పతంజలి 3.విభూతి పాదం


3.విభూతి పాదం  
3.1.దేశబంధశ్చిత్తస్య ధారణా
చిత్తస్య=చిత్తమునకు, దేశబంధః=ఏదియేని ఒక ప్రదేశాముతోడ సబంధము, ధారణా= ధారణ.
చిత్తమునకు ఏదియేని ఒక ప్రదేశముతోడ సబంధము ధారణ.
3.2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానం
తత్ర= ఆ,  ప్రత్యయ= గ్రహింపులో, ఏకతానతా= ఏకగ్రతయే, ధ్యానం= ధ్యానము.
ఆ, గ్రహింపులో ఏకగ్రతయే ధ్యానము.
3.3. తదేవార్థ మాత్రా నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధిః
తదేవ= ధ్యానమే, అర్థమాత్రా= ధ్యేయాకారమాత్రమైన, నిర్భాసం= నిరంతర ప్రకాశముగల, స్వరూపశూన్యమివ=తనస్వరూపము శూన్యముగానున్న యడల సమాధిః= సమాధిఅంటారు.
ధ్యానమే ధ్యేయాకారమాత్రమై నిరంతర ప్రకాశముతో తనస్వరూపము శూన్యముగా నున్న యడల సమాధిఅంటారు.
3.4. త్రయమేకత్ర సంయమః
త్రయమేకత్ర= ధారణ ధ్యాన సమాధి మూడును ఏకమగుటను, సంయమః= సంయమము అంటారు.
ధారణ ధ్యాన సమాధి మూడును ఏకమగుటను సంయమము అంటారు. ధ్యానం, ధ్యేయం, మరియు ధ్యాత ఒక్కటి అవ్వాలి. ఇది సరియిన సమాధి.
3.5. తజ్జయా త్ప్రజ్ఞా లోకః
తజ్జయాత్= ఆ సంయమము స్థిరమగుటయే,  ప్రజ్ఞా లోకః= ప్రజ్ఞా లోకము.
 ఆ సంయమము స్థిరమగుటయే, ప్రజ్ఞాలోకప్రాప్తి.
3.6. తస్య భూమిషు  వినియోగః 
తస్య= సంయమమునకు,  భూమిషు=సవితర్కాది యోగావస్థలయందు, వినియోగః= వినియోగించవలయును.
  సంయమమునకు సవితర్కాది యోగావస్థలయందు  వినియోగించవలయును.
3.7.త్రయమంతరంగం పూర్వేభ్యః
పూర్వేభ్యః= ఇంతకు ముందు చెప్పినట్లు యమ నియమాదులకన్ననూ, త్రయమంత రంగం= సంయమ సమాధిఅందు అంతర్ముఖము అగుట చాలా సులభము.
ఇంతకు ముందు చెప్పినట్లు యమ నియమాదులకన్ననూ, సంయమసమాధి యందు అంతర్ముఖము అగుట చాలా సులభము.
3.8. తదపి బహిరంగం నిర్బీజస్య
తదపి= ధారణ, ధ్యాన, సమాధి, ఈ ధారణా త్రయముకూడా, సంప్రజ్ఞాతసమాధికి అంతరంగసాధన అగును., బహిరంగం నిర్బీజస్య= అసంప్రజ్ఞాతసమాధికి బహిరంగసాధన అగును.
ధారణ, ధ్యాన, సమాధి, ఈ ధారణాత్రయము సంప్రజ్ఞాతసమాధికి అంతరంగసాధన అగును. అసంప్రజ్ఞాతసమాధికి బహిరంగసాధన అగును.
3.9. వ్యుత్థాన నిరోధ సంస్కారయో రభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః
వ్యుత్థాన=ఆవిర్భావము, నిరోధ= నిరోధించు, సంస్కారయోః= సంస్కారములు, అభిభవ ప్రాదుర్భావౌ=బాహ్య తిరోభావమును, వైరాగ్యమును,  నిరోధక్షణ చిత్తాన్వయో= నిరోధించు క్షణమున చిత్తముయొక్క ఉదయించిన,  నిరోధ పరిణామః = నిరోధ పరిణామము అనబడును.
సంస్కారములు, మొత్తముగా నిరోధించు విధముగా ఆవిర్భావము చెందును. నూతన   బాహ్య తిరోభావ, వైరాగ్యపు అంతర్గత ఆలోచనలు ఉదయించును. అట్టి నిరోధించు క్షణమున చిత్తములో ఉదయించిన ఆలోచనలను నిరోధ పరిణామము అనబడును.
3.10. తస్య ప్రశాంత వాహితా సంస్కారాత్
తస్య=అట్టి,  ప్రశాంత= ప్రశాంతచిత్తమునకు, వాహితా సంస్కారాత్ =నిర్మల నిరోధ సంస్కారధారారూపగు స్థితి కలుగును.
అట్టి ప్రశాంతచిత్తమునకు నిర్మల నిరోధ సంస్కారధారారూపగు స్థితి కలుగును. t
3.11. సర్వార్థ తైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః
సర్వార్థ తైకాగ్రతయోః క్షయోదయౌ సమాధి పరిణామః
చిత్తస్య= చిత్తమునకు, సర్వార్థత= క్షణ క్షణమువివిధవిషయములలో జోక్యము,  అనగా మనస్సు చంచలమగుట వలన వివిధ అర్థములను గ్రహించు మనస్సు యొక్క, ఏకాగ్రతయోః= ఏకవస్తు మాత్ర విషయత్వము యొక్క, క్షయోదయౌ= తిరోభావమును, ఆవిర్భావమును, సమాధి పరిణామః= సమాధి పరిణామము అంటారు.
చిత్తమునకు, క్షణ క్షణమువివిధవిషయములలో జోక్యము,  అనగా మనస్సు చంచల మగుట వలన వివిధ అర్థములను గ్రహించు మనస్సు యొక్క, ఏకవస్తు మాత్ర విషయత్వము యొక్క, తిరోభావమును, ఆవిర్భావమును, అనగా ఏకాగ్రమాత్ర ఆవిర్భావమును సమాధి పరిణామము అంటారు.
అనగా చిత్తమునకు అనిశ్చలస్థితులన్నీ పోవును. నిశ్చలస్థితి ఆవిర్భావముచెందును. దీనిని సమాధిపరిణామము అంటారు.
3.12. తతః పునః శాంతోదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతా పరిణామః
తతః=అనిశ్చలస్థితులన్నీపోయి నిశ్చలస్థితి వచ్చిన చిత్తస్య=మనస్సునకు, పునః= మరల  శాంతోదితౌ= అతీత వర్తమానములగు, తుల్య ప్రత్యయౌ= ఒకే ఆలంబన కలుగుట వలన,  ఏకాగ్రతా పరిణామః = ఏకాగ్రతా పరిణామము అనబడును.
అనిశ్చలస్థితులన్నీపోయి నిశ్చలస్థితి వచ్చిన మనస్సునకు, గడచిన, వర్తమానములు రెండు ఒకటే అగును. దానిని  ఏకాగ్రతా పరిణామము అనబడును.
3.13. ఏతేన భూతేంద్రియేషు  ధర్మలక్షణా వస్థా పరిణామా వ్యాఖ్యాతాః
ఏతేన=నిరోధ సమాధి, మరియు ఏకాగ్రతా పరిణామము చేత,  భూతేంద్రియేషు= భూతములు మరియు వాటి ఇంద్రియములలోను,  ధర్మలక్షణా వస్థా పరిణామా= ధర్మపరిణామము, లక్షణా పరిణామము, మరియు అవస్థా పరిణామము, వ్యాఖ్యాతాః= వివరించబడినవి.
నిరోధ సమాధి, మరియు ఏకాగ్రతా పరిణామము చేత, భూతములు మరియు వాటి ఇంద్రియములలోను, ధర్మపరిణామము, లక్షణా పరిణామము, మరియు అవస్థా పరిణామము, వివరించబడినవి.
3.14.శాంతోదితావ్యపదేశ్య ధర్మానుపాతీ ధర్మీ
శాంత=భూత,  ఉదిత= వర్తమానము, అవ్యపదేశ్య=ఆగామి,  ధర్మ= ధర్మము, అనుపాతీ= అనుగతము, = ధర్మము.
భూత, వర్తమానము,మరియు ఆగామి, అన్నికాలములయందు అనుగతమైన ధర్మమే  ధర్మీ.
3.15.క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః
పరిణామాన్యత్వే= వేర్వేరు పరిణామాములు గాలుగుటలో, క్రమాన్యత్వం= క్రమము భిన్నముగానుండుట, హేతుః=కారణము.
వేర్వేరు పరిణామములు గలుగుటకు, చిత్తముయొక్కక్రమము భిన్నముగానుండుటయే కారణము.
పరిణామమును బట్టి ధర్మమూ మారును. ఒక ధర్మమునకు తరువాత కలుగు ధర్మము, ఇంతకూ ముందరిదానికి క్రమము అగును.  ముందర మట్టి, తరువాత కుండ, ఆ కుండ పగిలితే పెంకులు, పరిణామాములలో మార్పులు గలుగు తున్నవి. ఈ పరిణామాములలో మార్పులను బట్టి ధర్మమూ మారును. శిశువు, బాలుడు, యువకుడు, కౌమారుడు, వృద్ధుడు. ఇది క్రమము. ఆ క్రమునుబట్టి ధర్మమూ మారును.
3.16.  పరిణామత్రయ సంయమాదతీతానాగత జ్ఞానం
పరిణామత్రయ =ధర్మ, లక్షణ, అవస్థ, రూపములగు మూడు పరిణామములయందు, సంయమాత్= ధారణా, ధ్యాన, సమాధి,లొనర్చుటవలన,  అతీతానాగత జ్ఞానం=భూత భవిష్యత్ వస్తువుల సాక్షాత్కారము కలుగును.
ధర్మపరిణామమునందు, లక్షణపరిణామమునందు, అవస్థాపరిణామమునందు, ధారణా, ధ్యాన, సమాధి, లొనర్చుటవలన, తొలుత ధర్మలక్షణావస్థా పరిణామ సాక్షాత్కారము కలుగును. తదనంతరపరిణామములయందు అనుగతమగు భూత భవిష్యత్ వస్తువుల సాక్షాత్కారము కలుగును. అందువలన పరంపరా సంబంధముచే పరిణామత్రయము అతీతానాగత పదార్థసాక్షాత్కార సాధన అగును. 
3.17.శబ్దార్థప్రత్యయానామితరేతరాధ్యాసాత్సంకరస్తత్ప్రవిభాగసంయమాత్సర్వభూతరుతజ్ఞానం
శబ్దార్థప్రత్యయానామ్=పదము, దాని సంబంధిత అర్థము, తద్విషయ జ్ఞానము,  ఇతరేతర ఆధ్యా సాత్= పరస్పరాభేద నిశ్చయము వలన, సంకరః=పరస్పరసౌకర్యము కలుగును,  తత్ ప్రవిభాగ సంయమాత్= ధారణ, ధ్యాన, సమాధులవలన,  సర్వభూతరుతజ్ఞానం= సకలప్రాణి భాషా పరిజ్ఞా నము కలుగును.
పదము, దాని సంబంధిత అర్థము, తద్విషయ జ్ఞానము,  పరస్పర అభేద నిశ్చయము వలన,  పరస్పరసౌకర్యము కలుగును. ధారణ, ధ్యాన, సమాధులవలన, సకలప్రాణి భాషా పరిజ్ఞానము కలుగును.
3.18.సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వ జాతి జ్ఞానం
సంస్కార సాక్షాత్కరణాత్= సంస్కారములను సాక్షాత్కరించుకుంటే,  పూర్వ జాతి జ్ఞానం = పూర్వ జాతులు లేక జన్మల జ్ఞానం వచ్చును.
సంస్కారములను సాక్షాత్కరించుకుంటే, పూర్వ జాతులు లేక జన్మల జ్ఞానం వచ్చును.
3.19.ప్రత్యయస్య పరచిత్త జ్ఞానం
ప్రత్యయస్య=ఇతరుల, పరచిత్త జ్ఞానం= సంయమము వలన, ఇతరులమనస్సును తెలిసికొను జ్ఞానం వచ్చును.
ఇతరుల మనస్సుతో సంయమము వలన, ఇతరులమనస్సును తెలిసికొను జ్ఞానం వచ్చును.
3.20. న చ తత్సాలంబనం తస్యావిషయీ భూతత్వాత్
తస్య=ఆ ఇంకొకరి చిత్త సాక్షాత్కారమునకు,  అవిషయీ భూతత్వాత్= రాగాదులు విషయము కావు, అందువలన, తత్=ఆ ఇంకొకరి చిత్తము యొక్క సాక్షాత్కారము  సాలంబనం= రాగాది విషయ ఆలంబనము అగునది,  న చ=కాదు.
ఆ ఇంకొకరి చిత్త సాక్షాత్కారమునకు, రాగాదులు విషయము కావు, అందువలన,  ఆ ఇంకొకరి చిత్తము యొక్క సాక్షాత్కారము రాగాది విషయ ఆలంబనము అగునది కాదు.
ఇంకొకరి చిత్తమునకు రాగద్వేషములు విషయము కావు, అందువలన, ఆ ఇంకొకరి చిత్తము యొక్క  రాగద్వేషములకు సాధకుడి చిత్తము ఆధారము అగునది కాదు. 
3.21.  కాయరూప సంయమాత్తద్గ్రాహ్యశక్తిస్తంభే చక్షుస్ప్రకాశా సంయోగే న్తర్ధానం
కాయ=తన శరీరము యొక్క, రూప= రూపవిషయమున, సంయమాత్= సంయమము చేయుటవలన, తత్=రూపముయొక్క, గ్రాహ్యశక్తి= గ్రహణశక్తియొక్క, స్తంభే=నిరోధించుట కలుగగా, చక్షుః ప్రకాశా= ఇతరుల నేత్రములతో, అసంయోగే తన శరీరమునకు దగ్గిరలో,  న్తర్ధానం =ంతర్ధానశక్తి అనగా ఇతరులకు కనబడని శక్తి సిద్ధించును.
తన శరీరముయొక్క రూపవిషయమున సంయమము చేయుటవలన, రూపముయొక్క గ్రహణశక్తి నిరోధించుట కలుగగా, ఇతరుల నేత్రములతో తన శరీరమునకు దగ్గిరలో,ంతర్ధానశక్తి అనగా ఇతరులకు కనబడని శక్తి సిద్ధించును. అందువలన సాధకుడు రూపవిషయ సంయమమున ఇతరులకునేత్రముల ఎదుట ఉన్నను కనబడదు.  
3.22.సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సం యమా దపరాంత జ్ఞానమరిష్టేభ్యోవా
సోపక్రమం= ప్రారబ్ధమును,  నిరుపక్రమం చ=ఆగామి, కర్మ= కర్మ,  తత్సంయమాత్= అట్టి కర్మలకు సంయమము వలన,  అపరాంతజ్ఞానం=మరణజ్ఞానము కలుగును,    అరిష్టేభ్యోవా=అరిష్టముల ద్వారాగాని
ప్రారబ్ధము అనుభవించుట వలన, ఆగామికర్మలకు సంయమము వలన వాటి కర్మల యొక్క జ్ఞానము తప్పక  కలుగును.  అరిష్టములు అనగా చెడు సంకేతములద్వారా మరణజ్ఞానము కలుగును,
3.23. మైత్ర్యాదిషు బలాని
మైత్ర్యాదిషు= మైత్రి, కరుణ, ముదితలు అను మూడు భావనలు,  బలాని= బలములు
మైత్రి, కరుణ, ముదితలు అను మూడు భావనలున్నూ బలములు.
మైత్రి—యోగులు అభ్యాసముతో ప్రాణులతో మిత్ర భావమును పొందుతారు. 
కరుణ—దుఃఖితుల విషయములోసంయమమువలన యోగికి కరుణా భావనాబలము ఏర్పడును.
ముదిత—పుణ్యశీలురయందు తటస్థభావము, చింతాయుక్తులగు దీనమానవులను ఆనందపెట్టు సామర్థ్యము వలన యోగికి ముదిత భావనాబలము ఏర్పడును.
3.24.బలేషు హస్తి బలాదీని 
 బలేషు= బలవిషయములో,  హస్తి బలాదీని= ఏనుగు మ్దలగు వాని బలము అబ్బును.  బలవిషయములో సాధకునికి ఏనుగుమొధలగువాని బలముఅబ్బును.
3.25. ప్రవృత్త్యాలోకన్యా సాత్సూక్ష్మ వ్యవహిత విప్ర కృష్ట జ్ఞానం
ప్రవృత్తి=విషయములందు ఉత్సాహముయొక్క, అలోక=సాత్విక ప్రకాశమును, న్యాసాత్ = సంయమము ద్వారా ఉంచుటవలన,  సూక్ష్మ వ్యవహిత విప్ర కృష్ట జ్ఞానం= సూక్ష్మ,  దాగియున్న, విప్ర కృష్ట= దూర పదార్థముల యొక్క,  జ్ఞానము కలుగును.
విషయములయందు ఉత్సాహముయొక్క సాత్విక ప్రకాశమును  సంయమము ద్వారా ఉంచుటవలన, సూక్ష్మ,  దాగియున్న, దూర పదార్థముల యొక్క,  జ్ఞానము కలుగును.
విషయములయందు ఉత్సాహము సంయమము ద్వారా ఉంచుటవలన, సూక్ష్మ,  దాగియున్న, దూర పదార్థముల యొక్క,  జ్ఞానము కలుగును.
3.26. భువన జ్ఞానం సూర్యే సంయమాత్  
సూర్యే సంయమాత్ = సూర్యుని విషయమున సంయమము వలన,  భువన జ్ఞానం= సకలలోక విషయక జ్ఞానము కలుగును.
సూర్యుని విషయమున సంయమము వలన సకలలోక విషయక జ్ఞానము కలుగును.
3.27.చంద్రేతారావ్యూహ జ్ఞానం
చంద్రే= చంద్రుని విషయమున సంయమము వలన,  తారావ్యూహ జ్ఞానం=నక్షత్రాల సకల విషయక జ్ఞానము కలుగును.
చంద్రునివిషయమున సంయమము వలన, నక్షత్రాల సకల విషయక జ్ఞానము కలుగును.
3.28.ధృవే తద్గతి జ్ఞానం
ధృవే= ధృవనక్షత్ర విషయమున సంయమము వలన, తద్గతిజ్ఞానం=తారకలగమన విషయక  జ్ఞానము కలుగును.
ధృవనక్షత్ర విషయమున సంయమము వలన,  తారకలగమన విషయక జ్ఞానము కలుగును.
3.29.నాభిచక్రే కాయ వ్యూహ జ్ఞానం
నాభిచక్రే= నాభిచక్రమున సంయమమువలన, కాయ వ్యూహ జ్ఞానం=  శరీర విషయక జ్ఞానము కలుగును.
నాభిచక్రము విషయమున సంయమమువలన, సాధకునకు శరీర విషయక జ్ఞానము కలుగును.
3.30.కంఠకూపే క్షుత్పిపాసా నివృత్తిః
కంఠకూపే= కంఠకూపము విషయమున సంయమమువలన, క్షుత్పిపాసా నివృత్తిః= ఆకలి దప్పులు తీరును.
కంఠకూపము విషయమున సంయమమువలన, సాధకునకు ఆకలిదప్పులు తీరును.
3.31. కూర్మనాడ్యాం స్థైర్యం
కూర్మనాడ్యాం= కూర్మ నాడియందు  సంయమము వలన, స్థైర్యం= స్థిరత యేర్పడును.
కూర్మనాడియందు  సంయమము వలన, సాధకునకు స్థిరత్వము యేర్పడును. కంఠకూపము క్రింద చుట్టచుట్టుకొని సర్పమువలె కూర్మాకారము మాదిరి ఒక నాడి యున్నది. ఆ నాడియందు ధ్యానము ఉడుము మాదిరి స్థిరత్వం కలుగును.   
3.32. మూర్ధజ్యోతిషి సిద్ధ దర్శనం
మూర్ధ= శిరస్సునండలి, జ్యోతిషి= జ్యోతియందు సంయమముచే,  సిద్ధ దర్శనం= సిద్ధ పురుషుల దర్శనం సిద్ధించును.
శిరస్సునందలి జ్యోతియందు సంయమముచే, సాధకునకు సిద్ధపురుషుల దర్శనం సిద్ధించును.
3.33. ప్రాతిభాద్వా సర్వం
ప్రాతిభాద్వా= ప్రాతిభము అను జ్ఞానముచే,   సర్వం= సర్వము తెలియును.
ప్రాతిభము అను జ్ఞానముచే, సర్వము తెలియును.  నిమిత్తము లేకయే మనోమాత్ర జన్యమై తటాలున కలుగు జ్ఞానము ప్రతిభ అనబడును.
3.34. హృదయే చిత్తసంపత్
హృదయే= హృదయమున సంయమము చేయుటచే, చిత్తసంపత్= స్వ, పర చిత్త సాక్షాత్కారము కలుగును.
హృదయమున సంయమము చేయుటచే, సాధకునకు స్వ, పర చిత్త సాక్షాత్కారము కలుగును.
3.35.సత్వపురుషయో రత్యంతా సంకీర్ణయోః ప్రత్యయా విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థసంయమాత్ పురుష జ్ఞానం
అత్యంతాసంకీర్ణయోః=విరుద్ధమైన ధర్మములు కలిగినట్లుగా, సత్వపురుషయో=బుద్ధిసత్వ మునకు, పురుషునకు, ప్రత్యయావిశేషః= అభేదరూపభావము, భోగః= భోగముఅందురు.  పరార్థత్వాత్= బుద్ధి సత్వము పురుషునికొరకు అయినదిగాన,  స్వార్థ సంయమాత్ = పురుషునియందు సంయమము వలన, పురుష జ్ఞానం= ఆత్మజ్ఞానం కలుగును.
విరుద్ధమైన ధర్మములు కలిగినట్లుగా అనిపించు, బుద్ధిసత్వమునకు, పురుషునకు, అభేదరూప భావమును, భోగము అందురు. అనగా పురుషుడు వేరు, పురుషుని  బుద్ధి సత్వము వేరు కాదు.  పురుషుని యందు సంయమము వలన, సాధకునకు ఆత్మజ్ఞానం కలుగును.
3.36. తతః ప్రాతిభశ్రావణ వేదనా దర్శాస్వాదవార్తా జాయంతే   
తతః= అందువలన, ప్రాతిభ= ప్రాతిభము, శ్రావణ= శ్రవణము, వేదనా= స్పర్శ,  ఆదర్శ= చూడటము, ఆస్వాద= రుచి, వార్తాః= వాసన, అను సిద్ధి షట్కము, జాయంతే= కలుగును.
అందువలన, ప్రాతిభము, శ్రవణము, స్పర్శ, చూడటము, రుచి, వాసన, అను సిద్ధి షట్కము,  సాధకునకు కలుగును.
3.37. తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః
తే= పైన చెప్పిన ఆరును, సమాధా= సమాధియందు, వుపసర్గాః=విఘ్నములగును,  వ్యుత్థానే= బహిర్ముఖ అవస్థలో, సిద్ధయః= సిద్ధులు   
పైన చెప్పిన ఆరును సమాధియందు విఘ్నములగును. ఇవి బహిర్ముఖ అవస్థలో,  సిద్ధులు.
3.38. బంధకారణ శైథిల్యా త్ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః
బంధకారణ= చిత్తబంధమునకు కారణములగు ధర్మాధర్ములయొక్క, శైథిల్యాత్= సడలుట వలన,  ప్రచార=చిత్తసంచారముయొక్క,  సంవేదనాత్ చ= యెరుగుటవలనను,  చిత్తస్య= చిత్తమునకు, పరశరీరావేశః= అన్యుల శరీరములో ప్రవేశము కలుగును.  
చిత్తబంధమునకు కారణములగు ధర్మాధర్ములయొక్క, సడలుట వలన, చిత్తసంచారము యొక్క, యెరుగుటవలనను చిత్తమునకు, అన్యుల శరీరములో ప్రవేశము కలుగును. 
చిత్తము చంచలమయినది. పుణ్య పాపముల వలన ఒక శరీరమునందు స్థిరనివాసము ఏర్పరచుకుంటుంది. దీనిని చిత్తబంధము అంటారు. కనుక చిత్తబంధమునకు కారణము అయిన పుణ్య పాపములు బంధ కారణములు. అది సంయమము వలన శిథిలమగును. దీనిని బంధకారణ శైథిల్యము అంటారు. అట్లా సంయమము వలన బంధము శిథిలమయిన మనస్సు చిత్తసంచారమును అర్థము చేసికొని అన్యుల శరీరములో ప్రవేశించ కలుగుతుంది.  
3.39. ఉదానజయాజ్జల పంకకంటకాదిష్వసంగ ఉత్క్రాంతిశ్చ   
ఉదానజయాత్= ఉదాన వాయువును జయించుటవలన,  జల పంక కంటక ఆదిషు=నీరు, బురద, ముళ్ళు, మొదలగువానియందు, అసంగః= సబంధము లేకుండా, ఉత్క్రాంతిశ్చ=ఊర్ధ్వ గమనము సిద్దించును. 
ఉదాన వాయువును జయించుటవలన, నీరు, బురద, ముళ్ళు, మొదలగువానియందు,  సబంధము లేకుండా ఊర్ధ్వ గమనము సిద్దించును. 
3.40. సమానజయాజ్వలనమ్
సమానజయాత్= సమాన వాయువును జయించుటవలన, జ్వలనమ్= దీప్తి కలుగును.
సమాన వాయువును జయించుటవలన, దీప్తి కలుగును.  
3.41.శ్రోత్రాకాశయోస్సంబంధ సంయమాత్ దివ్యం శ్రోత్రం
శ్రోత్రాకాశయో= శ్రోత్ర ఇంద్రియమునకు ఆకాశమునకు, స్సంబంధ సంయమాత్= సంబంధ సంయమము వలన, దివ్యం శ్రోత్రం= దివ్యమగు శ్రోత్ర ఇంద్రియము కలుగును.
శ్రోత్ర ఇంద్రియమునకు ఆకాశమునకు, సంబంధ సంయమము వలన, దివ్యమగు శ్రోత్ర ఇంద్రియము కలుగును.

3.42.కాయాకాశయోస్సంబంధ సంయమాల్లఘుతూల సమాపత్తేశ్చ ఆకాశగమనం
కాయాకాశయో= శరీరము ఆకాశము, సంబంధ సంయమాత్= సంబంధ సంయమ ధ్యానము చేయటం వలన, లఘు=తేలిక పదార్థము, తూల= దూది మొదలగు,  సమాపత్తేశ్చ=తన్మయీ భావమువలన,  ఆకాశగమనం= ఆకాశగమనశక్తి వచ్చును.
శరీరము ఆకాశము, సంబంధ సంయమ ధ్యానము చేయటం వలన, తేలిక పదార్థము దూది మొదలగు, తన్మయీ భావమువలన ఆకాశగమనశక్తి వచ్చును.
3.43.బహిరకల్పితా వృత్తిర్మహావిదేహాతతః ప్రకాశావరణక్షయః
బహిః= శరీరము బయట, అకల్పితా=కల్పింపబడని,  వృత్తిః=చిత్తవృత్తి,  మహావిదేహా= మహావిదేహా అనేపేరుగల ధారణా, తతః= వలన, ప్రకాశా= ప్రకాశారూపమగు బుద్ధిని, ఆవరణ= కప్పునట్టి క్లేశాదికములకు, క్షయః= నాశనము కలుగును.
స్వతంత్రమయిన మనస్సు మహావిదేహా అనేపేరుగల ధారణ వలన, శరీరము బయట  బుద్ధిని అంటుకున్న  క్లేశాదికమును నాశనము చేయ కలుగును.
శరీరము బయట ఏదో ఒక విషయమునందు మనస్సు లగ్నమగుటను విదేహనామకము అనే ధారణ.
మనస్సు శరీరమునందు ఉండి, శరీరము బయట ప్రచారము చేయుట దీనిని కల్పిత విదేహధారణ అంటారు.
శరీరముతో సంబంధము లేకుండా, స్వతంత్రమగు మనస్సునకు బయట ప్రచారము చేయుట దీనిని అకల్పిత లేక మహా విదేహధారణ అంటారు.
యోగికి కల్పిత విదేహధారణ సాధనముగా మహా విదేహధారణను సాధించాలి. అప్పుడు యోగి పరకాయప్రవేశము చేస్తాడు. అంతేకాదు, క్లేశ, కర్మ, విపాకము మూడింటిని నిర్మూలిస్తాడు.
3.44.స్థూల స్వరూప సూక్ష్మా స్వయార్థ వత్త్వా సంయమాత్ భూత జయః
స్థూల స్వరూప సూక్ష్మా స్వయార్థ వత్త్వా సంయమాత్= స్థూలము, స్వరూపము, సూక్ష్మ ము, అన్వయము,  అర్థవత్వము, అను (పంచభూతముల) పంచావస్థలయందు సంయమము వలన,    భూతజయః= భూతజయము అను సిద్ధి కలుగును.
స్థూలముపృథివీ, స్వరూపమునీరు, సూక్ష్మము అగ్ని, అన్వయమువాయువు,  అర్థవత్త్వముఆకాశము, అను పంచభూతముల పంచావస్థలయందు సంయమము వలన భూతజయము అను సిద్ధి కలుగును.
3.45.తతోణిమాది ప్రాదుర్భావః కాయసంపత్తద్ధర్మానభిఘాతశ్చ 
తతః= ఆ భూతములను జయించుటవలన అనగా నీ ఆధీనములోనికి తెచ్చుకోవఢము వలన, అణిమాది ప్రాదుర్భావః= అణిమాది అష్టసిద్ధులు కలుగును.,  కాయసంపత్= దేహ సంపదయు,  తత్= ఆ భూతములయొక్క,  ధర్మ= ధర్మములచే. అనభిఘాతః చ =ప్రతి బంధకములు ఉండవు.
ఆ భూతములను జయించుటవలన అనగా నీ ఆధీనములోనికి తెచ్చుకోవఢము వలన,  అణిమాది అష్టసిద్ధులుకలుగును. దేహసంపదయు,  భూతములయొక్క, ధర్మములచే.  ప్రతిబంధకములు ఉండవు.
3.46.రూపలావణ్య బలవజ్ర సంహననత్వాని కాయసంపత్
రూప= మనోహర రూపమును, లావణ్య= కాంతి విశేషమును, బల=అతిశయబలమును,  వజ్రసంహననత్వాని= వజ్రసమానముగా దృఢములగుసంగములు కలిగియుండుట, కాయ సంపత్= దేహసంపద అంటారు.
ఈ పైన చెప్పినట్లుగా ధ్యానము చేయు యోగికి అద్భుతమయిన దేహసంపదకలిగి,   మనోహర రూపమును, కాంతి విశేషమును, అతిశయబలమును, వజ్రసమానముగా దృఢములగు సంగములు కలిగియుంటాడు.  
3.47.గ్రహణస్వరూపాస్మితాస్వయార్థవత్వ సంయమాదింద్రియజయః
గ్రహణస్వరూపాస్మితాస్వయార్థవత్వ సంయమాత్= గ్రహణము, స్వరూపము, అస్మిత, అన్వయము, అర్థవత్వము, అను అయిదు రూపములయందు, సంయమము వలన,   ఇంద్రియజయః= ఇంద్రియజయఃము కలుగును.
ఇంద్రియమునకు గ్రహణము అనగా గ్రహింపు. స్వరూపము, అస్మిత అనగా అహంకారము. అన్వయము అనగా ఆ ఇంద్రియము యొక్క గుణము. అర్థవత్వము అనగా సామర్థ్యము అను అయిదు రూపములయందు, సంయమము వలన ఇంద్రియజయము అనగా ఆయా ఇంద్రియ సిద్ధి కలుగును.
3.48.తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ
తతః=ఇంద్రియజయమువలన, మనోజవిత్వం= మనోవేగమును,  వికరణభావః= వికరణ భావమును,  ప్రధానజయశ్చ= ప్రకృతిజయము కూడా కలుగును.
ఇంద్రియజయమువలన, మనోవేగమును అనగా మనస్సువలె శీఘ్రముగా గమనము చేయు శక్తి, వికరణ భావమును అనగా భూత, వర్తమాన, మరియు భవిష్యత్ జ్ఞానము కలుగుట, ప్రధాన లేక  ప్రకృతిజయము అనగా కార్య కారణములు ఆధీనములో ఉండుట  సాధకునకు కలుగును.

3.49.సత్వపురుషాన్యతా ఖ్యాతిమాత్రస్య సర్వభావాదిష్ఠాతృత్వం సర్వ జ్ఞాతృత్వంచ
సత్వపురుషాన్యతా ఖ్యాతిమాత్రస్య=ప్రకృతి పురుషుడు అనే వివేకముగల యోగికి,    సర్వభావాదిష్ఠాతృత్వం= సమస్తవస్తువుల ఆధిపత్యమును, సర్వ జ్ఞాతృత్వంచ=సకల వస్తువిషయక యదార్థ జ్ఞానము లభించును.   
ప్రకృతి పురుషుడు అనే వివేకముగల యోగికి,  సమస్తవస్తువుల ఆధిపత్యమును, సకల వస్తువిషయక యదార్థ జ్ఞానము లభించును.
3.50.తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యం
తద్వైరాగ్యాదపి=ఆ వివేకఖ్యాతి విషయమగు వైవిధ్యమయిన రాగ్యము అనగా కేవలము పరమాత్మయందే మనస్సు లగ్నమయినది అగుట వలన, దోషబీజక్షయే= రాగాది దోషములకు, మూలకారణమైన అవిద్యయొక్క నాశము అవ్వగా, కైవల్యం= మోక్షప్రాప్తి కలుగును.
ఆ వివేకఖ్యాతి విషయమగు వైవిధ్యమయిన రాగ్యము అనగా కేవలము పరమాత్మయందే మనస్సు లగ్నమయినది అగుట వలన, రాగాది దోషములకు, మూలకారణమైన అవిద్య నాశము అవ్వగా, మోక్షప్రాప్తి కలుగును.
3.51.స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్
పునః=తిరిగి, అనిష్ట ప్రసంగాత్=అనిష్టమగు సంసారము ప్రాప్తించునుగాక,  స్థాని= స్వర్గాది లోక పాలకులు, ఉపనిమంత్రణే= సత్కారా పూర్వక ప్రార్థనయందు, సంగా= ప్రీతియు, స్మయా= దేవతలు తనను ఆదరించిరని కృతార్థతా బుద్దియు, ఆకరణం= చేయరాదు.
సాధకునికి అనిష్టమగు సంసారము ప్రాప్తించునుగాక, స్వర్గాది లోక పాలకులు,  సత్కారా పూర్వక ప్రార్థనయందు, ప్రీతియు, దేవతలు తనను ఆదరించిరని కృతార్థతా బుద్దియు,  సాధకుడు చేయరాదు. అనగా కష్టములు వచ్చినప్పుడు క్రుంగిపోకూడదు. సుఖములు వచ్చినప్పుడు పొంగిపోకూడదు.
3.52.క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానం
క్షణ=క్షణవిషయమున, తత్క్రమయోః= ఆక్షణపు క్రమము విషయమునను,   సంయమాత్ = సంయమము వలన, వివేకజం=వివేకవంతమయిన, జ్ఞానం= జ్ఞానము కలుగును.
క్షణవిషయమున, ఆ క్షణపు క్రమమువిషయమునను, సంయమమువలన వివేకవంత మయిన, జ్ఞానము కలుగును.
క్షణము= అతి సూక్ష్మము అయిన ఇక విభజించబడని కాలము.
 అట్టి క్షణములు రెండింటిలోరెండవది మొదటిదానికి క్రమము అగును. ఘటిక, ముహూర్త, ప్రహర, దివా, రాత్రి అనునవి కాలములోని క్రమములు.
3.53. జాతి లక్షణ దేశైరన్యతానవచ్ఛేదాత్తుల్య యోస్తతః ప్రతిపత్తిః 
జాతి లక్షణ దేశైః= జాతి, లక్షణము, దేశము, అనువానిచేత, అన్యతానవచ్ఛేదాత్=భేద నిశ్చయము కలుగదు, తుల్యయోః= సమానమగు పదార్థములకు, ప్రతిపత్తిః= భేద జ్ఞానము, తతః= ఆ వివేక జ్ఞానము వలననే కలుగును.
ఒక్కొక్కప్పుడు, జాతి, లక్షణము, దేశము, అనువానిచేత, భేద నిశ్చయము కలుగదు,  ముఖ్యముగా సమానమగు పదార్థములకు,  భేద జ్ఞానము,  ఆ వివేక జ్ఞానము వలననే నిర్ణయించ కలుగును.
3.54.తారకం సర్వవిషయం సర్వథా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం  
తారకం= సంసారమునుండి తరింపచేయునట్టి, సర్వవిషయం= పదార్థములను విషయీకరించునట్టి,  సర్వథా విషయం=అన్నివిధముల అన్నింటినీ  విషయీకరించు నట్టి, అక్రమం చ= క్రమమును అడ్డగించక హటాత్తుగా ఒకే సారి కలుగునది,  ఇతి= అను లక్షణములు కలది,  వివేకజం= ప్రాకృత పురుష వివేకమయిన జ్ఞానం,  జ్ఞానం= జ్ఞానంము.
వివేకముతోకూడిన జ్ఞానము, సంసారమునుండి తరింపచేయును. కనుక తారకము అనబడును. ఇంకొకరి ఉపదేశము అవసరము లేకుండా తనకు తానె స్వప్రతిబోత్థిత మగును. భౌతిక ప్రపంచము విషయములతో సబంధము లేక, కేవలము పరమాత్మతోనే సబంధముతో హటాత్తుగా ఒకే సారి కలుగు లక్షణములు కలది. ఈ  జ్ఞానము, ప్రాకృత పురుష వివేకమయిన జ్ఞానం.
3.55.సత్వ పురుషయో శ్శుద్ధి సామ్యే కైవల్యమితి
సత్వ పురుషయోః= బుద్ధికి పురుషునకు, శ్శుద్ధి సామ్యే= శుద్ధి యొక్క తుల్యత్వము కలిగెనేని,  కైవల్యమితి= కైవల్యము అబ్బును.
పురుషునిబుద్ధి, పరిశుద్ధము అయితే కైవల్యము అబ్బును.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana