జంతువు—మనిషి—చక్రములు



జంతువు—మనిషి—చక్రములు
పురుగులు పశు పక్ష్యాదులలో ప్రాణశక్తి ఉంటుంది. మనిషి శరీరములో చక్రములు ఉంటాయి. మనిషి భగవంతుని మూసలో చేయబడ్డాడు లేదా వ్యక్తీకరించబడ్డాడు. అందువలననే మనిషి జన్మ, ముముక్షత్వము, మరియు మహాపురుష దర్శనము దుర్లభము. దేవతలయిననూ, భగవంతునితో అనుసంధానం చెందుటకు మానవజన్మ ఎత్తవలసినదే. మానవుడిగా తప్పులు/పాపము చేసిన వాడు హీనజన్మలు ఎత్తవలసినదే. హీనజన్మలు అనగా పురుగు, వృక్షము, పక్షి, జంతువు అనేవి. కేవలము ఈ జన్మలు శిక్ష అనుభవించుటకై మానవుడు ఎత్తు జన్మలు. వీటికి కర్మ, కర్మ ఫలితము, పాపపుణ్యములు ఉండవు. ఒక పులి ఎన్ని పశువులను తిన్నా దానికి పాపపుణ్యములు అంటవు.  
తప్పుచేసినవారిని శిక్షిస్తారు. ఆ శిక్షలు మరియు జైలులో వారిని ఉంచే శిక్షా సమయములు వారి వారి నేరమును బట్టి ఉంటాయి. వారికి స్వేచ్ఛ ఉండదు.
తప్పులు/పాపము చేసినమానవుడికి కలుగు శిక్షలే ఈ బీద మానవుడు, రోగిష్టి మానవుడు, అవయవముల లోపమున్న మానవుడు, హీనజన్మలు అనగా పురుగు, వృక్షము, పక్షి, పశువు అనేవి.  
స్వేచ్ఛ లేని జైలులో ఉన్న  శిక్షను అనుభవిస్తున్న మానవుడు చేసే కర్మ పరాధీనమై  ఆశిక్షా సమయములో జైలు అధికారుల అధీనమై  ఉంటుంది. అనగా వాడు ఆ సమయములో చేసే జైలు అధికారుల ఆజ్ఞలను అనుసరించి చేయు కర్మ వాడికి అంటదు. ఆపాప పుణ్యముల కర్మ ఫలితము ఆ జైలు అధికారులకే అంటుతుంది. కాని పనిలేని విశ్రాంతి సమయములో వాడు చేసే కర్మ ఫలితము ఆ నేరస్తుడికే చెందుతుంది. గాంధీ మహాత్ముని లాంటి వారు జైలులో విశ్రాంతి సమయములో శ్రీభగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలు చదివేవారు. సద్గ్రంధరచన చేసేవారు. ఆ పుణ్య ఫలితము వారికే దక్కును.
ఒక్క మానవునికి మాత్రమె ఈ 7 చక్రములు ఉన్నవి. వీటిని వ్యష్టిలోని చక్రములు అంటారు.  బయటకూడా  7 చక్రములు ఉన్నవి. వీటిని సమిష్టిలోని చక్రములు అంటారు. మనిషిలోని 7 చక్రములు, మరియు సమిష్టిలోని 7 చక్రములను ఈ క్రింద పట్టికలో ఇచ్చాను.
మనిషి ఏ వస్తువునయినాను ఎక్కువ పరిమాణములోనే చేస్తాడు. ఒక్క ఇడ్లీ, ఒక్క లడ్డూ బూంది ఒక్క పకోడీ ఇట్లా చేయడు, చేయలేడు. అనగా ఒక రకముగా సమిష్టిగానే సృష్టిస్తాడు. దానిలోనుండి ఎవరికి కావలసినది వారు తీసుకుంటారు. అదే చందమున  పరమాత్మ ఒక్క మనిషి, ఒక్క పక్షి, ఒక్క పశువు, ఒక్క పురుగు, ఒక్క వృక్షముగా, అనగా వ్యష్టిగా కాక, సమిష్టిగానే సృష్టించాడు. అనగా సృష్టి  సమిష్టిగానే వ్యక్తీకరించబడినది. అందుకనే సమిష్టి శబ్దము (చెవి-వినికిడి శక్తి), చర్మము- స్పర్శ, రూపము-చూసే శక్తి, రస-రుచి శక్తి, గంధ-వాసన శక్తి గానే వ్యక్తీకరించబడినవి. మనమందరమూ ఆ సమిష్టిలోని వ్యష్టులమే.  అందువలననే, ఒక జంతువు ఒకడికి ఎట్లా కనబడునో మిగిలిన వారికి అట్లానే కనబడును. ఒక పండు రుచి ఒకడికి ఎట్లా ఉండునో మిగిలిన వారికి అట్లానే ఉండును.

వ్యష్టిలోకము
సమిష్ఠిలోకము
పాతాళ (మూలాధారచక్ర)
భూ
మహాతల (స్వాధిష్ఠానచక్ర)
భువర్
తలాతల (మణిపురచక్ర)
స్వర
రసాతల(అనాహతచక్ర)
మహర్
సుతల (విశుద్ధచక్ర)
జన
వితల (ఆజ్ఞాచక్ర)
తపో
అతల(సహస్రారచక్ర)
సత్య


మనిషి సమిష్ఠిలోనుండి వ్యష్టిలోనికి వచ్చాడు. కనుక తెలిసో తెలియకో మనప్రయాణము వ్యష్టి లోనుండి సమిష్ఠిలోనికే. మనము ఎవరి ఇంటికి లేదా ఒక ప్రదేశములోనికి వెళ్ళినా ముందర వ్యష్టిని అనగా కొంత ప్రదేశము చూచి అటు పిమ్మట చుట్టుప్రక్కల అంతా పరికించి చూస్తాము. అదేవిధముగా సాధకుడు తన ధ్యానములో ఒక్కొక్క చక్రము అనగా వ్యష్టిలోనికి ముందర చొరబడుతాడు. ఉదాహరణకి ధ్యానములో వ్యష్టిలోని లేదా తనలోని పాతాళము లోనికి ముందర చూస్తాడు.  పండుని కొంచెము కొరుక్కొని తిని ఆ పిమ్మట మొత్తము పండు కొరుక్కొని తినే రీతిన, తనలోని వ్యష్టిని ముందర అనుభవిస్తాడు. దానికి గుర్తు: ఆ చక్రముయొక్క రుచి, లేదా రంగు, లేదా శబ్దము, మరియు లేదా దళములలో, ఏ ఒక్కటిగాని, లేదా అన్నియుగాని అనుభవం చెందుతాడు. అటు పిమ్మట సమిష్టిలోనికి అనగా పాతాళమునుండి పృధ్వీలోనికి ప్రవేశించటము జరుగుతుంది. మొదటి సారిగా కార్ డ్రైవింగ్ (car driving) చేసేవాడికి ఆ తరువాత క్రమముగా సాధారణమయినట్లుగా, అలవాటు పడిపోతాడు. 
అన్నమయ కోశమునకు సంబంధించినది పదార్ధము. చరాచర (కదిలే మరియు కదలని) ప్రపంచమునకు అన్నమయ కోశము ఉండును. అనగా రాళ్ళు రాప్పలు కేవలము అన్నమయకోశములోనివె. ఆ తరువాతిది ప్రాణమయకోశము. చెట్లుచేమలు అనేవాటికి  అన్నమయకోశము మరియు ప్రాణమయకోశము రెండూ ఉండును. ఆ తరువాతిది మనోమయకోశము. పశుపక్ష్యాదులకు  ఈ మూడు అనగా అన్నమయకోశము, ప్రాణమయకోశము, మరియు మనోమయకోశము ఉంటాయి. శుక్లము(sperm) శోణితము (ova) ఉన్న వాటికి మాత్రమే మనోమయకోశము వర్తిస్తుంది.  
రాళ్ళు రాప్పలు,మరియు  చెట్లుచేమలు అనేవాటికి శుక్లము(sperm) శోణితము (ova) అనేవి ఉండవు. కనుక వీటిని మనము ఆరగించవచ్చు. మనకు అనుకూలముగా ప్రకృతికి హాని కలగకుండా ఉపయోగించుకోవచ్చు.
ఆ తరువాతిది విజ్ఞానమయకోశము. మంచిచెడు అనగా యుక్తాయుక్త విచక్షణా జ్ఞానము కలది విజ్ఞానమయకోశము. ఈ అన్నమయకోశమును స్థూల శరీరము అందురు. ప్రాణమయ, మనోమయ, మరియు విజ్ఞానమయ కోశములు మూడింటినీ కలిపి సూక్ష్మ శరీరము అందురు. విజ్ఞానమయ కోశములేని ప్రాణులకు సూక్ష్మ శరీరము మరియు కర్మ  ఉండదు. అందుకనే పైలోకములో ఉండగలుగు లేక ఉండు  ప్రేతములు  స్థూలశరీరము వదలిన సూక్ష్మ, కారణ శరీరములు, మరియు కర్మ గల జీవులే. అంతియేగాని అక్కడ ఈ రాళ్ళు రప్పలు, స్థూల శరీరము వదిలిన పశుపక్ష్యాదుల సూక్ష్మశరీరములు ఉండవు, కనబడవు.
   ఆ తరువాతిది ఆనందమయకోశము. దీనినే కారణశరీరము అందురు. ఈ కారణశరీరము పరమాత్మకు చేరువులో ఉండే ఆనందమయకోశము. ఈ ఆనందమయకోశము కేవలము మనిషికి మాత్రమె అదియును ధ్యానయోగికి మాత్రమె అనగా యోగులకు, ధ్యానపరులకు మాత్రమె ప్రాప్తము.
మనిషి శరీరములో అనేకరకములయిన పురుగులు ఉండును. వాటిలోనూ చక్రములు ఉండునా, ఉండవు. ప్రతి మనిషి ప్రధానమంత్రి పదవిలో ఉండలేనట్లుగానే, ప్రతిజీవికి ఈ చక్రములు ఉండటము అసాధ్యము. నేను ఆయా లోకములలో చూడలేదు.  కేవలము మనిషికి మాత్రమె 7 చక్రములు  నిస్సందేహముగా ఉన్నవి.
   భౌతికమైన మరియు ఆధ్యాత్మకమయిన వ్యత్యాసములు మనుషులకు పశువులు మరియు ఇతర నీచ జాతులకు ఎన్నో ఉన్నవి. ఉదాహరణకు:
ఆత్మవిశ్వాసము, సౌందర్యోపాసన, హాస్య ప్రవృత్తి, మరణము తథ్యము అనే జ్ఞానం, కాలముయొక్క జ్ఞానం, శబ్దములమధ్య ఉన్న వ్యత్యాసము లేదా , శబ్ద జ్ఞానం, సంగీత జ్ఞానం, జీవిత పరమార్థం యొక్క జ్ఞానం, శీతోష్ణస్థితుల జ్ఞానం, శీతోష్ణస్థితులకు అనుగుణముగా దుస్తులు ధరించగల జ్ఞానం, ప్రకృతినియమాలను ఉల్లంఘించి రైలు, రోడ్డు, ఆకాశ (విమాన), మార్గముల ప్రయాణించగలిగిన జ్ఞానం, ఒకే కుటుంబానికి, గోత్రమునకు సంబంధించిన వారితో వివాహముమరియు సంభోగము  కూడదనే  నిషేధ నియమముల  జ్ఞానం, ఆవేశముతోను, జన్మతహా వచ్చే స్వభావము(instinct)లతో కాక ఆలోచనాపూర్వక క్రియా జ్ఞానం, ప్రేమ ఆప్యాయత సహోదరభావ జ్ఞానం, కట్టు బొట్టుల జ్ఞానం, తన శరీర స్వభావమునుబట్టి ఆరోగ్య పరిస్థితులనుబట్టి  తీసుకోవలసిన లేదా పాటించవలసిన ఆహార నియమముల జ్ఞానం, కృషితో అన్ని రంగములలోను పైకి వచ్చే జ్ఞానం, ఇంకొకడి ఆరోగ్యము ఐశ్వర్యం, ఉన్నతికై భగవంతుని ప్రార్థించే జ్ఞానం, ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎన్నో.
అందువలననే మనిషి మానవ రాక్షసుడు, మానవ పశువు, మానవ మానవుడు అవస్థలను(stages) దాటి మానవ దేవుడు అవ్వాలి. దానికి ఏకైక మార్గము క్రియాయోగ సాధనే. ఏదయినా వేడి వస్తువు ముట్టుకున్నప్పుడు మనలోని పంచజ్ఞానేంద్రియములలో ఒకటయిన స్పర్శేంద్రియము చర్మము గ్రహించి  సెన్సర్ (senser nerves) నరములద్వారా బుర్రకు(cerebrum) సమాచారము చేరవేస్తుంది. బుర్ర మోటార్ (motor nerves) నరములద్వారా చేతులు వెనక్కి తీసుకొమ్మని సంకేతము పంపుతుంది. అదేవిధముగా చూపు, శ్రవణము, ఘ్రాణము, మరియు రుచిలకి సంబంధించిన ఇతర జ్ఞానేంద్రియముల ద్వారా అందిన సమాచార సేకరణనిబట్టి ఆయా సంబంధిత ఇంద్రియములకు అవయవములకు పాటించవలసిన ఆజ్ఞలు (orders) బుర్ర పంపుతుంది. కాని మనము చాలా సందర్భములలో అనుభవము పొందకమునుపే, సెన్సర్ (sensor nerves) మరియు మోటార్ (motor nerves) నరముల ప్రమేయము లేకుండానే పనులు చేస్తూ ఉంటాము. ఉదాహరణకి: వేడివస్తువుని చూచి ముట్టుకోకపోవటము, పాము, తేలులాంటి విష జంతువులనుండి దూరముగా ఉండటము,  ఇత్యాదివి ఎన్నో. అనగా మనిషికి ఆలోచనా సరళి(కారణమనస్సు- causal mind), అవచేతనా మనస్సు (sub-conscious mind), మరియు చేతనా మనస్సు (conscious mind)అనేవి ఉన్నవి అనటములో ఏమాత్రము సందేహములేదు.

Comments

  1. Om namasivaya. Pranams guruji.you have explained very clearly about chakras.I am very fortunate to have you as my kriyayoga guru.I am practising chakra dyana and meditation daily.my regards to mataji. Varalakshmi.

    ReplyDelete
  2. Excellent!!!! Guru garu 🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana