పతంజలి 4.కైవల్యపాదము
4.
కైవల్యపాదము
4.1.జన్మౌషధి మంత్రతపస్సమాధిజాస్సిద్ధయః
జన్మౌషధి మంత్రతపస్సమాధిజాస్సిద్ధయః=జన్మ, ఓషధులు, మంత్రము, తపస్సు, సమాధి- ల వలన అయిదు సిద్ధులు ఉన్నవి.
జన్మ, ఓషధులు, మంత్రము, తపస్సు, సమాధి- ల వలన కలిగిన అయిదు సిద్ధులు ఉన్నవి.
4.2.జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్
(తత్ర= ఆ సిద్దులలో, అన్య జాతీయపరిణతానాం= మనుష్యాది అన్య జాతి రూపమున
పరిణమించిన, కాయేంద్రియానాం= దేహము ఇంద్రియముల యొక్కయు), జాత్యంతరపరిణామః= జాతి
తదితర మార్పులు, ప్రకృత్యా= దేహమునకు ప్రకృతిఅగు భూతములయొక్కయు, ఇంద్రియములకు
ప్రకృతిఅగు అస్మిత అనగా అహంకారము యొక్కయు, అపూరాత్=అవయవానుప్రవేశమువలన కలుగును.
పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలం, మరియు నీరు, వీటినే ప్రకృతి
అంటారు. మానవ శరీరమునకు కారణము ఈ ప్రకృతి.
జాతి తదితర మార్పులు, దేహమునకు ప్రకృతిఅగు భూతములయొక్కయు, ఇంద్రియములకు
ప్రకృతిఅగు అస్మిత అనగా అహంకారము యొక్కయు,
చెవ్వు (శబ్దము),
చర్మము (స్పర్శ), నేత్రము (చూపు), నాలుక (రుచి), మరియు ముక్కు (వాసన)—వీటిని పంచ
జ్ఞానేంద్రియములు అంటారు. పాణి, పాదము,
పాయువు, ఉపస్థ, మరియు నోరు—వీటిని పంచ కర్మేంద్రియములు అంటారు. మనో, బుద్ధి,
చిత్త, అహంకారము—వీటిని అంతఃకరణ అంటారు.
ఈ ఇంద్రియములకు కారణము అహంకారము.
సాధారణ మనిషి ఇంద్రియముల స్థితికి వచ్చుటకు ధ్యాన సాధనచేయకపోవుటే కారణము. ఓషధి, మంత్రము, తపస్సు, సమాధులు అను సాధనములను
అనుష్ఠించుటచే మనిషి, ఇంద్రియముల స్థితినుండి దేవాది జాతిరూపమున పరిణామును చెందుతాడు.
4.3 నిమిత్తమ ప్రయోజకం ప్రకృతీనాం వరణభేదస్తు
తతః క్షేత్రికవత్
నిమిత్తం= మంత్రములవలనకలిగిన ధర్మమువలన,
ప్రకృతీనాం= ప్రకృతులకు, అప్రయోజకం=ప్రయోజనము లేనిది, తు= అయితే, తతః= ఆ ధర్మాది కారణమువలన, క్షేత్రికవత్=
రైతుచేనువలె, వరణభేదః=ప్రతిబంధకపు
నివృత్తి మాత్రము కలుగును.
మంత్రములవలనకలిగిన ధర్మమువలన, ప్రకృతులకు ప్రయోజనముఉండదు . అయితే, ఆ ధర్మాది కారణమువలన, రైతుచేనువలె, సాధకునకు
ప్రతిబంధకపు నివృత్తి మాత్రము కలుగును. రైతు, చేనుకు అడ్డుగాఉన్న
అడ్డుకట్టఅను ప్రతిబంధకమును తొలగిస్తాడు.
అంతేగాని ఆ నీటిని చేతితో లాగుకొనగూడదు. ధర్మము సయితము ప్రకృతులకు అడ్డుకట్ట
అను ప్రతిబంధకము అను అధర్మమును
తొలగించును.
4. 4. నిర్మాణచిత్తాన్య
స్మితామాత్రాత్
అస్మితామాత్రాత్= అహంకారరూపమగు ఉపాదానకారణమును మాత్రము గ్రహించి, నిర్మాణచిత్తాన్య= నిర్మాణచిత్తములను యోగి సృజించును.
అహంకారరూపమగు ఉపాదానకారణమును మాత్రము గ్రహించి, నిర్మాణచిత్తములను యోగి
సృజించును. అనగా చిత్తములు అనేకముగా ఉండవచ్చును. అహంకారము ఒక్కటే.
4.5.ప్రవృత్తిభేదే ప్రయోజకం చిత్తమేకమనేకేషాం
అనేకేషాం= అనేకమగు చిత్తములయొక్క, ప్రవృత్తిభేదే= భిన్న భిన్న ప్రవృత్తులయందు,
ఏకమ్= ఒకటియగును, చిత్తం= చిత్తము, ప్రయోజకం=నడిచే ముఖ్య చిత్తము ప్రవర్తకమగును
అనేకమగు చిత్తములయొక్క, భిన్న భిన్న
ప్రవృత్తులయందు ముఖ్య చిత్తము ఒక్కటే. అది ప్రవర్తకమగును.
మన శరీరములో చిత్తవృత్తులు అనేకము. ఒకే చిత్తము అన్ని చిత్తవృత్తులయందు
ప్రవృత్తి భేదమును అంగీకరించుచున్నది. కనుక ఒకే ముఖ్య చిత్తము, నానా చిత్తములను అంగీకరించవచ్చును.
4.6. తత్ర ధ్యానజమనాశయం
తత్ర= అయిదు విధములగు
సిద్ధ చిత్తములలో, ధ్యానజం= ధ్యానజన్య సిద్ధచిత్తము
అనాశయం= కర్మక్లేశ
వాసనారహితమయినది.
జన్మము, ఓషధి,
మంత్రము, తపస్సు, మరియు సమాధి అను అయిదు విధములగు సిద్ధ చిత్తములలో,
ధ్యానజన్యసిద్ధచిత్తము కర్మక్లేశ
వాసనారహితము అయినది. అది కైవల్యమునకు అర్హమైనది.
4.7 . కర్మాశుక్ల కృష్ణం యోగిన
స్త్రివిధమితరేషాం
యోగినః= యోగియొక్క, కర్మ=పుణ్య పాప కర్మ,
అశుక్ల కృష్ణం= అశుక్లము అకృష్ణము
అగును., ఇతరేషాం= ఇతరులకర్మ త్రివిధం=శుక్లము,
కృష్ణము, శుక్లము-కృష్ణము అని మూడు విధములు.
శుక్లము అనగా పుణ్యము, కృష్ణము అనగా పాపము.
అశుక్లము అనగా పుణ్యము ఉండదు. కృష్ణము
అనగా పాపము ఉండదు.
కైవల్యము ప్రాప్తించిన యోగియొక్క, పుణ్య పాప కర్మ, అశుక్లము అకృష్ణము అగును. అనగా
పుణ్యానికి, మరియు పాపానికి రెండింటికీ అతీతుడు.
ఇతరులకర్మ—శుక్లము, కృష్ణము, శుక్లము-కృష్ణము అని మూడు విధములు.
4.8. తతస్తాద్విపాకా
నుగుణానామేవాభివ్యక్తిర్వాసనానాం
తతః= ఆ మూడు విధములగు కర్మలచే,
తద్విపాక= ఆ కర్మ ఫలములకు, అనుగుణానామేవ= తగినట్టియే, వాసనానాం=వాసనలకు, అభివ్యక్తిః=ప్రకాశాభావము
కలుగును.
ఆ మూడు విధములగు శుక్లము, కృష్ణము,
శుక్లము-కృష్ణము అను కర్మలచే, ఆ కర్మ ఫలములకు తగినట్లుగా, వాసనలకు, ప్రకాశాభావము కలుగును.
4.9. జాతి దేశ కాల వ్యవహితానామప్యానంతర్యం
స్మృతి సంస్కారయోరేకరూపత్వాత్
జాతి దేశ కాల వ్యవహితానాంఅపి= జాతిచేతను, కాలముచేతను వ్యవహితములైనను, వాసనలు,
స్మృతి సంస్కారయోః= స్మృతికి,
సంస్కారమునకు, ఏకరూపత్వాత్= సమానరూపము కలిగియుండుటవలన, అనంతర్యం= వ్యవధానము
లేకుండుట (సంగతమగుట)
వాసనలను జాతి, దేశము, మరియు కాలము, కప్పిపుచ్చినను, వాటి వాటి వాసనలు, స్మృతికి, స్కారమునకు, సమానరూపము కలిగియుండుటవలన మరుగు కుండును.
4.10. తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్
ఆశిషః= ఆశీర్వాదమునకు, నిత్యత్వాత్=నిత్యత్వమువలన, తాసామ్ చ=ఆ వాసనలగును, అనాదిత్వం=
నిత్యత్వము
జేవితము అనిత్యముయినా మనిషి అది నిత్యత్వము అనుకుంటాడు. అదేవేధముగా వాటి వాసనలుకూడా నిత్యము అగును,
4.11.హేతుఫలాశ్రయాలంబనైః సంగృహీత త్వాదేషామభావే తదభావః
హేతుఫలాశ్రయాలంబనైః = కారణము, ఫలము, ఆశ్రయము, ఆలంబనము,లచేతను,
సంగృహీతత్వాత్= వాసనలు
సంగ్రహింపబడినవిగాన, ఏషాం=ఈ హేత్వాదులకు, అభావే= నాశము కలుగగా, తదభావః= ఆ వాసనలకు
అభావము కలుగును.
కారణముచేతను, ఫలముచేతను, ఆశ్రయముచేతను, మరియు ఆలంబనము,చేతను, వాసనలు
సంగ్రహింపబడినవిగాన, ఈ హేత్వాదులకు, నాశము కలుగగా, ఆ వాసనలకు అభావము కలుగును.
ధర్మాది హేతువులచేతను, సుఖాది ఫలములచేతను, మనోరూపమగు ఆశ్రయము చేతను, శబ్దాది
విషయములచేతను, వాసనలు పోగొట్టుకొని సంగృహీతములై భావరహితము అగును. విదేహముక్తి సమయమున ఆ కారణములుగూడా నాశనము
అగును. వివేకఖ్యాతిచే పోగొట్టుకున్న ఆ
వాసనలతో అవిద్యాదులు నాశము అగును.
4.12.అతీతానాగతం స్వరూపతో
స్త్యధ్వభేదాద్ధర్మాణాం
ధర్మాణాం= ధర్మములకు, అధ్వభేదాత్=కాలభేదమువలన, అతీతానాగతం= భూతవస్తువును,
భవిష్యత్ వస్తువును, స్వరూపతః= తన రూపముతో, అస్తి=ఉండును. వర్తమానములోని ఒక వస్తువు, భూతకాలములోను, మరియు భవిష్యత్ కాలములోను వర్తమానములోను అదే రూపముతో ఉండును.
4.13.వ్యక్తసూక్ష్మాగుణాత్మనః
వ్యక్త=వర్తమానరూపములును, సూక్ష్మాః= భూత భవిష్యత్కాలములకు సంబంధించినవి యును అగు,
తే= ఆ ధర్మములన్నియు, గుణాత్మనః= త్రిగుణ స్వరూపములైనవి.
వర్తమానరూపములును, భూత భవిష్యత్కాలములకు సంబంధించినవియును అగు, ఆ ధర్మములన్నియు, త్రిగుణ స్వరూపములైనవి.
పంచభూతములయొక్క స్వరూపము= పంచతన్మాత్రలు.
పంచతన్మాత్రలు+ఏకాదశ ఇంద్రియములు యొక్క స్వరూపము= అహంకారము,
అహంకారము యొక్క స్వరూపము= మహత్తత్వము
మహత్తత్వము యొక్క స్వరూపము= ప్రధానము
ప్రధానము యొక్క స్వరూపము= త్రిగుణములు.
ప్రపంచము యొక్క విశేషత= త్రిగుణములు.
4.14. పరిణామైకత్వాద్వస్తు తత్త్వం
పరిణామైకత్వాత్=గుణములు అనేకములైనను వాని పరిణామము ఒకే విధముగా ఉండుట వలన, వస్తు=తన్మాత్ర
భూత భౌతికాది వస్తువులకుగూడ, తత్త్వం=అట్టి ఏకత్వము వ్యవహృతమగును.
గుణములు అనేకములైనను వాని పరిణామము ఒకే విధముగా ఉండుట వలన, తన్మాత్ర భూత భౌతికాది వస్తువులకుగూడ, అట్టి ఏకత్వము వ్యవహృతమగును.
గుణములు అనేకములైనను వాని పరిణామము లేక మార్పు ఒకే విధముగా ఉండును. అందువలన,
భూత భౌతిక వస్తువులకుగూడ, అట్టి ఏకత్వము
వ్యవహృతమగును.
4.15. వస్తు సామ్యే చిత్తభేదాత్ తయోర్విభక్తః పంథాః
వస్తు సామ్యే= వస్తు సామ్యములోకూడా, చిత్తభేదాత్= చిత్తములు అనేకము అగురవలన, తయోః=
ఆ జ్ఞానమునకు, జ్ఞేయ వస్తువునకు, విభక్తః= భిన్నమైన, పంథాః=మార్గము
వస్తు సామ్యములో అనగా ఏకత్వమునందును కూడా, చిత్తములు అనేకము అగుట వలన, ఆ
జ్ఞానమునకు, జ్ఞేయ వస్తువునకు మార్గము భిన్నమైనది.
4.16. నచైకచిత్తతంత్రం వస్తు తదప్రామాణికం తదా కిం స్యాత్
వస్తు =బాహ్యవస్తువు, ఏకచిత్తతంత్రం= ఏదో ఒకచిత్తమునకు అధీనమగు సత్తగలదిగా, న
చ= కాదు, తదప్రామాణికం= ఆ చిత్తముచే ప్రమాణీక (విషయీక) రింపబడని వస్తువు, తదా=జ్ఞానమునకు
విషయముకాని సమయమున, కిం స్యాత్= ఏమియగును?
బాహ్యవస్తువు ఏదో ఒకచిత్తముమీద ఆధారపడి
ఉండదు, ఆ చిత్తముచే ప్రమాణీక
(విషయీక)రింపబడని వస్తువు, జ్ఞానమునకు విషయముకాని సమయమున, ఏమియగును? అనగా ఎవ్వరూ ఆ వస్తువును పట్టించుకోనప్పుడు
ఆ వస్తువు ఏమి అగును?
4.17. తదుపరాగాపేక్షిత్వాచ్చిత్తస్య వస్తు జ్ఞాతా
జ్ఞాతం
చిత్తస్య= చిత్తమునకు, తత్=ఆ విషయముయొక్క, ఉపరాగ= ఇంద్రియ సన్నికర్ష ప్రతిబింబమును, అపేక్షిత్వాత్=ఆపేక్షించియుండుట
వలన, వస్తు= బాహ్యవస్తువు, జ్ఞాతా జ్ఞాతం=ఒకప్పడు జ్ఞాతముగాను, మరియొకప్పుడు
అజ్ఞాతముగాను ఉండును.
చిత్తమునకు ఆ విషయముయొక్క,
ఇంద్రియ(సమీపమున) సన్నికర్ష ప్రతిబింబమును, ఆపేక్షించి(కోరిక)యుండుటవలన, బాహ్యవస్తువు,
ఒకప్పడు జ్ఞాతముగాను, మరి యొక ప్పుడు అజ్ఞాతముగాను ఉండును.
చిత్తము తనకు ఇష్టమైన విషయమును, సంబంధిత ఇంద్రియము(ల) ద్వారా ఆకర్షించును.
అప్పడు ఆ విషయము జ్ఞాతముగా ఉండును.
చిత్తము తనకు ఇష్టము కాని విషయమును సంబంధిత ఇంద్రియము(ల) ద్వారా
ఆకర్షించదు. అప్పడు ఆ విషయము జ్ఞాతముగా ఉండదు. అజ్ఞాతముగాను ఉండును. ఇట్లు
విషయములను ఆకర్షించుట, ఆకర్షించకపోవుట జరుగును. ఇట్లు విషయాకారమున పరిణమించుట,
పరిణమించకపోవుట అను తత్వముగల చిత్తము
పరిణామయుక్తము.
4.18.సదా జ్ఞాతాశ్చిత్త వృత్తయస్తత్ప్రభోః
పురుషస్యా పరిణామిత్వాత్
యస్య తు=ఏ చేతనునకైతే, తత్= ఆ విషయాకారమైన, చిత్తం ఏవ= చిత్తమే, విషయః=
విషయమగునో, తస్య= ఆ, తత్ప్రభోః=చిత్తమునకు ప్రభవు అగు, పురుషస్య= పురుషుడు అపరిణామిత్వాత్=పరిణామము
లేనివాడగుటచే, సదా= ఎల్లప్పుడూ, జ్ఞాతాశ్చిత్త వృత్తయః = చిత్తవిషయములు,
జ్ఞాతములగును.
ఏ చేతనునకైతే ఆ విషయాకారమైన చిత్తమే
విషయమగునో ఆ చిత్తమునకు ప్రభవు అగు పురుషుడు పరిణామములేని వాడగుటచే, ఎల్లప్పుడూ, చిత్తవిషయములు,
జ్ఞాతములగును.
చిత్తము అనగా మనస్సు యొక్క పధ్ధతి నిత్యమూ క్షణము క్షణము, కణ కణమూ తెలిసిన ఆ పరమాత్మకు అన్నీ తెలిసినవే
అగును.
4.19. న తత్స్వాభాసం దృశ్యత్వాత్
తత్=ఆ చిత్తము, దృశ్యత్వాత్= దృశ్యము, స్వాభాసం= తనంతటతాను ప్రకాశించునది, న=
కాదు.
ఆ చిత్తము దృశ్యము తనంతటతాను ప్రకాశించునది కాదు. అది శుద్ధ చైతన్యము వలన
ప్రకాశించును.
4.20.
ఏకసమయే చోభయా నవదారణం
ఏకసమయే చ= ఒకే కాలమున, ఉభయా నవధారణం= విషయమును, తన్ను,
గ్రహించుట అసంభవం.
ఒకే కాలమున విషయమును, తన్ను, గ్రహించుట అసంభవం. ఒక చిత్తవృత్తికి ఒకే సమయములో రెండు విషయములు గ్రహించు సామర్థ్యము ఉండదు.
అది అసంభవం.
4.21. చిత్తాన్తరదృశ్యే బుద్ధి బుద్ధే
రతిప్రసంగః స్మృతి సంకరశ్చ
చిత్తాన్తర= అన్యచిత్తములచేత, దృశ్యే=గ్రాహ్యత్వమునందు,బుద్ధి బుద్ధే= ఆ చిత్తగ్రాహకమగు చిత్తమునకు, అతిప్రసంగః=
అనవస్థారూపదోషమున్ను, స్మృతి సంకరశ్చ= స్మరణలకు పరస్పర అసౌకర్యమును కలుగును.
స్మృతి= జ్ఞాపకశక్తి, memory.
అన్యచిత్తములచేత గ్రాహ్యత్వమునందు ఆ చిత్తగ్రాహకమగు చిత్తమునకు అనవస్థారూప దోషమున్ను, స్మరణలకు పరస్పర అసౌకర్యమును
కలుగును. అనగా అన్యచిత్తములచేత
గ్రహింపబడుటచే, ఏ చిత్తము ఏమి గ్రహించినదో చిత్తమునకు తెలియక తికమక యేర్పడును.
అందువలన చిత్తములకు అనవస్థారూప దోషము ఏర్పడును. స్మృతి అనగా జ్ఞాపకశక్తి నాశనము
అగును. అందువలన ఏక స్మృతి నిశ్చయము కలుగదు.
4.22. చితేర ప్రతిసంక్రమాయాస్తదాకారాపత్తౌ
స్వబుద్ధి సంవేదనం
అప్రతిసంక్రమాయాః= ఇంద్రియములవలె విషయములయందు ప్రచారములేని, చితేః= చేతనపురుషునకు, తత్= తాను ప్రతిబింబించిన
ఆ చిత్తముయొక్క, ఆకారా=ఆకారమువంటి ఆ ఆకారామునకు, ఆపత్తౌ= ప్రాప్తించిన అనంతరము, స్వ= తనకు విషయమగు, బుద్ధి= బుద్ధియొక్క, సంవేదనం=జ్ఞానము
కలుగును.
ఇంద్రియ విషయములయందు పురుషుడు ప్రతిబింబించినప్పుడు,
ఆ చిత్తమునకు జ్ఞానము కలుగును. అనగా
మనస్సు నిశ్చలము అయినప్పుడు ఆ మనస్సు పరమాత్మను ప్రతిబింబించును.
నిర్మల జలమున ప్రతిబింబించు క్రియారహితుడయిన చంద్రుడు, ఆ నిర్మలజలము
కదిలినప్పుడు ప్రతిబింబముకూడా కదులును. అప్పుడు నిశ్చలుడయిన చంద్రుడుకూడా
కదిలినట్లు అనిపించును. అదే విధముగా
చిత్తము నందు ప్రతిబింబించు పరమాత్మ,
క్రియలు, లేదా విషయముల కదలికవలన నిశ్చలుడయిన పరమాత్మకూడా కదలినటుల
అనిపించినను వాస్తవముగా ఆ పరమాత్మలో ఏ కదలిక ఉండదు.
4.23. ద్రష్ట్రు దృశ్యోపరక్తం చిత్తం
సర్వార్థం
ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం
ద్రష్టృ= ద్రష్ట యగు పురుషుని తోను, దృశ్య= దృశ్యమగు విషయము తోనూ, ఉపరక్తం=
సంబద్ధమగు, చిత్తం= చిత్తము, సర్వార్థం= సకలరూపములు కలదియగును.
ద్రష్ట యగు పురుషునితోను, దృశ్యమగు విషయముతోనూ, సంబంధముగల చిత్తము, సకలరూపములు కలదియగును.
4.24. తదసంఖ్యే యవాసనాభిశ్చిత్రమపి
పరార్థం సంహత్య కారిత్వాత్
తత్= ఆ చిత్తము, అసంఖ్యేయ=అసంఖ్యాకమయిన, వాసనాభిః=వాసనలచే, చిత్రమపి=
చిత్రించబడినను, సంహత్య కారిత్వాత్ =
విషయేంద్రియ సంబంధము కలిగి పనిచే యుచుండునుగాన,
పరార్థం= పురుషునికి ప్రవర్తించును.
ఆ చిత్తము అసంఖ్యాకమయిన వాసనలచే చిత్రించబడినను విషయేంద్రియ సంబంధము కలిగి
పనిచేయుచుండునుగాన పురుషునికొఱకే ప్రవర్తించును.
4.25 విశేషదర్శిన ఆత్మభావభావనావినివృత్తిః
విశేషదర్శినః= చిత్తముకన్న శుద్ధ చిత్తము వేరైనది అను భేదము, ఆత్మ యందు చూచు
వానికి, ఆత్మభావభావనావినివృత్తిః= ఆత్మ
సత్తావిషయకమగు విచారముయొక్క నివారణ కలుగును.
చిత్తముకన్న శుద్ధ చిత్తము వేరైనది అను భేదము, ఆత్మ యందు చూచు వానికి, ఆత్మ సత్తావిషయకమగు విచారముయొక్క నివారణ
కలుగును. అనగా తనువేరు, ఆత్మవేరు అనేభావము
పోతుంది.
4.26. తదా వివేకనిమ్నం కైవల్య ప్రాగ్భారం
చిత్తం
తదా= వివేక జ్ఞానము ఉద్భవించు ఆ సమయమున, చిత్తం= వివేకవంతుని చిత్తం, వివేకనిమ్నం= వివేకము అను నిమ్న (క్రింద) మార్గ
ప్రవృత్తియై, కైవల్య ప్రాగ్భారం=మోక్ష పర్యంతగామియగును.
వివేకజ్ఞానము ఉద్భవించు ఆ సమయమున, వివేకవంతుని చిత్తం వివేకము అను నిమ్న
(క్రింద) మార్గ ప్రవృత్తియై మోక్ష పర్యంతగామియగును.
4.27. తచ్ఛిద్రేషు ప్రత్యయాన్తరాణి
సంస్కారేభ్యః
సంస్కారేభ్యః=పూర్వపు బహిర్ముఖావస్థలోని సంస్కారములవలన, తచ్ఛిద్రేషు= ఆ వివేకనిష్ఠమగు చిత్తముయొక్క
అవివేక రూపములగు అవకాశములయందు, ప్రత్యయాన్తరాణి= ఇతర జ్ఞానములు ఉత్పన్నములు
అగును.
పూర్వపు బహిర్ముఖావస్థలోని సంస్కారములవలన ఆ వివేకనిష్ఠమగు చిత్తముయొక్క అవివేక
రూపములగు అవకాశములయందు, ఇతర జ్ఞానములు ఉత్పన్నములు అగును.
4.28. హానమేషాం క్లేశవదుక్తం
ఏషాం=ఈ సంస్కారములకు, హానం= నాశము, క్లేశవదుక్తం= అవిద్యాదిక్లేశములు అని
చెప్పబడినది.
ఈ సంస్కారములు అవిద్యాదిక్లేశములు మాదిరిగా నాశము యెట్లా చేయవలయునో చెప్పబడినది.
కేవలము వివేక జ్ఞానోదయముతో సంతృప్తి చెందకూడదు సాధకుడు. అసం ప్రజ్ఞాత సమాధిపర్యంతము
సాధన చేయవలయును సాధకుడు.
4.29. ప్రసంఖ్యానే ప్యకుసీదస్య సర్వదా
వివేకఖ్యాతేర్ధర్మ మేఘస్సమాధిః
ప్రసంఖ్యానేఅపి= సంప్రజ్ఞాత జ్ఞానమందు సయితము, అకుసీదస్య= లాభమును అపేక్షించనివానికి,
సర్వదా=నిరంతరముగా, వివేకఖ్యాతేః= వివేకజ్ఞానముఉండును, ధర్మ మేఘస్సమాధిః=
ధర్మమేఘము అనెడు సమాధి అబ్బును.
సంప్రజ్ఞాత సమాధియందు సయితము లాభమును అపేక్షించని సాధకునికి నిరంతరముగా వివేకజ్ఞానము
ఉండును, ధర్మమేఘము అనెడు సమాధి అబ్బును. బ్రహ్మానందమును వర్షించును గాన దానిని ధర్మమేఘసమాధి అందురు.
4.30.తతః క్లేశకర్మ నివృత్తిః
తతః= ధర్మమేఘ సమాధివలన, క్లేశకర్మ నివృత్తిః= సాధకునికి క్లేశకర్మ నివృత్తి
జరుగును.
ధర్మమేఘ సమాధివలన, సాధకునికి క్లేశకర్మ నివృత్తి జరుగును.
4.31. తదా సర్వావరణ మలాపేతస్య
జ్ఞానస్యా నంత్యా జ్ఞేయ మల్పం
తదా= ధర్మమేఘసమాధిఅబ్బిన కాలమున, సర్వావరణ మలాపేతస్య=సకల చిత్తనిష్ఠ సత్వ
గుణమును కప్పివేయు క్లేశకర్మరూపములగు ఆచ్ఛాదనములనుండి తొలగిన, జ్ఞానస్యా నంత్యా=జ్ఞానమునకు పరిమితి
లేకుండుటవలన, జ్ఞేయ మల్పం=తెలుసు కోవలసినది
అల్పము అగును.
ధర్మమేఘసమాధిఅబ్బిన కాలమున సకల చిత్తనిష్ఠ సత్వగుణమును కప్పివేయు క్లేశకర్మ
రూపములగు ఆచ్ఛాదనములనుండి తొలగిన జ్ఞానమునకు పరిమితి లేకుండుటవలన తెలుసు కోవలసినది
అల్పము అగును.
4.32. తతః కృతార్థానాం పరిణామక్రమ
సమాప్తిర్గుణానాం
తతః=ధర్మమేఘసమాధి ఉదయించుట వలన, కృతార్థానాం= సమాప్త కర్తవ్యములగు, గుణానాం=
గుణములకు, పరిణామక్రమ సమాప్తిః= పరిణామక్రమ సమాప్తికలుగును.
ధర్మమేఘసమాధి ఉదయించుట వలన సమాప్త కర్తవ్యములగు గుణములకు పరిణామ క్రమ
సమాప్తికలుగును.
4.33. క్షణ ప్రతియోగీ పరిణామపరాంత
నిర్గ్రాహ్యః క్రమః
క్షణ ప్రతియోగీ= క్షణములకు సంబంధించినది, పరిణామ= పరిణామము యొక్క అపరాంత=ముగింపుచేత,
నిర్గ్రాహ్యః= తెలిసికొనదగినది, క్రమః=
పరిణామక్రమము అంటారు.
క్షణములకు సంబంధించినది పరిణామముయొక్క ముగింపుచేత తెలిసికొనదగినది, దానిని
పరిణామక్రమము అంటారు.
4.34. పురుషార్థ శూన్యానాం గుణానాం
ప్రతిప్రసవః కైవల్యం స్వరూప ప్రతిష్ఠావా చితిశక్తిరితిః
పురుషార్థ శూన్యానాం= పురుషార్థ రహితములైన, గుణానాం= గుణములకు,
ప్రతిప్రసవః= స్వ స్వ కారణమున లయము మూలము
వలన ప్రధానమున లయమనునది, కైవల్యం=
కైవల్యము, స్వరూప = తన శుద్ధరూపమునందు, ప్రతిష్ఠా=
ఉనికి అను, చితిశక్తిరితిఃవా= =
చేతనశక్తి, కైవల్యం. ఇతిః= కైవల్యం, యోగ
శాస్త్రము ముగిసెను.
పురుషార్థములను సంపాదించి వాటిని రహితముచేయవలయును. అందుకు సహాయకములైన గుణములను
వాటి కారణమున లయము చేయవలయును తత్తదుపరి ప్రధానమున లయము చేయవలయునుఅ అదే కైవల్యము. అనగా
వ్యుత్థాన సంస్కారములు, సమాధి సంస్కారములు, నిరోధ సంస్కారములు, ఇవి అన్నియు స్వకారణమగు మనస్సున లయము చేయవలయును. మనస్సునకు
స్వకారణమగు అహంకారమున మనస్సు లయము చేయవలయును. అహంకారమునకు స్వకారణమగు బుద్ధి యందు
అహంకారము లయము చేయవలయును. బుద్ధికి స్వకారణమగు ప్రధానముయందు బుద్ధిని లయము
చేయవలయును. అదియే కైవల్యము. తన
శుద్ధరూపమునందు ఉనికి అను చేతనా శక్తి రూపుడుగా ఉండుటయే కైవల్యం.
యోగ శాస్త్రము ముగిసెను.
.
Comments
Post a Comment