7. రామాయణము ఉత్తరకాండ

  

 7.   ఉత్తరకాండ

రాక్షసులను సంహరించిన పిదప ఆనందము పొందిన మహర్షులు శ్రీరాముని అభినందించిరి. అందుకై అయోధ్యకు వచ్చిరి.

కౌశికః అథ యవక్రీతో గార్గ్యో గాలవ ఏవచ

కణ్వోమేదాతిథేః పుత్రః పూర్వస్యాం దిశియేశ్రితాః                              1

తూర్పు దిక్కునందు ఉండు కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, గాలవుడు, అట్లాగే 

మేదాతిథి పుత్రుడైన కణ్వుడు అక్కడికి వచ్చిరి.

స్వస్త్యాత్రేయశ్చ భగవాన్ నముచిః ప్రముచిస్తథా

అగస్త్యః అత్రిశ్స్చ భగవాన్ సుముఖో విముఖస్తథా

ఆజగ్ముస్తే సహాగస్త్యా యే శ్రితా దక్షిణాం దిశం                                     2                              

దక్షిణ దిశయందు ఉండు స్వస్త్యాత్రేయుడు, భగవాన్ నముచి, ప్రముచి, అగస్త్యుడు, భగవాన్  అత్రి, సుముఖుడు, విముఖుడు, వీరందరూ అగస్త్యమహర్షితో కలిసి వచ్చిరి. 

నృషః కవషో ధౌమ్యః కౌశేయశ్చ మహానృషిః

తేప్యాజగ్ముః సశిష్యావై యే శ్రితాః పశ్చిమాం దిశం                           3

పడమటి దిక్కుయందు ఉండు నృషఙ్గుడు, కవషుడు, ధౌమ్యుడు, మహర్షి కౌశేయుడు,  -- వీరందరూ తమతమ శిష్య సమేతముగా వచ్చిరి. 

వసిష్ఠః కశ్యపః ధాత్రిః విశ్వామిత్రః సగౌతమః

జమదగ్నిః భరద్వాజః తేపి సప్తయర్షః తథా

ఉదీచ్యాం దిశి సప్తైతే నిత్యమేవ నివాసిన                                   4

ఉత్తరపు దిక్కుయందు ఉండు వసిష్ఠుడు,  కశ్యపుడు, ధాత్రిః, విశ్వామిత్రుడు, గౌతముడు,

జమదగ్ని, భరద్వాజుడు, అను ఈ సప్తర్షులు  వీరందరూ తమతమ శిష్య సమేతముగా అయోధ్యాపురికి వచ్చిరి. 

దృష్ట్వా ప్రాప్తాన్ మునీంస్తాంస్తు ప్రత్యుత్థాయ కృతాఞ్జలిః

పాద్యాః అర్ఘ్యాదిభిః ఆనర్చ గాం నివేద్య చ సాదరం                                     5

ఆ మహానుభావుల్ని గాంచి శ్రీరాముడు చేతులు జోడించుకొని నిలబడెను. . అర్ఘ్యపాద్యాదులచే వారిని ఆదరపూర్వకముగా ఆహ్వానించెను.  పూజకు ముందుగా వారికి గోదానము చేసెను.

అప్పుడు శ్రీరామచంద్రుడు వారందరి సమాచారము అడిగెను. అప్పుడు వారిట్లనెను. శ్రీరామ, మమల్ని క్షేమముగా చూచుట ఆరోగ్యకరమైన విషయము. మీవలన రాక్షస సంహారము గావించబడెను. మేము క్షేమము. లొకకంటకుడు రావణుడు. అట్టి  రావణసంహారము ఆవశ్యకరము. మాయావియగు ఇంద్రజిత్తు ఎవ్వరిచేతను వధింపబడడు. అట్టి వాడు వధింపబడడుట ఆనందదాయకము. దానికి ఆశ్చర్యముగా శ్రీరాముడు ఇట్లనెను. ‘రావణుడు, కుంభకర్ణుడు—వీరిద్దరికంటె కంటే ఇంద్రజిత్తుని సంహరించుట కష్టతరమని మీరు వచించుట ఆశ్చర్యముగా ఉన్నది.’ అనెను.

శక్యం యదిమయాశ్రోతుం న ఖకు ఆజ్ఞాపయామి ఇవః   

యది గుహ్యం నచేత్ వక్తుం శ్రోతుం ఇచ్ఛామి కథ్యతాం                   8

ఇది గోప్యమయిన విషయము కానిచో నేను వినగోరతాను. దయచేసి చెప్పుడు. ఇది వినయపూర్వకమగు అభ్యర్ధన. నేను మేమ్ములను  ఆజ్ఞాపించుటలేదు.  అభ్యర్ధిస్తున్నాను.

మహాత్ముడయిన శ్రీరాముని తో సంతృప్తిచెందిన కుంభసంభవుడగు అగస్త్యుడు ఇట్లు చెప్పెను. శ్రీరామా, పూర్వము సత్యయుగమున ప్రజాపతియగు బ్రహ్మదేవునకు ఒక ప్రభావశాలి అయిన పులస్త్యుడు అని పేరుగల కుమారుడు ఉండెను. అతడు సాక్షాత్ బ్రహ్మదేవుడంత తేజస్వి. పులస్త్యుని పుతృడు విశ్రవసుడు. ఆయన తండ్రి మాదిరి గొప్ప తపోధనుడు. విశ్రవసుని పుతృడు వైశ్రవణుడు.  అతడు చాలాగొప్ప తపోధనుడు. అతడే కుబేరుడు.

తస్య ఆశ్రమ పదస్థస్య బుద్ధిర్జజ్ఞే మహాత్మనః

చరిష్యే పరమం ధర్మం ధర్మోహి పరమా గతిః                        7

ఆశ్రమవాసి అయిన మహాత్ముడగు ఆ వైశ్రవసుని మనస్సు ఉత్తమ ధర్మాచరణమునందు లగ్నమైయుండెను. ధర్మమే జీవునకు పరమగతి అని తెలుసుకున్న వాడు వైశ్రావణుడు. తదుపరి ‘సుమాలి’ యను రాక్షసుదు రసాతల లోకమునుండి భూలోకమునకు వచ్చి తిరుగుతూ ఉండెను. అతడు మంచి యోగ్యుడు.  అంతట ఆ ‘సుమాలి’ రాక్షసుడు తన కుమార్తె అగు ‘కైకసి’ తో ఈ విధముగా చెప్పెను. ప్రజాపతి వంశీకుడు, శ్రేష్ఠ గుణసంపన్నుడు, పులస్త్యుని కుమారుడు, బ్రహ్మజ్ఞాని, విశ్రవసుని వద్దకు స్వయముగా వెళ్ళెను. అమ్మా, కైకసి, నీవు ఈ విశ్రవసుని వివాహమాడుము అని అడిగెను. అంతట ‘కైకసి’ తన తండ్రి, ‘సుమాలి’ మాటను విని విశ్రవసుడు తపస్సుచేయు చోటుకు వెళ్లి నిలబడెను. విశ్రవసుడు బ్రాహ్మణుడు. ఆయన సాయంకాలిక అగ్నిహోత్రము చేయ దొడంగెను. అత్తరి ఆ ముని విశ్రవసుడు కైకసితో ఇట్లనెను. ఆయన ధ్యానముచేసి ఆ సుందరి కైకసితో ఇట్లనెను. సుందరీ, నీ ఉద్దేశ్యము నేను గ్రహించాను. నువ్వు నా వలన సంతానము పొందవలెనని నీ కోరిక. కాని నీవు వచ్చిన సమయము మంచిది కాదు. ఈ సమయములో సంతానము బడసిన స్త్రీకి కౄర స్వభావముగల సంతానము కలుగుదురు.  అట్లు కలిగిన సంతానము కౄరకర్మలనే చేయుదురు.

ముని ఇట్లు విశ్రవసుముని వచించిన కొంతకాలమునకు ‘కైకసి’  ఒక మహాభయంకరుడు, కౄర స్వభావము కలిగిన రాక్షసుని కనెను. అతనికి పది తలలు, ఇరువది భుజములు, పెద్ద దంతములు కలిగియుండెను. వాడు రావణుడు. ఆ తరువాత కుంభకర్ణుడు జన్మించెను. అంతటి శరీరము కలవాడు ఇంకొకడు ఈ ప్రపంచమున లేనే లేడు. అత్తరి రాక్షసి శూర్పణఖ పుట్టెను. అనంతరము విభీషణుడు పుట్టెను . అతను ధర్మాత్ముడు.  ఆయనే కైకసి చివరి కుమారుడు అయిన విభీషణుడు.

విభీషణస్తు ధర్మాత్మా నిత్యం ధర్మవ్యవస్థితః

స్వాధ్యాయ నియతాహార ఉవాస విజితేంద్రియః                                    8

విభీషణడు నిత్యము  ధర్మాత్ముడైయుండెను.  అతడు ఎల్లప్పుడూ  స్వాధ్యాయము చేస్తూ, నియమితమైన ఆహారము గైకొనుచు ఇంద్రియములను వశములో ఉంచుకొనెను.

అగస్త్యమహర్షి శ్రీరామునితో ఇట్లనెను. ముగ్గురి ధర్మాచరణము చేసెడి వారు.  వారి వారి తపస్సులకు మెచ్చి బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను. ‘దశకంఠా, వరము కోరుకొనుము.’ అనెను. అప్పుడు దశకంఠుడు రావణుడు ఇట్లనెను. ‘’దేవా, నేను గరుడ, నాగ, యక్ష, దైత్య, దానవ, రాక్షస, దేవతలచే చంపబడకుండులాగున వరమివ్వ ప్రార్థన.”

విభీషణస్తు ధర్మాత్మా వచనం ప్రాహ సాఞ్జలి

వృతః సర్వగుణైః నిత్యం చంద్రమా రశ్మిభిర్యథా                           9

పరమాపద్ గతస్యాపి ధర్మే మమ మతిర్ భవేత్

ఆశిక్షితం చ బ్రహ్మాస్త్రం భగవాన్ ప్రతిభాతు మే                               10

చంద్ర కిరణములచే, మరియు సదా సర్వ సుగుణములచే భూషితుడగు ధర్మాత్ముడు విభీషణుడు. ఆయన చేతులు జోడించుకొని బ్రహ్మదేవునితో ఇట్లనెను. మహాత్మా, పెద్ద పెద్ద ఆపదలయందు పడినను నా బుద్ధి ధర్మమంద స్థిరమైయుండుగాక. ధర్మమునుండి చలించకుండా ఉండుగాక.  శిక్షణ లేకనే బ్రహ్మాస్త్ర జ్ఞానము నాకు కలుగుగాక.

యా యా మే జాయతే బుద్ధిర్యేషు యేష్వాశ్రమేషు చ

సా సా భవతు ధర్మిష్ఠా తమ్ తమ్ ధర్మం చ పాలయే

ఏష మే పరమేదారో వరః పరమ కో మతః                                           11

ఏ ఏ ఆశ్రమ విషయమై విచారణ నాకుండునో, అది ధర్మమునకు అనుకూలముగా ఉండునుగాక. అట్టి ఆయా ఆయా ధర్మమునే నేను పాలించెదను. అట్టి సర్వోత్తమ ఉత్కృష్ఠ వరమును నాకు ఒసంగుడు అని విభీషణుడు ప్రార్థించెను. .   

నహి ధర్మాభిరక్తానాం లోకే కించన దుర్లభం

పునః ప్రజాపతిః ప్రీతో విభీణమ్ ఉవాచ హ                                12

ఎందుకంటె, ధర్మాచరణయందు ఆసక్తి ఉన్నవాడికి దుర్లభమైనది ఈ జగత్తులో ఏమియును లేదు.  ఇట్టి విభీషణుని వాక్యములను విని ప్రసన్నుడయిన బ్రహ్మదేవుడు ఇట్లు చెప్పెను. 

ధర్మిష్ఠస్త్వం యధా వత్స తథా చైతద్ భవిష్యతి

యస్మాద్ రాక్షసయోనౌ తే జాతస్యా మిత్రనాశనః

నా ధర్మే జాయతే బుద్ధిః అమరత్వం దదామి తే                             13

నాయనా, నీవు ధర్మమందు సదా ప్రతిష్ఠితమై ఉన్నావు. కనుక నీవు కోరినది నెరవేరుగాక. శత్రునాశకా, విభీషణా, నీవు రాక్షసకుల జాతకుడవైనప్పటికిన్నీ, నీ బుద్ధి అబద్ధమందు ప్రవర్తించుటలేదు. కావున నీకు నేను అమరత్వము ప్రసాదిస్తున్నాను.

పిమ్మట ‘వరము కోరుకొనుము’ అన్న బ్రహ్మదేవుని మాటలు విని కుంభకర్ణుడు ఇట్లనెను. ‘దేవదేవా, నేను పెక్కు సంవత్సరములు నిద్రించుచుండునుగాక’ అని కోరుకొనెను.  ‘అట్లే అగుగాక’ అని చెప్పి బ్రహ్మదేవుడు సర్వులకు చెప్పి అంతర్థానము అయ్యెను. 

కొంతకాలమునకు దైత్యరాజు అయిన మయుడు తన కుమార్తె మండోదరి యొక్క చేతిని రావణునిచేతిలో పెట్టి నవ్వుచు, రాక్షసరాజు అయిన రావణుడితో ఇట్లనెను. ‘రాక్షసరాజా, ఈమె అప్సరస అయిన హేమకూతురు. ఈమె పేరు మండోదరి. అత్యంత సౌందర్యవతి. మీరు భార్యగా స్వీకరించండి. ‘ అనెను.

శ్రీరామా, అంతట రావణాసురుడు ‘సరియే’ అని చెప్పెను. దైత్యరాజు అయిన మయుని కుమార్తె మండోదరిని వివాహమాడెను. కతిపయదినములకు మండోదరి ‘మేఘనాథుడు’ అనే పుత్రుడికి జన్మను ఇచ్చెను. అతడే ‘ఇంద్రజిత్’. కుంభకర్ణుడు నిద్రకు వశుడై యుండెను. దశకంఠుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దేవతలు, ఋషిలు, మునులు, యక్షులు, గంధర్వులు, వీరందరినీ సంహరించుచు వారికి బాధ కలుగజేయసాగెను.

విశ్రవసుని పుతృడు వైశ్రవణుడు.  అతడు చాలాగొప్ప తపోధనుడు. అతడే కుబేరుడు. ఆయన సోదరప్రేమను పరిచయము చేయుటకు, మరియు రావణునకు హితము చెప్పుటకు ఒక దూతను లంకకు పంపెను.  కాని రావణుడు దూతయొక్క హిత వాక్యములను పెడచెవిన పెట్టెను. ‘ఈ ముహూర్తమందు నేను ఒక్కని అపరాథముచే నలుగురు లోకపాలురను యమలోకమునకు పంపెదను.  ఇట్లా చెప్పి రావణుడు తన ఖడ్గముతో దూతను నరికివేసెను. ఆ శవమును దురాత్ములగు రాక్షలకు భక్షించుటకు ఇచ్చెను.

తదుపరి రథముపైనెక్కి మూడులోకములయొక్క విజయముకొఱకై రథయాత్ర చేసెను.  ఆ సమయములో ధనపతి అయిన కుబేరుడి స్థానమునకు పంపెను.  రావణుడు శాపవశాత్తు కౄరప్రకృతి కలవాడు. శిష్ఠాచారరహితుడు. ఆ వచ్చిన తనసోదరుడు రావణునితో కుబెరుడు ఇట్లనేను. రావణా, నీ దుర్బుద్ధితో నీవు వాస్తవం గ్రహించుటలేదు. మున్ముందు నీ పాపాపకర్మ ఫలమును తప్పక అనుభవించెదవు’ అనెను.  

యో హి మోహాద్ విషం పీత్వా నావ గచ్ఛతి దుర్మతిః

న తస్య పరిణామాంతే జానీతే కర్మణః ఫలం                              14

ఏ  దుర్మతి మోహము వలన తెలియక విషము త్రాగునో,  దాని పరిణామామము జరిగిన తదుపరి దాని కర్మఫలము తెలిసికొనుచున్నాడు.  

మాతరం పితరం విప్రం ఆచార్యం చావ మన్యతే

న పశ్యతి ఫలం తస్య ప్రేత రాజవశం గతః                               15

ఎవడు తల్లి, తండ్రి, బ్రాహ్మణులు, గురువులు, --వీరిని అవమానించునో, అతడు యమధర్మరాజుయొక్క వశములో తప్పకపడును. పిమ్మట ఆ కర్మ ఫలమును తప్పక అనుభవించును.

ఆధ్రువే హాయ్ శరీరే యోన కరోతి తపః ఆర్జనం

 న పశ్యాత్ తస్యతే మూఢః మృతో గత్వా  ఆత్మనో గతిం                           16

క్షనికమైనది ఈ శరీరము. అట్టి శరీరమును పొంది తపస్సును ఆచరించవలయును. ఆచరించనివాడు మూర్ఖుడు. అట్టి మూర్ఖుడు మృత్యువాత పడుతున్నప్పుడు పశ్చాత్తాపము చెందును.

ధర్మాద్ రాజ్యం దానం సౌఖ్యం అధర్మాద్ దుఃఖమేవచ

తస్మాద్ ధర్మం సుఖార్థాయ కుర్యాత్ పాపం విసర్జయేత్                          17  

ధర్మమువలన రాజ్యము, ధనము, సుఖము లభించును. అధర్మమువలన కేవలము దుఃఖమే లభించును.  అందువలన సుఖముకై ధర్మమునే ఆచరింపుము. పాపమును వదిలి వేయుము.

పాపస్య హి ఫలం దుఖం తత్ భోక్తవ్యమిహాత్మనా

తస్మాత్ ఆత్మావఘాతార్థం మూఢః పాపం కరిష్యతి                              18   

పాపముయొక్క ఫలము కేవలము దుఃఖము. దానిని స్వయముగా ఇచ్చటనే అనుభవించవలయును.  కావున ఏ మూఢుడు పాపము చేయునో  ఆ మూఢుడు శిక్షను తనే స్వయముగా అనుభవించవలయును.

కస్య చిన్న హి దుర్భుద్థే శ్చంధతో జాయతే మతిః

యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమశ్నుతే                                19

దుర్భుద్థి కలవాడికి సద్బుద్ధి కలుగదు. దుర్భుద్థి ఎట్టి కర్మ చేయునో, దానిననుసరించి అట్టి ఫలితమే కలుగును. 

బుద్ధిం రూపం బలం పుత్రాన్ విత్తం శూరత్వమేవచ

ప్రాప్నువన్తి నరా లోకే నిర్జితం పుణ్యకర్మభిః                            20

లోకములో జనులకు సమృద్ధి, సుందరరూపము, బలము, పుత్రులు, ధనము, శూరత్వము, మొదలగునవి పుణ్యకర్మానుష్టానము వల్లనే కలుగును.

ఏవం నిరయగామీ త్వాం యస్యతే మతిరీదృశీ

న త్వాం సమభిభాషిష్యే  ఏసద్ వృత్తేషు ఏవ నిర్ణయః                             21

అందువలన నీవు చేయు దుష్కర్మ అనుసారము నీవు నిస్సందేహముగా నరకములోనే పడదెవు. ఎందుకనగా నీ బుద్ధి పాపము చేయుటయందే ఆసక్తమైయున్నది. శాస్త్ర నిర్ణము ప్రకారము దురాచారులతో మాట్లాడకూడదు. కావున నేను కూడా నీతో ఏమియు మాట్లాడను.

ఆ తరువాత జరిగిన యుద్ధములో రావణుడు తన సోదరుడగు కుబేరుని జయించెను. కుబేరుని పుష్పక విమానమును తీసికొనెను. శ్రీరామా, అటు పిమ్మట రాక్షసరాజు అయిన రావణుడు ‘శరవణము’ అను వనమునకు పోయెను. ‘శరవణము’ అను వనము దేవతల యొక్క సేనాదిపతియగు కార్తికేయుడు జన్మించిన ప్రదేశము. అక్కడ లోపలికి వెళ్ళకూడదు అని శంకరుని పార్షదుడు అయిన నందీశ్వరుడు అడ్డుపెట్టెను.  అతని మాటలను లెక్కచేయలేదు దశగ్రీవుడు. అతడు అక్కడనే ఉన్న పర్వతము వద్దకు వెళ్లి దాని ముందర ఇట్లు చెప్పెను. యాత్రచేయుచున్న నా పుష్పక విమానమును ముందుకు వెళ్ళనీయకుండా ఈ పర్వతము ఆపినది. కనుక పశుపతీ, నీ పర్వతమును మొదలికంటా ఊడబెరికి పారవైచిదుని.  ఇట్లుచేప్పి ఆ పర్వతమును పెకిలించసాగెను. అంతట ఆ పర్వతము కదలసాగెను. 

చాలనాత్ పర్వతస్యైవ గణా దేవస్య కింపితాః

చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం                              22

పర్వతముయొక్క కదలికవలన దేవగణములన్నియు కంపించెను. పార్వతీదేవికూడా కదలెను. అప్పుడామే శంకరుని కౌగిలించుకొనేను. 

శ్రీరామ, దేవగణములలో శ్రేష్ఠుడును, పాపహరుడున్ను అయిన మహేశ్వరుడు అంతట ఆ పర్వతమును కాలి బొటనవ్రేలుతో ఒత్తెను. దానిచే పర్వతస్తంభమువలె ఉన్న రావణుని భుజము దానిక్రిందబడి నలిగిపోయెను.

తోషయస్వ మహాదేవం నీలకంఠం ఉమాపతిం                       

తమృతే శరణం నాన్యం పశ్యామి అత్ర దశానన                             23  

అప్పుడు అతనితోపాటు ఆ పుష్పక విమానములో ప్రయాణము చేయుచున్న అతని మంత్రులు మిగిలిన రాక్షసగణం యిట్లనిరి. దశకంఠా, నీవు నీలకంఠుడు, మరియు  ఉమాపతియును అగు మహాదేవుని సంతుష్ఠి పరచుము.  వారు తప్ప నీకు వేరెవ్వరూ నీకు శరణమొసంగు వారెవ్వరునూ లేరు అనిరి.

అంతట దశకంఠుడు వివిధ స్తోత్రములతోను, మరియు సామవేద మంత్రములతోను వారిని స్తుతించెను. అట్లు వేయి సంవత్సరములు స్తుతించెను. అంతట సంతుష్ఠి చెందిన శంకరుడు, పర్వతము క్రంద నలుగుచున్న దశకంఠుని చేతులు విడిపించెను. శంకరుడు ఇట్లనెను.

యస్మాల్లోకత్రయం చ ఏతద్ రావితం భయం ఆగతం

తస్మాత్ త్వం రావణో నామ నామ్నా రాజన్ భవిష్యసి.                           24

రాక్షసరాజా, నీ అరుపులు కేకలకు ముల్లోకములలోని ప్రజలు భయపడి యేడ్చినారు. అందువలన ఇకముందర నీవు రావణుడు అనే పేరుతొ ప్రసిద్ధికెక్కగలవు. ఇట్లు శంకరుడు పలికెను.

అంతటా శంకరుడు అతనికి అతని ఆయుర్దాయములో గతించినదానిని తిరిగి ఇచ్చెను. ‘చంద్రహాసము; అను ఖడ్గమును ఇచ్చెను. అంతటా రావణుడు భూతలమున హిమాలయముల వనములలో సంచరించసాగెను. అక్కడ ఒక తపస్విని అయిన కన్యను చూచెను.  ఆమె మృగ చర్మముపై ఘోర తపస్సు  చేయుచుండెను.  ఆమె అత్యంత సుందరముగా మెరయు చుండెను. రావణుని కామము మేల్కొనేను. రావణుడు ఆమెను రమ్మని ఆహ్వానించెను.  అంతట ఆ కన్య విధి ప్రకారము అతిథి మర్యాదలు సలిపి ఇట్లనెను.  బ్రహ్మర్హి కుశధ్వజుని కుమార్తెను నేను.  నా తండ్రి బృహస్పతి కుమారుడు. అయన బుద్ధియందు బృహస్పతి సమానుడు. నాతండ్రికి వాఙ్మయ కన్యారూపమున నేను ప్రావిర్భవించితిని.  నా పేరు వేదవతి. నారాయణుడే నా భర్త. ఆయన తప్ప మరియొకడు నా భర్త కాజాలడు. ఆయనను పొండుటకే నేను ఈ కతోరవ్రతమును చేయుచుంటిని.  ఆమాటలు వినినంతనే రావణుడు ఆమె కేశములను పట్టుకొనెను. అంతటా తన తపస్సు యొక్క తాపముచే అగ్నిని సృష్టించెను. ఆమె ఇట్లనెను. ‘ఓరీ రాక్షసాథమా, పాపీ, ఈ వనమందు నన్ను కామావేశాముచే నన్ను అవమానించితివి. కనుక నీ సంహారమునకై నేను తిరిగి జన్మించెదను. అంతట ఆమె అగ్నిప్రవేశము చేసెను.

సైషా జనక రాజస్య ప్రసూతా తనయా ప్రభో

తవభార్యామహాబాహో విష్ణుస్త్వం హి సనాతనః                         25  

శ్రీరామా, ఆ వేదవతియే జనకమహారాజుయొక్క పుత్రి రూపమున ఆవిర్భవించి మీ భార్యగా ఉన్నది. మహాబాహో, మీరు సాక్షాత్ సనాతనుడగు విష్ణువే అయి ఉన్నారు.

తదుపరి ‘ఉశీరబీజము’ అను దేశమునకు పోయెను. అక్కడ ‘మరుత్’ అను రాజు దేవతలతో కూర్చొని యజ్ఞము చేయుచుండెను. ఆ ‘మరుత్’  తో రావణుడు యుద్ధము చేసెను. రావణుడు ఆయుద్ధములో అక్కడ యజ్ఞము చేయు మహర్షులను అందరినీ భక్షించెను. మరుత్తు ఓడిపోయెను. దుష్యంతుడు, సురథుడు, గాథి, గయుడు, పురూరవుడు అను రాజులందరూ తమతమ అపజయమును అంగీకరించిరి. అటుపిమ్మట రావణుడు అయోధ్యకు వచ్చెను. అయోధ్యను ‘అవరణ్యుడు’ అను మహారాజు పరిపాలించుచుండెను. ఆ మహారాజు అవరణ్యునికి మరియు రావణునికి భీకరయుద్ధము జరిగెను. అవరణ్యునికి ప్రాణశక్తి క్షీణించెను. కాలమును అతిక్రమించుట దుర్లభము. రాక్షసా, ఇదే అయోధ్యలో దశరథ మహారాజునకు శ్రీరాముడు అను మహానుభావుడు జన్మించును. ఆయన చేతిలో నీ మరణము ఖాయము. ఇట్లుచేప్పి అవరణ్యుడు ప్రాణము వదిలెను. రావణుడు అక్కడినుండి మరియొక ప్రదేశమునకు వెడలెను.

రావణుడు అక్కడినుండి యమలోకమునకు యేగెను. రావణుడు యమునితో యుద్ధమునందు తలపడెను.  వారిరువురికి ఘోర యుద్ధము జరిగెను. అంతట యముడు తన అమోఘమైన కాలదండమును రావణుని పైకెత్తెను. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, యమునితో ఇట్లనెను. దేవశ్రేష్ఠా, నేను అతనికి దేవతలచే చంపబడకుండునట్లు వరము ఇచ్చితిని’ అనెను. అంతట యముడు  బ్రహ్మదేవునితో ఇట్లనెను. ‘ అట్లైన అందుకై నేను ఇప్పుడు ఈ దండమును విసర్జించి అతని దృష్టినుండి మరుగయ్యెదను. మీరు మా అందరికీ ప్రభువు’. ఇట్లుచెప్పి యమధర్మరాజు అంతర్ధానమయ్యెను.

రావణుడు సంతుష్ఠుడై తిరిగి వెళ్ళుచు మార్గమధ్యమున అనేక రాజులయొక్క, ఋషులయొక్క, దేవతలయొక్క, దానవులయొక్క, కన్యలను అపహరించెను.  సౌందర్యవతులయిన స్త్రీలు తారస పడినప్పుడు వారి వారిని రక్షించు బంధుగణమును, మరియు రక్షక గణమును వధించి వారినందరినీ తన పుష్పక విమానమునందు తీసికొని పోసాగెను. అదిచూచి బుద్ధిమంతుడగు విభీషణుడు అన్నతో ఇట్లనెను. ‘అగ్రజా, ఇందువలన నీ కీర్తి, ధనము, వంశమును నశింపజేయు చున్నది. నీకు ఘోరపాపము కలుగుచున్నది. ఇది తెలిసియు సదాచారమును విస్మరించి ప్రవర్తించున్నావు. నీవు స్వేచ్ఛాచరణమున ప్రవృత్తుడవగుచున్నావు.

పిమ్మట రావణుడు మధుపురమునకుబోను.తిరిగి వచ్చుచు సోదరుడు అయిన కుబేరుని నివాసమగు కైలాస పర్వతమునకు వచ్చెను. అక్కడ తన సేనను నిలిపెను. అందరిలోనూ సౌందర్యవతియు అయిన రంభ దివ్యావస్త్రాలంకరణ అయి ఆ మార్గమునబోవుచుండెను.  రావణుడు కామపీడితుడై రంభ చేయి పట్టుకొనెను. ఆమెతో రావణుడు ఇట్లనెను. నేను ముల్లోకములకు ప్రభువును. నేను చేతులు జాచి నిన్ను యాచిస్తున్నాను. ఇట్లు చెప్పి రావణుడు ఆమె అభిమతమునకు విరుద్ధముగా ఆమెతో బలాత్కారముగా సంభోగము ఒనర్చేను. అది రంభవలన విన్న వైశ్రవణుని కుమారుడు అయిన నలకూబరుడు ఆమె మీద జరిగిన అత్యాచారమును తలచుకొని రావణునికి శాపము ఇచ్చెను. ‘రావణుడు ఏ స్త్రీని అయినను, ఆమె అభిమతమునకు విరుద్ధముగా ఆమెకి ఇష్టములేకపోయినను త్రాకినచో ఆతని తల తత్క్షణమే ఏడు వ్రక్కలగును.

పిమ్మట రావణుడు ఇంద్రుని మీదకు యుద్ధముకై పోయెను.  తదుపరి రావణపుత్రుడగు ఇంద్రజిత్తు రథముపై కూర్చొని ఆ సేనయండు ప్రవేశించెను. ఇంద్రుని ఓడించి తన నగరమునకు తీసికొని వచ్చెను.  అప్పుడు దేవతలతో కూడా బ్రహ్మదేవుడు లంకాపురికి వచ్చి రావణునితో ఇట్లనెను. మహాబాహో, నీవు పాకశాసనుడగు ఇంద్రుని వదిలిపెట్టుము. అందుకై దేవతలు నీకేమి ఇవ్వవలేనో కోరుకొమ్మనెను.

అప్పుడు ఇంద్రజిత్తు నాశారహితుడగు బ్రహ్మదేవునితో ఇట్లనెను. మహాత్మా, ఇంద్రుని వదిలిపెట్టుటకై నా ఈ షరతుని అంగీకరించవలయ్టును. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించెను. అప్పుడు ఇంద్రజిత్తు ఇట్లు చెప్పదొడంగెను. నేను శత్రువుపై యుద్ధమునకు పోయెదను ఆ సమయమున నేను మంత్రయుక్తమగు యజ్ఞము చేయుదును. అప్పుడు మంత్రయుక్తమగు హవ్యము యొక్క ఆహుతిచే అగ్నిదేవుని పూజెంచెదను. ఆ సమయమున నా కొరకై ఒక రథము ఆవిర్భవించవలయును. అది అశ్వములతో సిద్ధముగా ఉండవలయును. దానిపై కూర్చొని నేను యుద్ధము చేయుదును. నాకు అపజయము ఉండకూడదు. ఒకవేళ అసంపూర్ణముగా హోమము నుండి నేను సమరమునకు వెడలినచో అప్పుడు మాత్రమె నాకు వినాశము కలుగుగాక.   ఇట్టి విషయము నాకు ఎల్లప్పుడు జరుగుగాక. అదివిన్న విధాత ‘అట్లే అగుగాక’ అని చెప్పెను. తదుపరి ఇంద్రజిత్ ఇంద్రుని వదిలిపెట్టేను. దేవతలతో ఇంద్రుడు దేవలోకమునకు వెళ్ళెను.

తదుపరి రావణుడు సంచారముచేయుచు మాహిష్మతి నగరమునకు వచ్చెను. అక్కడ అగ్నిదేవుడు విరాజమానుడై ఉండెను. అక్కడ కార్తవీర్యార్యర్జునుడు అను రాజు రాజ్యమేలుచండెను.  అతని రాజ్యమున అగ్నికుండమున అగ్నిదేవుడు సదా విరాజిల్లుచుండెను. ఒకనాడు పూజకై రాక్షసులు రావణునికి పూలు సమకూర్చి నిరీక్షించుచుండిరి. అప్పుడు రావణుడు నర్మదానదియందు స్నానమాచరించుటకై దిగెను. 

తత్ర స్నాత్వా చ విధివత్ జప్త్వా జప్యమనుత్తమం

నర్మదాసలిలాత్ తస్మాద్ ఉత్తతార స రావణః                              26

అక్కడ విదిపూర్వకముగా రావణుడు స్నానము చేసెను. అంతట రావణుడు పరమోత్తమమైన జపనీయమగు మంత్రమును జపించేను.  అనంతరము ఆ నర్మదానది జలములనుండి రావణుడు బయటకు వచ్చెను.

యత్ర యత్ర చ యాత స్మ రావణో రాక్షసేశ్వరః

జాంబునదమయం లిఙ్గం తత్ర తత్ర స్మ నీయతే                          27

రాక్షసరాజగు రావణుడు ఎక్కడికి వెళ్ళునో అక్కడికి ఒక సువర్ణమయమగు శివ లింగమును తనవెంట తీసికొనివెళ్ళును.

వాలుకావేది మధ్య తు తల్లిఙ్గ స్థాప్య రావణః

అర్చయామాస గంధైశ్చ పుష్పైశ్చ అమృత గందిభిః                      28

రావణుడు ఇసుకవేదికపై ఆ శివలింగమును స్థాపించును.  చందనముతోను, అమృతము వలే సుగంధయుక్తములైన పుష్పములచేతను అద్దానిని పూజించును.

తతః సతమార్తిహరం పరం వరం వరప్రదం చంద్రమయూఖ భూషణం

సమర్చయిత్వా స నశాచరో జగౌ ప్రసార్య హస్తాన్ ప్రణనర్తచాగ్రతః                    29

శంకరుడు అంటే ఎవరు? తన శిరస్సు మీద ధరించు చంద్రకిరణములే ఆయన భూషణము. సజ్జనుల బాధను హరించువాడు శంకరుడు. భక్తులకు మనోవాంఛిత ఫలములను ఒసంగువాడు. శ్రేష్ఠుడు. ఉత్కృష్టుడు. అట్టి మహానుభావుడైన శంకరుని రావణుడు ఎక్కడికి వెళ్ళినను పూజించుచుండును. చేతులుజాచి నృత్యము చేయుచుండువాడు రావణుడు.

మాహిష్మతి పురికి రాజయిన కార్తవీర్యార్జునుడు నర్మదానదీ జలమున దిగి తన స్త్రీలతో జలకాలాడుచుండెను. కార్తవీర్యార్జునకు వెయ్యి చేతులు ఉండెడివి. అతడు తన వెయ్యిచేతులతో నర్మదానది వేగమును అరికట్టెడువాడు. కార్తవీర్యార్జనుడు కృతవీర్యుని కుమారుడు. అట్లు అరికట్టబడిన నర్మదానదీ జలములు తీరమున పూజచేసికొనుచున్న రావణుని వైపునకు వచ్చి ఆ వైపుననే ప్రవహింపదొడగెను. రావణుడు అప్పడు మౌనవ్రతమున ఉండెను. తన మంత్రులయిన శుక, సారణులకు ఆదేశమిచ్చెను. వారిరువురు వెళ్లి కారణమును తెలిసికొని వచ్చిరి. వారు రావణునికి కారణమును తెల్పిరి.  రావణుడు అంతట కార్తవీర్యార్జునుని మీదకు యుద్ధముచేయుటకు వెళ్ళెను. కార్తవీర్యార్జనుడు రావణుని తన వెయ్యి చేతులతో బంధించి వేసెను. ఆ విషయము తెలిసుకొని పులస్త్యుడు అక్కడికి వచ్చెను. పులస్త్యుడు హైహయ రాజు అయిన కార్తవీర్యార్జునితో ధర్మము, అగ్నిహోత్రము, పుత్రులు వీరినిగూర్చిన కుశల సమాచారములు అడిగెను. తదుపరి కార్తవీర్యార్జునితో ఇట్లనెను.. నీవు నా పిల్లవాని కీర్తిని నశింపజేసితివి.  మరియు సర్వత్ర నీ పేరు ప్రఖ్యాతులను వ్యాపింపజేసికొంటివి. నాయనా, ఇప్పుడు నా కుమారుడయిన దశకంఠుని వదలిపెట్టుము. పులస్త్యుని మాటను మన్నించి కార్తవీర్యార్జనుడు రావణుని తన బంధమునుండి విడిచిపెట్టెను.   

ఏవం బలిభ్యో బలినః సన్తి రాఘవనందన

నావజ్ఞాహి పరే కార్యా య ఇచ్చేచ్ఛ్రేయ ఆత్మనః                    30

రాఘవనందన, ఈ విధముగా ప్రపంచమున మహాబలవంతులగు వీరులు అక్కడక్కడ ఉన్నారు. అందువలన తనయొక్క శ్రేయస్సును కోరువాడు ఎవ్వడైనాసరే, ఇతరులను హేళనచేయరాదు.

అటుపిమ్మట రావణుడు కిష్కింధాపురమునకు వెళ్ళెను. అక్కడ సువర్ణమాల ధరించిన వాలిని చూసేను. వాలిని యుద్ధమునకు రమ్మనెను. అప్పుడు వాలి అక్కడ లేడు. తారను పుష్పకవిమానముపై అదలించి బెదరించి ఎక్కించెను. అక్కడినుండి దక్షిణ సముద్రము వైపునకు పయనమయ్యెను. అక్కడ పర్వతమువలె ఎత్తైన వాలిని చూచెను. అప్పుడు వాలి సంధ్యోపాసనచేయుచుండెను. రావణుని కాలి అడుగుల చప్పుడు విన్నాడు వాలి.  రావణుడు నన్ను పట్టుకొనటానికి వస్తున్నాడు అని తలచెను.  రావణుని వాలి వొడిసి పట్టుకొనెను.  రావణుని చంకలోపెట్టుకొని నాలుగు సముద్రములయందు సంధ్యోపాసన పూర్తిచేసెను. అంతటా వాలి అలిసిపోయెను.  అలసిన వాలి కిష్కింధాపురిలోని వనమునకు చేరెను.  అప్పుడు వాలినవ్వుచూ రావణునితో ఇట్లనెను. నీవు ఎక్కడినుండి వచ్చావు?

రావణుడు అంతట తన నామము  రావణుడు అని చెప్పెను.  వానరేంద్రా, నేను నీతో యుద్ధముచేయవచ్చితిని. ఆ కోరిక ఇప్పుడు తీరినది. మీది అద్భుతమైన పరాక్రమము. మీరు నన్ను పశువు వలె చంకలో ఇరుకించుకొని  నాలుగు సముద్రంలో ముంచినారు.

త్రయాణాం ఏవ భూతానాం గతిరేషా ప్లవంగమః

మనోనిలసువర్ణానాం తవ చాత్ర న సంశయః                           31

వకనరరాజా, వాలీ, పూర్వము మనస్సు, వాయువు, గరుత్మంతుడు, ఈ మువ్వురకే ఇట్టి గతి ఉన్నదని విన్నాను. అట్టి వర్ణములలో మీరు నాలుగవ వర్ణముగా ప్రకాశిస్తున్నారు.   

కపిశ్రేష్ఠా, మీతో నేను మిత్రత్వము కలిగియుండ దలంచుచున్నాను.

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగ ఆచ్ఛాదన భోజనం

సర్వమేవా విభాక్తం ను భవిష్యతి హరీశ్వర                                    32

కపిశ్రేష్ఠా, స్త్రీ, పుత్ర, పురం, రాష్ట్రం, భోగ, ఆచ్ఛాదనము అనగా వస్త్రము,  భోజనం— సర్వవస్తువులయందు ఇకమీదట అవిభక్తమైన అధికారము ఉండును. 

శ్రీరామ, వాలి అంతటి మహా బలవంతుడ్ని మీరు త్రుటిలో కూల్చి వేసితిరి.  అప్పుడు శ్రీరామచంద్రుడు దక్షిణ దిక్కు నివాసియైన అగస్త్యునితో వినయముగా ఇట్లనెను.

అతులం బలమేతాద్ వై వాలినో రావణస్య చ

న త్వేతాభ్యాం హనుమతా సమం త్వితి మతిర్మమ                                 33

మహర్షీ, వాలి మరియు రావణాసురుడు – ఈ ఇద్దరి బలమునకు సాటిలేదు. ఇందులో అతిశయోక్తిలేదు. కాని వీరిరువురి బలము హనుమంతుని బలము ముందర ఏమాత్రము సాటిరాదు. ఇందులో సందేహములేదు. ఇది నా అభిప్రాయము.

శౌర్యం దాక్ష్యం బలం ధైర్యం ప్రాజ్ఞతా నయసాధనం

విక్రమశ్చ ప్రభావశ్చ హనూమతి కృతాలయాః                           34

శౌర్యం, దక్షత, బలం, ధైర్యం, ప్రజ్ఞ, నీతి, పరాక్రమము,  ప్రభావము, – అను ఈ సద్గుణములన్నియు  హనుమంతునియందు నేలకొనియున్నవి.

శ్రీరాముని యుక్తి యుక్తములైన ఆ మాటలను విని అగస్త్య మహర్షి హనుమంతుని ఎదుటనే శ్రీరామునితో ఇట్లు పలికెను.

సత్యమేతద్ రఘుశ్రేష్ట యద్ బ్రవీషి హనూమతిః

న బలే విద్యతే తుల్యో న గతౌ న మతౌ పరః                                35

రఘువంశ శ్రేష్టుడా, శ్రీరామ, హనుమంతుని విషయమై మీరు చెప్పినది సత్యము. బలము, బుద్ధి, గతి –  వీరికి సాటి మరియొకరు లేరు. 

రఘునందనా, పూర్వము ఋషులు ‘హనుమా, నీ బలముగురించి అన్యులు చెప్పేటంతవరకు నీకు తెలియకుండుగాక’ అని శాపము ఇచ్చిన. అందువలన హనుమకి ఋషులు ఇచ్చిన శాపము ప్రకారము తన బలము గురించి తనకు తెలియదు.

పరాక్రమోత్సాహ మతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయానయైశ్చ

గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యైః హనూమతః కోపి అధికః అస్తి లోకే        36

పరాక్రమము, ఉత్సాహము, బద్ధి, ప్రతాపము,  సౌశీల్యము, మాధుర్యము, నీతి- అవినీతుల వివేకము,  గాంభీర్యము, చాతుర్యము, ఉత్తమ బలము, ధైర్యైము – ఇట్టి సద్గుణములయందు హనమంతుడకి సరి ఈ లోకమున యెవ్వడు కలడు?

ఏ౩ ప్రకారముగా చెప్పి ఆ ఋషి తన సహచహరులతో, శిష్యగణముతో వెడలిపోయెను. శ్రీరామచంద్రుడు ఆ ఋషి వాక్యములనే తలచుకొని ఆనందపడుచుండెను.  కొంతకాలము గడచిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని పిలిచి ఇట్లు చెప్పెను. మిత్రమా మీరందరూ వారివారి స్థానములకు వెళ్లి మీ మీ రాజ్యములను సుఖముగా మరియు ధర్మముగా పరిపాలింపుడు.

హనుమానో ప్రణతో భూత్వా రాఘవం వాక్యం అబ్రవీత్

స్నేహో మే పరమో రాజ్యం స్త్వయి తిష్ఠతు నిత్యదా

భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్ఛతు .                    37

అంతట ఆంజనేయుడు నమ్రతతో శ్రీరామునితో ఇట్లు పలికెను.  మహారాజా, మీయందు నా నిశ్చల స్నేహ, భక్తి, మరియు అనురాగ భావములు సదా నెలకొనియుండుగాక.

యావద్ రామకథా వీర చరిష్యతి మహీతలే

తావత్ శరీరే వత్స్యంతు ప్రాణా మమ న సంశయః                 38

వీరుడవగు శ్రీరామ, ఈ భూమండలమున రామకథ ఎంతవరకు ఉండునో, అంతవరకూ నిశ్చయముగా ప్రాణములు ఆ కథను వింటూ ఉండుగాక.

ఏవమేతత్ కపిశ్రేష్ఠ భవితా నాత్ర సంశయః

చరిష్యతి కథా యావదేషా లోకే చ మామికా                                           40

 

తావత్ తే భవితా కీర్తిః శరీరే అపి యసవస్తథా

లోకా హి యావత్ స్థాస్యంతి తావత్ స్థాస్యంతి మే తథా                                41

కపిశ్రేష్ఠ, అట్లేయగుగాక.  ఇందులో సందేహము లెదు. లోకములో నా కథ ఉండునంత వరకు, నీ కీర్తి ఉండునుగాక. అంతేగాక మీ శరీరము ప్రాణము రెండూ ఉండును. ఈ లోకములు ఉండునంతవరకు నా కథలు కూడా స్థిరముగా ఉండును.

ఏకైకస్య ఉపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే

శాషస్యేహోప కారాణాం భవామ ఋణినో వయం                           42

 కపిశ్రేష్ఠా, మీరు నాకు లెక్కలేనన్ని ఉపకారములు చేసితిరి. వానిలో ఒక్కొక్కదానికి నా ప్రాణములను గూడ నేను సమర్పించగలను.  ఇక మిగిలిన ఉపకారములకు నేను మీకు ఋణగస్తుడనే అవుతాను.

తతోస్యహారం చంద్రాభం ముచ్వ్హ్య కణ్ఠాత్ స రాఘవః

వైఢూర్యతరలం కణ్ఠే బబన్ధ చ హనూమతః                               43  

ఈ విధముకాచెప్పి శ్రీరామచంద్రుడు తన కంఠమధ్యమునుండి వైఢూర్యమణి ఉన్న ఒక చంద్రసమానమైన ఉజ్వలమైన హారమును తీసి హనుమంతుని మెడలో వేసెను.

తదుపరి ఆ రాక్షసులు, వానరులు, శ్రీరామచంద్రునకు నమస్కరించిరి. వారివెంట అశ్రువులు కార్చుచుండెను. అంతట తమ తమ స్థానములకు వెళ్ళిరి.

పూర్వాహ్ణే ధర్మకార్యాణి కృత్వా ధర్మేణ ధర్మవిత్

శేషం దివస భాగార్థం అంతఃపురగతః అభవత్                   44

శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడు.  ఆయన పగటి పూర్వభాగమందు ధర్మానుసారము ధార్మికమైన పనులు చేయుచుండును. మిగిలిన అర్తభాగమందు అంతఃపురమందు నివసించుచుండును.                               

సీతాపి దేవకార్యాణి కృత్వా పౌర్వాహ్ణికానివై

శ్వశ్రూణాం ఆకరోత్ పూజాం సర్వాసామా విశేషతః                            45

సీతాదేవి కూడా పూర్వాహ్ణకాలమున దేవపూజలను చేయుచుండును.  అత్తలనందరిని సమానముగా, మరియుబ్ గౌరవించుచూ ఉండును.

అంతట సీతమ్మ శుభకరమైన గర్భము దాల్చెను. అంతట శ్రీరామచంద్రుడు సీతమ్మతో నీ యొక్క అభిలాష ఏమిటో చెప్పుము. నీయొక్క మనోరథమును నెరవేర్చెదను.  అందుకు సీత ఇట్లు అనెను.

రాజా, నాకు పవిత్ర తపోవనములను చూడవలెనని కోరిక ఉన్నది. మహర్షుల సమీపమున ఆ తపోవనమందు ఒక దినము నివసింపదలచినాను.  ఇదియే నా కోరిక. అందుకు శ్రీరామచంద్రుడు, వైదేహీ, రేపే నీ కోరికతీరుస్తాను. నిశ్చింతగా ఉండుము. ఇందులో సందేహము లేదు.

అంత శ్రీరాముడు భద్రుడు అనువాడ్ని రాజ్యములో ప్రజలు ఏ విషయముగురించి చర్చించుకొనుచుండిరో చెప్పుడు అనెను. దానికి ఆ భద్రుడు ఇట్లు చెప్పెను. కొందరు సీతమ్మ విషయమై చాలా మంచిగా చర్చించుకొనుచుండిరి. కొందరు అందుకు విరుద్ధముగా అపవాడులతో చర్చించుకొనుచుండిరి. అని చెప్పెను భద్రుడు.   అప్పుడు శ్రీరాముడు తన సోదరులను పిలిపించి వారితో సీతమ్మ విషయమై ఈ విషయము చెప్పి బాధ పడెను. 

అకీర్తిః నిన్ద్యతే దేవైః కీర్తిః లోకేషు పూజ్యతే 

కీర్త్యర్థం తు సమారంభః సర్వేషాం సుమహాత్మనాం                 46

దేవతలు లోకమున అపకీర్తిని నిందించుదురు. కీర్తిని గౌరవించుదురు. ఉత్తములైన మహాత్ములయొక్క ఉత్తమ కార్యములన్నియు కీర్తిని వ్యాపింపజేయును.

కావున లక్ష్మణ,, రేపు సీతమ్మను రథములో ఎక్కించుకొని రాజ్యము బయట ఆమెను వదిలివేయుము. గంగానది ఆవలి ఒడ్డున తమసా తీరమున మహాత్ముడగు వాల్మీకి మహర్షి పరిసర ప్రాంతాలలో సీతమ్మను నిర్జన ప్రదేశమునందు వదిలివేయుము. వెంటనే రమ్ము. ఇది నా ఆజ్ఞ. ఈ విషయములో ఇంకొక మాటకు తావులేదు. ‘నేను గంగా తీరమున ఋషులను ఆశ్రములను చూడదలచినట్లు సీతమ్మ లోగడ నాతొ చెప్పినది. ఆమె అభిలాష నేరవేరుగాక. అంతట లక్ష్మణుడు సీతమ్మను గంగానదియొక్క ఆవలి తీరమును జేర్చెను. లక్ష్మణుడి కళ్ళవెంట నీరు కారజొచ్చెను. అమ్మ, నీ విషయమై అత్యంత భయంకరముగా వ్యాపించిన వదంతులు విని నా అగ్రజుడు రాజ్యసభయందు విని శ్రీరాముని హృదయము తపించిపోయెను. అమ్మ ఇక్కడ బ్రహ్మర్షి వాల్మీకి ఆశ్రమము ఉన్నది. ఆయన మా తండ్రి గారైన దశరథ మహారాజు యొక్క ఆప్తమిత్రుడు. అదివిన్న సీతమ్మ మూర్ఛ పోయెను పిమ్మట తేరుకొని ఇట్లు చెప్పెను.  

మామికేయం తనుః నూనం సృష్టా దుఖాయ లక్ష్మణ

ధాత్రా యస్త్యాత్ తథా  మే అద్య దుఃఖమూర్తిః ప్రదృశ్యతే                    47

లక్ష్మణా, విధాత నా శరీరమును అనుభవించుటకై నిర్మించెను. ఇది నిశ్చయము. అందువలననే నేడు దుఖముల సమూహము యొక్క రూపుదాల్చిన ఆకారమునే ఈ విధముగా నేను చూస్తున్నాను.

కిం ను పాపం  కృతం పూర్వమ్ కోవా దారైర్వియోజితః

యాహం శుద్ధ సమాచారా త్యక్త్వా నృపతినా సతీ                              48

పూర్వము ఏమి పాపమును చేసితినో, ఏ భార్యను తన భర్తనుండి వేరుచేసితినో, శుద్ధ ఆచరణ కలిగియున్నప్పటికీ మహారాజు నన్ను వదిలివేసెను.

పతిర్హి దేవతానార్యాః పతిర్బంధుః పతిర్గురుః

ప్రాణైరపి ప్రియం తస్మాద్ భర్తుః కార్యం విశేషతః                             49   

స్త్రీకి పతియే దేవత, పతియే బంధుః, పతియే గురువు, పతియే దేవత, పతియే ప్రాణానికి ప్రాణం.  అందువలన పతి ఆజ్ఞయే స్త్రీకి అనుసరణీయము.

ఆ మాటలు విన్న లక్ష్మణుడు సీతచుట్టూ ప్రదక్షిణచేసేను.  పిమ్మట అమ్మ, మీరు ఏమి చెప్పుచున్నారు? అనెను.

దృష్టపూర్వం న తే రూపం పాదౌ దృష్టౌ తవానఘే

కతమత్ర హి పశ్యామి రామేణ రహితాం వనే.                      50

మహాపతివ్రతా, అమ్మా నేను ఎన్నడు మీ సంపూర్ణరూపమును చూడలేదు. నేను కేవలము మీ పాదములనే చూచియుంటిని. అగ్రజునితోబాటు లేని మిమ్మల్ని ఎట్లు చూడగలను?

ఈ ప్రకారముగా చెప్పి లక్ష్మణుడు సీతాదేవికి ప్రణమిల్లెను.  నావపై కెక్కెను. తదుపరి నావికునకు నావను పోనిమ్మని చెప్పెను.

శోకభారముచే పీడింపబడుచున్న సీతమ్మను ఓదార్చుతూ వాల్మీకి మహర్షి ఇట్లనెను.   

ఆశ్రమస్యావిదూరే మే తాపస్యస్తపసి స్థితాః

తాస్త్వాం వత్సే యథా వత్సం పాలయిష్యంతి నిత్యశః                         51

వత్సా, ఆ ఆశ్రమమునకు సమీపములో తపస్సునందు నిమగ్నమైయున్న తాపసస్త్రీలు నివసించుచున్నారు.  వారు తమ బిడ్డవలె నిన్ను కాపాడుదురు.   

తదుపరి వాల్మీకి మర్షి వెంట సీతనడువగా అక్కడి ఆశ్రమవాసులందరూ సంతోషించిరి. అంట వాల్మీకి వారిటు ఇట్లు నుడుఇవేను. ఈమె సీతమ్మ. శ్రీరాముని ధర్మపత్ని. మీరు ఈమెయందు మిక్కిలి స్నేహము చూపండి.  

మాశుచః పురుషవ్యాఘ్ర కాలస్య గతిరీద్రుశీ

త్వద్విథా నహి శోచంతి బుద్ధిమంతో మనస్వినః                                     52

లక్ష్మణుడు దుఃఖమతి అయిన అగ్రజుడు శ్రీరామచంద్రునితో ఇట్లనెను. అగ్రజా, మీరు శోకింపకుడు. కాలము యొక్క గతి ఇట్లే ఉన్నది. మీవంటి, బుద్దిమంతులు, మరియు మనస్వినులు అగు పురుషశ్రేష్ఠులు ఈ విధముగా శోకింప తగదు.

సర్వే క్షయాంతా నిచయాః పతనాన్తాః సముచ్ఛ్రయాః

సంయోగా విప్రయోగాంతా మరణాన్తం చ జీవితం                                         53

అగ్రజా శ్రీరామా, ప్రపంచమున వస్తువులన్నిటియొక్క అంతయు వినాశమైయున్నది. పెరుగుటయొక్క అంతము పతనము. సంయోగము యొక్క అంతము వియోగము. జీవితము యొక్క అంతము మరణము.

తస్మాత్ పుత్రేషు దారేషు మిత్రేషు చ ధనేషు చ

నాతి ప్రసంగః కర్తవ్యో విప్రయోగో హితైః ధ్రువం                       54

అగ్రజా శ్రీరామా, అందువలన స్త్రీ, పుత్ర, మిత్ర, ధనములయందు  ఆసక్తి కలిగియుండుట అదియును విశేషముగా ఆసక్తి కలిగియుండుట యుక్తముకాడు. ఎందుకంటె సంయోగము వియోగము కొరకే కనుక.

శక్తస్త్వం ఆత్మనాత్మానం నినేతుం మనసా మనః

లోకాన్ సర్వాంశ్చ కాకుత్థ్స కిం పునః శోకం ఆత్మనః                      55

కాకుత్థ్సకులభూశానా, మీరు ఆత్మచే ఆత్మను, మనస్సుచే మనస్సునుసమస్త లోకములనుగూడ నిగ్రమందు ఉంచుటలో సమర్థులు.  ఇక ఈ శోకమును నిగ్రహించుట మీకు అంత కష్టమేమీ కాదు. మీకు ఇది ఒక పెద్ద విషయముకాదు.

స త్వం పురుషశార్దూల ధైర్యేణ సుసమాహితః

త్యజేమాం దుర్బలాం బుద్ధిం సంతాపం మా కురుష్వహ                    56

కావున ఓ పురుషసింహమా, మీరు ధైర్యముతో చిత్తమును ఏకాగ్రపరచుకొనుడు. ఈ దుర్బలమగు శోక బుద్ధిని వదివేయుడు. సంతాపము చెందకుడు.

లక్ష్మణుడి వాక్యములతో మనస్సు కుదుటపడిన శ్రీరాముడు ఇట్లనెను. లక్ష్మణ, నీ యొక్క అనునయ వాక్యములతో నా మనస్సు శాంతించినది. అనెను. ఇక రాజ్యపరిపాలన గావించెదను అనెను.

నాధయో వ్యాధయశ్చైవ రామే రాజ్యం ప్రశాసతి

పక్వసస్యా వసుమతీ సర్వౌషధి సమన్వితా                            57

శ్రీరాముని రాయకాలమున ఎవరికిని శారీరక రోగాములుగాని, మానసికరోగాములుగాని సంభావిన్చాకుండెను.  భూమి సర్వరకములయిన ఔషధులతోనూ సంపూర్ణముగా నుండెడిది.  క్షేత్రములు సష్యశ్యామలముగానుండెడివి.

న బాలో మ్రియతే తత్రన యువా న చ మధ్యమః

ధర్మేణ శాసితం సర్వం న చ బాధా విదీయతే                     58

బాలునకుగాని, యువకునకుగాని, మధ్యమావస్థగాలవానికిగాని మృత్యువు సంభవించకుండెను.  అందరికి ధర్మపూర్వక శాసనము గావింపబడుచుండెను. ఎవ్వరి కిన్నీ ఏ విధమైన బాధ కలుగకుండెను.

ద్వారమువద్ద ఒక శునకము వచ్చి నిలుచుండెను. దానిశిరస్సు పగిలియుండెను.

ధారణాద్ ధర్మమిత్యాహుః ధర్మేణ విధృతాః ప్రజాః

యస్మాద్ ధారయతే సర్వం త్రైలోక్యం సచరాచరం                            59

ధర్మము ప్రపంచమునంతను ధరించుచున్నది. అందువలననే దానిని ధర్మము అందురు.  ధర్మమే సమస్త ప్రజలను  ధారణనోనర్చియున్నది.  ధర్మమే సమస్త చరాచర ప్రపంచమునకంతకును,  త్రైలోక్యమునకంతకును ఆధారమైయున్నది. 

ఏషరాజన్ పరోధర్మః ఫలవాన్ ప్రేత్యరాఘవ

నహి ధర్మాద్ భవేత్ కించిద్ దుష్పాపమితి మే మతిః                  60  

శ్రీరామా, ప్రజాపాలనా రూపమగు పరమ ధర్మము ఉత్తమ ఫలమును ఇచ్చును. ధర్మపాలనము చేయుటచే ఏదియును దుర్లభముకాదని నా దృఢ విశ్వాసము.

దానం దయా సతాం పూజా వ్యవహారేషు చార్జవం

ఏషరామ పరో ధర్మో రక్షణాత్ ప్రేత్య చేహ చ                            61  

శ్రీరామా,  దానం, దయా, సతతం సజ్జనులను గౌరవించుట, వ్యవహారములయందు  ఋజుత్వము, --వీటిని కలిగియుండుటే పరమ ధర్మము.  శ్రీరామ,  పరులను రక్షణలో కలిగే ఉత్కృష్ట ధర్మము మనకు ఇహలోకమునందు, ఇహలోకమునందు మనకు మేలు కలుగజేయును. 

ధర్మేణ రాష్ట్రం విన్దేత ధర్మేణైవ అనుపాలయేత్

ధర్మాత్ శరణ్యతాం యాతి రాజా సర్వభయాపహః

ఇదం విజ్ఞాయ యత్ కృత్యం శ్రూయతాం మమ రాఘవ                      62

రాఘవ, రాజు ధర్మముచేతనే రాష్ట్రమును పొందును. ధర్మము చేతనే రాజ్యమును పాలించుగాక. ధర్మము చేతనే రాజు  సర్వులకు శరణునొసంగుగాక, సర్వులభయమును అప్పుడే పోగొట్టకలుగును.   ఇట్లు తెలిసికున్న మీరు నా మాట వినుడు.

కుక్క ఇట్లు చెప్పెను. ప్రభూ, సర్వార్థ సిద్ధుడు అను ఒక భిక్షువుగలడు. అతడు బ్రాహ్మణుల ఇంటియండు నివసించుచుండెను.  నేడు అతడు అకారణముగా నన్ను కొట్టెను. నేను అతనికి ఏ అపకారము చేయలేదు.  వెంటనే శ్రీరామచంద్రుడు ద్వారపాలకుని పంపి ఆ సర్వార్థ సిద్ధుడు అను బ్రాహ్మణ భిక్షువును పిలిపించెను.  ఆ భిక్షువు శ్రీరామా, నన్ను ఎందుకు పిలిపించిరి? నాతొ పనియేమి? అనెను. అంతట శ్రీరాముడు ఇట్లనెను.  ఓ, బ్రాహ్మణుడా, ఈ శునకము మీకేమి హానిచేసినది? మీరు ఎందుకు దానిని కొట్టిరి? అని అడిగెను.

క్రోధః ప్రాణహరః శతృః క్రోధో మిత్రముఖోరిపుః

క్రోధో హ్యసిర్మహాతీక్ష్ణః సర్వం క్రోధో పకర్షతి                           63

క్రోధము ప్రాణహారి అయిన శత్రువు.  కోపము పైకి మిత్రునివలె కనిపించు శత్రువు. క్రోధము తీక్ష్ణమైన ఖడ్గము వంటిది.   క్రోధము సర్వ సద్గుణవినాశిని.

తపతే యజతే చైవ యచ్చదానం ప్రయచ్ఛతి

క్రోధేన సర్వం హరతి తస్మాత్ క్రోధం విసర్జయేత్                            64  

మనుజుడు చేయు తపస్సు, యజ్ఞము, దానము వలన కలుగు పుణ్యము, అన్నింటినీ క్రోధము హరించివేయును. కావున క్రోధము అవశ్యము విసర్జించవలయును.

ఇంద్రియాణాం ప్రదుష్టానాం హయనామివ ధావతాం

కుర్వీత ధృత్వా సారథ్యం సంహృత ఇంద్రియ గోచరం                        65

దుష్ట గుఱ్ఱములవలె ఇందియములవైపే ఇంద్రియములు పరుగిడును. వానినుండి ఆ ఇంద్రియముల దృష్టి మరలించి ధైర్యముగానుండవలయును. ఇంద్రియములను అదుపులో పెట్టవలయును.

మనసా కర్మణా వాచా చక్షుసా చ సమాచరేత్

శ్రేయో లోకస్య చరతో న ద్వేష్టి న చ లిప్యతే                              66

మనస్సుచేతను, వాక్కు చేతను, క్రియ చేతను, దృష్టి చేతను, ప్రజలకు మంచే చేయ వలయును.  ఎవ్వనియందు ద్వేషము  కలిగియుండరాదు. ఈ ప్రకారము ఆచరించిన మనుజుడు పాపముచే అంటబడడు.

న తత్ కుర్వాదసి తీక్ష్ణః సర్పోవా వ్యాహతః సదా

అరిర్వా నిత్య సంక్రుద్దో యథాత్మా దురనుష్ఠితః                              67

దుష్టమనస్సు చేయు అనర్తమును తీక్ష్ణమైన ఖడ్గాముగాని, కాలిక్రింది విసర్పముగాని, నిరంతరము క్రోధయుక్తుడయిన శతృవుగాని చేయనేరడు.

వినీత వినయస్యాపి ప్రకృతిః న విధీయతే 

ప్రకృతిం గూహమానస్య నిశ్చయేన కృతిః ధృవా                               68  

వినయమును గూర్చిన శిక్షణ లభ్యమైనను కొందరికు దుష్టప్రకృతి మారకుండును.  వాడు తన దుష్ట ప్రకృతిని గుప్తముగా ఉంచినను అది కార్యరూపమున నిశ్చయముగా ప్రకటితమగుచునే యుండును.

శ్రీరాముడు ఇట్లు వచిన్చాగా, ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. శ్రీరామ, నేను ఆకలితోనుంటిని. ఈ శునకము దారిలోనుండెను.  దారి తొలగమన్నాను. తొలగలేదు. నాకు కోపము వచ్చి దాని తలమీదమీద కొట్టితిని. నేను అపరాధిని. మీరు నాకు దండననొసంగుడు. మీరు నాకు దండననొసంగినచో నాకు నరకభయము తొలగును. అక్కడ చేరియున్న ముని శ్రేష్ఠులందరూ యిట్లనిరి. మీరు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. మీరు శాశించుడు. అప్పుడు శునకము ఇట్లనెను. శ్రీరామా, మీరు నా ఇచ్ఛానుసారము వరము ఈయదలచినచో నా మాట వినుడు.

బ్రహ్మస్వం దేవతాద్రవ్యం స్త్రీణాం బాలధనం చ యత్

దత్తం హరతి యో భూయ ఇష్టైః సహ వినశ్యతి                               69

ఎవ్వడూ కూడా బ్రాహ్మణుని యొక్క, దేవతాద్రవ్యం యొక్క, స్త్రీలయొక్క, బాలురయొక్క, ధనమును అపహరించకూడదు. ఎవ్వడు దానము ఇచ్చినదానిని తిరిగి తీసికొనునో అతడు ఇష్ట జనులతో కూడి నశించిపోవును.  

రఘునందనా, బ్రాహ్మణుని యొక్క, దేవతాద్రవ్యం యొక్క, స్త్రీలయొక్క, బాలురయొక్క, ధనమును అపహరించునో అట్టివాడు శీఘ్రముగా అవీచి అను ఘోర నరకమందు పడిపోవును.

మనసాపి హి దేవస్వం బ్రహ్మస్వం చ హరేత్తు యః

నిరయాన్నిరయం చైవ పతత్యేవ నరాథమః                                  70   

ఎవ్వడు బ్రాహ్మణుల యొక్క, దేవతాద్రవ్యం యొక్క,  ధనమును అపహరించుటకు సంకల్పించునో అట్టివాడు శీఘ్రముగా ఒక నరకమునుండి మరియొక నరకమునందు పడిపోవును.

శునకము యొక్క మాటలు విని శ్రీరాముడు ఆశ్చర్యచకితుడాయెను. ఆ కుక్కయు వచ్చినదారినే వెడలిపోయెను. తదుపరి శతృఘ్నుని మధువనదేశమునకు రాజుగా పట్టాభిషిక్తుడ్నిచేసెను.  శతృఘ్నునితో ఇట్లు పలికెను. సోదరా, నీకు అమోఘమైన ఆయుధమును ఒసంగుచుచున్నాను. ఈ అమోఘమైన బాణముతో నీవు లవణాసురుని వధించగలవు. శతృఘ్నా, లవణాసురుడు నగరమందు ప్రవేశించనపుడు కాచుకొని ఉండుము.  నగరద్వారమున అస్త్ర శస్త్రములను ధరించి అతనిరాక కొరకై నిరీక్షింపుము.  అప్పుడు అతని వద్ద శివునిచే ఒసంగబడిన శూలము, ఉండదు. అప్పుడు అతనిని వధింపుము.  శత్రుఘ్నుడు దారిలో రెండురాత్రులు గడిపినపిమ్మట మూడవ రాత్రి వాల్మీకి మహర్షి ఆశ్రమమును చేరెను.  అది చాలా ఉత్తమమైన నివాస స్థానము.

యామేవ రాత్రిం శతృఘ్నః పర్ణశాలాం సమావిశత్

తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం                      71

శతృఘ్నుడురాత్రియందు పర్ణశాలయందు ప్రవేశించెను. ఆ రాత్రియందే సీతమ్మ ఇరువురు పుత్రులను ప్రసవించెను.

అర్ధరాత్రి శతృఘ్నుడు గోవులు మూత్రము పోసేవేళ  సీతయొక్క పర్ణశాలకు పోయెను. ఇట్లనెను. ‘తల్లీ, చాల సౌభాగ్యకరమైన విషయము’ అని సీతమ్మతో అనెను.  మరునాడు సంధ్యావందనాదులు గావించుకొనెను. చేతులు జోడించుకొని మునికి నమస్కారాదులు గావించుకొని పశ్చిమాభిముఖుడై పోయెను.  అంతట అన్నగారి ఆదేశానుసారము లవణాసురుని సంహరించెను. లవణాసురుని శూలము రుద్రుని కడకేగెను. తదుపరి శ్రీరాముడు అశ్వమేథయాగముచేయ సంకల్పించెను. వశిష్ఠాది మునులతో సంప్రదించెను.

నైమిశారణ్యమున గోమతీ నదీతీరమున విశాల యజ్ఞ మంటపము నిర్మించుటకు తన పరిజనులకు ఆజ్ఞనొసంగెను.

లక్ష్మణుని సంరక్షణమునందు యాగాశ్వము స్వేచ్ఛగా సంచరించు కార్యక్రమముకూడా పూర్తి అయినది. యజ్ఞము నిర్విఘ్నముగా జరిగినతదుపరి బ్రాహ్మణులకు  భూరి దక్షిణలు ఇవ్వబడెను. అంతట వాల్మీకి మహర్షి శిష్యసమేతముగా అక్కడికి విచ్చేసెను. తన శిష్యులగు కుశలవులను ‘రామకథ సంపూర్ణముగా మనోహరముగా పాడుతూ చదువుడు’ అని చెప్పెను. ఋషిలతోను, రాజులతోను వానరులతోను అదివిన్న శ్రీరాముడు అమిత ఆనందమును పొందెను. ఆ కథ విన్న శ్రీరామునకు వారు తన పుతృలు కుశలవులు అని తెలిసెను. అంతట శ్రీరాముడు ఇట్లు చెప్పెను. ఆమె పతిత పావని అయిన యడల ఆమె తన పాతివ్రత్యమును తన శుద్ధత్వమును ప్రకటించుగాక అని తెలిపెను.  అదివిన్న వాల్మీకి ఇట్లు పలికెను.    

ఏవం భవతు భద్రం వో యథా వదతి రాఘవః

తథా కరిష్యతే సీతా దైవతం హి పతిః స్త్రియాః                    72   

అట్లేయగుగా, మీకు శుభము కలుగుగాక.  రాఘవుడు యెట్లు చెప్పునో ఆ మాటలనే సీతమ్మ వినును.

ఆ రాత్రి గడచిన పిదప శ్రీరామచంద్రుడు యజ్ఞశాలకు వచ్చెను. అప్పుడతడు ఋషి లందరినీ అక్కడికి ఆహ్వానించెను.

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః

విశ్వామిత్రో దీర్ఘతమా దుర్వాసాశ్చ మహాతపాః                     73

పులస్త్యోపి తథా శక్తిః భార్గవశ్చైవ వామనః

మార్కండేయశ్చ దీర్ఘాయు మౌద్గల్యశ్చ మహాయశాః                     74 

గర్గశ్చ చ్యవనశ్చైవ శతానందశ్చ ధర్మవిత్

భరద్వాజశ్చ తేజస్వీ అగ్నిపుత్రశ్చ సుప్రభః                          75

నారదః పర్వతశ్చైవ గౌతమశ్చ మహాయశాః

కాత్యాయనః సుయజ్ఞశ్చ హి అగస్త్యః తపసాం నిధిః                     76

 ఏతేచాన్యే చ బహవో మునయః సంశ్రితవ్రతాః

కౌతూహల సమావిష్టాః సర్వ ఏవ సమాగతాః                                77

వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, విశ్వామిత్రుడు, దీర్ఘతముడు, దుర్వాసుడు, మహాతపస్వి అయిన పులస్త్యుడు, తథా శక్తి, భార్గవుడు, వామనుడు, దీర్ఘాయువు అయిన మార్కండేయుడు, మౌద్గల్యుడు, మహాయశుడైన గర్గుడు, చ్యవనుడు,  ధర్మజ్ఞుడైన శతానందుడు, తేజస్వి అయిన భరద్వాజుడు, అగ్నిపుత్రుడయిన  సుప్రభుడు, నారదుడు, పర్వతుడు, గౌతముడు,  మహాయశుడైన కాత్యాయనుడు,  సుయజ్ఞుడు,  తపోనిధి అయిన అగస్త్యుడు, వేరన్దరిత౫ఒబాతు ఇన్కను కతినవ్రతములను పాలించు అనేక మంది మహర్షులు కౌతూహలముతో అక్కడ సమావేశమయ్యిరి.

జ్ఞాననిష్ఠాః కర్మనిష్ఠాః యోగనిష్ఠాః తథాపరే

సీతా శపథ వీక్షార్థం సర్వఏవ సమాగతాః                                78

జ్ఞాననిష్ఠులు, కర్మ నిష్ఠులు, యోగ నిష్ఠులు, ఇంకా ఇతరులు సర్వులు సీతా శపథమును వీక్షించుటకు అక్కడ సమావేశం అయ్యారు.

అందరూ నిశ్చలముగా కూర్చుదిరి. వాల్మీకి సీతమ్మను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చిరి. ఆమె రెండు చేతులు జోడించుకొనేను. నేత్రములనుండి నీరు కారుచుండెను.  ఆమె తన హృదయమున శ్రీరాముని తలచుచుండెను.  అప్పుడు వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రునితో ఇట్లనెను. శ్రీరామ, ఈమె సీతమ్మ, ఉత్తమోత్తమురాలు. ఈమె ధర్మపరాయిణి. ఈమె మీదపడ్డ లోకోపవాదమువలన ఈమెను నా ఆశ్రమములో వదిలిరి.

బహువర్ష సహస్రాణి తపశ్చర్యా మయాకృతా

నోపాశ్నీయాం ఫలం తస్యా దుష్టేయం యది మైథిలీ                  79

నేను అనేకవేల సంవత్సరముల తపస్సు చేసితిని.  మిథిలేశుని పుత్రిక అయిన ఈ సీతమ్మయందు ఏదేని దోషము ఉన్నచో ఈ నా తపస్సు వృథా అగుగాక.  

ఇయం శుద్ధ సమాచారా అపాపా పతిదేవతా

లోకాపవాద భీతస్య ప్రత్యయం తవ దాస్యతి.                      80

ఈమె ఆచరణ సర్వ విధముల శుద్ధమైనది.  ఈమె అమలినమైనది. పాపము ఈమెను అంటనైనాను అంటదు. ఈమె పతియే దేవతగా భావించునదియైయున్నది. ఈమె లోకాపవాదము గురించి తన  శుద్ధత్వము గురించి విశ్వాసము కలుగజేయగలదు.

ఆ సమయమున కాషాయవస్త్రము ధరించియుండెను.  ఆమె ఆ సమావేశమయిన మహానుభావులముందర చేతులు జోడించుకొని ఇట్లనెను.

యథాహం రాఘవాద్ అన్యం మనసాపి న చింతయే

తథా మే మాధవీ దేవీ వివరం దాతుమర్హతి                           81

నేను శ్రీరాఘవుడ్ని తప్ప అన్య పురుషుని మనస్సునందు చింతించను. ఇది సత్యమైనచో భూదేవి తన ఒడియందు నాకు స్థానమునిచ్చుగాక. 

మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే

తథా మే మాధవీ దేవీ వివరం దాతుం అర్హతి                        82    

నేను మనసా కర్మణా వాచా శ్రీరామునే  ఆరాధించుచున్నచో భూదేవి తన ఒడియందు నాకు స్థానమిచ్చుగాక.  

అంతట భూతలమునుండి ఒక అద్భుతమైన సువర్ణమయ సింహాసనము ప్రకటితము అయ్యెను. సింహాసనముతో భూదేవియు ప్రత్యక్షము అయ్యెను. ఆ దేవి తనరెండు చేతులనుచాచి సీతమ్మను ఆ చేతులలో బిడ్డను పట్టుకున్నట్లుగా ఎత్తుకొని తన చేతులలో కూర్చుండబెట్టుకొనేను. అంతట భూదేవి రసాతలమునందు ప్రవేశించుచుండ దేవత లందరూ ఆమెను చూచిరి. సీతమ్మ భూదేవి ప్రవేశించుచుండ శ్రీరాముడు అమిత దుఃఖముచెందెను. వారు ఒక దండము సహాయముతో తలవంచుకొని నిలబడిరి.  నేత్రములనుండి కన్నీరు కారజొచ్చెను. అప్పుడు దేవతలతోకూడా బ్రహ్మదేవుడు వచ్చి శ్రీరామునితో ఇట్లు చెప్పెను. శ్రీరామా, ఖేద పడకుడు. మీరు మీ స్వస్వరూపమును స్మరించుడు అనెను.

ఇష్టయజ్ఞో నరపతిః పుత్రద్వయ సమన్వితః

న సీతాయాః పరం భార్యాం వవ్రేస రఘునందనః

యజ్ఞే యజ్ఞే చ పత్న్యర్థం జానకీ కాఞ్చనీభవత్                      83

తదుపరి శ్రీరాముడు యజ్ఞము పూర్తిచేసి తన ఇరువురు పుత్రులతోను నివసింప దొడగెను. వారు సీతమ్మను తప్ప పరభార్యను చేసికొనలేదు. ప్రతి యజ్ఞమునందు భార్యయొక్క ఆవశ్యకత ఏర్పడినప్పుడు సీతమ్మకు బదులుగా స్వర్ణసీతమ్మను వాడెడివారు. 

దశవర్ష సహస్రాణి వాజిమేథానథా కరోత్  

వాజపేయాన్ దశగుణాం స్తథా బహుసువర్ణకాన్                            84

శ్రీరామచంద్రుడు పదివేలసంవత్సరములవరకు యజ్ఞములను చేసెను. లెక్కలేనన్ని ఆశ్వేమేథ యాగములు చేసెను. వాటికి పదిరెట్లు వాజపేయ యజ్ఞములను చేసెను.  వాటియందు లెక్కలేనన్ని బంగారు నాణెములను కానుకలుగా ఇచ్చెను.

ఏవం స కాలః సుమహాన్ రాజ్యస్థస్య మహాత్మనః

ధర్మే ప్రయతమానస్య వ్యతీయాద్ రాఘవస్య చ                        85

ఈ ప్రకారముగా మహాత్ముడగు శ్రీరామచంద్రునకు చాలా సమయము గడిచిపొయినది.  ఆయన సమయమంతయు ధర్మపాలనయందే గడిచెను.

కాలే వర్షతి పర్జన్యః సుభిక్షం విమలాదిశః

హ్రుష్టపుష్ట జనాకీర్ణం పురం జానపదం స్తథా                          86

శ్రీరాముని రాజ్యమందు మేఘములు సకాలమందు వర్షించుచుండెను. ఎల్లప్పుడు రాజ్యము సుభిక్షముగా నుండెడిది. సర్వదిక్కులు ప్రసన్నములుగా కాన్పించుచుండెను. నగరములు, గ్రామములలోని ప్రజలు దేహదార్ఢ్యముతో ప్రకాశించుచుండెడివారు.

వశిష్ఠంతు మహాతేజా వాక్యం ఏతద్ ఉవాచ హ

ద్రుష్టమే తన్మహాబాహో క్షయం తే రోమహర్షణం                    87  

అటు పిమ్మట  మహాతేజస్వి అగు వశిష్ఠమహర్షి శ్రీరామచంద్రునితో ఇట్లనెను. మహాబాహో, ఇప్పుడు  రోమహర్షణం  అనగా గగుర్పాటు కలిగించు సర్వులకు సాకేతగామనము జరుగుచున్నదని నా తపోబలముచే చూచితిని.

తతో ధర్మే వినష్టే తు త్రైలోక్యం సచరాచరం 

సదేవర్షిగణం సర్వం వినశ్యేత్ తు న సంశయః                      88

ధర్మము అతిముఖ్యము. ధర్మము నశించినచో చరాచర ప్రపంచమును నశించిపోవును. దానితో పాటుగా ప్రాణులు, దేవతలు, ఋషులు కూడా నశించిపోవును. ఇందు సంశయము లేదు.

అనంతరము శ్రీరాముడు పురోహితులతోను, మంత్రులతోను, శాస్త్రజ్ఞులతోను ఇట్లు చెప్పెను. నేడు నేను ధర్మవత్సలుడును, వీరుడును అగు భరతుని అయోధ్యకు  పట్టాభిషిక్తుడ్ని చేయుదును. తదుపరి వనమునకు వెళ్ళుదును. అదివిని భరతుడు దుఃఖపడుతూ ఇట్లనెను.

సత్యేనాహం శపే రాజన్ స్వర్గభోగైన చైవ హి

న కామయే యథా రాజ్యం త్వం వినా రఘునందన                              89

రఘునందన, నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. మీరు తప్ప నాకు ఇంకేమి వద్దు. రాజ్యముగాని, స్వర్గభోగముగాని మీరు లేనిది నాకు అవి అన్నీ తృణప్రాయము.  

భరతుని ఆ వాక్యములను వినిన అనంతరము కుశునకు దక్షిణ కోసలదేశమునకు రాజుగా పట్టాభిషేకము చేసెను.  లవుని ఉత్తర కోసలదేశమునకు రాజుగా పట్టాభిషేకము చేసెను. ఇంతలో వీరుడగు సుగ్రీవుడు శ్రీరామునకు నమస్కారము చేసి తన అభిప్రాయమును ఈ విధముగా తెలియజేసెను. ‘శ్రీరామ, నేను అంగదుని రాజుగా పట్టాభిషిక్తుడ్ని చేసి వచ్చితిని. కావున నేను కూడా మీ వెంట వచ్చుటకు దృఢముగా నిశ్చయించుకొంటిని’ అనెను. అంతట శ్రీరాముడు తనవెంట రాదలచుకున్న సుగ్రీవుని మరియు ఇతర వానరవీరులను ‘అట్లే అగుగాక’ అని చెప్పెను. అంతట చిరునవ్వుతో విభీషణునితో ఇట్లు పలికెను.

యావత్ ప్రజా ధరిష్యంతి తావత్ త్వం వై విభీషణ

రాక్షసేంద్ర మహావీర్య లంకాస్థః స్వం ధరిష్యసి                                      90

మహాపరాక్రమవంతుడవగు విభీషణా, రాక్షసరాజా, ఎంతవరకు ప్రపంచమున ప్రజలు జీవితమును ధరించుదురో అంతవరకూ మీరున్ను లంకయందు శరీరము ధరించి యుండెదరు’ అనెను.

యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్ఠతి మేదినీ

యావచ్చ మత్కథా లోకే తావద్ రాజ్యం తవాస్త్విహ                       91

విభీషణా, సూర్య చంద్రులు, ఈ భూమి, ఈ ప్రపంచమున నా కథ, ఉండునంతవరకు, ఈ భూతలమున మీ రాజ్యము సుస్థిరముగా ఉండును.

విభీషణునీతో ఇట్లుచెప్పిన పిమ్మట శ్రీరాముడు హనుమంతునితో ఇట్లనెను.  మీరు దీర్ఘకాలమువరకు జీవించుటకు నిశ్చయించితిరి. మీరు ఈ ప్రతిజ్ఞను వ్యర్థము ఒనర్చకుడు.

మత్కథాః పచరిష్యంతి  యావల్లోకే హరీశ్వర

తావద్ రమస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్                 92

కపీశ్వరా, ఈ లోకమున నా చరిత్ర ప్రచారములో ఉండునంతవరకు మీ చరిత్రకూడా నా ఆజ్ఞను పాలించుచూ ప్రచారములోనుండును.

మహాత్ముడు శ్రీరామచంద్రుడు ఈ మాటలను పలికిన పిదప ఆంజనేయుడు ఇట్లనెను.   

యావత్ తవ కథా లోకే విచరిష్యతి పావనీ

తావత్ స్థాస్యామి మేదిన్యాం తవ ఆజ్ఞాం  అనుపాలయన్                      93 మహాత్మా, శ్రీరామచంద్రా, మీ పుణ్యకథ ఈ మండలమున ఎంతవరకు ఉండునో అంతవరకూ మీ ఆదేశమును పాలించుచుండును. మరియు అంతవరకు ఈ భూమండలము మీద ఉండెదను.

అటుపిమ్మట వసిష్టముని తన మహాప్రస్తానముకై సంసిద్దుదయ్యేను. ఆయన సమస్త క్రియలను విధిపూర్వకముగా నిర్వర్తించెను. అనంతరము శ్రీరాముడు పరబ్రహ్మ ప్రతిపాదకములగు వేదమంత్రోచ్ఛారణ  చేస్తూ సరయూనది తీరమునకు పోయెను.

వేదాబ్రాహ్మణరూపేణ గాయత్రీ సర్వరక్షిణీ

ఓంకారః అథ వషట్కారః సర్వే రామం అనువ్రతాః                     94

నాలుగు వేదములు బ్రాహ్మణరూపము ధరించి వెళ్ళుచుండెను. సర్వరక్షిణి అయిన గాయత్రి, ఓంకారము, వషట్కారము –అన్నీ శ్రీరామునే అనుసరించెను.

ఋషయశ్చ మహాత్మనః సర్వ ఏవ మహీసురాః

అన్వగచ్ఛన్ మహాత్మానం స్వర్గద్వారం అపావృతం                    95

ఋషులు, మహాత్ములు, సర్వులు కూడా  స్వర్గద్వారమువంటి పరమాత్ముడైన శ్రీరామునివెంట వెళ్ళిరి. అంతఃపుర స్త్రీలు, బాలురు వృద్ధులు, దాసేజనులు, సేవకులు సరయూనదీ తీరమునకు వేదలుచున్న శ్రీరాముని వెంట వెళ్ళిరి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశమునుండి ఇట్లు పలికెను. శ్రీవిష్ణు స్వరూపులగు రాఘవా, రండి, మీయొక్క పరంథామమునకు మీరు వేంచేయుచున్నారు. రండి. అనెను.

పితామహవచః శృత్వా వినిశ్చిత్య మహామతిః

వివేశ వైష్ణవం తేజః సశరీరః సహా అనుజః                        96  

పితామహుడు అయిన బ్రహ్మదేవుని వచనములను విని పరమబుద్ధిమంతుడగు శ్రీరాముడు కొంత నిశ్చయముచేసి సోదరులతో కూడి శరీరసహితముగా తన వైష్ణవ తేజమును ప్రవేశించెను.

అప్పుడు ఇంద్రుడు, అగ్త్ని మొదలగు సమస్తదేవతలు, సాధ్యులు, మరుత్తులు, విష్ణు స్వరూపమున ఉన్న శ్రీరాముని పూజింప దొడగిరి.

అథ విష్ణుః మహాతేజాః పితామహం ఉవాచ హ  

యేషాం లోకం జనౌ ఘా నాం దాతుం అర్హసి సువ్రత                    97

అనంతరము విష్ణుతేజస్సుతో విరాజమానుడైన యున్న మహాతేజస్వియగు శ్రీరామచంద్రుడు బ్రహ్మదేవునితో ఇట్లు చెప్పెను. ఉత్తమ వ్రతమును పాలించు పితామహా, నా వెంటవచ్చిన ఈ సమస్త జనసముదాయమునకు, ఈ భక్తకోటికి కూడా మీరు ఉత్తమ లోకములను ప్రాప్తింప చేయుడు.

విష్ణు భగవానుని మాటలను విన్న బ్రహ్మదేవుడు ఇట్లనెను. మహాత్మా, వీరికి ‘సంతానకము’ అను ఉత్తమలోకము ప్రాప్తించును. అంతట సరయూనదియందు స్నానమాచారించిన వారు అందరూనూ చాలా సంతోషముతో తమతమ ప్రాణములను, శరీరములను వదిలి విమానములపై కూర్చుండిరి.      

ఇదం ఆఖ్యానం ఆయుష్యం సౌభాగ్యం పాపనాశనం

రామాయణం వేదసమం శ్రాద్దేషు శ్రావయేద్ బుధః                             98

ఈ రామాయణ కావ్యము ఆయుష్షును, సౌభాగ్యమును వృద్ధి చేయును. పాపములను నశింపజేయును.  రామాయణం వేదసమం.  విద్వాంసులు అయినవారు  శ్రాద్ధముల యందు దీనిని వినిపించవలయును.

అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం

సర్వపాపైః ప్రముచ్యేత పాదమపి యస్య యః పఠేత్             90

 ఈ రామాయణ కావ్యమును చదివినయడల పుతృలులేనివానికి పుత్రులు కలుగును. నిర్ధనుడు ధనమును పొందును.  ఎవ్వడైనను ఒక్క శ్లోకపాదమును చదివినను సర్వపాపములనుండి విముక్తుడగును.

రామాయణం గోవిసర్గే మధ్యాహ్నేవా సమాహితః

సాయాహ్నే వ అపరాహ్ణే చ వాచయన్ న అవసీదతి          100

యెవ్వడు ప్రతిదినము ఏకాగ్రచిత్తుడై ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము రామాయణము పఠించునో, అతనికి ఎప్పుడను, ఏ విధమైన దుంఖము కలుగదు.

సత్యమేతద్ విదిత్వా తు శ్రోతవ్యం నియతాత్మభిః

గాయత్ర్యశ్చ స్వరూపం తద్ రామాయణం అనుత్తమం            101     

ఇది సంపూర్ణముగా సత్యమని నమ్మవలెను. మనస్సును వశమందు ఉంచుకొనవలెను. అంతట శ్రవణము చేయవలయును. ఈ పరమోత్తమ రామాయణ కావ్యము గాయత్రి యొక్క స్వరూపము అయి ఉన్నది.

ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః

ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం                          102  

ఈ ప్రకారముగా ఈ పురాతన అభ్యాసమును మీరు విశ్వాసముతో పఠించండి.  మీకు శుభమగును. విష్ణు భగవానుని బలమునకు జయమగుగాక. 

                                శుభం 

Comments

  1. Astrologer Master Rudra Ji is the best astrologer in New York who was practicing Vedic Astrologer for the past many years.
    Best Astrologer in California

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana