విశ్వరూపము

                                విశ్వరూపము
ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. అందు వలన రాజ్యమును పాండురాజు పరిపాలించాడు. పాండురాజుకు కుంతి మరియు మాద్రి అని ఇద్దరు భార్యలు. వారి కుమారులు పాండవులు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు.  అసూయ అనే  పురుగు దుర్యోధనుని అంతఃకరణములో ప్రవేశించినది. అతను శకుని మున్నగు వారి సహాయముతో వక్రమార్గమున ధర్మరాజుని అతని సోదరులను జూదమున ఓడిస్తాడు. వారిరాజ్యమును కాజేస్తాడు. వారిని 12  సంవత్సరముల వనవాసము, ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయిస్తాడు. అప్పటికీ వారిరాజ్యమును వారలకు ఇచ్చుటకు ఒప్పుకోడు. సూదిమోపినంత స్థలముకూడా ఇవ్వనంటాడు. తదుపరి శ్రీ కృష్ణుడు రాయబారము చేస్తాడు. ప్రయోజనము ఉండదు.కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో పాణ్డవ కౌరవ సేనలు బారులుతీర్చి నిలబడియున్నవి. అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రెండుసేనలమధ్య తమ రథమును నిలబెట్టెను. అప్పుడు ఆ సేనల మధ్యనున్న అన్నలు, తమ్ములు, మామలు, మేనమామలు, బావలు, బావమరిదులు, తండ్రులు, తాతలు, గురువులు మున్నగువారినిజూచి విలపించుచూ ఈ బంధువులనుజంపి రాజ్యము సంపాదించుటకంటే వేరే పాపము ఏమన్నా యున్నదా? నాకు కర్తవ్యాన్నిబోధించమని అడుగుతాడు. దాని ఫలితమే గీత.
మనిషి , మూడుశరీరములు:
మనిషికి మూడుశరీరములున్నవి. జన్మించిన మనిషికి ఒక జడమైన స్థూల శరీరము, దానిలోపల సూక్ష్మశరీరము, దానిలోపల కారణశరీరము, దాని లోపల ఈమూడుశరీరములు స్థితివంతమగుటకు వ్యష్టాత్మ ఉంటాయి.
భౌతిక, ఆరోగ్య మరియు సాంఘిక ధర్మములు స్థూలశరీరమునకు వర్తిస్తాయి.
నీతి, నియమములు, మనస్తత్వ విషయములు, జన్మాంతర సంస్కా రములు, కోరికలు, ఆలోచనలు  సూక్ష్మశరీరమునకు వర్తిస్తాయి.
ఆధ్యాత్మికత, దివ్యమైన ప్రకృతి మరియు పరమాత్మతో అనుసంధానం కారణశరీరమునకు వర్తిస్తాయి.
కారణశరీరము సర్వశక్తిమంతమైన పరమాత్మకు దగ్గిరగాయున్నందున మిగిలిన సూక్ష్మ మరియు స్థూలశరీరములు స్థితివంతమగుటకు వలసిన శక్తి మరియు సహజావబోధన కారణశరీరముద్వారా  సూక్ష్మ శరీరములోనికి, ఆ తరువాత స్థూలశరీరములకు సమకూర్పబడుతాయి. కనుక పరమాత్మతో అనుసంధానమునకు మొదట స్థూల తరువాత సూక్ష్మ, తదుపరి కారణశరీరమును సమాయత్త పరచవలెను.
ఆత్మ ఏవిధముగా భౌతిక, సూక్ష్మ మరియు కారణశరీరముల తొడుగులలో ఉన్నట్లుగా కనబడుతున్నదో, సృష్టిలోని పరమాత్మకూడా భౌతిక, సూక్ష్మ మరియు కారణశరీరముల తొడుగులను ధరిస్తుంది. భౌతిక బ్రహ్మాండ సృష్టికర్తగా విరాటుడుగాను, వ్యష్టి భౌతిక  సృష్టికర్తగా విశ్వుడుగాను, సూక్ష్మ బ్రహ్మాండ సృష్టికర్తగా హిరణ్యగర్భుడుగాను, వ్యష్టి సూక్ష్మ సృష్టికర్తగా తైజసుడుగాను, కారణ బ్రహ్మాండ సృష్టికర్తగా ఈశ్వరుడుగాను, వ్యష్టి కారణ  సృష్టికర్తగా ప్రాజ్ఞుడుగాను, వ్యక్తీకరణచేస్తాడు..
మహాభారతములో భగవాన్ శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు పాండవుల దూతగా వెళ్తారు. యుద్దము వద్దని చెప్తారు. 5 ఊళ్ళు  ఇస్తే చాలు, పాండవులు యుద్దము చేయరు. ఈ విధమయిన శాంతి ప్రస్థావన తెస్తారు. అయినను అసూయా పరు లయిన  కౌరవుల రాజు దుర్యోధనుడు యుద్దమువయిపే మొగ్గు చూపుతాడు. అంతేకాక తన తమ్ములతో కలిసి  శ్రీకృష్ణుని తాళ్ళతో బంధించుటకు ప్రయత్నిస్తాడు. అప్పుడు తన విశ్వరూపమును ప్రదర్శిస్తాడు. అది తట్టుకోలేక కౌరవులు దూరముగా పారిపోతారు. అశక్తులవుతారు. ఒక్క దృతరాష్ట్రుడు మాత్రమె ప్రార్థించి చూడగలుతాడు. దృతరాష్ట్రుడు అనగా గుడ్డి మనస్సు. శుద్ధ బుద్ధి శుద్ధ మనస్సు శుద్ధాత్మ ఒక్కటే అని శ్రీ రామకృష్ణ పరమహంస అనేవారు. ఆ సమయములో గుడ్డి మనస్సు శుద్ధ మనస్సుగా రూపాంతరము చెందినదని అర్ధము. మనస్సు చంచలమయినది కాబట్టి ఆ తరువాత యథాతథముగా వాస్తవము గుర్తించలేని గుడ్డి మనస్సుగానే తిరిగి రూపాంతరము చెందినదని అర్ధము.   
Iఇక్కడ కౌరవులు అనగా సాధకునిలోని నకారాత్మకశాక్తులు.  అవి మాయాప్రభావమువలన సాధకుని క్రియాయోగాసాధన చేయకుండా చేస్తూ ఉంటాయి.  శ్రీకృష్ణుడు అనగా ఆత్మబోధ లేక శుద్ధాత్మ. ఇక్కడ విశ్వరూపము అనే మాటను వాడారు. విరాట్ రూపము అనే మాటను వాడ లేదు.  విశ్వఅనేది వ్యక్తిలోని వ్యష్టాత్మకి సంబంధించినది. కనుక ఎవడికి వాడే తనలోని దుర్యోధనుడు(కామ), దుశ్శాసనుడు(క్రోధ), కర్ణుడు(లోభ), శకుని(మోహ), శల్య(మద), కృతవర్మ(మాత్సర్య) మరియు 100 మంది కౌరవాదులు అనువారలను జయించవలయును అని అర్ధము. అంతేకాదు, శ్రీకృష్ణుడు అనగా ఆత్మబోధ లేక శుద్ధబుద్ధిని నకారాత్మకశాక్తులు ఏమీ చేయలేవు, ఈ తాళ్ళు అనే ఏ ఈషణ త్రయములున్ను శుద్ధబుద్ధిని బంధించలేవుఅని అర్ధము. శుద్ధబుద్ధి సాధకునికి క్రియాయోగాసాధన ఏ భయము సంకోచము పెట్టుకొనక  చేయుటకు తోడ్పడుతుంది. నకారాత్మకశక్తులతో సంధి అనవసరము అని చెప్పకనే చెప్పుతుంది.
విశ్వరూపసందర్శనయోగము శ్రీ భగవద్గీతలో ఏకాదశోధ్యాయము. ఏక=ఒక్కటి, దశ= దర్శించటము. అనగా సాధన అంతిమ లక్ష్యము పరమాత్మని ఒక్కడిగా దర్శించటము, ఆయనలో ఒక్కటి అనగా ఐక్యము అవటమే.  
  





Comments

  1. sir,
    a good notes and interpretation.
    regards
    deekshitulu

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana