శ్రీకృష్ణాష్టమి
శ్రీకృష్ణాష్టమి—దక్షిణాయణం—వర్షఋతువు—శ్రావణమాసము—బహుళ పక్షము —అష్టమి
శ్రీకృష్ణాష్టమి శ్రావణ బహుళ
అష్టమి నాడు వస్తుంది. పరమాత్మశ్రీకృష్ణ జన్మదినము అగుట వలన
దీనిని జన్మాష్టమి లేదా గోకులాష్టమి అనికూడా అంటారు.
శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకీమాత శరీరమునకు ప్రతీక. తండ్రి వాసుదేవుడు ప్రాణశక్తికి ప్రతీక. శరీరమునందు ప్రాణశక్తి పెరిగినప్పుడు ఆనందం అనగా శ్రీకృష్ణుడు పుడతాడు. కాని అహంకారము అనగా కంసుడు ఆ
ఆనందమును తీసివేయుటకు ప్రయత్నము చేస్తుంది. దేవకీ సోదరుడు అయిన కంసుడు శరీరము అనగాదేవకీమాత ఏర్పడినపుడే దానితోపాటే పుడతాడు. సుఖము, సంతోషము, మరియు ఆనందకరమయిన శరీరము ఇతరులకు హాని చేకూర్చదు. సుఖ సంతోషములు లేనివాడే ఇంకొకరి అనర్థమునకు హేతువు. ప్రేమ, సర్వసాధారణత్వము, మరియు ఆనందములకు ప్రతీక అయిన శ్రీకృష్ణుని ముందర అహంకారము(కంసుడు) కరిగి లేక వీగిపోతుంది.
అహంకారము ఎక్కువయినపుడు ఈ శరీరము ఒక కారాగారములాగా ఉంటుంది. శ్రీకృష్ణుడు కారాగారములో దేవకికి జన్మిస్తాడు. అప్పుడు కావలివాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అనగా ప్రేమ, సర్వసాధారణత్వము, మరియు ఆనందములకు ప్రతీక అయిన శ్రీకృష్ణుని జన్మ కావలివాళ్ళు అనగా ఇంద్రియములను అంతర్గతము చేస్తుంది. బహిర్గతము అయిన ఇంద్రియములు అహంకారమునకు ప్రతీక. అనగా మేల్కొన్న ఇంద్రియములు అహంకారమునకు ప్రతీక.
శుద్ధ జ్ఞానము వెన్నకు ప్రతీక. వెన్న ఆరోగ్యమునకు, పౌష్టికతకు ప్రతీక. ఆ
వెన్న అనగా శుద్ధజ్ఞానమును దొంగిలించినవాడే లేదా దొంగిలించేవాడే శ్రీకృష్ణుడు. అటువంటి శుద్ధజ్ఞానమునకు పరాకాష్ఠ అయిన శ్రీకృష్ణుడు నిర్వికల్పుడు, నిరాసక్తుడు,
మరియు నిర్విషయాసక్తుడు.
ఆయన
ధరించే నెమలి కన్ను పింఛము మూడవనేత్రము అయిన శ్రీకృష్ణ చైతన్యమునకు ప్రతీక. శవమునకు ఆలోచనలు రావు. ప్రాణశక్తి లేదా శ్రీకృష్ణ చైతన్యము వచ్చిపోయే శరీరము మంగళకరమయినది. ఆ శరీరమునే శివము అందురు. ఆ శివములోని ఆలోచనలు గోప్యముగా ఉండును. గోప్యముగా ఉండు ఆలోచనలను గోపికలు అందురు. ఆ ప్రతి గోపిక వెనకాల శ్రీకృష్ణుడు లేదా శ్రీకృష్ణచైతన్యము ఉండితీరవలసినదే. అవి పదహారువేలు ఉండును. ఇది
షుమారుగా చెప్పినది. ఆలోచనలను అనగా గోపికలను ఎవ్వరూ లెక్క పెట్టి చెప్పలేదు. శ్రీకృష్ణునికి పదహారువేలమంది గోపికలు అంటే ఇది అర్ధము.
జన్మించిన ప్రతిజనుడు లేదా మనిషి ఆనందముతో ఉండవలెను అని చెప్పుటకు ఉద్దేశ్యించబడినదే ఈ
జన్మాష్టమి. దానికై సహకరించునది క్రియాయోగము.
Comments
Post a Comment