3. అరణ్యకాండ -- రామాయణము
3. అరణ్యకాండ శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతముగా దండకారణ్య మహారణ్యమును ప్రవేశించెను. అటుపిమ్మట పెక్కు ఆశ్రమములను దర్శించెను. పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః తద్ బ్రహ్మ భవనప్రఖ్యం బ్రహ్మఘోషనినాదితం 1 నియమితమగు ఆహారము తీసుకొనువారును, పవిత్రులైన మహర్షులయొక్క సుశోభితములు, సుందరములు అయిన వారి వారి ఆశ్రమములు బ్రహ్మదేవుని నివాసమువలె తెజోవంతములు, వేదధ్వనితో ప్రతిధ్వనించునవియు అయి యున్నవి. అత్యంతప్రియుడయిన శ్రీరామ సీత లక్మణులను ఆహ్వానించి తమ తమ పర్ణశాలలకు ఋషులు తీసికొని వెళ్ళిరి. ఆ ఋషులకు జరిగిన విషయము అంతా శ్రీరామ సీత లక్మణులు చెప్పిరి. దానికి ఆ ఋషులు యిట్లనిరి: శ్రీరామా, మేము క్రోధమును వదిలివేసితిమి. రాజు ధర్మమును పరిపాలించువాడును, యశస్వియును, ప్రజలకు శరణ్యుడును, పూజనీయుడును, మాన్యుడును, అందరికీ గురుసమానుడును, అయి ఉండవలయును. మేము ఇంద్రియములను జయించితిమి. ఇప్పుడు తపస్సే మా ధనము. తమరు మమ్ములను ర...