ్రీరాముడు తన పిన్నితో ఇట్లనెను:
అహో ధిజ్ నార్హసేదేవి
పక్తుం మామీదృశం వచః
అహం హి వచనాద్ రాజ్ఞః
పతేయమపి పావకే ------- 27
భక్షయేయం విషం తీక్ష్ణం
పతేయమపి చార్ణవే
నియుక్తో గురుణా పిత్రా
నృపేణ చ హితేన చ ----------- 28
తత్ బ్రూహి వచనం దేవి
రాజ్ఞో యదభికాంక్షితం
కరిష్యే ప్రతిజానే చ రామో
ద్విర్నభాషతే ----------- 29
ఆహా, ధిక్కారమగుగాక. నాగురించి
ఇటులమాట్లాడుట తగదు. రాజుచేప్పినచో నేను
అగ్నిలో సహితము దూకుటకు సిద్ధముగా ఉన్నాను. తీవ్ర విషము త్రాగుటకు కూడా నేను
సిద్ధము. సముద్రములో పడుటకు నేను సిద్ధముగా ఉన్నాను. మహారాజు నాయొక్క తండ్రి, గురువు, హితైభిలాషి. ఆయన ఆజ్ఞను కాదని నేను ఏమి చేయుదును? కావున అమ్మా, రాజునకు ఏది ఇష్టమో అది
నాకు చెప్పుము. దానిని తప్పక నెరవేర్చెదను అని ప్రతిజ్ఞ చేసెదను. రాముడు రెండు
రకముల మాటలను ఎన్నడూ మాట్లాడడు.
అప్పుడు కైక శ్రీరామునితో
ఇట్లనెను: ఓ, రామా, పూర్వము దేవాసురయుద్ధమునందు
నేను నీ తండ్రికి చేసిన
సహాయమునకు ప్రతిగా రెండు వరములను
కోరుకొనమనెను. అవ్వి నేను ఇప్పుడు కోరుకొంటిని. అవి: 1) భరతుని రాజ్యాభిషేకము, 2) నీవు భార్యతో సహా 14
సంవత్సరములు అరణ్యవాసము చేయటము. అందుకు నీ
తండ్రిగారు దుఖితుడయ్యెను. నీకు చెప్పుటకు
సంశయించుచుండిరి. నీ తండ్రి ఆజ్ఞను
పాటించుము. వారిని సత్యమునుండి కాపాడుము. వారిని ఈ సంకటమునుండి కాపాడుము.
ఇతీవ తస్యాం పరుషం
వదంత్యాం న చైవ రామః ప్రనివేశ శోకం
ప్రవివ్యథేచాపి మహానుభావో
రాజా చ పుత్రవ్యసనాభి తప్తః
------------- 30
ఈ విధముగా పలికిన పినతల్లి
పరుషమయిన మాటలు విన్న శ్రీరాముడు కొంచెము అయినను
శోకము చెందలేదు. కాని శ్రీరాముడు వనవాసము చేయవలెనను కైక కోరికకు దశరథుని
పుత్రుని వియోగము భరించవలేననే వ్యథ మిక్కిలి కలచివైచెను.
తదప్రియ మమిత్రఘ్నో వచనం
మరణోపమం
శ్రుత్వా న వివ్యథే రామః
కైకేయీం చేదమబ్రవీత్ --------- 31
తన పినతల్లి మాటలు
అప్రియముగాను, మరణసమముగాను, కష్టదాయకముగాను ఉన్న
మాటలు విన్నతదుపరి శ్రీరాముడు ఒకింతమయినను బాధపడలేదు. వారు కైకేయితో యిట్లనిరి.
ఏవమస్తు గమిష్యామి వనం
వస్తుం అహం త్వితః
జటాచీర ధరో రాజ్ఞః
ప్రతిజ్ఞామను పాలయన్
------------------- 32
అమ్మా, నీవు చెప్పినట్లుగానే
నేను వెళ్ళగలను. మహారాజు యొక్క ఆజ్ఞను తప్పక పాలించెదను. జటా వల్కములను ధరించెదను.
అరణ్యమునందు నివసించుటకై బయలుదేరేదను.
నాహమర్థపరో దేవి
లోకమావస్తు ముత్సహే
విద్ధి మామృషిభిస్తుల్యం
విమలం ధర్మమాస్థితం --------- 33
అమ్మా, నేను ధనమును కోరుతూ, ఉపాసించుచూ ఈ ప్రపంచమున ఉండదలచుకోలేదు. నన్ను నమ్మండి.
నేను ఋషులవల నిర్మలమయిన ధర్మ జీవితమును గడపదలచితిని.
నహ్యతో ధర్మాచరణం
కించిదస్తి మహత్తరం
యథా పితరి శుశ్రూషా తస్య
నా వచనక్రియా ------ 34
ధర్మ జీవితమును మించిన
జీవితం ఈ లోకమున ఇంకొకటిలేదు. తండ్రిని సేవించుటకు మించిన ధర్మాచరణము ఈ లోకమున
ఇంకొకటిలేదు.
అటుపిమ్మట తల్లి కౌశల్య
అనుజ్ఞ పొందుటకు వెళ్ళెను. తండ్రి దశరథుడు మిక్కలి ఖేదమొందెను.
వందిత్వా చరణౌ రాజ్ఞో
విసంజ్ఞస్య పితుస్తదా
కైకేయ్యా శ్చాప్య నార్యాయా నిష్పపాత మహాద్యుతిః --------------- 35
అప్పుడు శ్రీరాముడు
తండ్రిని సమీపించి అనుజ్ఞ నొసంగమని ప్రార్థించెను. తండ్రి చేష్టలుడిగి
ఉండుటగమనించి ఓదార్చెను. పినతల్లి కైకేయి యడల ఏ మాత్రము కోపములేకుండా
నిష్పక్షపాతముగా పాదములకు ప్రణమిల్లెను.
న చాస్య మహతీం లక్ష్మీం
రాజ్యనాశోపకర్షతి
లోకకాంతస్య
కాంతత్వాచ్ఛీతరశ్మేరివక్షయః
---------------------- 36
శ్రీరాముడు చాలా
బుద్దిమంతుడు. ప్రపంచమునకు శుక్ల పక్షములో
వెలుగు ఇచ్చే చంద్రుడు, కృష్ణ పక్షములో వెలుగు పోగొట్టుకొని క్షీణదశలోకి వెళ్తాడు.
అంతమాత్రమున తన శోభ పోగొట్టుకోడు.
అదేవిధముగా రాజ్యమును పోగొట్టుకున్న లోకప్రియుడగు శ్రీరాముడు తన ఆకర్షణను
పోగొట్టుకోడు.
న వనం గంతు కామస్య
త్యజతశ్చ వసుంధరాం
సర్వలోకాతిగాస్యేవ
లక్ష్యతే చిత్తవిక్రయా
---------- 37
శ్రీరాముడు సమస్త భూమండల
రాజ్యమును త్యజించి అరణ్యమునకు వెళ్ళుటకు సిద్ధపడెను. సర్వలోకములకు అతీతుడయిన
జీవన్ముక్తునికి ఏ వికారమూ ఉండదు. అదేవిధముగా రాజ్యమును త్యజించుటకు శ్రీరామునికి
ఏ వికారమూ లేకుండెను.
ప్రతిషిధ్య శుభం ఛత్రం
వ్యజనే చ స్వలంకృతే
విసర్జయిత్వా స్వజనం రథం
పౌరం స్తథా జనాన్ ------------ 38
ధారయన్ మనసా
దుఖమింద్రియాణి నిగృహ్యచ
ప్రవివేశాత్మవాన్ వేశ్మ
మాతురప్రియశం సివాన్ ------- 39
శ్రీరాముడు తనపై అందమయిన
చాత్ర చామమరములను పట్టుకోనివ్వలేదు.
రథమును వదిలివేసిరి. తన సేవకులను, సర్వజనులను, పురవాసులను పంపివైచిరి.
వారికి ఆ విధముగా తన వియోగ దుఃఖమును పోగొట్టిరి. మనస్సును, ఇంద్రియములను పరిపూర్ణముగ
వశపరచుకొనిరి. అటుపిమ్మట తల్లియగు కౌసల్య
వద్దకు వెళ్ళిరి.
న క్రుధ్యత్యభిశప్తోపి
క్రోధనీయాని వర్జయన్
క్రుద్ధాన్ ప్రసాదయన్
సర్వాన్ స ఇతోధ్య ప్రవత్స్యతి
------- 40
అన్తఃపురములోని స్త్రీలు
తమలోతాము ఇట్లనుకోనిరి:
శ్రీరాముడు ఎవరినీ
కోపగించుకోరు. కఠినముగా మాట్లాడరు. ఇతరులను నొప్పించేట్లుగా మాట్లాడరు.
కోపగించినవారిని శాంతింపజేయును. అట్టి సద్గుణశీలుడు ఈ రోజున అరణ్యమునకు
పోవుచున్నాడు.
ప్రవిశ్యతు తథా రామో
మాతురంతఃపురం శుభం
దదర్శ మాతరం తత్ర
హావయన్తీం హుతాశనం -------- 41
శ్రీరాముడు తల్లి కౌసల్య
అంతఃపురములో ప్రవేశించెను. తల్లిని దర్శించెను.
అక్కడ ఆమె అగ్నులందు ఆహుతులు వైచుచు హోమము చేయుచుండెను.
ఆయన తల్లి పాదములకు
ప్రనమిల్లెను. ఆమె శ్రీరాముని ప్రేమతో
ఆప్యాయముగా కౌగిలించుకొనేను. పుత్రవాత్సల్యముతో
ఇట్లనెను:
వృద్ధానాం ధర్మశీలానాం
రాజర్షీణాం మహాత్మనాం
ప్రాప్నుహ్యా యశ్చ
కీర్తిం చ ధర్మం చ అపి ఉచితం కులే
-------- 42
నాయనా, నీవు ధర్మశీలురు, పెద్దలు, మహాత్ములు, రాజర్షి ల వలె ఆయుస్సు, కీర్తి కులమునకు
యోగ్యమయిన ధర్మమును పొందుము.
విషయాసక్తిగల స్థూలజ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాల స్థితిని రాజర్షిస్థితి అంటారు. అనగా లౌకికమయిన మరియు ఆధ్యాత్మికమయిన యోగ్యమయిన ధర్మమును
పొందుము.
దత్తమాసన మాలభ్య భోజనేన
నిమంత్రితః
మాతరం రాఘవః కించిత్
ప్రసార్యాంజలిం అబ్రవీత్
----------------- 43
ఇట్లా అని ఆ తల్లి
వారికి కూర్చోనుతకు ఆసనమును ఒసంగెను. భోజనమునకు రమ్మనెను. శ్రీరాముడు చేతితో
కొంచెము త్రాకెను. తదుపరి చేతులు జోడించి
ఇట్లు పలికెను.
గమిష్యే దండకారణ్యం
కిమనేన ఆసనేన మే
విష్టరాసన యోగ్యో హి
కాలోయం మాం ఉపస్థితః
---------------- 44
నాకు ఈ ఆ సనముతో పని
ఏమున్నది. అమ్మా, నేను ఇప్పుడు
దండకారణ్యమునకు పోవుచుంటిని. ఇప్పుడు ఈ
దర్భాసనముపైన కూర్చొను సమయము వచ్చినది.
చతుర్దశ హి వర్షాణి
వత్స్యామి విజనే వనే
కందమూల ఫలైర్జీవన్
హిత్వా ముని వదామిషం ------------- 45
14 సంవత్సరములు
అరణ్యమున గడిపెదను. కందమూలములు ఫలములు
వీటితోనే జీవించెదను. మునులవలె జీవించెదను.
నా తండ్రి దశరథమహారాజు
పినతల్లి కైకకు ఇచ్చిన రెండు వరముల ప్రకారము 1) భరతునికి రాజ్యాభిషేకము చేయుట, 2) నన్ను తపస్విగా దండకారణ్యమునకు పోవమని
ఆజ్ఞాపించారు.
ఈ మాటలువిని తల్లి
కౌసల్య మూర్చవచ్చినట్లుగా క్రింద పడిపోయెను. అప్పుడు శ్రీరాముడు ధర్మయుక్తముగా
ఇట్లనెను.
నాహం ధర్మం అపూర్వం తే
ప్రతికూలం ప్రవర్తయే
పూర్వైరయమభిప్రేతో గతో
మార్గోనుగమ్యతే ------------------ 46
అమ్మ, నేను మీకు ప్రతికూలముగా ఏ నూతన ధర్మమును ప్రచారము
చేయుటలేదు. పూర్వకాలమున ధర్మాత్ములయినవారికి ఇదే ఇష్టముగానున్నది. వారి మార్గామునే
నేను ఇప్పుడు అనుసరిస్తున్నాను.
తదేతత్ తు మయా కార్యం
క్రియతే భువి నాన్యథా
పితుర్హి వచనం కుర్వన్
న కశ్చిన్నామ హీయతే
-------------- 47
ఈ భూమిమీద
ధర్మాత్ములయిన ఇతరులకును ఏది ఆమోగ్యమయినదో, అదే నేనుకూడా చేయ బోవుచుంటిని. అంతేకాని దానికి విరుద్ధముగా నేను ఏమీ
చేయబోవుటలేదు. పితృ ఆజ్ఞను తప్పక పాటించవలయును. అట్టివారు ధర్మమునుండి ఎన్నటికి
జారిపోరు.
అటుపిమ్మట
లక్ష్మణునితో ఇట్లనెను:
ధర్మోహి పరమే లోకే
ధర్మే సత్యం ప్రతిష్ఠితం
ధర్మ సంశ్రితమపి ఏతత్
పితుర్వచనం ఉత్తమం ---------- 48
లక్ష్మణా, ప్రపంచమున ధర్మమే అన్నిటికంటే శ్రేష్ఠమైయున్నది. ధర్మమునందేసత్యము ప్రతిష్ఠితమైయున్నది.
తండ్రియొక్క ఆజ్ఞ ధర్మబద్ధమయినది. అందువలన ఆ తండ్రి ఆజ్ఞను పాటించుటఏ ఉత్తమము.
సంశ్రుత్య చ
పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్యవా
న కర్తవ్యమ్ వృథా వీర
ధర్మం ఆశ్రిత్య తిష్ఠతా
-------- 49
ధర్మమును
ఆశ్రయించుకొని యుండవలయును. తండ్రియొక్కయు, తల్లియొక్కయు, బ్రహ్మజ్ఞాని అయిన
బ్రాహ్మణుని యొక్కయు వచనములను పాటించెదనుఅని ప్రతిజ్ఞ చేసితిని. పిదప దానిని
వ్యర్థమొనర్పరాదు.
లక్ష్మణునితో ఇట్లా
చెప్పిన పిమ్మట శ్రీరాముడు కౌసల్య పాదములకు ప్రణమిల్లెను. అమ్మతో ఇట్లు చెప్పెను:
అనుమన్యస్వ మాం దేవి
గమిష్యన్తమితో వనం
శాసితాసి మామ ప్రాణైః
కురు స్వస్త్యయనానిమే
--------------- 50
తల్లీ, నేను ఇక్కడినుండి వనమునకు పోవుచున్నాను. ఆజ్ఞ ఇమ్ము.
స్వస్తి వచనము పలుకుము. ఈ వచనములను నేను నా ప్రాణములపై శపథము చేసి చెప్పుచుంటిని.
శోకః సంధార్యతాం మాతః
హృదయే సాధు మా శుచః
వనవాసాది హైష్యామి
పునః కృత్వా పితుర్వచః
---------------- 51
తల్లీ, శోకమును నీ హృదయమునందే లెస్సగా అణచిపెట్టియుంచుము.
దుఃఖించకుము. తండ్రి ఆనతిని పాటించెదను. వనవాసమునుండి తిరిగి వచ్చెదను.
త్వయా మయాచ వైదేహ్యా
లక్ష్మణేన సుమిత్రయా
పితుర్నియోగే స్థా
తవ్యమేష ధర్మః సనాతనః
------------------- 52
నువ్వు, నేను, సీత, లక్ష్మణుడు, లక్ష్మణుని తల్లి
సుమిత్ర, మనమందరము తండ్రి
దశరథుని ఆజ్ఞ ప్రకారమే వర్తించవలయును. ఇదే
సనాతన ధర్మము.
యశోహ్యాహం కేవల రాజ్య
కారణాత్ న పృష్ఠతః కర్తుమలం మహోదయం
అదీర్ఘకాలేన తు దేవి
జీవితే వృణే వరామద్య మహీమ ధర్మతః
--- 53
అమ్మా, నాకు మహా ఫలదాయకము, మరియు సత్కీర్తిదాయకము అగు ధర్మము ముఖ్యము.
అట్టిదానిని కేవలము రాజ్యకాంక్షకొరకై వదలలేను. అమ్మా నువ్వు నేను దీర్ఘకాలము
జీవించలేము. క్షణభంగురమయిన ఈ జీవితము కోసరము అధర్మ పూర్వకముగా ఈ భూమిని, మరియు రాజ్యమును స్వీకరించలేను.
ప్రసాదయన్నరవృషభః స
మాతరం పరక్రమాజ్జిగా మిషురేవ దండకాన్
అథానుజం భ్రుశమనుశాస్య
దర్శనం చకార తాం హృది జననీం ప్రదక్షిణం
--- 54
ఈ ప్రకారముగా
నరోత్తముడగు శ్రీరాముడు తల్లికి ధైర్యపూర్వక వచనములను చెప్పెను. దండకారాణ్యమునకుపోవ నిచ్చగించెను. తల్లిని
ప్రసన్నురాలిని చేసెను. తన అనుజుడు అయిన లక్ష్మణునికి ధర్మ రహస్యమును
ఉద్బోధించెను. తల్లికి హృదయపూర్వక నమస్కారము చేసెను.
అసాద్య రామః సౌమిత్రిం
సుహృదం భ్రాతరం ప్రియం
ఉవాచేదం స ధైర్యేణ
ధారయన్ సత్వం ఆత్మవాన్
-------------- 55
తన మనస్సును వశమునందు
ఉంచుకున్నవాడు శ్రీరాముడు. తన హితైషియు, సహృదయుడును, ప్రియమయినవాడును అగు
దిగులుగాను కొంచెం కోపముగా ఉన్న
లక్ష్మణునితో ఇట్లనెను.
ని గృహ్యం రోషం శోకం చ
ధైర్యమాశ్రిత్య కేవలం
అవమానం నిరస్యైనం
గృహీత్వా హర్షముత్తమం --------- 56
ఉపక్లుప్తం యదైతన్మే
అభిషేకార్థం ఉత్తమం
సర్వం నివర్తయ
క్షిప్రం కురు కాత్యం నిరవ్యయం
---------- 57
లక్ష్మణా, నీ మనస్సునందు కోపమును, రోషమును దూరము చేయుము. కేవలము ధైర్యమును
ఆశ్రయింపుము. అవమానమును చిత్తమునందు తలపకుము. నా రాజ్యభిషేకమునకు సంబంధించి
చేర్చిన సామగ్రిని తొలగించుము. నేను అరణ్యమునకు వెళ్ళు విధముగా ప్రవర్తించుము.
న బుద్ధిపూర్వం నా
బుద్ధం స్మరామీహ కదాచన
మాతౄణాం నా పితుర్వాహం
కృతమల్పం చ న ప్రియం -------------- 58
నేను తెలిసిగాని, తెలియకగాని, తల్లులకుగాని, తండ్రికిగాని ఏ చిన్న
అపరాథమునైనను చేసినట్లు జ్ఞాపకము లేదు.
సత్యః సత్యాభిసంధశ్చ
నిత్యం సత్యపరాక్రమః
పరలోక భయాద్ భీతో
నిర్భాయోస్తు పితా మమ ------- 59
తండ్రి సదా సత్యవాదియు, సత్యపరాక్రమశీలుడును అయి
ఉన్నాడు. తండ్రి పరలోక భయముచే ఎల్లప్పుడూ భయపడుచుండు వాడు. తండ్రికి పారలౌకిక భయము తొలగిపోవు కార్యమునే
నేను చేయవలసియున్నది.
యదచిన్త్యం తు తద్ దైవం భూతేష్వపి నహన్యతే
వ్యక్తం మయి చ తస్యాం చ పతితో హి విపర్యయః
------------ 60
ఏ కాలమునందైనను దైవముయొక్క విధానము ఎట్లుండునో ఆలోచించుటకు వీలుకాదు. దైవము
యొక్క విధానము భవిష్యత్తులోనూ ఎట్లుండునో ఆలోచించుటకు వీలుకాదు. నిశ్చయముగా ఏ
విధముగానైనను జరుగుటకు కేవలము దైవ ప్రేరణయే
కారణము. మరియొకటి కాదు.
కశ్చ దైవేన సౌమిత్రే యోద్ధుం ఉత్సహతే పుమాన్
యస్య అనుగ్రహణం కించిత్ కర్మణః అన్యన్ న దృశ్యతే ---------
61
లక్ష్మణా, సుఖ దుఃఖాది కర్మఫలము లభ్యమయిన తదుపరి, వ్యక్తికి జ్ఞానము కలుగుతుంది. కర్మను
అనుసరించే భగవంతుని అనుగ్రహం ఉంటుంది.
అట్టి దైవంతో ఎవ్వడు తలపడగలడు?
సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ
యస్య కించిత్ తథాభూతం నను దైవస్య కర్మతత్
------------ 62
సుఖదుఃఖములు, భయక్రోధములు, లాభ నష్టములు, ఉత్పత్తి వినాశములు, మొదలయిన పరిణామములు ఏవి
కలుగుచున్నవో, వేనికి ఏ కారణము తెలియబదదో, ఆ కర్మఫలములకన్నీ హేతువు
పరమాత్మే.
అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే
వివర్త్యారబ్ధం ఆరంభైర్నను దైవస్య కర్మ తత్
------------ 63
ఏ విషయము ఆలోచించకుండానే మనమీద అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. ప్రయత్నముచే
ఆరంభించబడిన కార్యమును నిలిపివేస్తుంది. నూతనమయిన కాండను తెచ్చిపెడుతుంది.
దైవముయొక్క విధానము ఈ విధముగానే ఉంటుంది.
ఏ తయా తత్తయా బుధ్యా సంస్తభ్యాత్మనమాత్మనా
వ్యాహతే వ్యభిషేకే మే పరితాపో న విద్యతే ------------ 64
ఇటువంటి తాత్విక బుద్ధిచే స్వయముగా మనస్సును స్థిరపరచుకొనుము. దానివలన
రాజ్యాభిషేకమునకు విఘ్నము కలిగినను అనగా జరగకున్నను దుఃఖము గాని, సంతాపముగాని కలగదు.
తస్మాత్ అపరితాపః సంస్త్వమపి అనువిధాయ మాం
ప్రతిసంహారయ క్షిప్రం అభిషేచనికీం క్రియాం ---- 65
కావున ఓ లక్ష్మణా, నీవు విచారించకుము. నాయొక్క
విచారణను అనుసరించుము. సంతాపరహితుడవు కమ్ము. నా రాజ్యాభిషేక ప్రయత్నమును
విరమించుము.
మా చ లక్ష్మణ సంతాపం కార్లీర్లక్ష్మ్యా విపర్యయే
రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః
------- 66
ఓ లక్ష్మణా, రాజ్యలక్ష్మియొక్క ఈ విపర్యమునుగురించి నీవు ఏమాత్రము చింతించకుము. నాకు
రాజ్యము లేదా వనవాసము రెండునూ సమానమే. కాని బాగా ఆలోచించినచో వనవాసమే ఉత్తమముగా
నాకు తోచుచున్నది.
న లక్ష్మణాస్మిన్ మమ రాజ్యవిఘ్నే మాతా యవీయస్యభి శంకితవ్యా
దైవాభిపన్నా న పితా కథంచి జ్ఞానాసి దైవం హి తథా ప్రభావం ---- 67
సోదరా, రాజ్యాభిషేక విఘ్నమునకు పినతల్లి కైకేయి కారణమని తలంచవలదు. ఎందువలననగా ఆమె
దైవమునకు అధీనురాలు. అట్లే తండ్రియు దీనికి కారణము కాదు. నీకు దైవమును, ఆయన అద్భుత ప్రభావమును తెలుసు. ఆ దైవమె ఈ విపరీతమునకు హేతువు.
విమృజ్య భాష్పం పరిసాంత్వ చాసక్రుత్ స లక్ష్మణం రాఘవ వంశవర్ధనః
ఉవాచ పిత్రోర్వచనే వ్యవస్థితం నిబోధ మామేష హి సౌమ్య సత్పథః ---- 68
రఘువంశమును వృద్ధి పరచునట్టి శ్రీరామచంద్రుడు ఈ విధముగా లక్ష్మణుని కన్నీరు
తుడిచి ఈ విధముగా పలికెను. సౌమ్యుడా, తల్లి తండ్రుల ఆజ్ఞను పాలించుటయందే నేను కృత నిశ్చయముతో నున్నానని
తెలిసికొనుము. ఇదియే సత్పురుషుల మార్గము.
నయ మామపి కాకుత్థ్స వనం వన్యాం మృగీమివ
యది తే గమనే బుద్ధిః కృతా పితరపేక్షయా ----69
అప్పుడు దుఃఖముతో తల్లియగు కౌసల్య ఇట్లు పలికెను:
కాకుత్థ్సా, తండ్రి ఆజ్ఞ పాటించుటకే నీవు వనమునకేగుటకు కృతనిశ్చయముతో ఉన్నావు. వనములోని
మృగము లేక లేడివలే నన్నుకూడా నీ వెంబడి వనమునకు తీసికొని వెళ్ళుము.
తాం తథా రుదతీం రామో రుదన్ వచనమబ్రవీత్
జీవంత్యాహి స్త్రియా భర్తా దైవతం ప్రభురేవచ
భవత్యా మమ చైవాద్య రాజా ప్రభావతి ప్రభుః
------- 70
ఇట్లు పలికి తల్లియగు కౌసల్య దుఃఖించ సాగెను. అదిచూచి శ్రీరామచంద్రుడు
పరితాపము చెందెను. ఆమెను ఒడార్చుచు ఇట్లు పలికెను. అమ్మా, స్త్రీ జీవించి యుండగా భర్తయే ఆమెకు ప్రభువు మరియు దేవుడు. రాజుగారు నీకు నాకు
ఇద్దరికీ ప్రభువు.
నేను వెళ్ళిపోయిన తదుపరి పుత్రశోకము వలన మహారాజునకు కష్టము ఏమాత్రము కలగకుండా
జాగ్రత్తగా ఉండుము.
శుశ్రూషామేవ కుర్వీత భర్తుః ప్రియహితే రతా
ఏష ధర్మః స్త్రియా నిత్యో వేదే లోకే శ్రుతః స్మృతః -----
71
కావున స్త్రీ పతియొక్క హితమునే కోరవలయును. అతని సేవయందే నిమగ్నమైయుండవలయును.
ఇదియే స్త్రీ ధర్మమూ, లోక ప్రసిద్ధమగు ధర్మమూ. ఈ విధముగా
వేదములలో శ్రుతులందు స్మృతులందు చెప్పబడియున్నది.
తల్లి కౌసల్య ఇట్లనెను:
న శక్యసే వారయితుం గచ్ఛ ఇదానీం రఘూత్తమ
శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాం క్రమే ------------ 72
ఓ, శ్రీరామా, ఇప్పుడు నేను నిన్ను ఆపలేను. ఇప్పుడు వెళ్ళరమ్ము. సజ్జనుల మార్గమందు స్థిరముగా
నుండుము. శీఘ్రముగా తిరిగి రమ్ము.
యమ పాలయాసి ధర్మం త్వం ప్రీత్యాచ నియమేనచ
స వై రాఘవ శార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు
------------ 73
రఘుకుల సింహా, నీవు నియమపూర్వకముగా
సంతోషముగా ఏ ధర్మమును పాలించుచున్నావో ఆ ధర్మమే అన్నివైపులనుండి నిన్ను
రక్షించుగాక.
ఏభ్యః ప్రణమసే పుత్ర దేవేష్వాయతనేషుచ
తే చ త్వామభి రక్షంతు వే సహ
మహర్షిభిః ---------- 74
పుత్రా, దేవస్థానములకు పవిత్రస్థలములకు వెళ్లి మొక్కుము. నమస్కరించుము. ఆయా దేవతలు
మహర్షులు నిన్ను సదా రక్షించుగాక.
యాని దత్తాని తేస్త్రాణి విశ్వామిత్రేన ధీమతా
తాని త్వామభిరక్షంతు గుణైః సముదితం సదా
--------------75
నీవు సద్గుణములతో ప్రకాశించు. దీమంతుడయిన విశ్వామిత్ర మహర్షి నీకు అస్త్రములను
ఇచ్చెను. అవి నిన్ను అన్ని సమయములయందు సదా రక్షించుగాక.
పితృ శుశ్రూషయా పుత్రపితృ శుశ్రూషయా తథా
సత్యేన చ మహాబాహో చిరంజీవ అభిరక్షతు
---- 76
మహాబాహువగు పుత్రా, నీవు తండ్రి యొక్కశుశ్రూష
చేత, నీవు తల్లి యొక్కశుశ్రూష చేత, మరియు సత్యపాలనచేత సదా
చిరంజీవివై సురక్షితుదవై వర్ధిల్లు.
సర్వలోక ప్రభుః బ్రహ్మా భూత కర్తృ తథర్షయః
ఏచ శేషాః సురాస్తే తు రక్షంతు వనవాసినం
------------- 77
సర్వలోక ప్రభువు బ్రహ్మ, జగత్తునకు కారణభూతము అయిన
పరబ్రహ్మము, సమస్త ఋషులు, దేవతలు, అందరును నిన్ను వనవాసకాలమున రక్షించుగాక.
మయార్చితా దేవగణాః శివాదయో మహర్షయో భూతగణాః సురోరగాః
అభిప్రయాతస్య వనం చిరాయతే హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ -----78
రాఘవా, నేను ఎల్లప్పుడూ ఎవరిని పూజించుచుంటినో, సన్మానించితినో, అట్టి శివుడు, సమస్త దేవతలు, మహర్షులు, భూత గణములు, దివ్య సర్పములు, సమస్త దిక్కులు, అందరు, వనవాస సమయములో నీ యొక్క హితమును
కాంక్షంతురుగాక.
తయాహిదేవ్యా చ కృత ప్రదక్షిణో నిపీడ్య మాతుశ్చరణౌ పునః పునః
జగామ సీతానిలయం మహాయశాః స రాఘవః ప్రజ్వలితస్తయా శ్రియా -----79
ఈ విధముగా చెప్పి తల్లి యగు కౌసల్య శ్రీరామునికి అన్నివైపులా ప్రదక్షిణ చేసి
ఆశీర్వదించెను. అప్పుడు శ్రీరాముడు తల్లి పాదములకు మరల మరల ప్రణమిల్లెను. మహా
యశస్వియగు శ్రీరామచంద్రుడు సీతాదేవియొక్క నివాసభవనము వైపునకు వెడలెను.
శ్రీరాముడు సీతమ్మతో ఇట్లనెను:
యాతేచ మయి కల్యాణి వనం ముని నిషేవితం
వ్రతోపవాసపరయా భవితవ్యం త్వయానఘే
------ 80
కల్యాణి, మునిజన సేవితమగు వనమునకు నేను తండ్రిగారి ఆజ్ఞపైన వెళ్ళుచుంటిని. నీవు ప్రాయః వ్రత, ఉపవాసములందు సంలగ్నురాలవై యుండుము.
కల్యముత్థాయ దేవానాం కృత్వా పూజాం యథావిధిః
వందితవ్యో దశరథః పితా మామ జనేశ్వరః
----------------------- 81
ప్రతిదినము ఉదయము ప్రాతఃకాలమున లేవవలయును. దేవతలను విధిపూర్వకముగా
పూజించవలయును. నా తండ్రియగు దశరథునకు వందము ఆచరించవలయును.
మాతా చ మమ కౌసల్యా వృద్ధా సంతాపకర్శితా
ధర్మమేవాగ్రతః కృత్వా త్వత్తః సమ్మానమర్హతి
------- 82
నా తల్లియగు కౌసల్యకు నమస్కరించవలయును. ఆమె వృద్ధురాలు. అంతేకాక నా వనవాసము
ఆమెను దుఃఖితురాలను చేసి కృంగదీసినది. నీవు ధర్మమార్గామున నడువుము. నీవు వారిని సమ్మనించవలయును.
వందితవ్యాశ్చతే నిత్యం యః శేషామమ మాతరః
స్నేహ ప్రణయ సంభోగైః సమాహి మమ మాతరః
--- 83
నాయొక్క మిగిలిన ఇద్దరి తల్లుల పాదములకు కూడా ప్రతిదినము ప్రణమిల్లవలయును.
స్నేహము, ప్రేమ, పాలన పోషణలలో నాకు తల్లులందరూ సమానులే.
భ్రాత్రుపుత్ర సమౌచాపి ద్రుష్టవ్యౌ చ విశేషతః
త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ
----- 84
భరతుడు శత్రుఘ్నుడు నాకు ప్రాణముకంటెను ఇష్టము. కనుక నీవు వారిని నీ స్వంత
సోదరులవలె పుత్రులవలె విశేషముగా చూడవలయును.
సా త్వాం వసేహ కళ్యాణీ రాజ్ఞః సమనువర్తినీ
భరతస్య రతా ధర్మే సత్యవ్రతపరాయణా ---
85
కళ్యాణీ, నీవు రాజు అగు భరతునికి అనుకూలముగా ప్రవర్తించుము. ధర్మము, సత్యవ్రతము –వీనియందు తత్పరయై ఇచ్చటనే
నివసింపుము.
అహం గమిష్యామి మహావనం ప్రియే త్వయా హి వస్తవ్యం ఇహైవ భామినీ
యథా వ్యలీకం కురుషే న కస్యచిత్ తథా త్వయా కార్యమిదం వచో మమ -----86
ప్రియా, నేను ఇప్పుడు విశాలమగు వనమునకు పోవుచుంటిని.
భామినీ, నీవు ఇచ్చటనే ఉండుము. నీ ప్రవర్తన ఎవ్వరికినీ కష్టము కలిగించకుండునుగాక. ఈ
విషయమును దృష్టియందుంచుకొనుము. నా ఆజ్ఞను పాలించుము.
సీతమ్మ ఇట్లనెను:
భర్తుర్భాగ్యం తు నార్యేకా ప్రాప్నోతి పురుషర్షభ
ఆతశ్చైవాహ మాదిష్టా వనే వస్తవ్య మిత్యపి
------------- 87
పురుషోత్తమా, ఎల్లప్పుడూ భర్త భాగ్యమే భార్య భాగ్యము అనగా భార్య భాగ్యము
భర్త భాగ్యమును అనుసరించియుండును కదా. అందువలన మీవెంట వనములందు నడచుటయే నా
భాగ్యము.
న పితా న ఆత్మజో నాత్మ న మాతా న సఖీజనః
ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకో గతిః సదా
----- 88
నారీమణులకు ఇహ లోకమున పరలోకమున భర్తయొక్కడే గతి. తల్లి, తండ్రి, స్నేహితురాండ్రు, ఆఖరికి తన శరీరముకూడా
సహాయకులు కాదు.
యది త్వం ప్రస్థితో దుర్గం వన మధ్యైవ రాఘవ
అగ్రతస్తే గమిష్యామి మృద్గంతీ కుశకండకాన్ ---- 89
ఓ రాఘవా, మీరు ఈ దినమే దుర్గమమయిన వనమునకు బయలుదేరినచో, నేను ముందర ఉండెదను. మీకు అడ్డువచ్చు గడ్డినీ ముళ్ళను తీసివేయుదును.
ప్రాసాదాగ్రే విమానైర్వా వైహాయసగతేనవా
సర్వావస్థా గతా భర్తుః పాదచ్ఛాయూ విశిష్యతే -- 90
పెద్ద పెద్ద భవనములయందు నివసించుట, విమానములపైన యెక్కితిరుగుట, వీటి ఆన్నింటికంటేను, స్త్రీలకు సర్వావస్థలయందును భర్త చరణముల నీడలోనుండుటయే శ్రేయస్కరము, ఉత్తమము.
సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః
అచింతయంతీ త్రీన్ లోకాన్ చింతయంతీ పతివ్రతం
-- 91
ఏ విధముగానైతే నా తండ్రిభవనమందు సుఖముగా నివసించితినో, అదే విధముగా నీతోపాటు వనమందు సుఖముగా నివసించెదను. మూడులోకముల ఐశ్వర్యమును
గొప్పగా తలచను. నేను సదా మీ సేవయందు నిమగ్నమై ఉండెదను.
శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణీ
సహా రంస్యే త్వయా వీర వనేషు మధుగంధిషు
-----92
వీరోత్తమా, నియమపూర్వకముగా ఉండెదను. బ్రహ్మచర్యవ్రతమును పాలించెదను. నిత్యమూ మీ సేవయందే
నిమగ్నమై ఉండెదను. మధురగంద యుక్తములగు వనములందు మీతో సంచరించెదను.
ఏవం వర్ష సహస్రాణి శతం వాపి త్వయా సహ
వ్యతిక్రమం న వేత్స్యామి స్వర్గోపి హి న మే మతః -----93
ఈ విధముగా మీతో శత సహస్ర వర్షములుకూడా మీతో వనములో గడపగలను. అది నాకు కష్టము
కానేకాదు. మీరులేని ప్రదేశము స్వర్గమయినను నాకు సమ్మతము కానేకాదు.
అనన్య భావామనురక్తచేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం
నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం నాతొ మయాతే గురుతా భవిష్యతి ---91
నా హృదయమండలి అనురాగము అంతయు మీకే అంకితం. నా మనస్సు మీయందే ఎల్లప్పుడూ
నిమగ్నమైయుండును. మీనుండి వియోగముకన్న నాకు మరణమే శ్రేయస్కరము. కావున మీరు నా
ప్రార్థనను మన్నించండి. నన్ను వెంట తీసికోనిపొండు. నేను మీకు భారముకాను.
సీతమ్మ కనులవెంట నీరు కారుచుండెను. శ్రీరాముడు అనునయముగా ఇట్లు పలికెను:
సీతే మహాకులీనాపి ధర్మేచ నిరతా సదా
ఇహా చరస్వ ధర్మం త్వాం యథా మే మనసః సుఖం
--- 95
సీతా, నీవు చాలా ఉత్తమకులమున జన్మించితివి. అంతేకాక ధర్మాచరణమునందే ఎల్లప్పుడూ
నిమగ్నమై యుండు. కనుక ఇక్కడనేయుండి ధర్మమును పాలింపుము. దానివలన నా మనస్సు సంతోషము
చెందును.
శ్రీరామచంద్రుడు సీతతో ఇట్లనెను. సీతే, వనమందు అనేకమయిన భయములను, బాధలను
ఎదుర్కొనవలసియుండును. వనము సదా దుఃఖరూపమయియున్నది. నీవు సుకుమారివి. వాటినన్నిటినీ
భరించలేవు. కావున నీవు ఇక్కడే ఉండుట శ్రేయస్కరము. దానికి దుఃఖముతో సీత ఇట్లనెను:
ఏ త్వయా కీర్తితా దోషా వనే వస్తావ్యతాం ప్రతి
గుణానిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతా
-- 96
ఓ ప్రాణేశ్వరా, వనవాసమందలి దోషములను మీ
స్నేహమువలన నాకు గుణరూపముగా పరివర్తన చెందగలవు. ఈ విషయమును మీరు తెలిసికొనుడు.
వనవాసే హి జానామి దుఃఖాని బహుధా కిల
ప్రాప్యంతే నియతం వీర పురుషైరకృతాత్మభిః
----- 97
వీరోత్తమా, వనవాసమునందు చాలా దుఃఖములు తప్పక కలుగగలవని నాకు తెలియును. కాని మనస్సు, ఇంద్రియములు తన వశమునందు లేనివానికే అవి దుఃఖములుగ అనిపించును.
శుద్ధాత్మన్ ప్రేమభావాద్ధి భవిష్యామి వికల్మషా
భర్తారం అనుగచ్ఛంతీ భర్తా హి పరదైవతం
-----98
శుద్దాత్మా, మీరు నా భర్త. మీవెంట ప్రేమ భావముతో అనుసరించి వనమునకు పోవలయును. నా పాపములు
తొలగిపోవును. ఎందుకంటే భర్తకంటే భార్యకు పరదైవములేదు.
భక్తాం పతివ్రతాం దీనాం మాం సమం సుఖ దుఃఖయోః
నేతుమర్హసి కాకుత్స సమాన సుఖ దుఃఖనీం
---- 99
ఆర్యా, నేను మీ భక్తురాలను. పాతివ్రత్యమును పాలించుదానను. మీ సుఖ దుఃఖముల యందు
పాలుపంచుకొనుదానను. నేను సుఖ దుఃఖములయందు సమముగానుండు దానను. నన్ను తప్పక మీవెంట
తీసుకొని వెళ్ళండి. నేను హర్షశోకముల వశములో నుండను.
శ్రీరామచంద్రుడు ఆమెను లాలించుతూ ఇట్లనెను:
న దేవి బట దుఖేన స్వర్గమపి అభిరోచయే
నహి మేస్తి భయం కించిత్ స్వయం భోరివ సర్వతః 100
దేవీ, నీకు దుఃఖము కలుగుటే నేను భరించలేను. దానికి స్వర్గసుఖముకూడా ఏమాత్రము నాకు
అక్కరలేదు. స్వయంభువు అగు బ్రహ్మదేవుని వలె నాకు ఎవరివలన అయినను ఏమాత్రమూ
భయములేదు.
యత్ సృష్టాసి మయా సారం వనవాసాయ మైథిలి
న విహాతుం మయా శక్యా ప్రీతిరాత్మవతా యథా 101
మిథిలా రాజకుమారి, నీవు నన్ను వనమునందు
నివసించుటకే జన్మించియున్నచో, ఆత్మజ్ఞాని తన స్వాభావిక
ప్రసన్నత్వమును వదలలేదు. అలాగే నిన్ను నేను వదలజాలను.
ఏష ధర్మష్చ సుశ్రోణి పితుర్మాతుశ్చ వశ్యతా
ఆజ్ఞాం చాహం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే --- 102
సుందరీ, తల్లిదండ్రుల ఆజ్ఞను పాలించుట కుమారుని ధర్మము. కావున నేను వారి ఆజ్ఞను ఉల్లంఘించను. ఉల్లంఘించి జీవించలేను.
ఆస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే
స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం
--- 103
తల్లిదండ్రి ప్రత్యక్షదైవములు. వారికి
తప్పక సేవచేయవలయును. ప్రత్యక్షదైవములు అయిన తల్లిదండ్రులను వదిలిబెట్టి ఎదురుగా
లేని దేవతలను ఎలా ఆరాధించగలము?
యత్ర త్రయం త్రయో లోకాః పవిత్రం తత్సమం భువి
నాన్యదస్తి శుభాపాఙ్గే తేనేదమభిరాధ్యతే --- 104
సీతే, తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దైవములు. వారిని ఆరాధించినచో ధర్మ, అర్థ, కామములు మూడూ సంప్రాప్తించును. తల్లి, తండ్రి, గురువునకు సమానమయిన దేవతలు ఈ భూమి మీద మరియొకరు లేరు. అందువలన వీరి ముగ్గురిని
తప్పక ఆరాధించవలయును.
న సత్యం దానమానౌ నా యజ్ఞో నా ప్యాప్త దక్షిణాః
తథా బలకరాః సీతే యథా సేవా పితుర్మతా
105
సీతే, శుభాప్రాప్తికి తండ్రి సేవయే ప్రబలమయిన సాధనా కారణము. అదేవిధముగా సత్యము, దానము, మానము, గొప్ప దక్షిణలతో కూడిన యజ్ఞములు ఏవియునూ దీనికి సమానము కావు, కానేరవు.
స్వర్గో ధనం నా ధాన్యం నా విద్యా పుత్రాః సుఖానిచ
గురువృత్తి అనురోధేన న కించిదపి దుర్లభం --------- 106
గురుజనులయొక్క సేవచే స్వర్గము, ధనము, ధాన్యము, విద్య, పుత్రులు, అన్నియు సుసాధ్యమే, ఏదియు దుర్లభముకాదు, కానే కాదు.
దేవ గంధర్వ గోలోకాన్ బ్రహ్మలోకాం స్తథా పరాన్
ప్రాప్నువన్తి మహాత్మానో మాతా పితృ పరాయణాః ----------- 107
తల్లిదండ్రుల సేవలయండు నిమగ్నమైయుండు మహాత్ముడు దేవలోకము, గంధర్వ లోకము, గోలోకము, మరియు ఇతరములయిన లోకములనుగూడ పొందగలడు.
స మా పితా యథా శాస్తి సత్య ధర్మ పథే స్థితః
తథా వర్తితుం ఇచ్ఛామి స హి ధర్మః సనాతనః
------ 108
అందువలన సత్య ధర్మ మార్గమునండున్న పూజ్యుడగు నా తండ్రి దశరథ మహారాజు నాకు
ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ఆచరించ దలచినాను. ఎందుకంటే ఇది సనాతన ధర్మమైయున్నది.
సాహి దిష్టానవద్యాఙ్గి వనాయ మదిరేక్షణే
అనుగచ్ఛస్వ మాం భీరు సహధర్మచరీ భవ
-------------- 109
సులోచనా, ఇప్పడు నీకు అనుజ్ఞను ఒసంగుచున్నాను. నాతోబాటు వనమునకు రమ్ము. నీవు నన్ను
అనుసరించుము. ధర్మమును ఆచరించుము.
అక్కడికి వచ్చిన లక్ష్మణుడు అన్నయగు శ్రీరామునితో ఇట్లనెను.
యది గంతుం కృతా బుద్ధిర్వనం మృగ గజాయుతం
అహం త్వాను గమిష్యామి వనమగ్రే ధనుర్ధరః
----------- 110
అన్నా, అనేక మృగములు,
ఏనుగులతో నిండియున్న అరణ్యమునకు పోవుటకు మీరు కృత నిశ్చయముతోనున్నయడల
నేనుకూడా మిమ్ములను అనుసరించెదను. చేతిలో ధనుస్సుతో మీముందర నడిచెదను.
తతః స పురుషవ్యాఘ్రస్తద్ ధనం సహ లక్ష్మణః
ద్విజేభ్యో బాలవృద్ధేభ్యః కృపణేభ్యో హ్యదాపయత్ -----
111
పురుష సింహమయిన శ్రీరాముడు, లక్ష్మణునితో కలిసి
బ్రాహ్మణులకు ధనమును దానము చేసెను. అటుపిమ్మట వారిద్దరూ తండ్రిని చూచుటకు
పోయిరి. శ్రీరాముడు శ్రీరాముడు, సీతమ్మ, మరియు లక్ష్మణునితో కలిసి కాలినడకన పోవుచుండుటనుచూచి బాలలు వృద్ధులు అనేకజనులు
శోకాన్వితులయ్యిరి. ఇట్లా అనుకొనుచుండిరి.
ఆనృశంస్య మను క్రోశః శ్రుతం శీలం దమః శమః
రాఘవం శోభయన్త్యేతే షడ్గుణాః పురుషర్షభం
----- 112
సర్వ శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు ఆరుగుణములు అనగా క్రూరత్వము లేమి, దయ, విద్య, శీలము, మనోనిగ్రహము (శమము), ఇంద్రియనిగ్రహము (దమము), వీటితో అలరారు వాడు. సుశోభితుడు.
మూలం హ్యేష మనుష్యాణాం ధర్మసారో మహాద్యుతిః
పుష్పం ఫలం చ పత్రం చ శాఖాశ్చాస్య ఇతరే జనాః -----
113
మహా తేజస్వియగు ఈ శ్రీరాముడు జనులందరికినీ మూలము. ధర్మమే అతని బలము.
ప్రపంచమునందలి ఇతర ప్రాణులు, ఆకులు, పువ్వులు, పండ్లు, మరియు కొమ్మలు అయిఉన్నారు.
దుఃఖితుడైన తండ్రి దశరథ మహారాజుతో శ్రీరాముడు ఇట్లనెను. తండ్రీ, నావెంట వచ్చుటకు నా భార్య సీతను, అనుజుడగు లక్ష్మణుని పంపుటకు ఆజ్ఞ నొసంగుడు. వారిని ఎంత వారించినను వారు నాతో
వచ్చుటకే ఇచ్చగించిరి.
దశరథుడు శ్రీరామునితో బాధాతప్తుడై ఇట్లనెను. పుత్రా, నీవు మంగళము కొరకై, రఘువంశ కీర్తిని
వృద్ధికొరకై, తండ్రి ఆజ్ఞను జవదాటని పుత్రునిగా శాంతభావముతో అరణ్యమునకు వెళ్ళుచుంటివి. నీ
మార్గమునకు విఘ్నములు రాకుండుగాక. క్షేమముగా వెళ్ళుము. తిరిగి 14 వర్షముల వనవాసముతదుపరి తిరిగి రమ్ము.
శ్రీరాముడు దుఖమును పొంది తండ్రితో ఇట్లనెను.
నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మేదినీం
నైవ సర్వానిమాన్ కామాన్ న స్వర్గం న చ జీవితుం ------114
ఓ తండ్రీ, నాకు రాజ్యకాంక్ష లేదు. సుఖము మీద కోరికలేదు. భూమండలము పాలించాలనీ లేదు. సమస్త
భోగములగురించి కోరికలేదు. స్వర్గం గురించిగాని, జీవితము గురించిగాని కోరికలేదు.
త్వామహం సత్య మిచ్ఛామి నానృతం పురుషర్షభ
ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే
---- --- 115
ఓ మానవ శ్రేష్టుడా, నా మనస్సునందు ఎదియైనా
కోరికయున్నచో అది మీరు సత్యవాది కావలయుననే. మీ మాట అబద్ధము కానే కాకూడదు. మీముందర
సత్య శుభకర్మములమీద శపథము చేసి చెప్పుచుంటిని.
త్యక్త భోగస్య మే రాజన్ వనే వన్యేన జీవితః
కిం కార్యం అను యాత్రేణ త్యక్త సజస్య సర్వతః
---- 116
రాజా, నేను భోగములను పరిత్యజించితిని. నేను ఇప్పుడు అరణ్యములోని కందమూలములతో
జీవించవలయును. సర్వవిధముల నేను అన్నింటియందును ఆసక్తిని విడనాడితిని. ఇక నాకు
సైన్యముతో పని ఏమున్నది?
అప్పుడు తల్లి కౌసల్య కోడలు సీతమ్మ తలమీద ముద్దు పెట్టుకొనెను. ఆలింగనము
చేసికొనెను. ఇట్లనెను:
అసత్యః సర్వలోకేస్మిన్ సతతం సత్కృతాః ప్రియైః
భర్తారం నానుమన్యంతే వినిపాతగతం స్త్రియః
----- 117
సీతే, స్త్రీలు తమ భర్తలచే సదా సమ్మానితులైయున్నప్పటికీ, సంకటస్థితి వచ్చినప్పుడు ఆ స్త్రీలు తమ తమ భర్తలను ఆడరించవలయును. అట్లుకానియడల
అట్టి స్త్రీలు అసతులు లేక దుష్టులుగా పరిగణింపబడుడురు.
అసత్యశీలా వికృతా దుర్గా అహృదయః సదా
అసత్యః పాపసంల్పాః క్షణమాత్ర విరాగిణః
------ 118
అబద్ధము చెప్పువారు, వికృత చేష్టలను చేయువారు, దుష్టపురుష సాంగత్యము కలిగియుండువారు, పతియడల సదా హృదయరాహిత్యము కలిగియుండువారు, కులటలు, పాప సంకల్పులు, క్షణకాలమైనను పతియడల విరక్తి
కలిగియుండువారు అసతులు లేక దుష్టులుగా పరిగణింపబడుడురు.
సాధ్వీనాం తు స్థితానాం తు శీలే సత్యే శృతేస్థితే
స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే ------
119
సత్యము సదాచారము కలిగి శాస్త్రమర్యాదలను కులోచిత మర్యాదలను పాటించుదురో, అట్టి సాధ్వీ స్త్రీలకు పతియొక్కడే
పరమ పవిత్రమైన సర్వశ్రేష్టమైన దేవుడు.
స త్వయా నావ మంతవ్యః పుత్రః ప్రవ్రాజితో వనం
తవ దేవ సమస్త్వేష నిర్ధనః న ధనోపి వా ----- 120
అందువలన నీవు వనవాసముయొక్క ఆజ్ఞ లభించిన నా పుత్రుడగు శ్రీరాముని ఎప్పుడును
అనాదరము చేయవద్దు. నీ భర్త ధనహీనుడైనను, ధనవంతుడైనను నీకు దేవుడే.
అప్పుడు సీతమ్మ చేతులు జోడించి అత్తగారికి ప్రణమిల్లెను. ఇట్లు చెప్పెను:
కరిష్యే సర్వమేవాహం ఆర్యా యదనుశాస్తి
మాం
అభిజ్ఞాస్మి యథా భర్తుర్ వర్తితవ్యం శ్రుతం చ మే ---- 121
అమ్మా, మీరు ఉపదేశముచేసిన దానిని నేను యథావిధి పరిపూర్ణముగా పాటించెదను. భర్తయడల
పాటించవలసిన దానిని లోగడ నాకు తెలియును. ఈ విషయము ఇదివరకే వినియుంటిని.
అప్పుడు శ్రీరామచంద్రుడు ఇట్లనెను:
సంవాసాత్ పరుషం కించిద్ అజ్ఞానాత్ అపి యత్ కృతం
తన్మే సముపజానీత సర్వాశ్చామంత్రయామి చ
--- 122
అమ్మలారా, ఎల్లప్పుడూ ఒకేచోట ఉండుటవలన చనువుతోగాని లేదా అజ్ఞానమువలన గాని నేను ఏదయినా వచనములు అప్రియముగా
పలికియుండవచ్చు. నేను ఏదయినా తప్పు లేదా తప్పులు చేసి యుండవచ్చు. వాటినన్నిటినీ
క్షమించవలసినదిగా కోరుచుంటిని. ఇప్పుడు నేను మీ అందరినుండి సెలవు కోరుచుంటిని.
అథ రామశ్చ సీతా చ లక్ష్మణశ్చ కృతాఞ్ఙలిః
ఉప సంగృహ్య రాజానం చక్రుర్దీనాః ప్రదక్షిణం ----
123
తదుపరి శ్రీరాముడు, సీతమ్మ, మరియు లక్ష్మణుడు చేతులు
జోడించుకొనిరి. తండ్రి యగు దశరథమహారాజు పాదములను త్ర్రాకి నమస్కరించిరి. వినయముగా
ప్రదక్షిణ చేసిరి.
తం చాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞః సహ సీతయా
రాఘవః శోక సమ్మూఢో జననీమభ్య
వాదయత్ --- 124
శ్రీరాముడు తండ్రివద్ద సెలవుతీసికొనెను. ధర్మజ్ఞుడగు శ్రీరాముడు తల్లి
శోకమునుచూచి చలించిపోయెను. సీతాసహితముగా తల్లి పాదములకు ప్రణమిల్లెను.
వనవాసం హి సంఖ్యాయ వాసాంస్య ఆభరణాని చ
భర్తారమను గచ్ఛంత్యై సీతాయై శ్వశురోదదౌ
-------- 125
తదుపరి భర్తను అనుసరించి పోవు సీతాదేవికి మామాగారయిన దశరథమహారాజు వనవాసకాలమును
లెక్కించి తదనుసారముగా వస్త్రములను, ఆభూషణములను ఒసంగెను.
పిమ్మట శ్రీరాముడు, సీతమ్మ, మరియు లక్ష్మణుడు ముగ్గురు రథముపై
కూర్చొనిరి. సారథి సుమంత్రుడు రథమును ముందుకు నడిపెను. వీరు ముగ్గురూ వనవాసమునకు
పోవుచుండిరి అను వార్త దావానలములాగా ముందుకు ప్రాకెను. అందరు పెద్దగ ఏడ్చుచు వారి
వెంట నడిచిరి. తమసా నదికి ఆవలి ఒడ్డుకు చేరెను. కోసల దేశము దాటివైచెను. అచ్చటి
గ్రామములను పెక్కు రాజులు రక్షించుచుండిరి. వేదమంత్రముల శబ్దము
ప్రతిధ్వనించుచుండెను. అక్కడ మహా పవిత్రమయిన గంగానదిని దర్శించెను. ఆ నది ఒడ్డున
అనేక ఋషుల ఆశ్రమములు విలసిల్లుచుండెను. అట్టి దేవనదియగు గంగానది వద్దకు శ్రీరాముడు
చేరెను. గంగానది యొక్క ఆ ధార శృంగవేరపురమునందు ప్రవహించు చుండెను.
శృంగవేరపురమునందు గుహుడు అను రాజు రాజ్యము చేయుచుండెను. గుహుడు శ్రీరామునకు
ఆప్తమిత్రుడు. ఆటను నిషాద (బోయ) కులమునందు జన్మించెను. అతను శారీరకముగా మఱియు సైనిక శక్తియందు గొప్ప
బలవంతుడు. శ్రీరాముని రాకగురించి విని ఆయన పెద్దలగు మంత్రిగానముతోను, బంధువులతోను కలిసి అచ్చటికి వచ్చెను. అర్ఘ్యనివేదనచేసి శ్రీరామునితో ఇట్లు
పలికెను. ---మీకు స్వాగతము, సుస్వాగతము. ఈ భూభాగము అంతా
మీదే. మేము మీ సేవకులము. మీరు మాకు
ప్రభువు. శాసించుడు. ఆయన స్నేహ హస్తమునకు ఆనందపడి శ్రీరాముడు ఇట్లు
అనెను:
యత్ త్విదం భవతా కించిత్ త్రీత్యా సముపకల్పితం
సర్వం తదనుజానామి నహి వర్తే ప్రతిగ్రహే
---- 126
గుహుడా, నీవు సలిపిన ఈ ప్రేమసత్కార్యములకు మిక్కిలి సంతోషించితిని. ఈ ప్రేమతో నీవు
ఇచ్చిన సామానులను గ్రహించుటకు ఇది సమయముకాదు. అందువలన అవ్వి నీకే తిరిగి ఇచ్చి
వేయుచున్నాను.
కుశ చీరాజిన ధరం ఫలమూలా శనం చ మాం
విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం
వనగోచరం ------ 127
నార దుస్తులు ధరించి మృగ చర్మమును ధరించి ఫలమూలములను ఆహారముగా గైకొంటున్నాను.
ధర్ముగా తాపసిగా వనమునందు సంచరించుచున్నాను. ఈ దినములలో ఇట్టి నియమములనే
పాటించుచుంటినని తెలిసికొనుము.
అశ్వానాం ఖాదనేనాహమర్థీ నాన్యేన కేనచిత్
ఏతావతాత్ర భవతా భవిష్యామి సుపూజితః
------ 128
కేవలము అశ్వముల మేత మాత్రమె ఈ వస్తువులయందు నేను స్వీకరించగలను. అది ఇచ్చిన
నాకు మీరు చాలా సహాయముచేసినవారు కాగలరు.
తతశ్చీరోత్తరాసంగః సంధ్యాం అన్వాస్య పశ్చిమాం
జలమేవాదదే భోజ్యం లక్ష్మణే నాహృతం స్వయం
----- 129
తదుపరి శ్రీరామచంద్రుడు వల్కలములయొక్క ఉత్తరీయమును ధరించెను. సాయంకాలపు
సంధ్యావందనము పూర్తిచేసెను. లక్ష్మణుడు తెచ్చిన జలమును ఆహారముగా స్వీకరించెను.
తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాల్య లక్ష్మణః
సభార్యస్య తతోభ్యేత్య తస్థౌ వృక్షం ఉపాశ్రితః ----
130
పిమ్మట పత్నీసమేతుడగు శ్రీరామచంద్రుడు గడ్డితో చేయబడిన పడకపైన నేలమీద
పరుండెను. లక్ష్మణుడు అన్నయొక్క పాదములను కడిగెను. అక్కడికి సమీపములోని వృక్షము
క్రింద కూర్చుండెను.
తం జాగ్రతమదంభేన భ్రాత్రురర్థాయ లక్ష్మణం
గుహః సంతాపసంతప్తో రాఘవం వాక్యం అబ్రవీత్
---- 131
తన సోదరునియడల స్వాభావిక అనురాగముచే ఆ రాత్రి లక్ష్మణుడు మేలుకోని యుండుటను
చూచి గుహునకు చాలా సంతాపము కలిగెను. రఘుకులనందనుడగు లక్ష్మణునితో ఇట్లు పలికెను.
నాయనా, రాజకుమారుడా, నీ కొరకు ఈ సుఖదాయకమగు శయ్య
సిద్ధముగానున్నది. దీనిపై ఆనందముగా పరుండి హాయిగా విశ్రాంతి గైకొనుము.
నహి రామాత్ ప్రియతమో మమాస్తే భువి కశ్చన
బ్రవీమ్యేవ చ తే సత్యం సత్యేనైవ చ తే శపే
----- 132
లక్ష్మణా, నీకు సత్యముగా శపథము చేసి చెప్పుచున్నాను. నాకు ఈ భూమిమీద శ్రీరామునికంటే అధిక
ఇష్టుడు లేనేలేడు.
లక్ష్మణస్తు తదోవాచ రక్ష్యమాణాత్ త్వయానఘ
నాత్ర భీతా వయం సర్వే ధర్మం ఏవానుపశ్యతా
133
కథం దశరథౌ భూమౌ శయానే సహ సీతయా
శక్యా నిద్రామయా లబ్దుం జీవితం వా సుఖానివా ----- 134
అది విని లక్ష్మణుడు ఇట్లు అనెను. పాప రహితుడవగు ఓ నిషాదరాజా, నీవు ధర్మదృష్టితో మమ్మల్ని రక్షించుచున్నావు. అందువలన మాలో ఎవ్వరికి
భయములేదు. అయినను, దశరథుని జ్యేష్ట పుత్రుడైన
శ్రీరాముడుతనభార్య సీతతో భూమిమీద పడుకున్నాడు. సేను పట్టుమంచముమీద నిద్రపోవుట, స్వాదిష్టమగు అన్నము భుజించుట, మరియు ఇతర సుఖములను
అనుభవించుట ఎంతవరకు సమంజసము.
ఆరాత్రి గడచిన పిమ్మట, శ్రీరాముడు సీతా
లక్ష్మణునితో గంగా నది ఒడ్డుకు వెళ్ళెను. తన సహాయకుడగు గుహునితో ఇట్లు పలికెను.
అప్రమత్తో బలేకోశే దుర్గే జనపదే తథా
భవే థా గుహరాజ్యం హాయ్ దురారక్షతమం మతం 135
నిషాదరాజా! మీరు సేన, కోశాగారము, కోట, రాజ్యము విషయములలో అల్లప్పుడు జాగ్రత కలిగి ఉండవలయును. ఎందుకనగా
రాజ్యరక్షణాకార్యము మిక్కిలి కఠినము.
పిమ్మట శ్రీరాముడు సుమంత్రునకు, గుహునకు వెళ్ళుటకు ఆజ్ఞ
నొసగెను. పడవలోకూర్చోని
గంగానదీమధ్యభాగమునకు శ్రీరాముడు సీతాదేవితో చేరుకొనెను. సీతమ్మ గంగానదిని ఇట్లు ప్రార్థించెను.
పుత్రో దశరథస్యాయం మహారాజస్యధీమతః
నిదేశం పాలయత్వేనం గంగే త్వదభిరక్షితః 136
గంగాభవాని, వీరు దశరథ పుత్రులయిన శ్రీరామచంద్రమూర్తి. తండ్రి ఆజ్ఞాపాలన నిమిత్తము వనమునకు
వెళ్తున్నారు. వీరికి రక్షణకలుగచేయుము.
తీరమునకుచేరి శ్రీరాముడు నావను వదలి, సీతా లక్ష్మణులతో కలిసి ముందుకు ప్రయాణము చేసెను.
సతు సంవిశ్య మేదిన్యాం మహార్హశయనోచితః
ఇమాః సౌమిత్ర యే రామో వ్యాజహార కథాః శుభాః 137
ఖరీదయిన శయ్యపై పరుండదగిన శ్రీరాముడు
నేలమీద కూర్చొని సుమిత్ర కుమారుడు
లక్ష్మణునితో ఈ శుభవాక్యములను
పలికెను.
ఇదం వ్యసనమాలోక్య రాజ్ఞశ్చ మతివిభ్రమం
కామఏవార్థధర్మాభ్యాం గరీయానితి మేమతిః 138
నా మీద పడిన ఈ సంకటమును మరియు రాజుయొక్క భ్రాంతిని చూచినచో, ధనము, ధర్మముకంటే కామమునకే అధికమగు గౌరవము జనము ఇచ్చుదురని తెలుస్తున్నది.
అర్థధర్మౌ పరిత్యజ్య యః కామ మనువర్తతే
ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా 139
ఎవడు అర్థమును, ధర్మమును, పరిత్యజించి కేవలము కామమును అనుసరించునో, అతడు దశరథ మహారాజువలె, శీఘ్రముగా ఆపదలో పడిపోవును.
నూనం జాత్యన్తరే తాత స్త్రియః పుత్రైర్వియోజితాః
జనన్యామమ సౌమిత్రే తదద్యైత దుపస్థితం 140
నాయనా! సౌమిత్రకుమారా, నిశ్చయముగ పూర్వజన్మమందు, నా తల్లి కొందరు స్త్రీలకు, తమ పుత్రులనుండి వియోగము
కలిగించి ఉండవచ్చు. అందుకు ప్రతిగా పుత్రవియోగము నీ తల్లికి ప్రాప్తించి
యుండవచ్చు.
ఏకోహ్యహయోధ్యాం చ పృథివీం చాపి
లక్ష్మణః
తరేయమిషుభిః క్రుద్ధో నను వీర్యమకారణం 141
లక్ష్మణా, నాకు క్రోధము కలిగినచో, నా బాణములతో నేనొక్కడినే ఈ
అయోధ్యా పట్టణమును, సమస్త భూమండలమును ఏ
అడ్డంకులు లేకుండా చేసి ఆ అధికారమును ఉంచుకొనగలము. కానీ బలపరాక్రమము ద్వారా
పారలౌకిక హితసాధన సాధించలేము.
అధర్మభయతభీశ్చ పరలోకస్యచానఘ
తేన లక్ష్మణ నాచ్యాహ మాత్మానమభిషేచయే 142
లక్ష్మణా, నేను అధర్మము, మరియు పరలోకము గురించి
భయపడుచున్నాను. అందువలననే నేను అయోధ్యలో నా అభిషేకము కానివ్వలేదు.
సీతా రామ లక్ష్మణులు సూర్యాస్థమాన సమయమున గంగా యమునా నదుల సమీపమునగల
భరద్వాజముని ఆశ్రమమునకు చేరుకొనిరి. భరద్వాజముని దర్శనము చేసికొనిరి. వారి
పాదములకు నమస్కరించిరి.
ఆశ్రమములో రాత్రిగడిపి మహర్షికి ప్రణమిల్లి రమణీయమయిన చిత్రకూట పర్వతము పైకి
పోయిరి. పిమ్మట, సీతా రామ లక్ష్మణులు ఆచటగల వాల్మీకి మహర్షి ఆశ్రమమును ప్రవేశించిరి. వారికి
ప్రణమిల్లిరి. వాల్మీకి అనుమతితో పర్ణశాలను నిర్మించుకొనిరి.
రామః స్నాత్వా తు నియతో గునవాన్గపకోవిదః
సంగ్రహేణాకరోత్ సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్ 143
సద్గుణసంపన్నులయిన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి మంగళ స్నానములు
ఆచరించెను. శౌచ సంతోషాదినియమములను పాలించుచు వాస్తుపూజకు సంబంధించిన
మంత్రములన్నిటిని సంక్షేపముగా జపించెను.
ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశావసథం శుచిః
బభూవ చ మనోహ్లాదో రామస్యామిత తేజసః 144
ఇష్ట దేవతలను పూజించి, పవిత్రభావనతో శ్రీరామచంద్రుడు
సీతాలక్ష్మణులతో కలిసి ఆ కుటీరమున ప్రవేశించెను. మహా తేజస్వియగు శ్రీరామచంద్రుడు
మనస్సునందు మహాదానందముపొందెను.
అంతట సుమంత్రుడు అయోధ్యకు వెళ్ళెను. దశరథమాహారాజువద్దకు వెళ్లి నమస్కరించి
శ్రీరామచంద్రుడు చెప్పమన్న విషయములన్నియు చెప్పెను. అంతట దశరథమహారాజు కన్నేరుకార్చుచూ, ఇట్లనెను:
న సుహద్భిర్న చామాత్యైర్మంత్రయిత్వా సనైగమైః
మయాయ మర్ధః సమ్మోహాత్ స్త్రీహేతోః సహసాకృతః 145
నేను విజ్ఞులతోను, మిత్రులతోనూ, మంత్రులతోను, సమాలోచన చేయక మొహావేశమున
కేవలము ఒక స్త్రీ కోరికతీర్చుటకు ఇంతటి అనర్థమైన కార్యమును చేసితిని.
అంతట, కౌసల్య, దశరథమహారాజు భార్య, గద్గదస్వరముతో ‘మీరు యోగ్యులయినవారిని ఆలోచనలేకుండా వనములకు పంపిరి’ అనెను.
శోకో నాశయతేధైర్యం శోకోనాశయతే శ్రుతం
శోకోనాశయతేసర్వం నాస్తి శోకసమో రిపుః 1 46
శోకము ధైర్యము నశింపజేయును. శోకము శాస్త్రజ్ఞానమును నశింపజేయును. శోకము
సమస్తమును నశింపజేయును. కనుక శోకమునకు సమమయిన శత్రువు లేడు.
అంతట దశరథమహారాజు తన భార్య కౌసల్య తో ఇట్లనెను.
యదాచరతి కల్యాణి శుభంవా యది వాశుభం
తదేవ లభతే భద్రే కర్తా కర్మజ మాత్మ నః 147
కల్యాణి, మనుష్యుడు శుభముగాని, అశుభముగాని, అగు ఏ కర్మను చేయునో, ఆ కర్మయొక్క ఫలస్వరూపముగా
సుఖముగాని, దుఃఖముగాని ఆ కర్తకు సంప్రాప్తమగును.
గురులాఘవ మర్థానామారంభే కర్మణాం ఫలం
దోషంవా యో న జానాతి సబాల ఇతి హోచ్యతే 148
కర్మ ఫలము గురుత్వము లేదా లఘుత్వము అని రెండువిధములుగా ఉందును. వాటిని
తెలియనివాడును, ఆ కర్మలవలన లాభము కలగవచ్చు లేదా గుణము కలుగును లేదా హానికలగవచ్చు. అది తెలియని
వాడు బాలుడు అనిచేప్పబడును. అనగా తెలివిహీనుదని అర్థము.
అవిజ్ఞాయ ఫలం యోహి కర్మత్వేవానుధావతి
స శోచేత్ ఫలవేలాయాం యథా కిం శుకశేచకః 149
చేయబోవు కర్మయొక్క ఫలమును గూర్చి జ్ఞానము ఉండాలి. విచారణ చేయకుండా పనివెంట
పరిగెత్తకూడదు. అట్టివాడికి ఎండిపోయిన చెట్టుకి నీరు పోసినట్లు శోకము కలుగును.
తదిదం మేను సంప్రాప్తం దేవి దుఃఖం స్వయంకృతం
సమ్మోహాదిహ బాలేన యథా స్యాద్ భక్షితం విషం 15౦
దేవీ, పూర్వపు దుష్కర్మపలితము నాకు ఈ మహాదుఃఖ రూపమున సంప్రాప్తమయినది. పిల్లవాడు
తెలియనితనముతో విషమును త్రాగినను అది
అతనిని చంపుతుంది. అదేవిధముగా పూర్వము
నేను తెలియక చేసిన తప్పుయొక్క కర్మఫలము ఇప్పుడు అనుభవించవలసి వచ్చిందే.
అటుపిమ్మట దశరథమహారాజు శ్రీరాముని గురించి విలపిస్తూ తన మిగిలిన ఇద్దరు
భార్యలయిన కౌసల్య, సుమిత్రల వద్ద తన ప్రాణము
వదిలేను. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, మహా యశస్వి అయిన జాబాలి రాజపురోహితుడయిన వశిష్టుని ఎదురుగా కూర్చోని, మంత్రులతో తమతమ అభిప్రాయములను ఈ
విధముగా పంచుకొనిరి. వారు యిట్లనిరి:
నరాజకే జనపదే స్వకంభవతి కస్యచిత్
మత్స్యా ఇవ జనా నిత్యం భక్షయంతి పరస్పరం 151
వారు వశిష్టునీతో ఈ ప్రకారముగా చెప్పెను: రాజులేని రాజ్యములో ఎవ్వడికైనా ఏవస్తువుఅయినా
యెట్లు దొరుకుతుంది? మత్స్య న్యాయము ప్రకారము
మత్స్యములు ఒకటి మరియొదానిని ఎట్లుతినివేయునో, అట్లే రాజులేని దేశములోనిజనులు మరియొకరిని బాధించుచునే ఉందురు.
రాజా సత్యంచ ధర్మశ్చ రాజా కులవతాం కులం
రాజా మాతా పితాచైవ రాజా హితకరో నృణాం 152
రాజే సత్యము, రాజే ధర్మము, రాజే కులవంతులకు కులము, రాజే తల్లి, రాజే తండ్రి,
రాజే మనుజులకు హితముచేయువాడు
అయిఉన్నాడు.
వారివాక్యములను వశిష్టుడు ఈ ప్రకారముగా చెప్పెను: దశరథ మహారజు భరతునికి రాజ్యమునొసంగెను. ఆ
భరతుడు, తనసోదరునితో కలిసి మామగారింటికి వెళ్ళెను. వారిరువురుని పిలుచుకొనివచ్చుటకై
వశిష్టుడు దూతలను పంపెను. మామగారి ఇంటి
నుండి వచ్చిన భరతునితో తల్లి కైకేయి కుశలములు ఇట్లడిగెను. మీ మాగారు యథాజిత్తు క్షేమమా? నీవు క్షేమముగా ఉన్నావా? భరతుడు అన్నిటికి సమాధానము
చెప్పెను. తత్తదుపరి భరతునికి తండ్రిగారి మరణవృత్తాంతమును సవివరముగా
చెప్పెను. దానికి భరతుడు తండ్రిగారి అంతిమ సందేశమునుగురుంచి అడిగెను. దానికి తల్లికైకేయి ఇట్లనెను: శ్రీరాముని
పట్టాభిషేకము జరుగవలసిఉన్నది. నేను నీ కొరకై మీ తండ్రిగారు నాకు ఇదివరలో
వాగ్దానమొనర్చిన రెండు వరములకు బదులుగా 1)భరతుని పట్టాభిషేకము, 2)శ్రీరాముని పదునాలుగు సంవత్సరములు సీతాసమేతముగా వనవాసమును, రెండువరములుగా ఇప్పుడు నేరవేర్చమని కోరితిని. నాయనా, భరతా, నీ హితముకోరి నీను ఈ రెండువరములను కోరితిని. శ్రీరాముడు సత్యవాక్యపరిపాలకుడు.
అందువలన తన సతి అయిన సీతాసమేతముగా అరణ్యములకు బయలుదేరెను. నేను కూడా అన్నవెంట
అరణ్యములకు వేళ్ళెదనని లక్ష్మణుండు కూడా సీతారాముల వెంట వెళ్ళెను. మహారాజు
పుత్రవియోగముతో పరలోకవాసి అయ్యెను. నాయనా అంతయు నీ కొఱకే చేసితిని. అని తల్లి
కైకేయి చెప్పెను.
తల్లి కైకేయి మాటలు విని భరతుడు శోక సంతప్తుడయ్యెను. తల్లితో ఇట్లు పలికెను.
నన్వార్యోపి చే ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమాం
వర్తతే గురు వృత్తిజ్ఞో యథా
మాతరివర్తతే
153
తన అగ్రజుడయిన శ్రీరాముడు గురుజనులయదల
యెట్లు మెలగవలెనో చక్కగా తెలిసినవాడు. తల్లియడల యెట్లు మెలగవలెనో తెలిసినవాడు.
కనుకనే, అట్టి ఉత్తమ ప్రవర్తనను నీ యదలకూడా చూపెను.
నా పెత్తల్లి కౌసల్యాదేవి సత్యధర్మపరాయిణి. నీ యడల సోదరీ భావము
కలిగియున్నది. అందరికంటే పెద్దవానికి రాజ్యాభిషేకము చేయుట శాస్త్ర సమ్మతము. చిన్నవాళ్ళు పెద్దవాడి ఆజ్ఞాన ఆచరించుట ధర్మము.
తల్లీ, నీ స్వభావము ధర్మవిరుద్ధమయినది. నేను నీ కోరికను ససేమిరా నెరవేర్చలేను. తల్లీ, ప్రాణాంతకమయిన గొప్ప విపత్తును తెచ్చిపేట్టినావు.
నివర్తయిత్వా రామం చ తస్యాహం దీప్తతేజసః
దాసభూతో భవిష్యామి సుసితేనాన్తరాత్మనా 154
తేజస్సుతో వెలుగొందు నా అన్న శ్రీరాముని తిరిగి తీసుకొని వచ్చెదను. ఆయనకు
దాసుడనయి జీవితమును హాయిగా గడిపెదను.
శోకసంతప్తుదయిన భరతునితో వశిష్టుడు ఇట్లు పలికెను.
ఆలం శోకేన భద్రం తే రాజపుత్ర మహాయశః
ప్రాప్తకాలం నరపతేః కురు సంయానముత్తమం 155
మహాకీర్తిమంతుడవయిన రాజకుమారా, నీకు శుభమగుగాక. శోకమును
వదిలి వేయుము. దానివలన ప్రయోజనములేదు. ఇప్పుడు యుక్తమయిన కర్తవ్యముపై ధ్యాస
పెట్టుము. దశరథ మహారాజు దహన సంస్కారములు
గావింపుము. వాటికి కావలసిన ఏర్పాట్లు చేయించుము.
భరతుడు రాజపురోహితుదయినా వశిష్టునికి నమస్కరించి, తండ్రి ప్రేతకర్మకి కావలసిన ఏర్పాట్లు గావించెను. తండ్రి పార్థివ శరీరమును
శ్మశానమునకు తీసికొని వెళ్ళెను. తండ్రి శరీరమును అగ్నికి ఆహుతిచేసేను. దశాహము కూడా
శాస్త్రోక్తముగా నెరవేర్చెను. పదకొండవ రోజున స్నానమాచరించి ఏకాదశాహ శ్రాద్ధము
గావించెను. పన్నెండవ రోజున తక్కిన కర్మలను
ఒనర్చెను. అటుపిమ్మట విపరీత దుఃఖముతోకూదినే భరతుని ఓదార్చుతూ, వశిష్టులు యిట్లనిరి.
త్రీణి ద్వంద్వాని భూతేషు ప్రపృత్తాన్య విశేషతః
తేషు చాపరిహార్యేషు నైవం భవితుమర్హసి 156
మూడు ద్వంద్వములు. అవి: ఆకలిదప్పులు, శోకమోహములు, జరామరణములు. ఈ మూడు ప్రాణులకు వారివారి కర్మానుసారము కలుగుచుండును. వాటిని
అడ్డుకొనుట అసంభవము.
పిమ్మట వశిష్టుడు మరియు పెద్దలందరు భరతునితో యిట్లనిరి. మన రాజు పుత్రశోకముతో
తనువువీడిరి. శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు, లక్ష్మణుడు వనములకేళ్ళిరి. ప్రస్తుతము
రాజ్యమునకు రాజులేడు. మీ తండ్రి దశరథుడు రాజ్యము మీ కప్పగించిరి. మీరు అధికారము
గైకొనుడు. అందులో తప్పులేదు. దానికి ప్రతిగా భరతుడు ఇట్లనెను.
రామః పూర్వో హినోభ్రాతా భవిష్యతి మహీపతిః
అహం త్వరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచచ 157
శ్రీరామచంద్రమూర్తి నాకు అగ్రజుడు. అతడే రాజు అవదగినవాడు. కావున ఆయనకి బదులుగా
వనమందు పదునాలుగుసంవత్సరములు ఉండెదను.
భరతుడు వారితో ఇట్లనెను: విశాలమగు సైన్యమును సిద్ధపరచుడు. నేను నా
అగ్రజుడయిన శ్రీరామచంద్రమూర్తిని
వనములనుండి తిరిగి తీసుకొని వచ్చెదను.
చరితబ్రహ్మచర్య స్య విద్యాస్నాతస్య ధీమతః
ధర్నేప్రయతమాన స్యకోరాజ్యం మద్విధో హరేత్ 158
గురుదేవా, ఎవడు బ్రహ్మచర్యమును పాలించేనో, సమస్త విద్యలయందు
నిష్ణాతుడో, ఎవడునిత్యం సత్య ధర్మపాలకుడో, అట్టి శ్రీరాముని రాజ్యమును
యెవ్వడు అపహరించును?
జ్యేష్ఠః శ్రేష్ఠశ్చ ధర్మాత్మా దిలీప నహుషోపమః
లబ్ధుమర్హతి కాకుత్థ్సో రాజ్యం దశరథో యథా 159
శ్రీరాముడు ధర్మాత్ముడు. నాకు అగ్రజుడు. ఆయన దిలీపుడు, నహుషుడు మొదలగువారివలె తేజస్వి. కనుక దశరథునివలె ఆయనే ఈ రాజ్యమును పొందుటకు
అధికారి.
అనార్యజుష్టమస్వర్యం కుర్యాం పాపమహం యది
ఇక్ష్వాకూణామహం లోకే భవేయం కులసాంసనః 16౦
పాపమును నీచులు ఆచరింతురు. పాపులు నిశ్చయముగా నరకములో పడుదురు. అగ్రజుడయిన
శ్రీరాముని రాజ్యమును తీసుకొని పాపాచారణమును ఎట్లుచేయగలను? చేసినచో ఇక్ష్వాకు వంశమునకు
అప్రతిష్ట అగును.
రామమేవాను గచ్ఛామి స రాజా ద్విపదాం వరః
త్రయాణామపి లోకానాం రాఘవో రాజ్యమర్హతి 161
నేను నా అగ్రజుడు శ్రీరామునే అనుసరించెదను. మనుజశ్రేష్ఠుడగు శ్రీరాముడే రాజు.
అతడే ముల్లోకములకును రాజు అవ్వదగినవాడు.
భరతుడు ఇట్లనెను. నేను శ్రీరాముని తీసుకొని రాకపోయినచో నేను కూడా లక్ష్మణుని
మార్గామునే అనుసరించెదను. నేను ఈ సభాసదుల ఎదుట ప్రతిజ్ఞ చేసిచెప్తున్నాను.
ఇట్లుచెప్పి మంత్రి సుమంతునితో ఇట్లనెను. సుమంతా! నీవు వనమునకు వెళ్ళుటకు సేనను
ఏర్పాటు చేయుము. తత్తదుపరి ప్రాతఃకాలమున శ్రీరాముని దర్శించు అభిలాషతో సైన్యముతో
బయల్దేరి వెళ్ళెను. మంత్రులు, పురోహితులు ఆయనను
అనుసరించిరి.
మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వ దృఢవ్రతం
కదా ద్రక్ష్యామహే రామం జగతః శోకనాశనం 162
మేఘముమాదిరి శ్యామవర్ణము గలవాడును, మహాబాహువును, స్థితప్రజ్ఞుడును, దృఢవ్రతుడును, ప్రపంచముయొక్క
నశింపజేయువాడును అగు శ్రీరాముని ఎప్పుడు దర్శింతునా యని ఆతృతచెంద సాగెను.
భరతుడు సేనాసమేతముగా శృంగావేరపురమున గంగానదిఒడ్డునకు చేరిరి. అక్కడ గుహుడు తన
పరివారముతో కలిసి వచ్చి చేరిరి. గుహుడు భరతుని ఆ రాత్రికి అక్కడుండమనియు మరియు తన
అతిథి సత్కారములను గైకొని వెళ్ళమని భరతుని అతని రాజపరివారమును వేడుకొనెను. దానికి
ప్రతిగా భరతుడు, ఇప్పుడు తాను ఉండలేననియు, తాను శ్రీరాముని అయోధ్యకు
తీసుకొనివచ్చుటకు వెళ్తున్నాననియు, అదియునుగాక శ్రీరాముడు సీతా
లక్ష్మణులతో కలిసి వనములలో సంచరించుచు నేలమీద పడుకొనిఉంటూ ఉండగా తాను
పట్టెమంచముమీద పడుకోవటము సమంజసముగా లేదని చెప్పెను. దానికి గుహుడు సంతోషముతో భరతునితో ఇట్లనెను.
ధన్యస్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీ తలే
అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తుమహేచ్ఛసి 163
మీకుసమానమయిన నేను ఇంతవరకు చూడలేదు. మీరు
అయాచితముగా చేతికి వచ్చిన రాజ్యమును త్యజించదలచారు. మీవంటి ధర్మాతుడు మరియొకడు ఈ భూమి మీద
ఉండరు. మీరు ధన్యులు.
అటుపిమ్మట భరతుడు భరద్వాజుని తన సేనతో, పురోహితుదయినా వశిష్టునితోను, కలిసి దర్శించెను. భరద్వాజుడు వారిని
అర్ఘ్యపాద్యాడులచే ఆహ్వానించెను. భరతుడు వశిష్టుని పాదములకు నమస్కరించెను. విషయము తెలిసిన భరద్వాజమహర్షి భరతునితో
ఇట్లనెను.
త్వయ్యేతత్ పురుషవ్యాఘ్ర యుక్తం రాఘవ వంశజే
గురువృత్తిర్దమశ్చైవ సచివ సాధూనాం చానుయాయితా 164
పురుషసింహమా, నీవు రఘువంశమున
జన్మించితివి. కావున నీకు, గురుజనులసేవ, ఇంద్రియనిగ్రహము, పవిత్రులగు మహాత్ములను
అనుసరించుట—అను ఈ ధర్మములుండుట సముచితమే అగును.
భరద్వాజమహర్షి భరతునితో ఇట్లనెను.
నేను శ్రీరామ సేతాలక్ష్మణులు ఉండుచోటును ఎరుగుదును. ఆయన చిత్రకూటపర్వతముమీద
ఉన్నాడు. ఈ రాత్రి రాజపరివార సమేతముగా ఉండండి. మహర్షి కోరికప్రకారము ఆ రాత్రి
భరతుడు భరద్వాజుని ఆశ్రమములో గడిపెను.
మరునాడు ఉదయమే ఆయన ఆజ్ఞ గైకొని చిత్రకూటపర్వతము దారి తెలుసుకొని వెళ్ళెను. ఆ పర్వతము
సమీపములో ఉత్తరమువైపు మందాకినీ నది యున్నది. అక్కడ సెలయేళ్ళు, వనము మనోహరముగా ఉండెను. ఆ మందాకినీ నది మరియు చిత్రకూటపర్వతము మధ్యభాగముననున్న
శ్రీరాముని పర్ణశాలకు వెళ్ళెను.
న దోషేణావగం తవ్యా కైకేయీ భరతత్వయా
రామప్రవ్రాజనం హేతత్ సుఖో దర్కం భవిష్యతి 165
భరతా, నీవు కైకేయి యెడల దోషమును కలిగియుండకము.
శ్రీరాముని వనవాసము మున్ముందు చాలా మేలు కలగజేయును.
దేవానాం దానవాంచ ఋషీనాం భావితాత్మనాం
హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రాజనాదిహ 166
శ్రీరాముడు వనవాసముచేయుతవలన దేవతలకు, రాక్షసులకు, ఋషులకు, ఈ ప్రాపంచమున మేలేకలుగును.భరతుడు భరద్వాజుని ఆజ్ఞనుగైకొని ముందుకు
రాజపరివారముతో నడిచేను. ఇక్కడ శ్రీరాముడు తన సతి సీతాఅమ్మవారికి చిత్రకూట శోభను
చూపదొడంగెను. లక్ష్మణుడు భరతుని సేనను
చూసి క్రోధముచెందెను. అన్న శ్రీరాముడు లక్ష్మణుని శాంతపరచెను.
పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాహవే
కిం కరిష్యామి రాజ్యేన సాపనాదేన లక్ష్మణా 167
లక్ష్మణా, పితృ వాక్య పరిపాలనకై, సత్య ధర్మ రక్షణకై ప్రతిజ్ఞ
చేసిననేను, యుద్ధమున భరతుని జంపి రాజ్యము తీసుకొనినచో ప్రపంచము నన్ను ఎంతగా నిందించును.
అట్టి కళంకిత రాజ్యమును గైకొని నేనేమి చేయుదును?
యద్ ద్రవ్యం బాన్ధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్
నాహం తత్ ప్రతి గృహ్ణీయాం భక్ష్యాన్ విషకృతానివ 168
బంధువులను, మితృలను నాశమొనర్చి లభ్యమగు ధనము విషము కలిపిన అన్నము వంటిది. అట్టి దానిని
నేను ఎన్నడు స్వీకరించను.
ధర్మమర్థం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణా
ఇచ్ఛామి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమి తే 169
లక్ష్మణా, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ధర్మము, అర్థము, కామము, ఈ రాజ్యము, వీటిని కీ కొరకే అపేక్షించుచున్నాను.
భ్రాతృణాం సంగ్రహార్థం చ సుఖార్థం చాపి లక్ష్మణా
రాజ్యమప్యహ మిచ్ఛామి సత్యేనాయుధమాలభే 17౦
లక్ష్మణా, కేవలము నా సోదరుల సుఖ సంరక్షణకై రాజ్యమును కోరుచున్నాను. నా ధనుస్సును త్రాకి
నిక్కముగా చెప్పుచున్నాను.
నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగారాంబరా
న హీచ్ఛేయ మాధర్మేణ శక్రత్వమపి లక్ష్మణా 171
లక్ష్మణా, సాగరముచే చుట్టబడిన ఈ భూమండలము నాకు దుర్లభమైనది ఏమీ కాదు. కాని అధర్మమార్గమున ఇంద్రపదవికూడా నేను కోరను.
యది వినా భరతం త్వాం చ శతృఘ్నం వాపి మానద
భవేన్మమ సుఖం కించిద్ భస్మ తత్ కురుతాం శిఖీ 172
లక్ష్మణా, నా సోదరులయిన భరతుడు, శత్రుఘ్నుడు, మరియు నిన్ను విడచి నేను ఏ సుఖమూ కోరను. కోరినచో దానిని అగ్ని కాల్చి
భస్మీపటలముచేయుగాక.
మామగారి ఇంటినుండి అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు కేవలము నన్ను కలవటము కోసరము
వచ్చియుండవచ్చు. అంతకి మించి అతని రాకలో ఏ దురుద్దేశము ఉండదు.
నహి తే నిష్ఠురం వాచ్యో భరతో నా ప్రియం వచః
అహం హ్యప్రియ ముక్తః స్యాం భరతస్యాప్రియే కృతే 173
భరతునితో నీవు కఠోరవాక్యముగాని, అప్రియ వచనము గాని
పలుకవద్దు. నీవు అతనితో చేయు అప్రియ సభాషణ
నాతొ చేసినట్లే భావింపుము.
కథం ను పుత్రాః పితరం హన్యుః కస్యాం చిదాపది
భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః 174
లక్ష్మణా, ఎంతటి విపత్తు వచ్చినా, కొడుకు తండ్రిని యెట్లు
చంపగలదు? లేక, సోదరుడు తన అగ్రజుని యెట్లు చంపగలదు?
సా చిత్రకూటే భరతెన సేనా ధర్మం పురస్కృత్య విధూయ దర్పం
ప్రసాదనార్థం రఘునందనస్య వీరోచతే నీతిమతా ప్రణీతా 175
అక్కడ నీతిమనుదయినా భరతుడు ఎల్లప్పుడూ ధర్మమును పురస్కరించుకొని, నిగార్వియై, శ్రీమచంద్రుని ప్రసన్నము చేయుట కొరకు, ఏ సైన్యమును వెంట తెచ్చుకొనేనో, అది చిత్రకూట పర్వతముయొక్క
సమీపమున, లెస్సగా ప్రకాశమానము చెందుచుండెను.
సేనను అక్కడనిలిపి, భరతుడు తన సహోదరుడు
శత్రుఘ్నునితో ఇట్లనెను. నేను అగ్రజుడయిన శ్రీరాముని సీతా అమ్మవారు మరియు
లక్ష్మణునితో సహా చూడగలుగుతానో అప్పుడు నాకు శాంతి లభించును.
నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతోగురుం
ఉటజే రామమాసీనం జటామణలధారిణం 176
అటుపిమ్మట భరతుడు శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు మరియు లక్ష్మణస్వామి నివసిచు కుతీరమునకుచేరెను. అక్కడ
ప్రకాశవంతమైన వారి ముఖమందమందలమును దర్శించెను.
సోదరుని చూచి విలపిస్తూ ఇట్లనెను: అయ్యో, అన్నగారికి నా కారణముగా యెంత కష్టము వచ్చినది. శ్రీరామచంద్రమూర్తి పాదములకు
నమస్కరించి అక్కడ కూలబడిపోయెను. ఇట్లా
అని భరతుడు విలపించసాగెను. దానికి శ్రీరాముడు భరతుని ఒడిలో కూర్చుండబెట్టుకొని
ఓదార్చెను. సాంత్వన పరచెను. సాదరవాక్యములు పలికెను. తండ్రి దశరథుని కుశలము
అడిగెను.
స కచ్చిద్ బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్యో మహాద్యుతిః
ఇక్ష్వాకూణా ముపాథ్యాయో యథావత్ తాత పూజ్యతే 177
నాయనా, భరతా, ఇక్ష్వాకువంశమునకు గురువును, సదా ధర్మతత్పరుడును, విద్వాంసుడును, బ్రహ్మజ్ఞానియు, మహాతేజస్వియునగు వశిష్టమహర్షిని యథావిధిగా పూజించుచున్నావా?
తత్తదుపరి తల్లి కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, మరియు కైకేయి దేవిల కుశలములడిగెను.
కచ్చిద్ దేవాన్ పితౄన్ భృత్యాన్ గురూన్ పితృసమానపి
వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభి మన్యసే 178
నాయనా, భరతా, దేవతలను, పితృ సమానులగువారిని, సేవకులను, గురువులను, పెద్దలను, వైద్యులను, బ్రాహ్మణులను, అందరినీ ఆదరముగా
చూచుచుంటివా?
కచ్చిన్న లోకాయతికాన్ బ్రాహ్మణాంస్తాత సేవేసే
అనర్థ కుశలాహ్యేతే బాలః పండితమానినః 179
నాయనా, భరతా, నాయనా నీవు నాస్తిక సహవాసముచేయుటలేదుకదా? ఎందుకనగా వారు నీ బుద్ధిని పరమాత్మనుంది మరల్చుటలో సిద్ధహస్తులు. వారు
నిజానికి అజ్ఞాను లయి యున్నను, వారికి వారు గొప్ప
పండితులుగా తలంతురు.
ధర్మ శాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః
బుద్ధిమాన్వీక్షిక్షీం ప్రాప్య నిరర్థం ప్రవదంతితే 18౦
నాస్తికుల జ్ఞానము వేదవిరుద్ధము. అందువలన దూషితము. ధర్మశాస్త్రములు
ప్రమాణభూతములు. వారు తార్కికముగా వ్యర్థవాదమునొనర్తురు.
కశ్చిద్ గురూంశ్చ వృద్దాంశ్చ తాపసాన్ దేవతాతిథీన్
చైత్యాంశ్చ సర్వాన్ సిద్దార్థాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి 181
గురుజనులకు, పెద్దలకు, తపస్వులకు, దేవతలకు, అతిథులకు, పవిత్ర వృక్షములకు, సిద్దార్థులకు, బ్రాహ్మణులకు, నమస్కరించుచున్నావా?
నాస్తిక్యమ్ అనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం
ఆదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితాం 182
ఏకచింతనమ్ అర్థానాం అనర్థజ్ఞైశ్చ
మంత్రణం
నిశ్చితానాం అనారంభం మంత్రస్యాపరిరక్షణం 183
మంగలాద్య ప్రయోగం చ ప్రత్యుత్థానం చసర్వతః
కచ్చిత్ త్వం వర్జయ స్యేతాన్ రాజదోషాం శ్చతుర్దశ 184
1) నాస్తికత్వము, 2) అసత్య సంభాషణ, 3)కోపము, 4)సోమరితనము, 5) ప్రతిపని ఎక్కువ
సమయముతీసికొనుట, 6)అజ్ఞానుల సాంగత్యములో ఉండుట, 7) అలసత్వము, 8) ఇంద్రియములకు వశమగుట, 9)రాజకార్యములను ఒంటరిగా
విచారించుట, 10) ప్రయోజనములేని విపరీతదృష్టిగల మూర్ఖులసలహా తీసికొనుట, 11) నిశ్చయింపబడిన కార్యములను శీఘ్రముగా ఆరంభించకుండుట,12) రహస్య సంభాషణములను బయటికి ప్రకటించుట, 13) శుభకార్యములను, పుణ్యకార్య ములను
అనుష్ఠింపకుండుట, శతృవులందరిపైన ఒకేసారి దండెత్తుట,-- అను రాజుయొక్క పదునాలుగు దోషములను సదా
పరిత్యజించుచుంటివా?
కచ్చిదేషైవతే బుద్దిః యథోక్తా మమ రాఘవ
ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థసంహితా 185
రఘునందుడవైన భరతా, నేను ఏది చెప్పితినో
నీబుద్ధికి గూడా అదియే తట్టినది కదా. ఎందుకంటె అట్టి విచారణ ఆయుస్సును, కీర్తిని, అభివృద్ధిని పెంపొందించునదియు, ధర్మార్థ కామములను
సిద్ధింపజేయునదియు అయియున్నది.
యా వృత్తిం వర్తతే తాతోయాంచ నః ప్రపితామహః
తాం వృత్తిం వర్తసే కచ్చిద్ యా చ సత్పథగా శుభా 186
మన తండ్రులు, తాతలు ఏ వృత్తిను ఆచరించిరో, సజ్జనులు దేనిని సేవించిరో, ఏది శ్రేయస్సుకు మూలమో
దానినే నీవు పాలిచుంచున్నావా? ఆచరించుచున్నవా?
కచ్చిత్ స్వాదుకృతం భోజ్యమేకో నాశ్నాసి రాఘవ
కచ్చిదాశం సమానేభ్యో మిత్రేభ్యః సంప్రయచ్ఛసి 187
నీవు రుచికరమైన పదార్థములను ఒంటరిగా తినుటలేదుకదా. స్నేహితులతో పంచుకొని
తినుచుంటివా?
భరతుడు బలవంతముగా దుఃఖోద్వేగమును అణచుకొని శ్రీరామునితో ఇట్లనెను. అగ్రజా, నాకీ రాజ్యము అక్కరలేదు. ఈ రాజ్యభారము నేను మోయలేను. దయతో రాజ్యము స్వీకరించి
నన్ను క్రుతార్థుడ్ని చేయుము. తత్ పశ్చాత్ శ్రీరాముడు భరతుడ్ని కౌగిలించుకొని
ఇట్లు చెప్పెను.
కులీనః సత్వ సమన్న స్తేజస్వీ చరితవ్రతః
రాజ్యహేతోః కథం పాపమాచరేన్మద్విదో జనః 188
సోదరా, నీవే చెప్పుము. కులీనుడైనట్టియు, సత్వగుణ సంపన్నుడైనట్టియు, తెజస్వియు, శ్రేష్ఠ వ్రతములను ఆచరించునట్టియు, నా వంటి వ్యక్తి రాజ్యము కొరకై తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించుట అను పాపమునకు
ఒడికట్టగలడు?
యావత్ పితరి ధర్మజ్ఞ గౌరవం లోకసత్కృతే
తావద్ ధర్మకృతాం శ్రేష్ఠ జనన్యామపి గౌరవం 189
ధర్మజ్ఞుడవు, శ్రేష్ఠుడవు అయిన భరతా, ప్రపంచము లోనే గౌరవనీయుడయిన
తండ్రియందు ఎట్టి గౌరవము ఉండునో, అట్టి గౌరవమే తల్లియందు
ఉండవలెను.
ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్ఛేతి రాఘవ
మాతా పితృభ్యాముక్తోహం కథమన్యత్ సమాచరే 190
భరతా, అట్టి ధర్మశీలురగు తల్లితండ్రులు నన్ను నా భార్యతో సహా అరణ్యములకు పొమ్మని
నాకు ఆజ్ఞ ఇచ్చారు. వారి ఆజ్ఞకు విరుద్ధముగా నేను ఏ పనిఅయినా యెట్లు చేయగలను? చేయలేను. అట్లుచేస్తే అది ధర్మవిరుద్ధమగును.
సౌమ్యుడా, పదునాలుగు సంవత్సరములు వనములలో నివసించిన తదుపరి తండ్రిచే నొసంగబడిన రాజ్యమును
తిరిగి ఎటుల అనుభవించగలను?
యదబ్రవీన్మాం నరలోకసత్కృతః పితామహాత్మా విబుధాధీపోపమః
తదేవమన్యే పరమాత్మనో హితంన సర్వలోకేశ్వర భావమవ్యయం 191
ఈ భూలోకమున పూజనీయుడు, దేవరాజగు ఇంద్రునివలె
గౌరవనీడు అయిన ఇంద్రునివలె మహాత్ముడయిన మన తండ్రిగారు వనవాసముచేయమని
ఆజ్ఞనొసంగిరి. దానినే నేను పరమహితకారిగా
తలంచుచున్నాను. వారి ఆజ్ఞకు విరుద్ధముగా
బ్రహ్మపదవినికూడా నేను ఆశించను. అది నాకు శ్రేయస్కరము కాదు.
తదుపరి తేజస్వి అగు శ్రీరామచంద్రమూర్తి మందాకినీ నడిజలమున స్నానముచేసేను.
తీరమునకు వచ్చి సోదరునితో కలిసి పిండప్రదానము గావించెను. అనంతరము దశరథ మహారాజు
ముగ్గురు భార్యలు ముందర నడుస్తూ ఉండగా, వశిష్టమహర్షి శ్రీరాముని దర్శనాభిలాషియై ఆయన ఆశ్రమమునకు బయల్దేరేను.
తాసాం రామః సముత్థాయ జగ్రాహ చరనామ్బుజాన్
మాతౄణాం మనుజవ్యాఘ్రః సర్వాసాం సత్యసంగరః 192
సత్యనిష్ఠా గరిష్టుడగు శ్రీరాముడు తల్లులను చూసి లేచి నిలబడి వారి పాదములను
స్పర్శించెను.
బ్రువంత్యామేవ మార్తాయాం జనన్యాం భర్తాగ్రజః
పాదావాసాద్య జగ్రాహ వశిష్ఠస్య చ రాఘవః 193
శోకముతో కూడిన కౌసల్యాదేవి సీతమ్మను చూచి దుఃఖించుచుండెను. అంతట భరతాగ్రజుడగు
శ్రీరాముడు వశిష్టుని పాదములపైబడెను. ఆ పాదములు రెండింటినీ చేతులతో పట్టుకొనెను.
దుఃఖితుడై విలపించుచున్నఅనుజుడు భరతుని ఓదార్చుతూ శ్రీరామచంద్రమూర్తి
ఇట్లనెను.
సర్వే క్షయాంతా నిచయాః పతనాన్తాః సమృచ్ఛయాః
సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితం 194
సోదరా, పదార్థముల సంగ్రహములన్నిటియొక్క అంతము వినాశమే అయిఉన్నది. సంయోగముయొక్క అంతము
వియోగమే అయిఉన్నది. జీవితముయొక్క అంతము మరణమే అయియున్నది.
యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్ భయం
ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్ భయం 195
పండిన ఫలము పతనంచే తప్ప మరిదేనికీ భయము ఉండదు,. అదేవిధముగా జన్మించిన మనుజునకు మృత్యువుచేతప్ప మరి ఇంక దేనితోను భయములేదు.
ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ వసూనిచ
సమేత్య వ్యవధావంతి ద్రువోహేషాం వినా భవః 196
మహాసముద్రమునందు కొట్టుకొని పోవు రెండు కట్టెపుల్లలు ఒకప్పుడు కలుస్తూ, ఒకప్పుడు విడిపోవుచుండునో, అదేప్రకారముగా భార్య, పుత్రులు, బంధువులు, ధనము ఒకప్పుడు దగ్గిరకి వచ్చును, ఒకప్పుడు వేరైపోవును. వీటియొక్క వియోగము నిశ్చయమైయున్నది.
యథాగారం దృఢస్థూణం జీర్ణం భూత్వోససీదతి
తథావసీదంతి నరా జరామృత్యువశం గతాః 197
దృఢమైన స్తంభములు గల ఇల్లు కూడా పాతబడినచో పడిపోవును. అదేవిధముగా మనుజుడు
వార్ధక్య, మరణములయొక్క వశమందు పడు ను.
నశించిపోవును.
అత్యేతి రజనీ యా తు సా న ప్రతినివర్తతే
యాత్యేవ యమునా పూర్ణం సముద్రముదకార్ణవం 198
నాయనా భరత, గడచినా రాత్రి తిరిగి రాదు. జలముచే నిండియున్న యమునానది సముద్రమువైపు
వెళ్ళును. తిరిగిరాదు.
అహోరాత్రాణి గచ్ఛంతి సర్వేషాం ప్రాణినామిహ
ఆయూంషి క్షపంతాశు గ్రీష్మే జలమివాంశవః 198
సమస్త ప్రాణులమాదిరి పగలు రాత్రి
వెళ్ళిపోతున్నాయి. సూర్యకిరణములు గ్రీష్మ ఋతువునందు సూర్యతాపము మాదిరి, అహోరాత్రములు ఈ ప్రపంచమునందలి సమస్త ప్రాణికోట్ల ఆయుస్సును హరించును.
ఆత్మానమనుశోచ త్వం కిమన్య మనుశోచసి
ఆయుస్తు హీయతే యస్య స్థితస్యాస్య గతస్యచ 199
భరతా, నీవు నీ కొఱకే చింతింపుము. ఇంకొకరిగురించి ఎలా మాటి మాటికి శోకించు చున్నావు? ఎక్కడ ఉన్నను, ప్రతివాని వయస్సు నిరంతరమూ
క్షీణించుచుండునే ఉండును.
సహైవ మృత్యుర్వజతి సహమృత్యుర్నిషీదతి
గత్వా సుదీర్ఘమధ్వానం సహ మృత్యుర్నివర్తతే 200
ప్రతిప్రాణికి పుట్టుకతోనె మృత్యువు కూడావంట వచ్చును. ఆ ప్రాణితోబాటు
కూర్చొనును. దీర్ఘయాత్రయండు వానితోబాటుపోయి వానితో తిరిగివచ్చును.
గాత్రేషువలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః
జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్ 201
శరీరము ముడుతలు బడును. జుట్టు తెల్లబడును.
వార్ధక్యముచే నాశనమగు మనుజుడు ఏ
ఉపాయముతో తనను తాను తప్పించుకొనగలడు? తనప్రభావమును చాటుకొన గలడు?
నందన్త్యుదిత ఆదిత్యే నందన్త్య స్తమితే హని
ఆత్మనోనావ బుధ్యంతే మనుష్యా జీవితక్షయం 202
మనుష్యులు సూర్యోదయము కాగానే ఆనందపడుచున్నారు, సూర్యాస్తమయము కాగానే ఆనందపడుచున్నారు. కాని ప్రతిదినము తన జీవితమూ
తగ్గుచున్నదని ఎరుగకున్నారు.
హృష్యంతి ఋతు ముఖం దృష్ట్వా నవం నవమివాగతం
ఋతునాం పరివర్తేన ప్రాణినాం ప్రాణసంక్షయః 203
క్రొత్తగా వచ్చిన ఋతువును చూచి మనుజులు ఆనందపడుచున్నారు. కాని ఈ ఋతువుల మార్పే
ప్రాణుల ఆయుష్షు క్రమముగా క్షీణింపజేయుచున్నదని ఎరుగ కున్నారు ఈ మనుజులు.
యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహార్ణవే
సమేత్య తు వ్యపేయాతాం కాలమాసాద్య కంచనః 204
ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ వసూని చ
సమేత్యవ్యవధావంతి ధ్రువో హ్యేషాం వినా
భవః 205
ఏ విధముగా మహాసముద్రమున కొట్టుకోనిపోవుచున్న రెండు కాష్ఠములు అనగా కట్టెలు
ఒక్కొక్కప్పుడు కలుస్తూ మరియొక్కొక్కప్పుడు విడిపోవుచుండునో, అదేవిధముగా భార్యా, పుత్రులు, కుటుంబ సభ్యులు, బంధవులు, ధనము, క్షేత్రములు, ఒక్కొక్కప్పుడు
వద్దకుచేరును, మరియొక్కొక్కప్పుడు విడిపోవుచుండును. ఎందుకంటె వీటి సంయోగము వియోగము రెండూ
అవశ్యము.
నాత్రకశ్చిద్ యథాభావం ప్రాణీసమతివర్తతే
తేన తస్మిన్ న సామర్థం ప్రేతశ్యాస్త్యనుశోచతః 206
ఈ జగత్తులో ఏ ప్రాణీ కూడా యథాసమయములో ప్రాప్తించు జననమరణములను అతిక్రమించ
అసమర్థుడు. కావున చనిపోయిన వ్యక్తిగురించి
శోకించతగదు. ఎందుకంటె అతను తన మృత్యువును తప్పించుకొన అసమర్థుడు.
యథాహిసార్థం గచ్ఛంతం బ్రూయాత్ కశ్చిత్ పతిస్థితః
అహమపి ఆగమిష్యామి పృష్ఠతోభవతామితి 207
ఏవం పూర్వైర్గతో మార్గః పైత్రు పితామహైర్ద్రువః
తమాపన్నః కథం శోచేద్ యస్య నాస్తి వ్యతిక్రమః 208
ముందుపోవుచున్న యాత్రికులతో మార్గమందు నిలబడియున్న బాటసారి ‘నేను కూడా మీ వెంట వస్తున్నాను’ అని చెప్పి వారివెంట
ఎట్లుపోవునో, అదేవిధముగా పూర్వీకులగు తాతముత్తాతలు ఏ మార్గమున వెడలిరో ఆమార్గమునున్న
మనుజుడు మరియొకనికొరకై ఏలశోకించును?
వయసః పతమానస్య స్రోతసో వా నివార్తినః
ఆత్మా సుఖే నియోక్తవ్యః సుఖభాజః ప్రజాః స్మృతాః 209
నీటిప్రవాహము వెనకకు మరలునట్లు దినదినము గడిచిపోవు జీవితము తిరిగిరాదు.
జీవితముక్రమశః నశించిపోవుచున్నాడని తలంచి మనస్సును శ్రేయస్సు యొక్క సాధనభూతమగు
ధర్మమందు నియోగించవలయును. ఎందుకంటే సర్వులును శ్రేయమునే కాంక్షించుచుండును.
భరతా, మన తండ్రియగు దశరథ మహారాజు సమస్త యజ్ఞములను ఆచరించెను. వారిపాపక్షయమయ్యి స్వర్గలోకమునకు వెడలిరి.
ఏతే బహువిధాః శోకా విలాపరుదితేతథా
వరనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమతా 210
ధీరుడు, ప్రజ్ఞావంతుడగు మనుజుడు అన్నిపరిస్థితులలోను, ఈ పలువిధములగు శోకమును, విలాపమును
వదిలివేయవలయును.
న మయా శాసనం తస్య త్యక్తుం న్యాయ్యమరిందమ
స త్వాయాపి సదా మాన్యః సవై బంధుః సనః పితా 211
శత్రు సంహారకుడవగు భరత, తండ్రి ఆజ్ఞను అతిక్రమించుట
నాకు సముచితము కాదు. వారు నీకూ సదా సమ్మాన యోగ్యుడు. ఎందుకంటె వారే మనకు హితైషి, బంధువు, మరియు జన్మదాత అయిఉన్నారు.
ధార్మికేణా నృశంసేన నరేణ గురువర్తినా
భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషతా 212
ధార్మికుడు, కౄరత్వరహితుడు, గురుజనుల ఆజ్ఞలను
పాలించువాడు, అయిన నరుడు మాత్రమె పరలోకముపై విజయమును పొందుటకు అర్హుడు.
ఆత్మానమనుతిష్ఠ త్వం స్వభావేన నరర్షభ
నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశ రథస్య నః 213
మనుజ శ్రేష్ఠుడవగు భరతా, మనతండ్రి పూజ్యుడు. శుభ
ఆచరణాపరుడు. అట్టిదృష్టిగల నీవు నీ ధార్మిక స్వభావముద్వారా ఆత్మోన్నతికొఱకై
ప్రయత్నింపుము.
దానికి భరతుడు, “అగ్రజా, ఈ ప్రపంచమున మీవలె ఎవరుండగలరు?
యథా మృతస్తథా జీవన్ యథా సతి తథా సతి
యనైష్య బుద్ధిలాభః స్యాత్ పరితప్యేత కేన సః 214
చనిపోయిన జీవునకు తన శరీరాదులతో సంబంధము ఏమియు లేనట్లు, మనిషి జీవించియుండగానే వాటితో సంబంధము
లేకుండా ఉండవలయును. అట్లాగే వస్తువు లేనపుడు దానిమీద రాగద్వేషములు ఉండవు. అట్లాగే
ఆ వస్తువు ఉన్నప్పుడుకూడా లేనట్లుగానే ఉండవలయును. ఇటువంటి వివేకబుద్ధి కలవాడికి
ఇంక విచారము యెట్లా కలుగును?
పరావరజ్ఞోయశ్చస్యాద్ యథా త్వం మనుజాధిప
స ఏవ వ్యసనం ప్రాప్య న విషీది తు మర్హతి 215
నరశ్రేష్ఠుడా, మీమాదిరి ఎవనికి
ఆత్మజ్ఞానము ఉండునో, అట్టివాడు దుఃఖములోకూడా
దుఃఖపడదు.
అమరూప మసత్వస్త్వం మహాత్మా సత్యసంగరః
సర్వజ్ఞః సర్వదర్శీ చ బుద్ధిమాంశ్చాసి రాఘవ 216
రఘనందనా, మీరు దేవతలు, సత్వగుణసంపన్నులు, మహాత్ములు, సత్యవ్రతులు, సర్వ జ్ఞులు, సర్వులకు సాక్షి, బుద్ధిమంతులు అయిఉన్నారు.
న త్వామేవం గుణైర్యుక్తం ప్రభావాభవకోవిదం
అనిషహ్యతమం దుఃఖమాసాద యితుమర్హతి 217
ఇట్టి ఉత్తమగుణములతో కూడియున్న మీరు, జన మరణముల రహస్యమును తెలిసికున్న మేరు, అట్టి మీవద్దకు అసహ్యమగు దుఃఖము రాజాలదు.
ప్రాణము పోయేముందర జీవులు జీవితముమీద మోహితులవుతారు. దశరథమహారాజు
కఠోరమగుకర్మనొనర్చి ఆ నానుడి నిజముచేసేను. మీరు నాకంటే ఎక్కువ శాస్త్రజ్ఞానము
కలవారు. వయస్సులోనూ మీరునాకంటే పెద్దవారు. మీరు ఉండగా నేను రాజ్యము పాలించుట
ధర్మవిరుద్ధము. ధర్మవిరుద్ధమైన పని నేను చేయను, చేయలేను. మీరు నా ప్రార్థన మన్నించండి. రాజ్యమును పాలించండి. లేనియడల మీవెంట
అరణ్యములకు నేను కూడా వచ్చెదను. సత్వగుణసంపన్నుడగు రఘునాథుడు తండ్రి ఆజ్ఞయందె
దృఢముగా నెలకొనియున్నాడు. నేను అయోధ్యకు వెళ్ళుటకు ఇష్ఠపడను. శ్రీరాముడు భరతునితో
ఇట్లనెను.
పున్నామ్నో నరకాద్ యస్మాత్ పితరం త్రాయతే మతః
తస్మాత్ పుత్ర ఇతిప్రోక్తః పితౄన్ యః సాతి సర్వతః 218
పుత్ అనే నరకమునుండి తండ్రిని పుత్రుడు ఉద్ధరించును. అందుకే అతనికి పుత్రుడు
అని పేరు. పితరులను సర్వవిధముల కాపాడువాడే కుమారుడు.
భరతా, బుద్దిమంతులలో మేటి అయిన శత్రుఘ్నుడు నీకు సహాయకుడుగా ఉండుగాక. సుమిత్రా
తనయుడయిన లక్ష్మణుడు నాకు సహాయ పడును. మన నలుగురము కలిసి అన్నివిధములా సత్య
ధర్మములను నిర్వర్తించెదము. నీవు దుఃఖించకుము. అప్పుడు భ్రాహ్మణ శిరోమణియగు జాబాలి
శ్రీరామునితో ఇట్లనెను.
కః కస్య పురుషోబంధుః కిమాప్యం కస్య కేనచిత్
ఏకోహి జాయతే జంతురేక ఏవ వినశ్యతి 219
ఈ ప్రపంచమున ఎవడు ఎవనికి బంధువు? ఎవడు ఎవనిచేత ఏమి పొందగలడు? జీవుడు ఒంటరిగా
జన్మించుచున్నాడు. ఒంటరిగా చనిపోవుచున్నాడు.
తస్మాన్మాతా పితాచేతి రామ సజ్జేత యోనరః
ఉన్మత్త ఇవ స జ్ఞేయో నాస్తి కద్ధి కస్యచిత్ 220
అందువలన శ్రీ రామచంద్రా, ఎవరిని తల్లి తండ్రియని
తలంచి ఎవరితోనయినా ఆసక్తి కలవాడగునో అట్టివానిని ఇతరులు పిచ్చివానిగా తలంచవచ్చును.
ఇక్కడ ఎవడు ఎవనికి ఏ సబంధము లేనివాడే.
యథా గ్రామాంతరం గచ్ఛన్ నరః కశ్చిద్
బహిర్వసేత్
ఉత్సృజ్య చతమావాసం ప్రతిష్ఠేతా పరే హని
ఏవమేవమనుష్యాణాం పితామాతా గృహం వసు
ఆవాసమాత్రం కాకుత్థ్స సజ్జన్తే నాత్ర సజ్జనాః 220
మనుజుడు ఇంకొక గ్రామమునకు వెడలునపుడు ఏ ప్రకారము ఒకానొక సత్రమునండు రాత్రి విశ్రమించి
తిరిగి ఉదయమే లేచి ముందుకు ప్రయాణమై పోవునో, అట్లే తల్లి, తండ్రి, ఇల్లు, ధనము, --ఇవి అన్నియు మనుజులకు ఆవాస మాత్రములే అయియున్నవి. వీటియందు సజ్జనులు ఆసక్తి
చూపరు.
జాబాలి మాటలు విని సంతసించినవాడై శ్రీరామచంద్రమూర్తి ఇట్లు పలికెను.
నిర్మర్యాదస్తు పురుషః పాపాచార సమన్వితః
మానం న లభతే సత్సు భిన్న చారిత్రదర్శనః 223
ధర్మము లేదా వేద పద్ధతిని వదిలివేయునట్టివాడు పాపకర్మమున ప్రవృత్తుడగును. అతని
ఆచార విచారములు భ్రష్టమైపోవును. అనుక అట్టివానికి సజ్జనులలో ఎన్నటికీ సన్మానము
లభ్యమవ్వదు.
సత్యమేవానృశంసం చ రాజవృత్తం సనాతనం
తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః 224
సత్య పరిపాలనే రాజులయొక్కముఖ్యవృత్తి మరియు సనాతన ఆచారము అయిఉన్నది. . కావున
రాజ్యము సత్యస్వరూపము అయిఉన్నది. సత్యమందే జగత్తంతయు ప్రతిష్టితమైయున్నది.
ఋషయశ్చైప దేవాశ్చ సత్యమేవ హి మే నిరే
సత్యవాదీ హి లోకేస్మిన్ పరం గచ్ఛతి చాక్షయం 225
ఋషులు, దేవతలు సదా సత్యమునే
ఆచరిన్చిరి. ఈ ప్రపంచమున సత్యవాదియగు
మనుజుడు అక్షయ పరధామమునకు పోవును.
ఉద్విజంతే యథా సర్పాన్నరాదనృతవాదినః
ధర్మః సత్యపరోలోకే మూలం సర్వస్య చోచ్యతే 226
అబద్ధము ఆడువారిని చూచి జనులు పామును
చూచిన వారివలె భయపడుదురు. ప్రపంచమున సత్యమే ధర్మముయొక్క పరాకాష్ఠ. ధర్మమే
అన్నిటికీ మూలము.
సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మః సదాశ్రితః
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం 227
లోకములో సత్యమే ఈశ్వరుడు. సత్యముయొక్క
ఆధారముపైననే సదా ధర్మము ప్రతిష్ఠితమై యున్నది. సత్యమే అన్నిటికీ మూలము. సత్యమే
పరమాత్మ. సత్యమును మించిన పరమపదము వేరొకటి లేదు.
దత్తమిష్టం హుతం చైవ తప్తాని చ తపాంసిచ
వేదః సత్యప్రతిష్ఠానా స్తస్మాత్ సత్యపరో భవేత్ 228
దానము, యజ్ఞము, హోమము, తపస్సు, వేదము-- వీటియొక్క ఆధారము సత్యము. అందువలన అందరు సత్య ధర్మ పరయాణులై
ఉండవలయును.
సోహం పితుర్నిదేశం తు కిమర్థం నానుపాలయే
సత్యప్రతిశ్రవః సత్యం సత్యేన సమయీకృతం 229
నేను సత్యప్రతిజ్ఞాపాలకుడ్ని, సత్యమునే ఆచరించుదునని
శపథము చేసి తండ్రి యొక్క సత్యపాలనను స్వీకరించితిని. ఇట్టి పరిస్థితిలో నా
తండ్రియొక్క ఆజ్ఞను ఎలా పాలించకూడదు?
నైవ లోభాన్న మోహాద్ వా న చా జ్ఞానాత్ తమోన్వితః
సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్య ప్రతిశ్రవః . 230
లోభము వలనకాని, మోహమువలనకాని, అజ్ఞానము వలనకాని వివేకశూన్యుడనైన నేను సత్యవ్రతమును భంగముచేయజాలను.
అసత్య సంధస్య సతశ్చలస్యా స్థిరచేతసః
నైవదేవా న పితరః ప్రతీచ్ఛంతీతి నహ శ్రుతం 231
ఎవడు అసత్యమును పాలించునో, చపలచిత్తుడో, అట్టి భ్రష్టుని హవిస్సులను దేవతలు, పితరులు స్వీకరింపరు. ఇది మనము వినియున్నాము.
ప్రత్యగాత్మ మిమం ధర్మం సత్యం పశ్యామ్యహం ధృవం
భారః సత్పురుషైశ్చీర్ణ స్తదర్ధమభి నంద్యతే 232
ప్రతివాడికి ఈ సత్యము, ధర్మమూ పాలించుటే
శ్రేష్టము. అట్లా నేను ద్రుఢముగా విశ్వసించుచున్నాను. సత్పురుషులు సత్యమును
ధర్మమునే పరిపాలించుదురు. కావున నేను వారిని అభినందించుచున్నాను.
కాయేన కురుతే పాపం మనసా సంప్రధార్యతత్
అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మపాతకం
233
మనుజుడు శరీరముతో చేయు పాపము మనస్సుద్వారానే నిశ్చయిస్తున్నాడు. జిహ్వచే అనగా
నాలుకద్వారా ఆ అసత్యవాక్కును ఇతరులకు చెప్పుచున్నాడు. ఇతరుల సంయోగముతో ఆ పాపమును
చేయుచున్నాడు. ఈ విధముగా కాయముతో, మనస్సుతో, వాక్కుతో మూడు పాతకములు చేయుచున్నాడు.
భూమిః కీర్తిః యశో లక్షీః పురుషం
ప్రార్థయన్తి హి
సత్యం సమనువర్తంతే సత్యమేవ భజేత్ తతః 234
భూమి, కీర్తి, యశస్సు, లక్షీ—ఇవి అన్నియు సత్యవాదిని పొందు కోరును. శిష్టుడు సత్యమునే అనుసరించును. మనుజుడు
సత్యమునే అనుసరించవలయును.
వనవాసం వసన్నేవ శుచిర్నియతభోజనః
మూలపుష్ప ఫలైః పుణ్యైః పిత్రూన్ దేవాంశ్చ తర్పయన్ 235
నేను ఈ వనములయందే ఉండెదను. బాహ్యాభ్యంతరములయందు పవిత్రముగా ఉండెదను. అట్లాఉండి
నియమిత భోజనము గావించెదను. ఫల, పుష్ప, (కంద వగైరా)మూలముల ద్వారా దేవాదులను, పితృదేవతలను తృప్తి పరచెదను.
కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యమ్ కర్మ యచ్చుభం
అగ్నిర్వాయుర్ సోమశ్చ కర్మణాం
ఫలభాగినః
236
ఈ కర్మభూమిని జన్మించినవాడు శుభకర్మలనే అనుష్టించవలయును. ఎందుకంటె అగ్ని, వాయువు, చంద్రుడు—శుభకర్మల ఫలము వలననే ఆయా పదవులను పొందుతున్నాడు.
శతం క్రతూనాం ఆహృత్య దేవరాట్ త్రిదివం గతః
తపాంసి ఉగ్రాణి చాస్థాయ దివం ప్రాప్తా మహర్షయః 237
దేవరాజగు ఇంద్రుడు నూరు యజ్ఞములను చేసి స్వర్గలోకమును పొందెను. మహర్షులు ఉగ్రతపస్సు చేసి దివ్యలోకములయందు
స్థానమును పొందిరి.
సత్యం చ ధర్మంచ పరాక్రమంచ భూతాను కంపాం ప్రియవాదితాం చ
ద్విజాతి దేవాతిథి పూజనం చ సంథానామాహుస్త్రి దివస్య సంతః 238
సత్యము, ధర్మమూ, పరాక్రమము, సమస్త ప్రాణులందు దయ, అందరితో ప్రియముగా
మాట్లాడుట, దేవతలను, అతిథులను, బ్రహ్మనిష్ఠులను పూజించుట, ఇవి స్వర్గలోక మార్గముగా
సాదుమహాత్ములు పేర్కొనిరి.
ధర్మే రతాః సత్పురుషైః సమేతాః తేజస్వినో దానగుణ ప్రధానాః
అహింసకా వీతమలాశ్చ లోకే భవంతి పూజ్యామునయః ప్రధానాః 239
ధర్మతత్పరులు, సజ్జన సాంగత్యము
కలిగియుండువారు, తేజస్సంపన్నులు, దానగుణము ప్రధానముగా
కలిగినవారు, ఏ ప్రాణికి హానిచేయువారు, మాలిన్యములేనివారు, అట్టి శ్రేష్టులైన మునులె ఈ ప్రపంచమున పూజనీయులు.
పిదప రాజపురోహితుడు వశిష్టుడు శ్రీరామునితో ఇట్లనెను.
పురుషస్యేహ జాతస్య భవంతి గురువః సదా
ఆచార్యశ్చైవ కాకుత్థ్స పితామాతాచ రాఘవ 240
రఘునందనా, కాకుత్థ్సకులభూషణా, ఈ ప్రపంచమున మనుజునకు
ఆచార్యుడు, తండ్రి, తల్లి, అని ముగ్గురురు గురువులు ఉందురు.
పితాహ్యేనం జనయతి పురుషం పురుషర్షభ
ప్రజ్ఞాం దదాతి చాచార్యస్తస్మాత్ స గురురుచ్యతే 245
గురోత్తమా, తల్లి తండ్రి జన్మకు హేతువులు. కావున ప్రథమగురువు తల్లీ తరువాత తండ్రి.
విద్యా బుద్ధులునేర్పి ప్రజ్ఞాకారకుడు కనుక వారు తరువాతి గురువులు.
ఓ రామచంద్రా, నీవు భరతుని
ఆత్మస్వరూపుడివి. సత్యధర్మ పాలకుడివి. కనుక నిన్ను అయోధ్య వచ్చి రాజ్యము
పరిపాలించమని వేడుకొంటున్నాడు. మీరు అతని మాటను కాదనకుడు. అది ధర్మోల్లంఘముగా
పరిగానింపబడదు. దానికి శ్రీ రాముడు వశిష్టబ్రహ్మతో ఇట్లనెను.
స హి రాజా దశరథః పితా జనయితా మమ
ఆజ్ఞాప యన్మాం యత్ తస్య న తన్మిథ్యా భవిష్యతి. 242
నాతండ్రి దశరథుడు మహారాజు. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిరి. నేను దానిని తప్పక
పాటించవలయును. అది మిథ్య కారాదు.
తదుపరి భరతునితో ఇట్లనెను.
లక్ష్మీశ్చంద్రాదపేయాద్ వా హిమవాన్ వా హిమం త్యజేత్
ఆతీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞామహం పితుః 243
చంద్రుని కాంతి వేరైనను, హిమాలయములనుండి మంచు
వేరైనను, సాగరము తన హద్దు మీరినను, నేను నా తండ్రి ఆజ్ఞను
ఉల్లంఘించజాలను.
కామాద్ వా తాత లోభాద్ వా మాత్రా తుభ్యమిదం కృతం
న తస్మనసి కర్తవ్య వర్తితత్వం చ మాతృవత్ 244
తల్లిగారు లోభముతో ఏమిచేశిరో దానిని మనస్సునందు పెట్టుకొనకుడు. భరత, తల్లియందు గౌరవముగా ఉండుము.
అప్పుడు భరతుడు రెండు పాదుకలను అన్న శ్రీరాముని పాదములచెంత ఉంచి అవి ధరించి
తిరిగి ఇమ్మనెను. శ్రీరాముడు అవి ధరించి తమ్మునకు తిరిగి ఇచ్చెను.
అథానుపూర్వ్య ప్రతిపూజ్య తమ్ జనం గురూంశ్చ మంత్రీన్ ప్రకృతీస్తథానుజౌ
వ్యసనయద్ రాఘవ వంశవర్ధనః స్థితః స్వధర్మే హిమవానివాచలః 245
ఆ తరువాత తన విద్యుక్త ధర్మమందు కృతకృత్యుడై నిశ్చలుడైయున్న శేరాముడు అక్కడి
ప్రజలను, గురువులను, మంత్రులను, ఇరువురు సోదరులను ఉచితరీతిన సత్కరించి పంపెను.
అనంతరము శ్రీరాముని పాదుకలను తనతలపై భక్తిపూరకముగా ఉంచుకొని రథములో కూర్చొని
తమ్ముడు శతృఘ్నునితో కలిసి ప్రజలు, గురువులు, ఇతర బుధజనులతో అయోధ్యకు తిరిగి వెళ్ళెను. రాజుకు ప్రతిగా శ్రీరామ పాదుకలే
రాజుగా, రాజ్యము చేయుచుండెను. ఆ పాదుకలకు రాజుకు చేయవలసిన సకల మర్యాదలు చేయుచుండెను.
శ్రీరాముడు అత్రి మహర్షి ఆశ్రమమునకు సీతా అమ్మవారు, లక్ష్మణులతో కలిసి వెళ్ళెను. అత్రి మహర్షి భార్య అనసూయ అమ్మవారు. అనసూయమ్మ
సీతమ్మతో ఇట్లనెను. అమ్మా, నీవు ధర్మము పైనే దృష్టి
కలిగి పతిని వనములకు అనుసరించుట మిక్కిలి ముదావాహము.
నగరస్థో వనస్థో వా శుభో వా యది వాశుభః
యాసాం స్త్రీణాం ప్రియోభర్తా తాసాం లోకా మహోదయాః 246
భర్త నగరమందు ఉన్నను, అరణ్యమందు ఉన్నను, ఉన్నతుడైనను, న్యూనతుడైనను, స్త్రీలు ప్రియముగా చూడవలయును.
అట్టివారికి ఉత్తమలోక ప్రాప్తి కలుగును.
దుఃశీల కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః
స్త్రీణామార్య స్వభావానాం పరమం దైవతం పతిః 247
భర్త దుష్ట స్వభావము కలిగి, కామ ప్రవృత్తి కలిగిఉన్నను, ధనహీనుడైనను, అతడు ఉత్తమ స్వభావముకలిగిన
స్త్రీలకు దైవ సమానుడే.
నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశన్త్యహం
సర్వత్ర యోగ్యం వైదేహి తపః క్రుతమివావ్యయం 248
వైదేహి, భార్యకి పతికి మించిన హితకారియగు బంధువు కనిపించుటలేదు. తాను చేసిన నాశరహితమైన
తపస్సుయొక్క ఫలమువలన అతడు ఇహలోకమున పరలోకమున సర్వత్ర సుఖము కలుగచేయగల సమర్థుడు
అగును.
తదేవమేతం త్వమను వ్రతా సతీ పతిప్రధానా సమయాను వర్తినీ
భావ స్వ భర్తుః సహధర్మచారిణీ యశశ్చ ధర్మం చ తతః సమాప్స్యసి 249
కావున ఓ సీతా, నీవు సదా నీ పతి శ్రీరాముని
సేవయందు నిమగ్నమైయుండుము. సతీ ధర్మమును పాలింపుము. పతియే ప్రధానముగా భావింపుము.
సదా ఆయననే అనుసరించుము. నీ భర్తకు
సహధర్మచారిణివై యుండుము. దీనివలన నీకు సత్కీర్తి, ధర్మమూ రెండు సిద్ధించును.
అప్పుడు సీతమ్మ అనసూయమ్మతో ఇట్లనెను.
నే తదాశ్చర్య మార్యాయాం యన్మాం త్వమనుభాషసే
విదితం తు మమాప్యేతద్ యథా నార్యాః పతిర్గురుః 250
అనసూయమ్మ, మీరు అందరిలోకి ఉత్తమమైన స్త్రీ. మీరు ఇట్టి విషయములు చెప్పుటలో
ఆశ్చర్యములేదు. స్త్రీ కి భర్తే గురువు. ఈ విషయము నాకు ఇదివరకే తెలుసు.
న విప్మృతం తు మే సర్వం వాక్యైః స్వైర్ధర్మచారిణీ
పతిశుశ్రూణాన్నార్యాస్తపో నాన్యాద్ విధీయతే 251
ధర్మచారిణీ, అంతేగాక, నా స్వజనులు వారి బోధచే నాకు ఏదేది ఉపదేశించితిరో, దానిని నేను మర్చిపోలేదు. స్త్రీకి భర్తయొక్క సేవతప్ప మరియొక తపస్సేలేదు.
సావిత్రీ పతి శుశ్రూషాం కృత్వా స్వర్గే మహీయతే
తథా వృత్తిశ్చ యాతా త్వం పతి శుశ్రూషయా దివం 252
సావిత్రి, తనభర్త అయిన సత్యవంతుని సేవచేసియే దేవతలచే పూజింపబడుచున్నది. ఆవిడమాదిరిగా
అనసూయమ్మా, మీరు కూడా దేవతలతో స్వర్గలోకమున స్థానము పొందిరి.
వరిష్ఠా సర్వనారీణాం ఏషా చ దివి దేవతా
రోహిణీ న వినా చంద్రం ముహూర్తమపి దృశ్యతే 253
సర్వ నారీమణులలో శ్రేష్ఠురాలును, స్వర్గమునందు దేవత అయిన రోహిణి పతిసేవా ప్రభావము చేతనే ఒక్క ముహూర్తకాలము
అయినను చంద్రునికంటె వేరైయుండుట కనుపించుటలేదు.
ఏవం విథాశ్చ ప్రవరాః స్త్రియో భర్తృ దృఢవ్రతాః
దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేనకర్మణా 254
ఈ విధముగా దృఢవ్రతులై పాతివ్రత్య ధర్మమును పాలించు పెక్కు సాధ్వీమతల్లులు, తమతమ పుణ్యకర్మలయొక్క బలముచే దేవలోకమున ఆదరముపొందుచున్నారు.
సీతాదేవి వాక్కులు విని అనసూయమ్మ మహదానందము పొందెను. సీత్రమ్మను అక్కునచేర్చుకొని ఇట్లనెను. సీతమ్మా, ఈ అందమయిన సుందర దివ్యహారము, వస్త్రము, ఈ భూషణము, ఆ అంగరాగము, బహుమూల్యమయినవి నీ కోసంగుతున్నాను. అమ్మా, సీతా, ఇవి నీ అందమును ఇనుమడించును. మరునాడు ఉదయము సీతా రామ లక్ష్మణులు అత్రిమహర్షి ఆశ్రమమునుండి వెడలిరి.
Comments
Post a Comment