6 .యుద్ధకాండ –రామాయణము

 

                                         6   .యుద్ధకాండ –రామాయణము

హనుమంతుడు తన లంకా ప్రయాణమును గూర్చి విపులముగా శ్రీరామునికి విశదీకరించిన తదుపరి మిక్కిలి సంతోషించిన శ్రీరాముడు ఇట్లనెను.

కృతం హనుమతా కార్యం సుమహద్ భువి దుర్లభం

మనసాపి యదన్యేన న శక్యం ధరణీతలే.                                  1

హనుమంతుడు చాలా గొప్ప కార్యమును నెరవేర్చెను. ఈ భూతలముపై అంతటి మహత్ కార్యమును జరుపుట ఇంకొకడికి దుర్లభము.  ఇంకొకడు ఇట్టి కార్యమును చేయుటకు యోచింపనుకూడా కష్టము.

న హితం పరిపశ్యామి యస్తరేత మహోదధిం

అన్యత్ర గరుడాద్ వాయోరన్యత్ర చ హనూమతః                          2

గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు—ఈ ముగ్గురికే సముద్రమును దాటగల శక్తియున్నది. ఇంకొకరిలో ఈ శక్తిని నేను చూడ లేదు. 

యో హి భృత్యో నియుక్తః సం భర్త్రా కర్మాణి దుష్కరే

కుర్యాత్ తదనురాగేణ తమాహుః పురుషోత్తమ                           3

ఏ సేవకుడు యజమాని ఇచ్చిన ఎట్టి కష్ట కార్యమునైనను చేయునొ, అంతియగాక ఆ  కార్యమునకు అనుబంధముగా మరియొక కార్యమును కూడా చేయునో, అట్టివాడు ఉత్తమ సేవకుడు అని చెప్పబడును.

యో నియుక్తః పరం కార్యం న కుర్యాత్ నృపతే ప్రియం

భ్రుత్యో యుక్తః సమర్థశ్చ తమాహుః మధ్యమం నరం               4

ఏ సేవకుడైతే నియమించిన పని చేసిన తదుపరి, సామర్థ్యము యోగ్యతా ఉన్నప్పటికిన్ని వేరొక అనుబంధ కార్యము చేయకుండునో అతడు మధ్యతరగతి సేవకుడని పిలువబడును. 

నియుక్తో నృపతేః కార్యం న కుర్యాద్ యహ సమాహితః

భృత్యో యుక్తః సమర్థశ్చ తమ్  ఆహుః పురుషాథమం                        5

ఏ సేవకుడైతే నియమించిన పని చేసిన తదుపరి, సామర్థ్యము యోగ్యతా ఉన్నప్పటికిన్ని ఆ కార్యమును జాగ్రత్తగా పూర్తీ  చేయకుండునో అతడు ఆథమ తరగతి సేవకుడని పిలువబడును. 

తన్నియోగే నియుక్తెన కృతం కృత్యం హనుమతా

న చాత్మా లఘుతాం నీతః సుగ్రీవశ్చాపితోషితః                          6

హనుమంతుడు తనకు తన రాజగు సుగ్రీవుడు చెప్పిన కార్యము ఒక్కటెగాక ఇంకను మరికొన్ని గొప్ప కార్యములను కూడా చేసెను. అదేసమయములో తనకు అగౌరము కలగకుండా జాగ్రత్త పడెను.  తన్ను తాను ఇతరుల దృష్టిలో తక్కువకాకుండా చేసికొనెను. తన రాజైన సుగ్రీవునికి కూడా సంతోషము కలుగచేసేను.

హనుమంతుని వాక్యములను విన్న శ్రీరాముడు పరమానందము పొందెను.  వారు కార్యసఫలత గావించిన హనుమంతుని ప్రేమతో ఆలింగనము చేసికొనిరి.  అప్పుడు సీతను గూర్చిన వ్యాకులత చెందుచున్న శ్రీరాముని అనునయిస్తూ సుగ్రీవుడు ఇట్లు పలికెను.

తదలం విక్లవాం బుద్ధిం రాజన్ సర్వార్థ నాశినీం

పురుషస్య హి లోకేస్మిన్ శోకః శౌర్యానకర్షణః                          7 

రాజా, మీరు వ్యాకులత చెందకుడు. ఈ వ్యాకులతా బుద్ధిని వదిలివేయుడు. ఈ వ్యాకులతా బుద్ధి సమస్త కార్యములకు హానికారి. మరియు శోకము శౌర్యమును నాశనము చేయును.\

యత్ తు కార్యం మనుష్యేణ శౌటీర్యం అవలంబ్యతాం

తదలంకరణాయైవ కర్తుర్భవతి సత్వరం                                8 

మనుజుడు చేయు పనికి కీర్యదీక్షత మరియు  శౌర్యమును అనుసరించావలయును. అది కర్తకు అలంకారము.  అది అతని అభీష్టఫలమును నేరవేర్చును.   

అస్మిన్ కాలే మహాప్రాజ్ఞ సత్వం మాతిష్ఠ తేజసా

శూరాణాం హి మనుష్యాణాం త్వద్విథానాం మహాత్మనాం

వినష్టే వా ప్రణష్టే వా శోకః సర్వార్థ నాశనః                                    9

కావున శ్రీరామా, మీరు తేజస్సుతో పాటు ధైర్యము వహింపుము. వస్తువు పోయినాను, నశించినాను మీలాంటి శూరులు శోకించరు. ఎందుకనగా శోకము కార్యదీక్షతను నాశనము చేయును. 

సాగరమును దాటుటకు ఉపాయము మీరు మాతోటి విచారణ చేయుము.  ఎందుకనగా మీ బుద్ధి చాలా సూక్ష్మమైనది.  అప్పుడు శ్రీరాముడు వ్యాకులతమాని హనుమంతునితో ఇట్లు చెప్పెను.  

తపసా సేతుబంధేన సాగారోచ్ఛోషణేన చ

సర్వథా పి సమర్థోస్మి సాగరస్యాస్య లఙ్ఘనే                           10

నేను తపస్సుచేసి వారథిని నిర్మించి సముద్రమును ఎండింపజేసి సర్వ విధముల మహాసముద్రమును దాటుటయందు సమర్థుడను.  

తదుపరి శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లనెను.  ఇప్పుడు సూర్యుడు పగలు మధ్యాహ్నానికి చేరుకున్నాడు. ఈ ముహూర్తము తగినది. మీరు ప్రయాణానికి వెంటనే సిద్ధము కండు. అనంతరము దక్షిణదిశగా అందరూ బయల్దేరిరి. అందరికంటే ముందర ఋషభుడు, నీలుడు, వీరుడగు కుముదుడు, మరియు అనేక వానర వీరులు మార్గము సరిచేస్తూ ముందునడవగా వెనక అందరూ వారివెంట నడిచిచిరి.  సేనయొక్క మధ్యభాగమున వానరరాజు సుగ్రీవుడు, ఆయనను అనుసరిస్తూ శ్రీరామలక్ష్మణులు నడిచిరి. వీరితోబాటు భయంకర కార్యములు నెరవేర్చు శతబలి అనే వానర శ్రేష్టుడు పది కోట్లమంది వానరులతో తన పర్యవేక్షణలో నడచుచుండిరి. సముద్రము ఒడ్డుకు చేరిరి. అప్పుడు శ్రీరాముడిట్లు చెప్పెను. సుగ్రీవా, సేనలన్నిటినీ సముద్రతీరమున నిలుపుడు. ఇప్పుడు సముద్రమునకు ఆవల ఒడ్డుకు చేరు ఉపాయము ఆలోచించవలయును.

మంత్రమూలం చ విజయం ప్రవదంతి మనస్వినః

తస్మాద్ వై రోచయే మంత్రం రామం ప్రతి మహాబలాః                  11

మహావీరులార, విజయమునకు మూలము మంత్రులచే ఇవ్వబడు సలహాలే అని పెద్దలు చెప్పుదురు.  కనుక ఈ శ్రీరామ కార్యములో మీ సలహా ఏమిటి. చెప్పవలసినది.

త్రివిధాః పురుషాలోకే ఉత్తమ అథమ మధ్యమాః

తేషాం తు సమవేతానాం గుణదోషౌ వదామ్యహం                12

ప్రపంచమున ఉత్తమ అథమ మధ్యమా అని మూడు రకముల మనుష్యులు ఉంటారు.  నేను వారి వారి గుణదోషముల గురిచి చెప్తున్నాను.

మంత్రస్త్రిభిర్హి సంయుక్తః సమర్థైః మంత్ర నిర్ణయే

మిత్రైర్వాపి సమానార్థైః బాన్ధవైరపి వాధికైః                                    13

సహితో మంత్రయిత్వా యః కర్మారంభాన్ ప్రవర్తయేత్

దైవేచకురుతే యత్నం తమాహుః పురుషోత్తమం                                 14

ఎవని ఆలోచన ఉత్తమ లక్షణములతో కూడియుండునో, ఎవడు సమర్థమైన నిర్ణయములను తన మిత్రులతో బాగా విచారించి తీసికోనునో, సుఖ దుఖములను అర్థముచేసికొనునట్టి బంధువులు హితకారులతోను సంప్రదించి కార్యములు  ప్రారంభించునో, అతనిని ఉత్తముడందురు.

ఏకోర్థం విమృశేదేకో ధర్మే ప్రకురుతే మనః

ఏకః కార్యాణి కురుతే తమ్ ఆహుః మాధ్యమం నరం                                15

ఎవడు ఒంటరిగానే తన కర్తవ్యమునుగూర్చి విచారించునో, ఎవడు ఒంటరిగానే తన ధర్మమునందు మనస్సు నిలుపునో, ఎవడు ఒంటరిగానే తన కార్యములను అన్నింటినీ చేయునో,  అతనిని మధ్యముడందురు.

గుణదోషౌ న నశ్చిత్య త్యక్త్వా దైవవ్యపాశ్రయం

కరిష్యామీతి యః కార్యం ఉపెక్షేత్  స నరాధమః                         16

గుణ దోషములను విచారించక, దైవమును ఆశ్రయించక, కేవలము ‘చేసెదను’ అనే బుద్ధిచే కార్యములు ఆరంభించునో, తత్తదుపరి ఆ కార్యమును ఉపేక్షించునో, అట్టి మనుజుని అధముడంటారు.

మీరందరూ బుద్ధిమంతులు. కనుక బాగుగా విచారించి కర్తవ్యమును నిర్ణయింపుడు. దానినే నా కర్తవ్యముగా తలంచెదను.  ఈ విధముగా శ్రీరాముడు పలికెను. శ్రీరాముడు అనేకమంది అసంఖ్యాకమైన వానరవీరులతో తనమీదకు యుద్ధముచేయ వచ్చు చున్నాడనే వార్త రావణాసురుడికి అందెను. రావణుడు కోపముతో ఊగిపోయెను.  ఆ రాక్షసులందరూ యుద్ధము చేయ నిచ్చగించి బయల్దేరుటకు నిశ్చయించిరి.  అప్పుడు రావణుని అనుంగు సోదరుడు అయిన విభీషణుడు చేతులు జోడించి ఇట్లనెను.  శ్రీరాముడు రాక్షస రాజగు రావణునికి మొదటగా ఏమీ అపరాథము గావించలేదు. మహాత్ముడు అయిన శ్రీరాముని పత్నిని ఏ కారణముచేత ఇక్కడికి తెచ్చితివి? ఆమెను ఎందుకు చేర బట్టితివి? శ్రీరాముడు గొప్ప ధర్మాత్ముడు. గొప్ప పరాక్రమశాలి. వారితో అనవసరముగా వైరముచెందుట మంచిదిగాదు. మిథిలేశుని కుమార్తె వైదేహిని తిరిగి పంపివేయుము. శ్రీరామునికి క్షమార్పణ చెప్పుము. 

త్యజాశుకోపం సుఖధర్మనాశనం భజస్వ ధర్మం రతి కీర్తి వర్ధనం

ప్రసీద జీవేషు సపుత్ర బాంధవాః ప్రదీయతాం దాశరథాయ మైథిలీ         17

సోదరా, నీవు క్రోధమును వదలుము. క్రోధము సుఖమును, ధర్మమును నాశనము చేయును. ధర్మమార్గమును అనుసరింపుము. అది నీకు సత్కీర్తిని సుఖమును ఇచ్చును. మాపై ప్రసన్నుడవు కమ్ము. దానివలన మేము కుటుంబసమేతముగా క్షేమముగాను, మరియు సుఖముగా ఉండగలుగుదుము. ఈ దృష్టితోనే సీతమ్మను శ్రీరామునికి గౌరవప్రదముగా అప్పగించుమని కోరుచుంటిని. అని విభీషణుడు అనెను.

హితం మహారథం మృదు హేతు సంహితం వ్యతీత కాలాయతి సంప్రతి క్షమం

నిశమ్య తద్ వాక్యం ఉపస్థిత జ్వరః ప్రసఙ్గ వానుత్తరమే తదబ్రవీత్              18

విభీషణుని ఈ హితకరమైన, సుస్పష్ఠమైన,  మృదు మధురమైన వాక్యములు, గొప్ప ప్రయోజనము కలవియు, యుక్తితోకూడినవియు, భూత భవిష్యత్ వర్తమానముల యందు కార్యసాధనయందు సమర్థములైనవియును అగు ఆ వాక్యములను విన్న రావణునికి జ్వరము వచ్చినట్లుగా ఉండెను. రావణుడు ఈ విధముగా ప్రత్యుత్తరమును ఇచ్చెను.

భయం న పశ్యామి కుతశ్సిదపి అహం న రాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీం

సురైః సహెంద్రైరపి సంగరే కథం మమాగ్రతః స్థాస్యతి లక్ష్మణాగ్రజః               19

విభీషణా, నేను ఇసుమంతైనను భయపడుటలేదు. శ్రీరాముడు మిథిలేశుని కుమార్తెను తిరిగి పొందజాలడు. దేవేంద్రుని సహాయముతో లక్ష్మణుని జ్యేష్ఠసోదరుడు నా పై యుద్ధమందు గెలవలేడు.  

రాక్షసరాజగు సీతయడల కామపీడుతుడయ్యెను. అందుకని కామపీడితుడైన రావణునికి విభీషణుని హితవాక్యములు చేవికేక్కటము లేదు. సీతాపహరణము చేసిన రావణుడు మహాపాపి అని విభీషణుడులాంటి శ్రీలంక హితైభిలాషులు తలపోస్తూ ఉండిరి. రావణుడు కామపీడితుడై ‘సీతా, సీతా’ అని కలవరించుచుండెను. రాజ్యముయొక్క క్షేమము గోరు సేనాపతి అయిన ప్రహస్తుడు ‘సైన్యము సిద్ధముగా ఉన్నది’ అనే మాటే రావణునికి మంచిమాటగా తోచెను. కేవలము తన సుఖము మాత్రము కోరుకునే స్వార్థపరుడైన రావణుడు ఇట్లు తలంచెను. ‘అతిలోక సౌందర్యవతి అయిన సీతను వదలుకొనుట అసంభవం, మరియు కామము నన్ను తన వశుడను చేసికొనెను’ అని తలపోశేను. 

క్రోధ హర్ష సమానేన దుర్వర్ణ కరణేన చ

శోక సంతాప నిత్యేన కామేన కలుషీకృతః                   20  

క్రోధ హర్ష స్థితులు రెండింటియందు కామము సమానముగా ఉండును. శోక సంతాప సమయములందు మనస్సునందు తొలగనిది కామము. ఆ కామము నా హృదయము కలుషితము చేసినది.

కామాతురుడగు రావణుని ప్రలాపనను విన్న విభీషణుడికి కోపము వచ్చెను. విభీషణుడు ఇట్లనెను. మహారాజ, నీవు మోసముతో కూడిన ఈ పరస్త్రీ అపహరణాది పాపకార్యములు వేనిని చెసితివొ, ఇవి మిక్కిలి అనుచితములు. ఈ పాపకర్మను చేయుటకు ముందుగా నీవు మాతో సంప్రదించలేదు.

న్యాయేన రాజకార్యాణియః కరోతి దశాననా

న స సంతప్యతే పశ్చాత్  నిశ్చితార్థ మతిర్నృపః                  21       

దశాననా, రాజు కార్యమునంతను న్యాయపూర్వకముగా చేయవలయును. అప్పుడు అతని బుద్ధి నిశ్చయముగా ధర్మపూర్ణమై ఉండును. ఆ రాజు తరువాత పశ్చాత్తాప పడవలిసిన అవసరము ఉండదు.

అనుపాయేన కర్మాణి విపరీతాని యాని చ

క్రియమాణాని దుష్యంతి హవీంషః  ప్రయతేష్వివ                 22

కార్యములు సరియైన ఉపాయము అవలభించియే చేయవలయును. అవి లోకమునకు, శాస్త్రమునకు విరుద్ధముగా ఉండరాదు.  ఆ పాపకర్మలు అపవిత్ర హింసార్థక  యజ్ఞములందు హోమముచేయబడిన హవిష్యమువలె ఉండరాదు. అవి దోషమును కలుగజేయును.

యః పశ్చాత్ పూర్వకార్యాణి కర్మణ్యభిభిచికీర్షతి

పూర్వంచాపర కార్యాణి స న వేద నయానయౌ                          23

ఎవడు మొదట చేయదగిన కార్యములను తరువాతచేయునో, తరువాత చేయదగిన కార్యములను మొదట చేయునో, వాడు నీతిని అవినీతిని తెలిసికొనుటలేదు.

మహారాజా, నీవు భావికాల పరిణామమును విచారించకయే ఈ చేయరాని దుష్కార్యమును చేసితివి.  విషము కలిపిన భోజనము చేసినవాడికి వాడి ప్రాణము తప్పక హరించును.  శ్రీరాముడు ఇంతవరకు మిమ్మల్ని సంహరించకుండుట మీ అదృష్టము. 

జీవంస్తు రామస్య న మోక్ష్యసే త్వం గుప్తః సవిత్రాపి అథవా మరుద్భిః

న వాసవస్యాఙ్కగతో న మృత్యోః నభో న పాతాల మను ప్రవిష్టః                   24

రాజా, సూర్యభగవానుడుగాని, వాయుదేవుడుగాని, ఒకవేళ నిన్ను రక్షించవచ్చు, దేవేంద్రుడు గాని, లేదా యమధర్మరాజుగాని నిన్ను ఎవరికీ కనబడకుండా దాచిపెట్టవచ్చు. నీవు పాతాళమునగాని, ఆకాశామునందుగాని దాగుకొనవచ్చు. కాని నీవు శ్రీరాముని చేతినుండి బ్రతికి బయటపడటం అనేది అసంభవం.

రావణాసురుని నెత్తిమీద కాలుడు కాపురం ఉన్నాడు. అందుకని విభీషణుని మాటలు రావణాసురునికి రుచించలేదు. అందువలన విభీణునుడితో ఇట్టి కరవాక్యములను పలికెను.

వసేత్ సహ సపత్నేన క్రుద్ధేనాశీ విషేణచ

న తు మిత్రప్రవాదేన సంవసేత్ శతృ సేవినా                                  25

సోదరా, విభీషణా, శతృవుతోను, లేదా విషసర్పముతోను ఉండవచ్చును. కాని మితృడు అని పేరుపెట్టుకొని శతృవును సేవించువానిని ఎన్నడును దరిచేయనీయకూడదు.

యథా పూర్వం గజః స్నాత్వా గృహ్య హస్తేనవై రజః

దూషయత్ ఆత్మనో దేహం తథానార్యేషు సౌహృదయం                     26

ఏనుగు స్నానము చేసినతదుపరి తిరిగి తన శరీరముపై బురద చల్లుకొని మలిన పరచుకొనును. దుర్జనుల మైత్రియు అటువంటిదే.

కుల కళంకుడవగు నిశాచరా, నీకు ధిక్కారముగాక. నీవు గాక ఇంకొకడు నీ స్థానములో ఉన్నట్లయితే ప్రాణములతో ఉండెడివాడుకాదు. మంచిని చేయు వాక్యములను పలికిన విభీషణుని మాటలు రావణునికి రుచించలేదు. అంతట విభీషణుడు నలుగు రాక్షసులను వెంటబెట్టుకొని యెగిరి ఆకాశమున వెడలిపోయెను. అప్పుడు విభీషణుడు ఆకాశమునుండి రాక్షసరాజగు రావణుడితో కోపముగా ఇట్లు పలికెను.

సునీతం హితకామేన వాక్యముక్తం దశానన

న గృహ్ణంతి అకృతాత్మనః కాలస్య వశమాగతాః                       27

దశకంఠా, జితేంద్రియులు కానివారు, కాలమునకు వశమైనవారు ఎవ్వరి మాట వినరు. అట్టివారు హితవాక్యములను వినరు.

సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః

అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః                             28

సదా ప్రియముగా, తియ్యగా మాటలుచేప్పువారు లభించుట సులభము.  వినటానికి అప్రియముగాను, పరిణామమున హితకరములుగాను అగు మాటలు చెప్పువారు, వినువారు దొరుకుట దుర్లభము.

శూరాశ్చ బలవంతశ్చ నారా రణే

కాలాభివన్నాః సీదన్తి యథా వాలుకసేతవః                      29  

గొప్ప గొప్ప శూరవీరులు, బలవంతులు, అస్త్రవేత్తలు కాలమునకు వశులు.  అట్టి వారుకూడా ఇసుకతో కట్టబడిన వారధులవలె నశించిపోవుదురు.

రాక్షసరాజా, నేను నీ తమ్ముడిగా నీ హితముకోరి చెప్తున్నాను. కావున నేను చెప్పినది నీకు ఇష్టముకానిచో నన్ను క్షమించుడు.  నీవు నా జ్యేష్ఠ సోదరుడవు. నీవు నీ యొక్కయు, ఈ సమస్త లంకా పట్టణము యొక్కయు క్షేమమును సర్వవిధముల కాపాడుము. నేను ఇంటినుండి వెళ్తున్నాను. నేను లేకుండానే సుఖపడుము.  ఈ మాటలు మాట్లాడిన వెంటనే రెండు ఘడియలలోనే లక్ష్మణుడు ఉన్న శ్రీరాముడు ఉన్న చోటుకి చేరెను.  ఆకాశామందే ఉండి సుగ్రీవుడు మరియు ఇతర వానర శ్రేష్టులతో ఇట్లు పలికెను. రావణుడు అనే దురాచారి, మరియు కాముకుడు నా జ్యేష్ఠ భ్రాత.   నా హితకార మాటలు పెడచెవిన పెట్టెను. మా అన్న నాతో అనేక దుర్భాషలు మాట్లాడి నన్ను సేవకుని కంటే ఘోరముగా అవమానించాడు. నేను నా స్త్రీ పుత్రులను అక్కడే వదిలి శ్రీరాముని శరణ్యము పొందుటకు వచ్చితిని.

సుగ్రీవుడు వెంటనే శ్రీరాముని వద్దకు వచ్చి ఇట్లు చెప్పెను. ‘ప్రభూ, శ్రీరామా, మన శతృవు రావణుడు. వీడి తమ్ముడు విభీషణుడు. నీ శరణుకోరి వచ్చాడు. అతనిని నమ్మకుడు. గుడ్లగూబ కాకులను చంపునట్లు సమయముచూసి మనసేనలను చంపగలడు.  అప్పుడు శ్రీరాముడు అందరితోను ఇట్లనెను.  

సుహృదామర్థ కృఛ్రేషు యుక్తం బుద్ధిమతా సదా

సమర్థేనోప సందేష్టుం శాశ్వతీం భూతిమిచ్ఛతా                   30  

మిత్రుల శాశ్వత ఉన్నతిని కోరు బుద్ధిమంతునకు, సమర్థునకు, కర్తవ్య, మరియు అకర్తవ్య విషయమున సంశయము కలిగినపుడు మనుజుడు సదా తన సమ్మతిని ఒసంగ వలయును.  

అప్పుడు ఆ వానరశ్రేష్టులు అందరు ఆలోచించిరి.  అప్పుడు వివేకవంతుడైన హనుమంతుడు ఇట్లు పలికెను.

అశఙ్కితమతిః స్వస్థో న శఠం పరిసర్పతి

న చాస్య దుష్టవాక్ అస్తి తస్మాన్మే నాస్తి సంశయః                    31

దుష్టుడు నిశ్శంకగాగా, స్థిరచిత్తముతో ఎదుటకు ఎప్పుడున్నూ ఎదుటకు రాలేడు..  అతని వాక్కు దోషపూరితముగా ఉంటుంది. ఇందులో నాకు ఎట్టి సందేహమూ లేదు.

ఆకారస్చాద్య మానోపి న శక్యో వినిగూహితుం

బలాద్ధి  వివృణోత్యేవ భావమంతర్గతం నృణాం                                  32

ఒకడు తన పై ఆకారమును యెంత దాచుకున్నాను, లోపలి భావము దాగదు. బయటి ఆకారము లోపలి భావమును తప్పక ప్రకటించును.

ధీమంతులలో శ్రేష్ఠుడవగు శ్రీ రామచంద్ర, ఈ రాక్షసుని గురించి యథాశక్తి నివేదించితిని. మీకు ఉచితమైన రీతిని చేయుడు.  వారి మాటలు హనుమంతుని ద్వారా విన్న శ్రీరాముడు ప్రసన్నుడాయెను. అప్పుడు శ్రీరాముడు ఇట్లు వచించెను.

మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన

దోషో యద్యపి తస్యస్యాత్ సతామేతద గర్హితం                               33

మిత్రభావముతో వచ్చినవాడు ఎవ్వడైనను నేను త్యజించజాలను. అట్టివానియందు దోషమున్నను, అట్టి దోషికి ఆశ్రయమొసంగుట సజ్జనులకు నిందితముకాదు.  

న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాః

మద్విధా వా పితుః పుత్రః సుహృదోవా భవద్విధాః                   34

ప్రియమైన సుగ్రీవ, ప్రపంచమున సోదరులందరూ భరతుని మాదిరి ఉండరు. కుమారులందరూ నా మాదిరి ఉండరు.  మిత్రులందరూ మీవలె ఉండరు.

విభీషణుడు ఎతువంటివాడైనను నాకు హానిచేయలేడు అని నా విశ్వాసము.  

పిశాచాన్ దానవాన్ యక్షాన్  పృథివ్యాం చైవ రాక్షసాన్

అఙ్ల్యల్యగ్రేణతాన్ హన్యమిచ్ఛన్ హరిగణేశ్వర                                    35

వానరయూథనాయకా, నేను సంకల్పించినచో, భూమిపైగల పిశాచ, దానవ, యక్ష రాక్షసులందరినీ కూడా చిటికినవ్రేలితో వధించగలను.

శ్రూయతే హాయ్ కపొ౦తెన శత్రుహు కపోతెన శత్రుహు శరనమాగాతః

ఆర్చితశ్చ యథా న్యాయం స్వైశ్చ మాం సైర్ని మంత్రితః                      36

ఒక పావురము తనను శరణుబొందిన శతృవైన బోయవానికి తగిన అతిథి సత్కారములు చేసెను, ఆ బోయవానిని ఆహ్వానించి తనశరీరమునందలి మాంసమును భోజనము చేయించెను. ఇట్లా విన్నాము.  

స హి తమ్ ప్రతిజగ్రాహ భార్యాహర్తారం మాగతం

కపోతో వానరశ్రేష్ఠ కిం పునర్మద్విధో జనః                                        37

ఆ బోయవాడు ఆడ పావురమును పట్టుకొనెను.  అయినను ఇంటికి వచ్చిన బోయవాడిని అతిథిగా ఆ మగపావురము ఆదరించెను.న ఇక నావంటివాడు శరణాగతులను ఆదరించుట గురించి వేరే చెప్పవలయునా?

ఋషేః కణ్వస్య పుత్రేణ కణ్డునా పరమర్షిణా

శృణు గాథా పురా గీతా ధర్మిష్టా సత్యవాదినా                                    38

పూర్వము కణ్వముని పుత్రుడు కండు మహర్షి. ఆయన సత్యవాది. ఆ మహర్షి ఒక ధర్మసంబంధమైన విషయము చెప్పెను. అది వినుము.

బద్ధాఙ్లిలిపుటం దీపం యాచంతం శరణాగతం

న హన్యాదానృశంస్యార్థమపి పరంతప                                                   39

శత్రువులను తపింపచేయువాడా, శరణాగతుడైన శతృవునైనను, దీనముగా చేతులు జోడించి దయాభిక్ష కోరినచో అతనిపై యుద్ధముచేయరాదు. శతృత్వము వహించరాదు.

ఆర్తోవా యదివా దృప్తః పరేషాం శరణం గతః

అరిః ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః కృతాత్మనా                               40

శత్రువు ఆర్తుడైనను, అభిమానియైనాను, తన విపక్షిని శరణుగోరినచో శుద్ధమనస్సు గల ఆ శ్రేష్ఠ మనుజుడు తన ప్రాణముమీద మోహమును వదిలి అతనిని రక్షించ వలయును.

ఏవందోషో మహానత్ర ప్రపన్నా నామరక్షణే

అస్వర్గ్యం చాయశస్యం చ బలవీర్య వినాశనం                            41

శరణాగాతుని రక్షింపకుండుట గొప్పదోషమని చెప్తారు పెద్దలు. శరణాగతులను రక్షింపకుండుట స్వర్గప్రాప్తిని, సత్కీర్తి ప్రాప్తిని నశింపచేయును. మరియు బలమును, వీర్యమును నాశము చేయును.

కరిష్యామి యథార్థం తు కణ్డోర్వచనముత్తమం

ధర్మిష్ఠం చ యశస్యం చ స్వర్గ్యం స్యాత్ తు ఫలోదయే                42

కనుక  కణ్డు మహర్షి చెప్పిన ఆ యథార్థ ఉత్తమ వాక్యమునే పాలించేడను.  ఎందుకంటె అది పరిణామమున ధర్మమును, యశస్సును, స్వర్గ్యమును కలుగజేయును.

సక్రుదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే

అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ                    43

ఎవ్వడైనను, ‘నేను నీ వాడను, రక్షింపుము’  అని ప్రార్థించునో, అట్టిశరణాగతుడికి తప్పక సర్వప్రాణులనుండి నేను అభయమొసంగెదను. ఇది నా వ్రతము.

అభయమొసంగిన శ్రీరాముని కృతజ్ఞతా పూర్వకముగా ఆకాశమునుండి క్రిందకు చూచినవాడై, విభీషణడు తన అనుచరులతో సహా క్రిందకు దిగి శ్రీరాముని పాదములపై పడెను. పాదములపై పడిన విభీషణని శ్రీరాముడు ఓదార్చెను. అప్పుడు వినయపూర్వకముగా ఇట్లు పలికెను. మహాత్మా శ్రీరామ, నేను రావణుని తమ్ముడను. రావణుడు నన్ను అవమానించెను. మీరు సమస్త ప్రాణులకు శరణమొసంగువారు అందువలన నేను మీ శరణు కోరితిని. అప్పుడు శ్రీరాముడు అనునయ వాక్యములతో విభీషణుని ఓదార్చెను.

శ్రీరాముడు ఇట్లు అనెను. నేను నిశ్చయముగా చెప్తున్నాను.  రావణుని సేనాపతి ప్రహస్తుడు. ఆ ప్రహస్తుడితోపాటు రావణుని వధించెను. నిన్ను లంకకు రాజును చేసెదను. ఇది నా నిర్ణయము. అనెను.

రసాతలం వా ప్రవిశేత్ పాతాలంవాపి రావణః

పితామహ సకాశం వా న మే జీవన్ విమోక్ష్యతే                            44

రావణుడు రసాతలమునగాని పాతాళమునగాని దాక్కున్నను, లేక పితామహుడగు బ్రహ్మదేవునివద్దకు వెళ్ళినాను, నా చేతిలో బ్రతకడు రావణుడు. ఇది నిశ్చయము.

అహత్వా రావణం సంఖ్యే సపుత్ర జనబాంధవం

అయోధ్యాం న ప్రవేక్ష్యామి త్రిభిస్త్రైభ్రాతృభిః శపే                          45

విభీశానా, నేను నా మువ్వురు సోదరులపై ప్రతిజ్ఞచేసి చెప్తున్నాను. వినుము. యుద్ధమున పుత్ర, సేవక, బంధు సహితముగా రావణుని వధించెదను. అప్పుడే నేను అయోధ్య పునః ప్రవేశము చేసెదను.

అంతటా శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో ఇట్లనెను.  లక్ష్మణ, నీ ఇప్పుడు సముద్రమునుండి జలమును తెమ్ము. దానిచే మహాప్రాజ్ఞుభగు విభీషణుని లంకారాజుగా అభిషేకము చేసి ప్రతిష్ఠించెదను. అప్పుడు లక్ష్మణుడు తెచ్చిన ఆ సముద్ర జలముతో వానరశ్రేష్ఠులమధ్య విభీషణుని లంకారాజుగా అభిషేకము చేసెను.  అప్పుడు రావణుని గుప్తచరుడు ను, మరియు పరాక్రమశీలుడును అగు శార్దూలుడు అచ్చటికి వచ్చెను. సుగ్రీవునిచే సురక్షితమైన వానరసేనను చూసెను. వాడు శీఘ్రముగా లంకకు వెళ్లి రావణాసురునికి ఇట్లు చెప్పెను. ‘మహారాజా, లంకవైపునకు వానరసేన మహా ప్రవాహముగా వచ్చుచున్నది. అది ఇంకొక సముద్రమువలె అపారముగానున్నది. అప్పుడు రావణుడు కలవరపడి తేరుకొని శ్రేష్టుడైన శుకుడు అను రాక్షసునితో ఇట్లనెను.  నీవు వెంటనే సుగ్రీవుని వద్దకు వెళ్లి ఈ మాటలు నావిగా చెప్పుము. ‘శ్రీరాముని భార్యను నేను అపహరించినచో నీ కేమి? వెంటనే కిష్కింధకు తిరిగిపోమ్ము.’

ఆ దూత శుకుడు చెప్పిన మాటలు విని సుగ్రీవుడు ఇట్లు అనెను.  నీవు రావణునితో ఇవి నా మాటలుగా చెప్పుము. ‘రావణా, పుత్ర, బంధు, కటుంబ, మిత్ర సమేతముగా నిన్ను నిస్సందేహముగా సంహరించెదను.’.  తదుపరి వానరులు అతనిని పట్టి బంధించిరి. అతను ఏడవసాగెను.  

నాఘాతయత్ తదా రామః శ్రుత్వా తత్ పరిదేవితం

వానరాన్ అబ్రవీత్ రామోముచ్యతాం దూత ఆగతః                         46

అతని ఏడుపు విని శ్రీరాముడు అతనిని చంపనీయలేదు. శ్రీరాముడు వానరులతో ఇట్లు చెప్పెను. ఇతనిని వదిలివేయుడు. ఇతను దూతగా వచ్చిన వాడు’ అని వానరులతో చెప్పెను.   

తదుపరి శ్రీరాముడు సముద్రతీరమున దర్భలు పరచుకొని చేతులు జోడించి పూర్వాభిముఖుడై పరుండెను.  అక్కడ మూడు రాత్రులు గడిపెను. సముద్రుని ఉపాసించెను. మహాసాగారుడు ఆదిదైవిక రూపమున దర్శనము ఇవ్వలేదు. అప్పుడు కుపితుడయిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను.  సముద్రనకు గర్వము ఏర్పడినది. అందువలననే అతడు స్వయముగా ప్రత్యక్షము కాలేదు.

ప్రశమచ్చ క్షమాచైవ ఆర్జవం ప్రియవాదితా

అసామర్థ్యఫలా హ్యేతే నిర్గుణేషు సతాం గుణాః                           47

శాంతి, క్షమా, ఋజుత్వము, మధురభాషణము, అను ఈ సజ్జన గుణములను, గుణహీనుల ఎదుట ప్రయోగించరాదు. ఎందుకనగా వారు ఆ గుణవంతుని అసమర్థునిగా తలంచెదరు.  అది వారిలో కలుగు పరిణామము.  

ఈ విధముగా చెప్పి శ్రీరాముడు ఒక బాణమును బ్రహ్మాస్త్రముచే అభిమంత్రించి ధనుస్సునుంచి లాగెను. అప్పుడు సముద్రమధ్యమునుండి భయముతో వణుకుతూ  మహాశైలమగు మేరుపర్వతముయొక్క అంగమగు ఉదయాచలమునుండి మహా ప్రకాశముతో సాగరుడు స్వయముగా ఆకారముతో ప్రత్యక్షమయ్యెను. సాగరుడు క్షమా భిక్షకోరెను.  శ్రీరాముని చేతులు జోడించి ఇట్లు చెప్పెను. ‘మీ సేనయందు నలుడు అను వానరశ్రేష్టుడు కలడు. అతను సాక్షాత్ విశ్వకర్మ పుత్రుడు. “నీవు నా వలెనె సమస్త శిల్పకళయందు ప్రవీణుడవు కమ్ము” అని అతని తండ్రి వరమిచ్చెను. ప్రభూ, మీరున్నూ, ఈ విశ్వమునకు స్రష్టయగు విశ్వకర్మ అయిఉన్నారు. ఈ నలునికి మీరంటే అపారమైన భక్తి ప్రవృత్తులున్నాయి. కావున ఆ నలుడు నా పై వారధిని నిర్మించుగాక. దానిని నేను ధరిస్తాను.

సముద్రుడు ఈ వాక్యములు పలికిన తదుపరి నలుడు సముద్రముమీద వారధిని నిర్మించెను.  వానరులు దానికి వారి వారి సహాయమునొనర్చిరి. పిమ్మట సుగ్రీవుడు సత్య పరాక్రమవంతుడగు శ్రీరామునితో ఇట్లు చెప్పెను. మీరు హనుమంతుని భుజములపై కూర్చుండుడు.  ఎందుకనగా మకరములు అనగా మొసళ్ళతో కూడిన ఈ సముద్రము చాలా విశాలమైనది. ఈ వానరులిద్దరు ఆకాశామార్గమున పోగలరు. అందువలన రామలక్ష్మణులిరువురు ఆ సైన్యమునకు ముందుగా నడుస్తారు. మెల్లమెల్లగా మిగిలిన వానరసేన అంతయూ ఆ నలుడు నిర్మించిన వారధిద్వారా ఆవలి ఒడ్డుకు చేరెను.  శ్రీరాముడు సేవాసహితముగా సాగరము దాటుతున్నపుడు, రావణుడు శుక, సారణుడు అను మంత్రులిద్దరితో ఇట్లు చెప్పెను. మీరు అచ్చటికి వెళ్లి వారి వానర సేన ఎంతయో, వారిశక్తి ఎంతయో, వారిలో ముఖ్యమైనవారు ఎవరో తెలిసికొనిరండు అని పంపెను.

అప్పుడు ఆ శుకుడు, సారనుడు ఇద్దరు వానరరూపు ధరించి వానరసేనయందు ప్రవేశించిరి. విభీషణుడు వారిని గుర్తించి వారిని పట్టుకొనెను. వారిని శ్రీరాముని ఎదుట ప్రవేశపెట్టెను. శ్రీరాముని చూచిన వారిద్దరూ బ్రతుకుమీద ఆశ వదులుకొని బహు దుఖితులయ్యిరి. వారు చేతులు జోడించుకొని శ్రీరామునితో యిట్లనిరి. శ్రీరామ, మమ్మల్నిద్దరినీ రావణుడు పంపెను. ఈ సమస్త సైన్యమును గూర్చిన విషయము సేకరించుటకై మేము వచ్చితిమి. అప్పుడు శ్రీరాముడు నవ్వుతూ ఇట్లు పలికెను.

ప్రచ్ఛన్నౌ చ విముఞ్చేమౌ చారౌ రాత్రించరావుభౌ

శతృపక్షస్య సతతం విభీషణౌ వికర్షిణౌ                                  48  

విభీషణా, వీరిద్దరూ, రావణుని గూఢచారులు. రహస్యముగా విషయసెకరణకై వచ్చారు. వీరు శతృపక్షమునందు తగవు పెట్టుటకై వచ్చారు. వీరి రహస్యము తెలిసినది.  వీరిని వదిలివేయుము.  

అనంతరము ఆ ఇద్దరు శ్రీరాముని ఔదార్యమును తెలిసికోనిరి. రావణునివద్దకు వచ్చి ఇట్లు చెప్పిరి.

యాదృశం తద్ధి రామస్య రూపం ప్రహరణానిచ

వధిష్యతి పురీం లంకాం ఏకః తిష్ఠంతు తే త్రయః                  49

రాక్షసేశ్వరా, శ్రీరాముని రూపము, ఆయన అస్త్రశస్త్రములు అద్భుతమైనవి. ఆయన  ఒక్కడే ఈ లంకా పురమునంటాను నాశనము చేయగలదు.  తక్కిన ముగ్గురు వీరులతో అవసరములేదు.

వానరులందరూ యుద్ధముచేయుటకు ఉత్సాహముగా ఉన్నారు. వారిలో విరోధము పెట్టుకొనుటవలన మీకేమియు లాభములేదు. అందుకే మీరు సంధిని చేసికొనుడు. శ్రీరామునకు సీతను అప్పగించుడు.  శుకుడు, మరియు సారణుడు, వీరి ఇరువురి సత్యమైనట్టియు, ఉత్సాహవంతములైన వాక్యములను విని రావణుడు ఇట్లు అనెను.

యది మాం అభియుఞ్జీరన్ దేవగంధర్వ దానవాః

నైవ సీతామహం దద్యాం సర్వలోక భయాదపి                       50

దేవతలు, గంధర్వులు, దానవులు, నాతొ యుద్ధము చేయుటకు వచ్చినను, లోకమంతయు నన్ను భయ పెట్టినను సీతను అప్పగించను. నాకు ఎట్టి భయము లేదు.

తదుపరి రావణుడు మహాబలవంతుడును, మహామాయావియు, మాయా విశారదుడును అగు విద్యుజ్జిహ్వ అనే రాక్షసుడ్ని వెంటబెట్టుకొని సీతమ్మ ఉన్న ప్రమదావనమునకు పోయెను.  అప్పుడు మాయావి అయిన విద్యుజ్జిహ్వతో రాక్షసరాజగు రావణుడు ఇట్లనెను.  మనమిరువురము మాయద్వారా జనకనందిని అగు సీతమ్మను మోహపెట్టెదము.  విద్యుజ్జిహ్వా,  నీవు శ్రీరామునియొక్క మాయానిర్మిత శిరస్సుని తీసికొని ఒక గొప్ప ధనుస్సు బాణముతో సహా వెంటబెట్టుకొనిరమ్ము.  తదుపరి రావణుడు సీతమ్మతో ఇట్లనెను. మంగళకరము అయినదానా, నేను మరల మరల ప్రార్థించినప్పటికినీ నీవు నా మాటను అంగీకరించలేదు. ఖరుని వధించిన నీ భర్తయగు శ్రీరాముడు యుద్ధభూమియందు చంపబడెను.  ఇదిగో, నారితోకూడిన ఈ ధనుస్సు మీ శ్రీరామునిది. రాత్రి సమయమున అతనినిని చంపి ప్రహస్తుడు ఈ ధనుస్సును ఇచ్చటికి తీసికొని వచ్చెను. అప్పుడు విద్యుజ్జిహ్వ శ్రీరాముని మాయాశిరస్సును అక్కడ ఉంచగా.  దానితోబాటు రావణుడు ఆ ధనుస్సును భూమిపై పెట్టెను. తదుపరి సీతమ్మతో రావణుడు, ‘ఇక ఇప్పుడు నీవు నా వశము కమ్ము’. అని పలికెను.

రావణుడు ఆ ప్రదేశము నుండి నిష్క్రమించిన వెంటనే ఆ మాయా ధనుస్సు, ఆ మాయా శిరస్సు రెండూను అదృశ్యమయ్యెను. రాముని శిరస్సు, ధనుస్సు రెండింటినీ చూచి సీత విలపించి మూర్ఛ పోయెను. అప్పుడు ‘సరమ’ అను రాక్షసి సీతవద్దకు వచ్చెను. సరమ రావణుని ఆజ్ఞచే సీతను రక్షించుచుండెను.  ఆమె మృదు మధురముమైన వాక్యములు పలికెను. సీతమ్మా, ధైర్యమును వహింపుము. మనస్సునందు బాధ ఉండరాదు. 

న శక్యం సౌప్తికం కర్తుం రామసయ విదితాత్మనః

వధశ్చ పురుషవ్యాఘ్రే తస్మిన్ నైవోప పద్యతే                    51

శ్రీరాముడు జ్ఞాని. సర్వజ్ఞుడు. ఆయనే పరమాత్మ. వారిని వధించుట అసంభవం. ఈ విధముగా శ్రీరామచంద్రుని గురించి విపులముగా చెప్పిరి.

రావణుని బుద్ధి, కర్మ రెండును చెడ్డవి.  ఆటను సమస్త ప్రాణులకును విరోధి, క్రూరుడు, మాయావి. అతడు మీకు చూపించిన  శిరస్సు, ధనుస్సు, మాయా రచితము. నేను స్వయముగా రామలక్ష్మణులను కలిసివచ్చితిని అని సరమ చెప్పెను. వారు సముద్రతీరమున యుద్ధమునకు సిద్ధమై వచ్చియున్నారు. ఈ మాటలు సీతమ్మను సేదతీర్చినవి.  

పిమ్మట ‘యుద్ధమునకు సిద్ధము కమ్ము’ అనుదానికి నిదర్శనముగా శంఖనాదము చేసెను. ఆ శంఖనాదమునకు ఉలిక్కిపడిన రావణుడు తన మంత్రులతో మంతనము(లు) చేసెను.  రాముని పరాక్రమము, బల, పౌరుషములు, సముద్ర లంఘనము—వీటినిగూర్చి నేను వినియుంటిని. మీరు పరాక్రమవంతులు. మనముకూడా యుద్ధమునకు సిద్ధము కావలెను.   రావణుని మాటలు విని బుద్ధిమ్జంతుడైన మాల్యవంతుడు అను రాక్షసుడు ఇట్లనెను.

సందధానో హి కాలేన విగృహ్ణం శ్చారిభిః సహ

స్వపక్షే వర్ధనం కుర్వన్ మహదైశ్వర్య మశ్నుతే                                    52

అవసరము కలిగినప్పుడు శతృవులతో కూడా సమయానుసారము సంధి, నిగ్రహము చేసికొనదగును.  అప్పుడు తన పక్షముయొక్క అభివౄద్ధియందు  లగ్నమై ఉండ వచ్చును.  అట్టివాడు ఐశ్వర్యవంతుడగును.

కావున రావణా, శ్రీరామునితో సంధి చేసికోనుట్ యుక్తముగా తోచుచున్నది. సీతమ్మ కొరకై జరుగు ఈ యుద్దమును నిలిపివేయుము.

దర్మోవై గ్రసతే ధర్మం యదా కృతమభూత్ యుగం

అధర్మో గ్రసతే ధర్మం యదా తిష్యః ప్రవర్తతే                                   53  

కృతయుగం వచ్చినప్పుడు ధర్మము బలపడి అధర్మమును కబళించివేయును. అట్లే కలియుగము వచ్చినప్పుడు అధర్మము బలపడి ధర్మమును కబళించివేయును.

తత్ తు మాల్యవతో వాక్యం హితం ఉక్తం దశాననః

న మర్షయతి దుష్టాత్మా కాలస్య వశమాగతః                                54

దుష్టాత్ముడగు రావణుడు కాలమునకు వశుదగుచున్నాడు. అందుకే మాల్యవంతుడు చెప్పిన హితకరవాక్యములు రావణునికి రుచించలేదు.

తక్డుపరి మంత్రులతో మంతనముచేసి లంకారక్షణగూర్చిన రక్షణ ఏర్పాటు చేసెను.  ఇక్కడ లంక చేరిన శ్రీరాముడు, వానరరాజగు సుగ్రీవుడు, వాయుపుత్రుడగు హనుమంతుడు, ఋక్షరాజగు జాంబవంతుడు, రాక్షసుడు విభీషణుడు, వాలిపుత్రుడు అంగదుడు, శరభుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, నలుడు, వనసుడు, --వీరందరూ మంతనములు చేయుచుండిరి.  అప్పుడు బుద్ధిమంతుడయిన విభీషణుడు శ్రీరామునితో ఇట్లనెను. మీరు ఈ వానరసేనతో యుద్ధవ్యూహరచన చేయురు. అప్పుడే విశాలమైన రాక్షససేనను, రాక్షస రాజగు రావణుని వధించగలరు.  

తదుపరి ఒక్క ముహూర్తకాలములో కోటగోడ దాటి రావణుని రాజభవనము చేరెను. అక్కడ మంత్రులతో కూర్చొనియున్న రావణుని చూసెను. శ్రీరాముడు ఈ సందేశమును ఇచ్చిరి. ‘పాపివాగు రావణా, ఇంటినుండి బయటకువచ్చి యుద్ధమున నన్ను యెదుర్కొనుము.  నీవు దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు—వీరందరికీ నీవు శత్రువువు అయిఉన్నావు. ఋషులకు కంటకుడవు. కావున నిన్ను సంహరించెదను.’  ఆ మాటలువిన్నవెంటనే రావణుడు కుపితుడయ్యెను.  “ఈ దుష్ఠవానరుని పట్టుకొని చంపుడు” అని అరవసాగెను.  తనను పట్టుకున్న ఆ నిశాచారులను విదిలించుకొని ఎగ్గిరి ఎతైన ఆ భవనము పైన నిలబడెను. అక్కడినుండి శ్రీరాముని వద్దకు తిరిగి వెళ్ళెను. రాక్షసుల మధ్యననున్న సీతమ్మను తిరిగి తిరిగి తలచుకుంటూ, శ్రీరామచంద్రుడు రాక్షసులను సంహరించుమని వానరులకు ఆజ్ఞను ఇచ్చెను.

జయత్యతు బలోరామో లక్ష్మణశ్చ మహాబలః

రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః                            58

ఇత్యేవ ఘోషయంతిశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః

అభ్యధావంత లంకాయాః ప్రాకారం కామరూపిణః                        59

మహాబలుడైన శ్రీరామునకు జయమగుగాక. మహాబలుడైన లక్ష్మణునకు జయమగుగాక. శ్రీరామునిచే సురక్షితుడగు మహారాజు అయిన సుగ్రీవునకు జయమగుగాక. ఇట్లా అరచుచు గర్జనచేయుచు, లంకాపురము యొక్క ప్రాకారము మీదకు విరచుకు పడిరి.

అత్తరి వానరులకు రాక్షసులకు గొప్పయుద్ధము జరిగెను. అది పూర్వము దేవాసుర సంగ్రామమును పోలియుండెను. లక్ష్మణుడు బాణములను వర్షించెను. భయంకరుడయిన విరూపాక్షుని సంహరించెను. అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, అను రాక్షసులను వధించెను. అంగదుడు యుద్ధములో ముందుకు సాగెను. అతడు ఇంద్రజిత్తును గాయపరచెను. ఇంద్రజిత్తుయొక్క సారథిని, మరియు గుఱ్ఱములను గాయపరచెను. ఇంద్రజిత్తు కుపితుడయ్యి రామలక్ష్మణులిద్దరిని గాయపరచెను. రామలక్ష్మణులను మోహమందు పడవైచుచు కుటిల యుద్ధము చేయుచు వారిని సర్పాకార బాణములచే బంధించివేసెను. అట్లా నాగపాశముచే బంధింపబడి వీరశయ్యపై పరుండియున్న రామలక్ష్మణులిద్దరిచుట్టూ వానరులు గుమిగూడిరి. హనుమంతుడు మెదలగువారు ఖిన్నులై విషాదమున మునిగిరి. సుగ్రీవుని మనంబున భయమావహించెను. కన్నీరు కారుచుండెను.  అప్పుడు వానరరాజు సుగ్రీవునితో విభీషణుడు ఇట్లనెను. సుగ్రీవా, భయపడకుము. భయమువలన ఉపయోగమేమియునూలేదు.   

పర్యవస్థాన యాత్మానమనాథం మాం చ వానరః

సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యు కృతం భయం                          60

రాజా సుగ్రీవా, ధైర్యము వహింపుడు. శ్రీరాలక్ష్మణులు సత్యము, ధర్మములయందు అనురాగము కలవారు. అట్టివారికి  మృత్యు భయము లేదు. మృత్యువు దరికి రాదు. కేవలము వారు మూర్ఛపోయిరి.  మీరు మిమ్ములను ఉత్సాహ పఱచుకొండు. అనాథనైన నన్నుకూడా ఉత్సాహవంతుడ్ని చేయుడు. 

అప్పుడు సంతోషముతో రావణుడు సీతవడ్డ కాపలాఉన్న రాక్షసస్త్రీలను పిలిపించెను.  అతని ఆజ్ఞ ప్రకారము త్రిజట మున్నగు రాక్షస స్త్రీలు అక్కడికి వచ్చిరి.  ఆనందముగా రావణుడు వారితో ఇట్లనెను. మీరు సీతవద్దకువెల్లి ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపివేసేనని చెప్పండి. పుష్పకవిమానములో కూర్చుండబెట్టి ఆ చంపబడిన రామలక్ష్మణులను సీతకు చూపించండి. రావణుని మాటలువిని సీతమ్మను పుష్పకవిమానములో కూర్చుండబెట్టి త్రిజట ఆ యుద్ధలమునకు వెళ్ళిరి. అచట చనిపోయిన వానరసేనను, మరియు మూర్ఛ పోయిన, మరియు గాయపడిన రామలక్ష్మణులను  సీతమ్మకు చూపెను. తిరిగి సీతమ్మ దుఖములో మునిగిపోయెను. అప్పుడు రాక్షసి త్రిజట సీతమ్మతో ఇట్లనెను. అమ్మా, వ్యాకులపడకురు. రామలక్ష్మణులు ఇరువురూ మూర్ఛపోయిరి. అనంతరము నాగపాశముచేత బంధించ బడినను శరీర దృఢత్వమువలన  తేరుకున్నాడు. లక్ష్మణుడు ఇంకను తెరుకొనలేదు. శ్రీరాముడు ఇట్లు తలచెను.

శక్యా సీతా సమా  నారీ మర్త్యలోకే విచిన్వతా

న లక్ష్మణ సమో భ్రాతా సచివః సాంపరాయికః                          61 

మనుష్యలోకమున సీతవంటి ఇంకొక స్త్రీ దొరకగలదు. కాని లక్ష్మణుని వంటి సొదరుడు ఉండడు, మరియు యుద్ధకుశలుడైన యోద్ధ దొరకడు.

విససర్జైక వేగేన పంచబాణ శతాని యః

ఇష్వస్త్రేష్వధిక స్తస్మాత్ కార్తవీర్యాచ్చ లక్ష్మణః                                 62

లక్ష్మణుడు ఒకేసారి అయిదు వందల బాణములను వర్షింపగలడు. కావున ధనుర్విద్యయందు కార్తవీర్యార్జునునికంటెను అధికమైయున్నాడు.

అంతలోనే గరుత్మంతుడు అక్కడి రావటం వానరులు చూచిరి. అప్పుడు లక్ష్మణుని బంధించి మూర్ఛితుడ్ని చేసిన నాగపాశము విడిపోయి నాగులన్నియు పారిపోయినవి.  శ్రీరామలక్ష్మణుల గరుత్మంతుడి స్పర్శతో గాయములన్నియు మాయమైపోయినవి. వారు ఇద్దరు ఇదివరకటి ప్రకాశముతో ప్రకాశించుండిరి. గరుత్మంతుడు రామలక్ష్మణు లు ఇద్దరికి ప్రదక్షిణచేసి వారిద్దరిని ఆలింగనముచేసికొని, వాయువేగముతో ఎగిరిపోయెను.

తత్తదుపరి భయంకర యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో లక్ష్మణుడు విరూపాక్షుని సంహరించెను. అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు అను రాక్షసులను శ్రీరాముడు సంహరించెను. ధూమ్రాక్షుడు, అకంపనుడు, అను రాక్షసులను హనుమంతుడు సంహరించెను. వజ్రదంష్ట్రుడిని అంగదుడు సంహరించెను. అన్నివైపులా లంకాపట్టణమును వానరసేన చుట్టుముట్టివేసినది. అప్పుడు వ్యాకులత చెందిన రావణుడు యుద్ధకళా కోవిదుడు, మరియు హితైషి అయిన ప్రహస్తునితో ఇట్లు పలికెను. పహస్తా, నీవు శీఘ్రముగా సైన్యము తీసికొని బయల్దేరుము. అప్పుడు ప్రహస్తుడు రావణునికి ఈ సలహా ఇచ్చెను.  

ప్రదానేన తు సీతాయాః శ్రేయో వ్యవసితం మయా

అప్రదానే పునర్యుద్ధః దృష్టమేవ తథైవ సః                                 63

రాజా, సీతమ్మను శ్రీరామునకు ఇచ్చివేయుము. అదే మనకు శ్రేయస్సు. ఇవ్వనిచో యుద్ధము తప్పక కలుగును. ఈ విషయము నాకు ముందుగానే తెలుసు. ఇది నా నిశ్చిత అభిప్రాయము. నా అభిప్రాయము ఇప్పుడు కార్యరూపము దాల్చినది.

అక్కడినుండి యుద్ధభూమికేగి, ప్రహస్తుడు భయంకర యుద్ధముచేయనారంభించెను. అప్పుడు వానరశ్రేష్ఠుడు అయిన నీలుడు ఒక పెద్ద శిలను ప్రహస్తుని శిరస్సు పైకి విసిరెను. అది ప్రహస్తుని శిరస్సును ముక్కలు ముక్కలు చేసెను. ప్రహస్తుని మరణవార్తవిని రావణుని మనస్సు శోకముతో నిండిపోయెను. అప్పుడు తన రాక్షసప్రముఖులతో రావణుడు ఇట్లు మాట్లాడెను. ఇప్పుడు ఏమాత్రము ఆలస్యం చేయకుండా నేనే స్వయముగా యుద్ధములో పాల్గోనదెను.

ప్రత్యువాచ తతో రామో విభీషణం అరిందమః

అహో దీప్త మహాతేజా రావణో రాక్షసేశ్వరః                      64

అప్పుడు రావణుడు యుద్ధమునకు వెళ్ళెను. విబీషణుడు రావణునిగురించి వివరములు తెలిపెను. అప్పుడు శత్రుదమనుడగు శ్రీరాముడు విభీషణనితో ఇట్లు చెప్పెను. – ఆహా, రాక్షసరాజగు రావణునుది ఏమి తేజస్సు. దేదీప్యమానముగా ఉన్నది.

రావణుడు యుద్ధమున తన పరాక్రమమును చూపుచుండెను. అది చూచి పవనకుమారుడు హనుమంతుడు రావణుని బాణములను తప్పించుకుంటూ రావణునివైపు పరుగిడెను.

అథాశ్వస్య మహాతేజా రావణో వాక్యం అబ్రవీత్

సాధు వానర వీర్యేణ శ్లాఘనీయోసి మే రిపుః                     65

పిమ్మట మహాతేజస్వియగు రావణుడు తెప్పరిల్లుకొనేను. హనుమంతునితో ఇట్లనెను. మంచిది, వానరుడా, నీవు పరాక్రమమందు నాతొ సరి అయిన ప్రతిద్వంద్వివి.   

రావణేనైవ ముక్తస్తు మారుతిః వాక్యం అబ్రవీత్

దిగస్తు మమ వీర్యస్య యత్ త్వం జీవసి రావణ                         66

రావణుడు ఇట్లు చెప్పగా పనపుత్రుడైన హనుమంతుడు ఇట్లు చెప్పెను. రావణా, నీవు ఇంకను జీవించి ఉన్నావు. కావున నా పరాక్రమమునకు ధిక్కారము.

అత్తరి వానర శ్రేష్ఠుడు నీలుడు  కొంచెంసేపు రావణుని ధ్వజము మీదను, ఒకప్పుడు రావణుని ధ్వజము మీదను, ఒకప్పుడు రావణుని కిరీటముమీదను కూర్చొండియుండుటను చూచి శ్రీరాముడు మరియు హనుమంతునకు కూడా ఆశ్చర్యము కలిగెను.  నీలుని చురుకుతనమును చూసి రావణుడు కూడా ఆశ్చర్యపోయెను. రావణుడు తనబాణములతో నీలుని నిస్పృహుడ్ని చేసెను. అక్కడినుండి లక్ష్మణునివైపు దూసుకువెళ్ళెను.  రావణుని ధనుస్సును  లక్ష్మణుడు తన బాణములతో విరగగొట్టెను. రావణుడు బ్రహ్మదేవుడు తనకు ఇచ్చిన శక్తిని ఉపయోగించెను. లక్ష్మణుడు బలవంతుడైనప్పటికి ఆ శక్తి బాణముతో రావణునిచే కొట్టబడి క్రింద పడిపోయెను.  అప్పుడు రావణుడు తన రెండుచేతులతో లక్ష్మణుని పైకేత్తదొడంగెను. 

తామావతంతీం భరతానుజోస్త్రై ర్జఘాన బాణైశ్చ హుతాగ్ని కల్పైః

తథాపి సా తస్య వివేకశక్తిర్భుజాంతరం దాశరథేర్విశాలం                          67

రావణుడు దేవతలతో కూడిన హిమాలయ పర్వతమును, మందారాచలమును, మేరుపర్వతమును, లేక ముల్లోకములను తన భుజములచే లెవనెత్తగల శక్తి కలిగి యుండెను. అట్టి రావణుడు లక్ష్మణుని ఎత్తుటకు అశక్తుడయ్యెను.

ఆ సమయమున హనుమంతుడు క్రోధపూర్ణుడై రావణునివైపు పరుగిడెను. తన పిడికిలితో రావణుని వక్షస్థలముపై కొట్టెను.  రాక్షసరాజగు రావణుడు క్రిందబడెను. పిమ్మట లక్ష్మణుని ఎత్తుకొని హనుమంతుడు శ్రీరామునివద్దకు తీసుకువెళ్ళెను.   

వాయుసూనోః సుహృత్వేన భక్త్యా పరమయా చ సః

శతౄణామపి అకంప్స్యోసి లఘుత్వ మగమత్ కపేః                    68

హనుమంతుడి యొక్క సౌహార్ద్యము, అత్యంత భక్తిభావములవలన్ లక్ష్మణుడు వారికి తేలిక అయ్యెను. శతృవులకైతే వారు ఇప్పుడుకూడా చలింపరానివారై ఉన్నారు.  శత్రువులు వారిని కదిలించలేరు.   

అశ్వస్తశ్చ విశల్యశ్చ లక్ష్మణః శతృసూదనః

విష్ణోర్భాగమ మీమాంస్య మాత్మానం ప్రత్యనుస్మరన్                     69

శతృసూదనుడగు  లక్ష్మణుడు విష్ణువుయొక్క అచింతనీయ అంశ రూపమును తన్ను చింతన చేసి స్వస్థుడును, రోగరహితుడును అయ్యెను.

అప్పుడు హనుమంతుడు శ్రీరామునితో ఇట్లు చెప్పెను. ప్రభూ, విష్ణుభగవానుడు గరుత్మంతునిపై దైత్యులను సంహరించెను. అట్లే మీరుకూడా నా భుజములపై కూర్చొని ఈ రావణునికి దండననొసంగుడు. ఆ మాటలువిన్న శ్రీరాముడు ఆంజనేయుని భుజములపైకేక్కి కూర్చొనేను. అంతట రావణునితో ఇట్లనెను.

యదీంద్ర వైవస్వత భాస్కరాన్ వా స్వయంభు వైశ్వానర శంకరాన్ వా

గమిష్యసి త్వం దశధా దిశో వా తథాపి మే నాద్య గతో విమోక్ష్యసే                    70

రావణా, నువ్వు ఇంద్రుడు యముడు, సూర్యుడు, -- వీరియొద్దకుగాని, లేక బ్రహ్మదేవుడు, అగ్ని, శివుడు—వీరి సమీపమునకుగాని, లేక దశ దిక్కులకుగాని పరుగిడిపోయినను ఇప్పుడు నాచేతినుండి కాపాడబడజాలవు.

పిదప శ్రీరాముడు రావణునిపై ఆక్రమణచేసేను. రథ చక్రములు, గుర్రములు, ధ్వజము, ఛత్రము, పతాకము, సారథి, వజ్రము, శూలము, ఖడ్గము—వీనితో కూడిన అతని రథమును తన వాడిఅయిన బాణములచే ఛేదించివేసెను.

యో వజ్రపాతాశనిసం నిపాతా న్న చుక్షుభే నాపి చచాల రాజా

న రామబాణాభి హతో భృశార్త శ్చచాల చాపం చ ముమోచ వీరః         71

ఏ రాజగు రావణుడు వజ్రముయోక్క ఆఘాతములచే గూడ క్షోభను పొందకున్దేనో, అట్టి దానవ వీరుడు అయిన రావణుడుశ్రీరాముని బాణములచే గాయపడి అమితముగా కంపితుడాయెను. అట్టి రావణుడి చేతినుండి ధనుస్సు జారి క్రింద బడెను.  

ధనుస్సులెని రావణుడు విషరహితమైన సర్పమువలె తన ప్రభావమును గోల్పోయెను.  సాయంకాలమున ప్రభావము కోల్పోయిన సూర్యునివలెనున్న రావణునితో శ్రీరాముడు ఇట్లనెను.

ప్రయాహి జానామి రణార్దితస్త్వం ప్రవిశ్య రాత్రిం చరరాజ లంకాం

ఆస్వస్య నిర్వాహి రథీ చ ధన్వీ తదా బలం ప్రేక్ష్యసి మే రథస్థః                    72 

ఓ రావణా, నిశాచరా, నీవు ఇప్పుడు గాయపడి ఉంటివి. నీవు ఇంటికి వెళ్ళుము. విశ్రాంతి తీసికొని తిరిగిరమ్ము. రథము, మరియు ధనుస్సు తీసికొనుము. తిరిగి రథారూఢుడవై నా బలమును వీక్షింపుము.

అదివిన్న రావణుడు వెంటనే లంకకు తిరిగి వెళ్ళెను. అతని సంతోషము, అభిమానము దెబ్బతినెను. ధనుస్సు విరిగినది. గుఱ్ఱములు, సారథి చచ్చారు. కిరీటము ముక్కలు అయినది. అతను స్వయముగానే బాణములచే పీడింపబడి భరింపరాని బాధకలుగుతున్నది. అప్పుడు రావణుడు రాక్షసులతో ఈ విధముగా చెప్పెను.

ఉమా నందీశ్వరశ్చాపి రంభా వరుణ కన్యకా

యథోక్తాస్తన్మయా  ప్రాప్తం న మిథ్యా ఋషి భాషితం                    73

పూర్వము ఉమా, నందీశ్వరుడు, రంభ, వరుణకన్య అనగా అనరణ్యుడు, మరియు  వేదవతి మొదలగువారు నన్ను శపించిరి. ఆ ప్రకారమగు కర్మ ఇప్పుడు నాకు ప్రాప్తించినది.   ఋషివాక్యము వృథా కాదుగదా.

వాడిది సాటిలేని గాంభీర్యము. దేవతలయొక్కయు, మరియు దానవులయొక్కయో గర్వమును అణచివేయును. బ్రహ్మదేవుని శాపమువలన వాడిని నిద్ర వశము చేసికొనుచుండును. అతనే రావణుని సోదరుడు కుంభకర్ణుడు. ఓ రాక్షసులారా, మీరు ఇప్పుడు నా సోదరుడు కుంభకర్ణుని నిద్రమత్తునుండి మేల్కొల్పుడు.  రాక్షసులు త్వరత్వరగా కుంభకర్ణుని గృహమునకు వెళ్ళిరి.  సింహనాదము, గజపాధ సంఘట్టనము మిగిలిన వివిధ ఉపాయములచే కుంభకర్ణుని నిద్రనుండిలేపి రావణునివద్దకు తెసికొనివెళ్ళిరి.  శ్రీరాముడు కుంభకర్ణుని చూచి ‘వీడు ఎవడు?’  అని అడిగిరి. అందుకు విభీషణుడు శ్రీరామునితో ఇట్లనెను. వీడు రావణుని ఇంకొక సోదరుడు. వీడిపేరు కుంభకర్ణుడు. వాడినిచూచి వానరులందరూ పరుగెత్త నారంభించిరి.

ఉచ్యంతాం వానరాః సర్వే యంత్ర ఏతత్ సముఛ్చ్రితం

ఇతి విజ్ఞాయ హరయో భవిష్యన్తీహ నిర్భయాః                               74    

కావున వానరులందరూ ‘’యితడు వ్యక్తీ కాదు. వీడొక ఒక పెద్ద యంత్రము’ అని వానరులకు చెప్దాము. అప్పుడు నిర్భయులుగా ఉంటారు.

రావణుడు విలపించుతచూచి కుంభకర్ణుడు నవ్వుచుండెను. ఈ ప్రకారముచెప్పెను.  

శీఘ్ర ఖలభ్యుపేతం త్వాం ఫలం పాపస్య కర్మణః

నిరయేష్వేవ పతనం యథా దుష్కృతకర్మణః                                  75 

రావణా, సోదరా, నీకు త్వరలో నీ పాపకర్మయొక్క ఫలితము లభించును.  దుష్కర్మలు చేయువాడికి నరకమందు పడుట నిశ్చయము. అట్లే నీకుకూడా పాపకర్మయొక్క ఫలము తప్పక లభించును. 

ప్రథమం వై మహారాజ కృత్యమే తద చిన్తితం

కేవలం వీర్యదర్పేణ నానుబంధో విచారితః                                   76

మహారాజా, కేవలము బలగర్వముచే నీవు ఈ పాపకర్మను చేయుచుంటివి. దీని పరిణామము నీ బలదర్పముచే విచారించలేదు.   

యః పాశ్చాత్ పూర్వ కార్యాణి కుర్యాద్ ఐశ్వర్యం ఆస్థితః

పూర్వం చ ఉత్తర కార్యాణి న స వేద నయానయౌ                               77                

యెవ్వడు ఐశ్వర్యము యొక్క గర్వముచే మొదట చేయవలసిన పనిని వెనకచేయునో,  తరువాత చేయవలసినపనిని ముందర చేయునో, వాడు నీతి, మరియు అవినీతి తెలియనివాడే అగును.

దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్

క్రియమాణాని దుష్యంతి హవీంష్య ప్రయతేష్విన                                 78

కార్యములు సరియైన ప్రదేశములో, మరియు సరియైన కాలములో చేయబడాలి. విపరీతస్థితిలో చేయగూడదు.  అవి సంస్కారరహితము అయిన అగ్నులయందు హోమము చేయబడిన హవిష్యముమాదిరి ఉండగూడదు. అవి దుఃఖకారకములే అగును.

ధర్మమర్థం హి కామం వా సర్వాన్ వా రక్షసాంపతే

భజేత్ పురుషః కాలే త్రీణి ద్వంద్వాని వా పునః                              79

రాక్షసరాజా, నీతిజ్ఞుడగువాడు ధర్మము, అర్థము, కామము – అన్నిటియందును ఉపయుక్తమైన సమయమందే సేవించవలయును.

త్రిషు చైతేషు యత్ శ్రేష్ఠం శ్రుత్వా తన్నావబుధ్యతే

రాజా వ రాజమాత్రో వా వ్యర్థం తస్య బహుశ్రుతం                     80

రాజా, ధర్మము, అర్థము, కామము – అన్నిటియందును ధర్మముశ్రేష్ఠమైనది. విశేష అవసరములో అర్థము, కామములో అర్థము, కామములోను త్యజించి ధర్మమునే అనుకరించవలయును. అది తెలిసికొనని, ఆ ధర్మమును పాటించని రాజు పెక్కు శాస్త్రములను అభ్యసించినప్పటికిని వ్యర్థుడు.

అస్మిన్ కాలే తు యద్ యుక్తం తత్ ఇదానీం విచిన్త్యతాం

గతం తు నాను శోచంతి గతం తు గతమేవ హి                             81

జరిగినది ఏదో జరిగిపోయినది. విజ్ఞులు జరిగినదానిని గూర్చి ఆలోచించి మరల మరల దుఃఖించరు. ఇక  ముందర చేయవలసిన దానినిగూర్చి ఆలోచించుడు. 

స సుహృద్ యో విపన్నార్థం దీనమభ్యుప పద్యతే

స బందుర్యోపనీతేషు సాహాయ్యాయోప కల్పతే                              82

యెవ్వడు కార్యము నష్టమైపోవుటచే దుఃఖవంతుడయినను, ప్రజలకు సహాయముచేయునో వాడె సుహృత్.  అవినీతి మార్గమును అవలంభించిన జనులను మంచిమార్గమున పెట్టుటకు సహాయము, మరియు సరియైన సలహా యిచ్చునో అతడే అసలైన బందువు.

గర్జంతి న వృథా శూరా నిర్జలా ఇవ తోయదాః

పశ్య సంపద్యమానం తు గర్జితం యుధికర్మణా                                   83

జలరహితమేఘము గర్జించాడు. అదేవిధముగా శూరవీరులు వృథాగా గర్జించాడు.  ఇప్పుడు నేను నాపరాక్రమముతో యుద్ధమున గర్జనచేయుట చూడుము.

న మర్షయంతి చాత్మానం సంభావయతుమాత్మనా

ఆడర్శయిత్వా శూరాస్తు కర్మ కుర్వంతి దుష్కరం                                  84

ధీరులు గొప్పగొప్పకార్యములను, తమంతట తాము తాముచేసినను, చెప్పుకోరు. చెప్పుకొనుటకు ఇష్టమూపడరు.  వారు చెప్పకుండానే  దుష్కరమయిన కార్యములను వారిచేతలద్వారా ప్రకటితమగును.

మహాబలశాలియగు కుంభకర్ణుడు పర్వతమంతఎత్తుగాను, విశాలదేహముతో ఉండెను. ఈ ప్రకారముగా సంభాషించిన  కుంభకర్ణుడు వేగముగా లంకానగరము వెలుపలికి వెళ్ళెను. వానరులు వాడి భీకరాకృతికి భయపడి దాగుకొనిరి.  కొందరు వానరులు చెట్లపైకి ఎక్కిరి. కొందరు పర్వతములను ఎక్కి దాగు కొనిరి.

తాన్ సమీక్ష్య అంగదో భగ్నాన్ వానరాన్ ఇదం అబ్రవీత్

అపతిష్టత యుధ్యామో నివర్తధ్వం ప్లవంగమాః                               85

కకావికలై పరుగెత్తిపోతున్న  వానరులనుచూచి వారితో అంగదుడు ఇట్లనెను. – ఓ, వానరవీరులారా, ఆగండి, వెనక్కి రండి. మనము అందరమూ కలిసి కుంభకర్ణుడుతో యుద్ధము చేద్దాము.

శయామహే వా నిహతాః పృథివ్యాం అల్పజీవితాః

ప్రాప్నుయామో బ్రహ్మలోకం దుష్ప్రాపంచ కుయోగిభిః                      86

మనము చిన్న శరీరము గలవారము.  యుద్ధములో పడిచచ్చిపోయెదము.  కాని వెనక్కు వెళ్ళవద్దు. మనకు దుర్లభమైన బ్రహ్మలోకము ప్రాప్తించును.  అట్టిది కుయూగులకు పరమ దుర్లభము.

అవాప్నుయామః కీర్తిం వా నిహత్వా శత్రుమాహవే

నిహతా వీరలోకస్య భోక్ష్యా మోవాసు వానరాః                              87

అట్లుకాక మనమే యుద్దమందు శతృవును వధించినచో మనకు కీర్తి వచ్చును. లేదా చచ్చిపోయినచో వీరలోకముయొక్క వైభవమును మనము అనుభవించెదము.

ప్రజ్వలించువలె తేజోవంతుడైన కుంభకర్ణుని చూచి శ్రీరాముడు తన ధనస్సుతో  భయంకరమైన బాణమును వానిపై వదిలేను. పూర్వము దేవరాజగు ఇంద్రుడు వృత్రాసురుని శిరస్సును వేరు చేసినట్లు, శ్రీరాముని బాణము కుంభకర్ణుని శిరస్సును మొండెమును వేరుచేసేను. తదుపరి జరిగిన యుద్ధములో అంగదుడు  రావణుని కొడుకైన నరాంతకుని సంహరించెను. హనుమంతుడు రావణుని కొడుకులైన దేవాంతకుని, మరియు త్రిశురుని సంహరించెను. నీలుడు రావణుని కొడుకైన మహోదరుడ్ని సంహరించెను. ఋషభుడు రావణుని కొడుకైన మహాపార్శ్వుడ్ని సంహరించెను. లక్ష్మణుడు  రావణుని కొడుకైన అతికాయుడ్ని సంహరించెను. అప్పుడు రావణుడు ఇట్లనెను.  నా ఆజ్ఞచే యుద్ధభూమికి వెళ్ళిన వారందరూ ప్రాణములను కోల్పోయారు. అని రావణుడు మిక్కిలి వ్యాకులపడెను. రావణుడు ఇట్లనెను. 

తం న పశ్యామి అహం యుద్ధే యోద్య రామం సలక్ష్మణం

నాశయేత్ సబలం వీరం స సుగ్రీవం విభీషణం                                   88

యుద్ధమున రామసహితుడగు లక్ష్మణుని, లక్ష్మణసహితుడగు రాముని, సేనా  సహితుడగు సుగ్రీవుని, వీరుడగు విభీషణుని,  వధించగల ఏ వీరుని చూడలేదు.  ఆహా, రాముడు చాలా బలవంతుడు. నిశ్చయముగా శ్రీరాముని అస్త్రబలము చాలాగొప్పది.

యస్య విక్రమం ఆసాద్య రాక్షసా నిధనం గతాః

తమ్ మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం               89

శ్రీరాముని యొక్క బలపరాక్రమముని ఎదిరించి అసంఖ్యాకులగు రాక్షసులు మృత్యువాతపడిరి. అట్టి వీరుడగు శ్రీరాముని రోగ శోక రహితుడగు సాక్షాత్ నారాయణుడే అని తలంచుచున్నాను.  

రాక్షసరాజు అయిన రావణుడు శోకసముద్రమున మునిగియుండుట చూచి, కుమారుడు ఇంద్రజిత్తు అతనితో ఇట్లు చెప్పెను. నాయనా, నేను జీవించియుండునంతవరకు నీవు వ్యాకులపడవలసిన పనిలేదు.  నా బాణములను తప్పించుకొని ఎవ్వడూ ప్రాణములతో ఉండలేడు.  ఇట్లా చెప్పి ఇంద్రజిత్తు వెంటనే యుద్ధభూమికి వెళ్ళెను. వేడి, వాడియైన బాణములచే వానరసేనను అమిత ఉద్రేకముతో వధించసాగెను.  తరువాత రామ లక్ష్మణులు ఇద్దరినీ మూర్ఛితుల్నిచేసి రావణునివద్దకు వెళ్ళెను. రాక్షసులందరూ ఆనందముతో కేరింతలు కొడుతుండిరి.

అంతట మహాతేజస్వియగు జాంబవంతునితో హనుమంతుడు ఇట్లనెను. ఆంజనీయా, రా, వానరులను రక్షింపుము. మీరు సముద్రముపైకి వెంటనే ఎగిరి పర్వత శ్రేష్ఠమగు హిమాలయ పర్వతముపైకి వెళ్ళవలెను. అక్కడ ఆ హిమాలయ పర్వత శిఖరముపై నాలుగు ఓషధులు ఉంటాయి. అవి కాంతితో ప్రకాశించుచుండును.

మృత సంజీవనీం చైవ విశల్యకరణీమపి

సువర్ణ కరణీంచైవ సంథానీం చ  మహౌషధీం                     90

ఆ ఓషధుల పేర్లు – మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణ కరణి, సంధాని.

ఆంజనేయా, మేరు అత్యంత శీఘ్రముగా ఆ నాలుగు ఓషధులను తీసికొని రండు. వానరులకు ఆ ఓషధుల సహాయముతో ప్రాణదానముచేయ్యి.  ఆ వెంటనే హనుమంతుడు  వాయుమార్గమున హిమాలయ పర్వతమును చేరెను. అక్కడ హనుమంతుడు ఆ హిమాలయ పర్వత శిఖరముపై ఉన్న నాలుగు ఓషధులను దర్శించెను. హనుమంతుడు హిమాలయ పర్వత శిఖరమును పెళ్ళగించెను. హనుమంతుడు దేవేశ్వర, అసురేశ్వర సహిత సమస్తలోకములను భీతిల్లజేయుచు గరుత్మంతుని వలె భయంకరమైన వేగముతో ఆకాశమార్గమున ఎగిరిపోయెను. అక్కడినుండి త్రికుట పర్వతముపైకి దుమికి వానరసేనమధ్యకి వచ్చి వానరశ్రేష్టులను కౌగిలించుకొనేను. పిమ్మట విభీషణుని కౌగిలించుకొనేను. రామలక్ష్మణులు, ఆ ఓషధులను ఆఘ్రానించిరి. వారికి తెలివి వచ్చెను. వారి శరీరములోని గాయములన్నియు ఆ ఓషధుల ప్రభావముచే క్షణంలో మాయమయ్యెను. మిగిలిన వానరశ్రేష్ఠులు కూడా వారి వారి గాయములు మటు మాయము అయ్యెను. అందరు ఆరోగ్యవంతులుగా అయ్యిరి. పిమ్మట తన చేతిలోనే ఉన్న ఆ హిమాలయ పర్వత శిఖరమును తిరిగి యథాస్థానమునకుజేర్చేను. తిరిగివచ్చి శ్రీరాముని కలిశెను.

తదుపరి జరిగిన భీకర యుద్దమందు అంగదుడు కంపనుని, శోణితాక్షుని, మరియు ప్రజంఘుని సంహరించెను. ద్వివిదుడు శోణితాక్షుని సంహరించెను.  మైందుడు యూపాక్షు ని సంహరించెను. సుగ్రీవుడు కుంభకర్ణుని కుమారుడగు కుంభుని సంహరించెను.   హనుమంతుడు కుంభకర్ణుని కుమారుడగు నికుంభుని సంహరించెను.  శ్రీరాముడు ఖరుని  కుమారుడగు మకరాక్షుని వధించెను.   ఇదంతయుచూచి రావణుడు మహాచింతాక్రాంతు డయ్యెను. అంతట తన కుమారుడగు ఇంద్రజిత్తును యుద్ధమునకు పంపెను. ఇంద్రజిత్తు కృద్ధుడై యుద్ధభూమికి వచ్చెను. ఇంద్రజిత్తు రథము అతని మాయాశక్తిచే ఆకాశమందు నిలబడెను. శ్రీరామలక్ష్మణులిద్దరు యుద్ధభూమియందుంచిరి. వారిరువురికి కనబడకుండా ఇంద్రజిత్తు మేఘముల చాటునుండి యుద్ధము చేయనారంభించెను. అప్పుడు లక్ష్మణుడు తన సోదరుడు శ్రీరామునితో ఇట్లు చెప్పెను. అన్నా, నేను ఇప్పుడు ఈ రాక్షసులందరినీ వధించుటకు బ్రహ్మాస్త్రమును ఉపయోగించెను. 

తమ్ ఉవాచ రామోలక్ష్మణం శుభలక్షణం

నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హన్తుం అర్హసి                            91  

ఆ వాక్యములను విన్న శ్రీరామచంద్రుడు, శుభలక్షణ సంపన్నుడగు లక్ష్మణునితో ఇట్లనెను.— లక్ష్మణా, ఒక్క దుష్టుడికొఱకై సమస్త జాతిని తుదముట్టించటము యుక్తముగాదు.  

ఆయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం

పలాయమానం మత్తం వా న హన్తుం త్వం ఇహ అర్హసి.                    92

లక్ష్మణా, యుద్ధము చేయనివాడు, దాగుకొనినవాడు, చేతులు జోడించి శరణు కోరిన వాడు, యుద్ధమున పారిపోయినవాడు, పిచ్చివాడు—ఇట్టివారిని సంహరించరాదు

యద్యేష భూమిం విశతే దివం వా రసాతలం వాపి నభస్తలం వా

ఏవం నిగూఢోసి మమ అస్త్ర దగ్ధః పతిష్యతే భూమితలే గతాసుః                       93

ఈ ఇంద్రజిత్తు భూతలమున ప్రవేశించినను, స్వర్గమునకేగినను, రసాతలమున జొచ్చినను, ఆకాశమందున్నను, ఈ ప్రకారముగా దాగుకొనినుగూడ,  నా అస్త్రముచే దగ్ధుడై , విగతజీవియై భూమిపై తప్పక పడిపోగలడు.

తదుపరి ఇంద్రజిత్తు యుద్ధభూమియందు పెద్దగా సింహనాదముచేయ దొడంగెను. వానరులు ఆ గర్జన విని నలుదిక్కులకు పరుగిడనారంభించిరి. అటుపిమ్మట, ఇంద్రజిత్తు వానరులను మోహమందు పడవేసెను.  నికుభిలా మందిరమున హోమము చేయుటకు పోయెను. .అదిచూసి హనుమంతుడు వారితో ఇట్లనెను.

పృష్ఠతో వ్రజద్వం మామగ్రతో యాన్తమాహవే

శూరైరభిజనో సేతైరయుక్తం హి నివర్తితుం                            94

వానరులారా, యుద్దమందు నేను ముందు నడచెదను. మీరందరూ నా వెనక రండు. ఉత్తమ వంశమందు జన్మించిన శూరవీరులు యుద్ధమున పారిపోవుట యుక్తముగాదు.    

అప్పుడు ఆంజనేయుడు శ్రీరామునితో ఇట్లు చెప్పెను. మహాబాహో, ఇంద్రజిత్తు వానరులను మోహమందు పడవేసెను. అతడు ఇప్పుడు నికుభిలా మందిరమున హోమము చేయుచున్నాడు. ఆ హోమకర్మము సమాప్తముగాకమునుపే అతనితో  యుద్ధముచేయుట యుక్తము.  ప్రస్తుతము అగ్నిని స్థాపించి అందు విధి పూర్వక ముగా ఇంద్రజిత్తు హోమము చేయుచున్నాడు. అందువలన ఆ యజ్ఞము అసంపూర్ణముగా ఉన్నప్పుడే లక్ష్మణుని పంపుడు.

ఉద్యమః క్రియతాం వీర హర్షః సముపసేవ్యితాం

ప్రాస్తావ్యా యది తే సీతా హన్తవ్యాశ్చ నిశాచరాః                      95

వీరశేఖరా, మీరు సీతను పొందుటకు, దుష్ట రాక్షసులను వధించుటకు, ప్రయత్నము చేయుడు. హర్షము ఉత్సాహము కలిగియుండుడు. 

శ్రీరామచంద్రుడు ఆంజనేయుని వాక్యములు విన్నాడు. శ్రీరామచంద్రుడు తన శత్రువు, దురాత్ముడు, అయిన ఇంద్రజిత్తు యొక్క మాయాశక్తిని తెలుసును. అప్పుడు శ్రీరాముడు ఇట్లనెను. లక్ష్మణా, రాక్షసవీరుడైన విభీషణుని వెంటబెట్టుకొనుము. వానరరాజు సుగ్రీవుని తోడ్కోనుము. వానరసేనను, హనుమంతుడు మొదలగు వానర వీరులను,  ఋక్షరాజు జాంబవంతుడు, సైనికులను వెంటబెట్టుకొనుము. మాయాబల సంపన్నుడు, రాక్షస రాజకుమారుడు, వీరులలో శ్రేష్ఠుడు  అయిన ఇంద్రజిత్తును సంహరించుము. అదివిన్న వెంటనే లక్మణుడు అందరినీ వెంటబెట్టుకొని ఇంద్రజిత్తుమీదకు యుద్ధమునకు వెళ్ళెను. అప్పుడు ఇంద్రజిత్తు అయిష్టముగానే అసంపూర్ణముగా యజ్ఞము వదిలి యుద్ధమునకు వచ్చెను. విభీషణా, నీవు మా రాక్షసజాతికి చెందినవాడివి. నీవు నా పినతండ్రివి. అట్టి నీవు నాకేల ద్రోహము చేయుచున్నావు?. దానికి విభీషణుడు, రాక్షస రాజకుమారా, ఇంద్రజిత్తు, నా స్వభావము నీకు తెలియునుగదా. అగ్రజుడు రావణుడు పరస్త్రీని చెరబట్టినాడు. సీతమ్మను రామయ్యకి అప్పచెప్పి క్షమాపణ వేడుకో. అది నీకు లంకకు క్షేమము అనిచేప్పినందులకు నన్ను అవమాన పరచినాడు. అది తెలియకనే మాట్లాడుతున్నావా?  అనెను.

కులే యద్యప్యహం జాతోరక్షసాం కౄరకర్మణాం

గుణోయః ప్రథమో న్రూణాం తన్మే శీలమరాక్షసం                                   96

నా జన్మము కౄరకర్మలు చేయు రాక్షస జాతిలో సంభవించినది. కాని నాది  రాక్షస ప్రవృత్తి కాదు.  నేను సజ్జనులమాదిరి సత్వమును ఆశ్రయించుకున్నాను.  

న రమే దారణే నాహం న చ ధర్మేణ వైరమే

భ్రాత్రా విషమశీలోపి కథం భ్రాతా నిరస్యతే                                          97

క్రూరకర్మలయాడు నా మనస్సు ఇష్ఠపడదు. కుమారా, ఇంద్రజిత్తు, అధర్మమందు నాకు ప్రీతిలేదు. తన స్వభావమునకు నాది వ్యతిరేకము. అయినప్పటికీ ఒక అగ్రభ్రాత  అనుజుడ్ని ఇంటినుండి యెట్లు తరిమివేయగలడు?

ధర్మాత్ ప్రచ్యుతశీలం హి పురుషం పాపనిశ్చయం

త్యక్త్వా సుఖం అవాప్నోతి హస్తదాశీవిషం యథా                                     98  

ఎవని శీలము, స్వభావము ధర్మమునుండి పడిపోయినదో, ఎవడు పాపము చేయుటకు దృఢ నిశ్చయము గావించుకొనెనో, అట్టివానిని వెంటనే వదిలి పెట్టవలయును. అప్పుడు మనుజుడు—చేతిపైనున్న విషసర్పమును వదిలి నిర్భయుడగునట్లు – సుఖమును పొందును.

పరస్వహరనే యుక్తం పరదరాభి మర్శకం

త్యాజ్యం ఆహుః దురాత్మనం వేశ్మ ప్రజ్వలితం యథా                       99

ఇతరుల ధనమును అపహరరించరాదు. పరస్త్రీని తాకరాదు. కాలుచున్న ఇంటిని వదిలివేసినట్లే వానిని  వెంటనే వదిలివేయవలెను.

పరస్వానాం చ హరణం పరదరాభి మర్శనం

సుహృదామతి శంకా చ త్రయోదోషాః క్షయావహాః                          100

ఇతరులధనమును అపహరించుట్, పర స్త్రీ సంసర్గము, హితైభిలాషులయందు అవిశ్వాసము, అను ఈ మూడు దోషములు వినాశకరము.

మహర్షీణాం వధో ఘోరః సర్వదేవైశ్చ విగ్రహః

అభిమానశ్చ రోషశ్చ వైరత్వం ప్రతికూలతా                          101

ఏతే  దోషాం మమ భ్రాతుః జీవితైశ్వర్య నాశనః

గుణాన్ ప్రచ్ఛాదయామానుః పర్వతానివ తోయదాః                102  

మహర్షులను ఘోరముగా వధించుట,  సర్వదేవతలతోను ప్రతికూలతా, అభిమానము రోషము వైరత్వము అందరితోను ప్రతికూలతా తత్వము ఈ దోషాములు నా అగ్రజునిలోఉన్నవి.  అవి అతని ఐశ్వర్యమును జీవితమును నాశనఃము చేయును. మేఘము పర్వమును కప్పును. అట్లే ఈ దుర్గుణములు నా సోదరుని తప్పక నాశనము  చేయును.

దోషైరేతైః పరిత్యక్తో మయాభ్రాతా పితా తవ

నేయమస్తి పురీ లంకా న చ త్వం న చ తే పితా                             103

ఈ దోషముచేత నేను నా సోదరుడు, మరియు నీ తండ్రి అయిన రావణుడ్ని వదిలివేసితిని. ఇక శ్రీలంక, నీవు, మరియు నీ తండ్రి నాశనమగుదురు.

విభీషణుడు అనిన ఆ వాక్యములను విన్న కోపముతో ఇంద్రజిత్తు మూర్ఛితుడి మాదిరియ్యెను. క్రోధముగా మాటలు అనుచు ముందుకు వచ్చెను. ఇంద్రజిత్తు కోపముగా విభీషణునితో, లక్శ్మణునితో, మిగిలిన యుద్ధవీరులతో ఇట్లనెను. నా పరాక్రమమును చూడుడు. లక్మణుడు క్రోధితుడయ్యెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో ఇట్లు పలికెను.

ఉక్తశ్చ దుర్గమః పారః కార్యాణాం రాక్షస త్వయా

కార్యాణాం కర్మణా పారం యో గచ్ఛతి స బుద్ధిమాన్                    104

రాక్షసా, నీవు కేవలము వాక్కుద్వారా శతృవధ మొదలగు కార్యములయొక్క పూర్తికి ఈ వాక్యములు పలికితివి.  అవి నీవు పూర్తిచేయుట అసంభవము.  ఎవడు ఒట్టి మాటలతో గాక, చేతలతో చేయవలసిన కార్యమును చూపునో అతడే బుద్ధిమంతుడు.

దుర్మతీ, నీవు నీ అభీష్టకార్యము చేయుటలో అసమర్థుడివి. నీవు కేవలము మాటలతో తృప్తిచెందుచున్నావు.

అంతర్ధాన గతే నాజౌ యత్వయా చరితస్తదా

తస్కరా చరితో మార్గో నైష వీర నిషేవితః                                        105

నీవు ఆనాడు దాగుకొని ఏ యుద్ధ పద్ధతిని ఆశ్రయించితివో అది దొంగల పధ్ధతి. నిజమైన వీరుడు అట్టి దొంగపద్దతులను యుద్దమందు ఉపయోగించడు.

అనుక్త్వా పరుషం వాక్యం కించిదప్య నపక్షిపన్

అవికత్థన్ వధిష్యామి త్వం పశ్య పురుషాదన                                       106

నరభక్షకుడవగు రాక్షసా, చూడుము, నేను కఠోరవాక్యములు పలుకను. నీపై అట్టి ఆక్షేపముచేయను. ఆత్మా ప్రశంస చేసికోను. నిన్ను సంహరించెదను.

ఈ ప్రకారముచేప్పిన పిదప ఇంద్రజిత్తుమీద లక్ష్మణుడు ఐదు బాణములను వేసెను.

అథైంద్రం అస్త్రం సౌమిత్రిః సంయుగేష్వ పరాజితం

శరశ్రేష్ఠం ధనుశ్రేష్ఠే వికర్షన్నిదం అబ్రవీత్                                                     107

లక్ష్మీవాం ల్లక్ష్మణో వాక్యమర్థసాధకం ఆత్మనః

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది

పౌరుషే చాప్రతిద్వంద్వస్తదైనం జహి రావణిం                                              108

పిమ్మట లక్ష్మణుడు ఇంద్రాస్త్రమును సంధించెను. ఈ అస్త్రము యుద్ధమందు ఎన్నడు వృథా కాదు. శోభాసంపన్నుడు, సుమిత్రకుమారుడును, వీరుడును, అగు లక్ష్మణుడు ఆ బాణమును లాగుచు ఇట్లనెను. దశరథకుమారుడు అగు శ్రీరాముడు ధర్మాత్ముడు, సత్యప్రతిజ్ఞుడు, అయినచో పౌరుషములో శ్రీరామునితో సమానమైన మరియొక వీరుడు లేనిచో, ఓ అస్త్రమా, నీవు ఈ రాక్షసకుమమారుడ్ని వధించివేయుము.

లక్ష్మణుడు అట్లా మాట్లాడి ఇంద్రజిత్తుమీద ఇంద్రాస్త్రమును వదిలెను.  ఆ అస్త్రము శిరస్సును మొండెమునుండి వేరుచేసెను. అప్పుడు ఆకాశమునందు దేవతలు పూలవర్షము కురిపించిరి. అంతట లక్ష్మణుడు ఇంద్రజిత్తు సంహార సమాచారమును  తెలియపరచెను. అంతట శ్రీరామచంద్రమూర్తి సంతోషముతో ఇట్లనెను.

సాధు లక్ష్మణ తుష్టోస్మి కర్మ చానుకరం కృతం

రావణేర్హి వినాశేన జితమిత్యుపధారయ                                      109

మంచిది లక్ష్మణా, నేను నీ యడల చాలా ప్రసన్నుడనైతిని. నీవు అమోఘమైన పరాక్రమమును చూపితివి. ఇప్పుడు రావణ పుత్రుడగు ఇంద్రజిత్తు సంహరింపబడెను. మన జయము నిశ్చయము.

అంతట శ్రీరాముని ఆజ్ఞచే సుషేణుడు, లక్ష్మణుడు, విభీషణుడు, మొదలైన మిత్రులకు, సమస్త వానర వీరులకు చికిత్స గావించెను. ఇంద్రజిత్తు వధను విన్న రావణుడు హతాశుడయ్యెను. మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను.

ప్రకృత్యా కోపనం హ్యేనం పుత్రస్య పునరాధయః

దీప్తం సందీపయామాసుర్ఘ ర్మేర్కమివ రశ్మయః                          110

రావణాసురుడు స్వభావరీత్యా సహజముగానే కోపిష్ఠి, మరియు దుష్ఠ స్వభావి. పుత్రుని గూర్చిన  చింత దీనికి అగ్నికి ఆర్ఘ్యముపోసినట్లు చేసినది. గ్రీష్మ ఋతువుకు సూర్యరశ్మి తోడయినట్లుగా చేసినది. పిమ్మట శ్రీరామచంద్రమూర్తి రాక్షససేనమీద బాణవర్షము కురిపించెను. 

నతే దదృశిరే రామం దహన్తమపి వాహినీం

మోహితాః పరమాస్త్రేణ గాన్ధర్వేణ మహాత్మనా                                    111

శ్రీరాముడు రాక్షససేనను దగ్ధమొనర్చుచుండెను. కాని ఆ రాక్షసులు ఆ బాణములను చూడలేకుండిరి. ఎందుకనగా శ్రీరాముడు ఆ రాక్షసులను గాంధర్వము అను దివ్యాస్త్రముచే మోహింపజేసెను.

అనీకం దశసాహస్రం రథానాం వాతరంహసాం

అష్టాదశ సహస్రాణి కుంజురాణాం తరస్వినాం                                112

చతుర్దశ సహస్రాణి సారోహాణాం చ వాజినాం

పూర్ణే శతసహస్రే ద్వే రాక్షసానాం పదాతినాం                                  113

దివసస్యాష్టభాగేన శరైరగ్నిశిఖోపమైః

హతాన్యేకేన రామేణ రక్షసాం కామరూపిణాం                                     114

శ్రీరామచంద్రమూర్తి పగటియొక్క ఎనినిదవ భాగము అనగా 8½ గంటల సమయములో అగ్నిజ్వాలవంటి తేజోవంతమైన బాణములతో ఇచ్ఛారూపీ రాకసులను పదివేల రథములతోను, పదునెనిమిది వేల ఏనుగులతోను, పదునాలుగువేలగుఱ్ఱములతోను, రెండు లక్షల కాలిబంటులతో కూడిన సేనతోను కూడిన రాక్షస సేనను సంహరించెను.

అనంతరం అనేకరాక్షసులను తోడిడుకొని రావణుడు యుద్ధమునకు బయల్దేరెను. కోపముగా అతివేగముగా భూమి దద్దరిల్లేలా యుద్ధభూమికి వెళ్ళెను. పిమ్మట యుద్దమందు సుగ్రీవుడు విరూపాక్షుడ్ని, మహోదరుడ్ని వధించెను. అంగదుడు మహాపార్శ్వుడ్ని సంహరించెను. రావణుడు శక్తిని లక్ష్మణునిపై ప్రయోగించెను. అది హృదయలోతులో దిగెను. దాని తాకిడికి లక్ష్మణుడు మూర్ఛిల్లెను. అప్పుడు మహాబలశాలియగు శ్రీరాముడు తనరెండుచేతులతో దానిని పట్టుకొని లక్ష్మణుని శరీరమునుండి వేరుచేసేను. క్రోధముగా దానిని త్రుంచివేసెను. యుద్ధభూమియందు ఘోరముగా గాయపడిన లక్ష్మణునిచూచి శ్రీరామచంద్రుడు విలపింపదొడంగెను.

దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాన్ధవాః

తమ్ తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః                                    115  

ప్రతి దేశమందు కలత్రము లబించును. ప్రతి దేశమందు బంధువులు లభించవచ్చు. కాని నమ్మకమైన విశ్వసనీయుడగు సోదరుడు లభించుట దుర్లభము.  

హనుమంతుడు సుషేణుని వచనము ప్రకారము హనుమంతుడు మహోదయ పర్వతము వద్దకు వాయువేగముగా పోయెను. దానిని శిఖరము పెకలించుకొని వచ్చెను. హనుమంతుడు సుషేణునితో ఇట్లనెను.  సుషేణా, నాకు ఆ ఓషధులెవ్వియు తెలియదు. అప్పుడు ఆ ఓషధులను పెరికి నూరి లక్ష్మణుని ముక్కువద్ద బెట్టెను. ఆ ఓషధులరసము ను, మరియు చూర్ణమును ఆఘ్రానించుట తోడనే శరీరములో గ్రుచ్చుకున్న బాణములు బయటికి వచ్చెను. లక్ష్మణుడు శీఘ్రముగా ఆరోగ్యవంతుడయ్యెను. భూమిపైన లేచి నిలబడెను. శ్రీరాముడు ఆనందముతో లక్ష్మణుని ఆలింగనము చేసికొనెను.

పిమ్మట శ్రీరాముడు ధనుస్సునుగైకొని రాక్షససేనతో తలబడెను. శరపరంపరను కురిపించెను.

నహి ప్రతిజ్ఞాంకుర్వన్తి వితథాం సత్యవాదినః

లక్షణం హి మహత్వస్య ప్రతిజ్ఞా పరిపాలినం                             116

నైరాశ్యం ఉపగంతుం చ నాలం తే మత్ క్రుతేనఘ

వధేన రావణస్యాద్య ప్రతిజ్ఞాం అనుపాలయ                                 117

సత్యవాదులు వ్యర్థప్రతిజ్ఞలు చేయరు. తమ తమ ప్రతిజ్ఞలను తప్పక నెరవేర్చేదరు. అదే వారి వైశిష్యము. రఘువీరా, మీరు వ్యాకులపడకుడు. మీ ప్రతిజ్ఞను పరిపూర్ణముగా నేరవేర్చుడు.

శ్రీరాముడు లక్ష్మణుని మాటలకు సాంత్వన పొందెను. ధనుర్బాణములు గైకొని యుద్ధముచేయుటకు సంకల్పించెను. ఇంద్రుని సారథి మాతలి కొరడా తీసికొని రథముపై కూర్చోండెను. మాతలి శ్రీరామునితో ఇట్లనెను. సహస్రనేత్రుడగు ఇంద్రుడు ఈ రథమును విజయముకొరకు నీకు ఇవ్వమని చెప్పెను. ఇది అగ్నివలె తేజోవంతమైన కవచముతో కూడినది. ఇవి సూర్యతేజస్సుతో కూడిన బాణములు. ఇది మంగళకరమైన నిర్మలశక్తి. వీటిని గైకొనుము. నన్ను సారథిగా చేసికొని రావణుని సంహరింపుము.  అంతట ఆ రథముచుట్టూ ప్రదక్షిణచేసి శ్రీరాముడు దానిలో ప్రవేశించెను. అంతట రామ రావణ యుద్ధము భీకరముగా సాగెను.

పూరితః శరజాలేన ధనుర్ముక్తేన సంయుగే

మహాగిరి రివాకంప్యః కాకుత్థ్సో న ప్రకంపతే                                 118

యుద్ధస్థలమంతయు రావణునిచే అతని ధనుస్సునుండి విడువబడిన బాణములతో వ్యాపించియుండెను. శ్రీరామచంద్రుడు ఏమాత్రము తొట్రుబాటు పడలేదు. వారు మహాపర్వతమువలె నిశ్చలురైయుండిరి.   

ప్రాదుర్బభూవురస్త్రాణి విదితాత్మనః

ప్రహర్షాచ్ఛ మహాతేజాః శీఘ్రహస్త తరోభవత్                                   119

ఆత్మా జ్ఞాని యగు శ్రీరాముని ఎదుట అస్త్రములన్నియు వాటంతట అవే ప్రకతితమగుచుండెను. హర్షము, మరియు ఉత్సాహముతో శ్రీరాముని హస్తము చాలా వేగముగా కదలజోచ్చెను.

అంతట శ్రీరాముడు యుద్ధభూమియందు విశ్రాంతి తీసికోనుచుండెను.  రావణుడు యుద్ధము చేయ సిద్ధపడి శ్రీరాముని ఎదుట నిలుచుండెను. దేవతలతోకూడా ఆ యుద్ధము వీక్షించుటకై వచ్చియున్న అగస్త్య మహర్షి శ్రీరామునితో ఇట్లు చెప్పెను.  

రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం

యేన సర్వానరీన్ వత్ష సమరే విజయిష్యసే                                     120

అందరి హృదయములను సంతోషపరచు  మహాబాహో శ్రీరామా, ఈ సనాతనమైన గోప్యమగు మంత్రమును వినుడు. వత్సా, దీనిని జపించినచో యుద్దమందు శత్రువులందరిపై విజయము పోందెదవు.

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశతృ వినాశనం

జయావహం జపం నిత్యం అక్షయం పరమం శివం                             121

సర్వ మంగళ మాఙ్గల్యం సర్వపాప ప్రణాశనం

చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం                                     122

ఇది అత్యంతరహస్యమైన స్తోత్రము. దీనిని ఆదిత్యహృదయము అందురు. ఇది పరమ పవిత్రమైనది. సమస్త శతృవులను వినాశనమొనర్చును. దీనిని నిత్యము జపించవలయును. తద్వారా సదా జయము కలుగును. ఇది నిత్యము, అక్షయము, పరమ కల్యాణదాయకము, మంగళదాయకము. దీనిచే పాపములన్నియు నశించును. ఇది చింతను, శోకమును తొలగించును. ఆయుస్సుని వృద్ధిచేయును. ఇది ఉత్తమసాధనము.

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్క్రుతం

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం                              123

సూర్యభగవానుడు తన అనంత కిరణములతో రశ్మిమాన్ అనగా శుశోభితులై యున్నాడు. వారు నిత్యము సముద్యన్ అనగా ఉదయించువారు. దేవతలచేతను, మరియు అసురులచేతను నమస్కరింపబడువాడు. అందుచే ఆయనను వివస్వాన్ అందురు. కాంతిని విస్తరింపజేయుచు భాస్కరా అని పిలవబడుచున్నారు.   నాయనా, నీవు అట్టి సూర్యభగవానుని  ‘రశ్మిమతేనమః, సముద్యతేనమః, దేవాసుర నమస్కృతాయ నమః వివశ్వతే నమః భాస్కరాయ నమః’ అను నామ మంత్రములచే పూజింపుడు.

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసుర గణాంల్లోకాన్ పాతి గభ స్తిభిః                               124

దేవతలందరూ వీరి స్వరూపులేయియున్నారు. వీరు తమ అనంత తేజోరాశిచేతను, మరియు తన కిరణములచేతను, జగత్తునకు సత్తాను, స్ఫూర్తిని ఇచ్చువారు. వీరు తమ కిరణములను ప్రసరించి దేవతలతోను, అసురులతో కూడిన సమస్తలోకములను పాలించుచున్నారు.

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలోయమః సోమోహి అపాం పతిః                     125

పితరో వసవాః సాధ్యా అశ్వినౌ మరుతోమనుః

వాయుర్వహ్నిః ప్రజాః  ప్రాణఋతుః  కర్తా ప్రభాకరః                             126

వీరే బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కన్దుడు, ప్రజాపతి, మహేంద్రో, ధనదుడు అనగా కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు అనగా కుబేరుడు, అపాంపతిః అనగా వరుణుడు,  పితరులు, వసువు, సాధ్యులు,  అశ్వినీ కుమారులు, మరుత్ గణము, మనువు, వాయువు, అగ్ని,  ప్రజలు, ప్రాణము, ఋతువులు అన్నితికినీ—ప్రకతనమోనర్చు వారును, కాంతిపుంజమును అయి ఉన్నారు.     

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః                                             127

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ కోంశుమాన్                     128

హిరణ్యగర్భః శిశిరః తపనో హస్కరో రవిః

అగ్నిగర్భోదితేః పుత్రః శఙ్ఖః శిశిరనాశనః                                 129

వ్యోమనాథస్తమో భేదీ ఋగ్యజుః సామపారగః

ఘనవృష్టి రసాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః                         130

ఆతపీ మణ్డలీ మృత్యుః పిఙ్గలః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః                                131

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే                            132 

వీరి పేర్లు—ఆదిత్యుడు (ఆదితి పుత్రుడు), సవత (జగత్తును ఉత్పన్నముచేయువాడు), సూరుడు (సర్వవ్యాపి), ఖగుడు (ఆకాశమున సంచరించువాడు), పూషా (పోషించు వాడు), గబస్తిమంతుడు ((ప్రకాశవంతుడు), సువర్ణసదృశుడు, భానుడు (ప్రకాషకుడు), హిరణ్యరేతా0(బ్రహ్మాండము యొక్క ఉత్పత్తి బీజము), దివాకరుడు (రాత్రియండలి చీకటిని పోగొట్టి ప్రకాశమును వ్యాపింపజేయువాడు), హరిదశ్వుడు (దిక్కులందు వ్యాపించువాడు), సహస్రార్చి (వేలకొలది కిరణములతో సుశోభితుడు), సప్తసప్తి (ఏడు గుఱ్ఱములు కలవాడు),  మరీచిమాన్ (కిరణములచే శోభితుడు), తిమిరోన్మథనః (అంధకారమును తరిమివేసేవాడు), శంభు (శుభమునకు శానము), త్వష్టా (భక్తుల దుఃఖమును పోగొట్టువాడు, లేక జగత్తును సంహరించువాడు), మార్తాండుడు (బ్రహ్మాండమునకు జీవనప్రడుడు),  అంశుమాన్ (కిరణములను ధరించువాడు), హిరణ్య గర్భః (బ్రహ్మ), శిశిరః (స్వభావముగానే సుఖమునిచ్చేవాడు), తపనః (తాపము అనగా వేడి కలగాజేసేవాడు), అహస్కరః (దినకరుడు), రవిః (అందరియొక్క స్తుతికి పాత్రుడు),  

అగ్నిగర్భః (అగ్నిని గర్భమును ధరించువాడు), అదితేః పుత్రః (అదితి యొక్క పుత్రుడు) శఙ్ఖః (ఆనందస్వరూపుడు మరియు వ్యాపకుడు), శిశిరనాశనః (శీతమును నశింపజేయువాడు), వ్యోమనాథః (ఆకాశాముయోక్క ప్రభువు), తమోభేదీ (చీకటిని నశింపజేయువాడు),  ఋగ్యజుః సామపారగః (ఋక్ యజుః సామ వేదములను లెస్సగా అధ్యయనము చేసినవాడు), ఘనవృష్టి (మహావర్షమునునకు కారణభూతుడు),  రసాం మిత్రః (జలమును ఉత్పత్తిచేయువాడు),  వింధ్య వీథీ ప్లవంగమః (ఆకాశామున వేగముగా ప్రయాణముచేయువాడు),  ఆతపీ (ఎండను కలగాజేసేవాడు),  మణ్డల (కిరణములను ధరించినవాడు), మృత్యుః (మృత్యుకారకుడు), పిఙ్గలః (పిఙ్గల వర్ణము కలవాడు),   సర్వతాపనః (సర్వులకు తాపముకలగాచేసేవాడు), కవి (త్రికాలదర్శి), విశ్వః (సర్వస్వరూపులు), మహాతేజః (మహాతేజస్వి),  రక్తః (ఎఱుపు రంగు గలవాడు) సర్వభవోద్భవః (అందరి ఉత్పత్తికి కారకుడు), నక్షత్ర గ్రహతారాణా మధిపో (నక్షత్ర గ్రహతారలకు అధిపతి), విశ్వభావనః (జగత్తును రక్షించువాడు), తేజసామపి తేజస్వీ (తేజస్వులయందు మహాతేజస్వి), ద్వాదశాత్మన్ (ద్వాదశ అనగా పన్నెండు రూపములతో అభివ్యక్తమైనవాడు) అయియున్నవి. అట్టి సూర్యదేవునకు నమస్కారము.

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః                             133

పూర్వగిరి (ఉదయాచలము), పశ్చిమగిరి (అస్తాచలము) ల రూపులగు సూర్యునికి నమస్కారము. జ్యోతిర్గణములకు  గ్రహ నక్షత్రములకు ప్రభువును, మరియు పగటి యొక్క అధిపతియైన మీకు నమస్కారము.

జయాయ జయభద్రాయ హర్శశ్వాయ నమోనమః

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః                        134

జయస్వరూపులు, విజయ, కళ్యాణదాతలు, ఆకుపచ్చ గుఱ్ఱములుగల రథముగలవారును అగు మీకు నమస్కారము. మీకు పునః పునః నమస్కారము. వేలకొలది అంశలు లేదా కిరణములు గలవాడా మీరు అదితి పుత్రుడైన ఆదిత్యుడు అనే పేరుతొ ప్రసిద్ధిగాంచిన సూర్యదేవా, మీకు నమస్కారము.

నమః ఉగ్రాయ వీరాయ సారఙ్గాయనమోనమః

నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే.                           135

ఉగ్రుడు (భక్తులుకాని వారు శతృవ్లులు, వీరికి భయంకరులు),  వీరుడు (శక్తి సంపన్నులు), సారఙ్గుడు (శీఘ్రగమనము గలవాడు), అగు సూర్యదేవునకు నమస్కారము. కమలములను వికసింపజేయు ప్రచండుడికి నమస్కారము.

బ్రహ్మ ఈశాన అచ్యుతాయ సూరాయాదిత్య వర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః                               136

మీరే బ్రహ్మ, విష్ణు, శివుడు. సూర్యుడు, ఆదిత్యుడు, ఈ సౌరమండలము అంతా మీ తేజముతోనే నిండియున్నది. మీరు ప్రకాశముచే పరిపూర్ణులు.  మీరే సర్వ భక్షకులు. మీరు రుద్రరూపులు. మీకు నమస్కారము.

తమోఘ్నాయ హిమఘ్నాయ శతృఘ్నాయ మితాత్మనే

కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః                                      137

మీరు అజ్ఞానమును, అంధకారమును నశింపజేయువారు, జడత్వము, శీతము నివారించువారు, శతృనాశకులు, మీ స్వరూపము అప్రమేయమైనది. మీరు కృతఘ్న వినాశకులు. సమస్తజ్యోతులకు ప్రభువు. దేవస్వరూపులు.  అట్టి మీకు నమస్కారము.

తప్తచామీకరాభాయ హరయే విశ్వకర్మణే

నమస్తమోభిఘ్నయ రుచయే లోకసాక్షిణే                                  138

మీ కాంతి మరగిన బంగారము వంటిది.  అజ్ఞానము నాశనముచేయు హరి మీరు. ప్రపంచమును సృష్టించు విశ్వకర్మ మీరే.  మీరే తమో నాశకులు, ప్రకాశస్వరూపులు, జగత్తుకు సాక్షి. అట్టి మీకు నమస్కారము.

నాశయత్యేష వై భూతం తమేవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః                                        139

ప్రభూ, మీరే ప్రాణులయొక్క సృష్టి, స్థితి, సంహారములను చేయుచున్నారు.  మీరే తమ కిరణములచే తాపమును కలిగిస్తున్నారు. మరియు వర్షింపజేస్తున్నారు.

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హ్యోతిణాం                                           140 

మీరే సమస్తప్రాణులయందు ఉన్న అంతర్యామి. ప్రాణులు నిద్రించుచున్నను మీరు మేల్కొనేయుందురు. మీరే అగ్నిహోత్రులు, మీరే అగ్నిహోత్రీ అనగా జనులకు లభించు ఫలము అయియున్నారు.

దేవాశ్చ క్రతవశైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభుః                                          141   

యజ్ఞమందు భాగము గ్రహించు దేవతలు మీరే, యజ్ఞము మీరే, యజ్ఞఫలము మీరే, సమస్త లోకములయందును గల క్రియలన్నిటికి ఫలప్రదాత మీరే, ఇచ్చుటకు సమర్థులు మీరే.

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తియన్ పురుషః కష్చిన్నావసీదతి రాఘవ                              142

రామా, ఎవడు విపత్తియందు, కష్టమందు, దుర్గామమార్గమందు భయము తటస్ధించినప్పుడు సూర్యదేవుని స్మరించునో, అట్టి వాడికి దుఃఖము నివృత్తిఅగును.

పూజ యస్వైనం ఏకాగ్రో దేవదేవం జగత్ పతిం

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యతి                       143

కావున ఓ శ్రీరామా, మీరు ఏకాగ్ర చిత్తముతో దేవాది దేవుడయిన ఈ జగదీశ్వరుని పూజింపుడు.  దీనిని మూడుసార్లు జపింపుడు. మీరు తప్పక విజయము పొందెదరు.

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం జహిష్యసి

ఏవం ఉక్త్వా తతః అగస్త్యో జగామ స యథాగతం                                   144

మహాబాహో, మీరు ఈ క్షణమందే రావణుని వధించగలరు. ఇట్లాచెప్పిన తదుపరి అగస్త్య మహర్షి వచ్చిన దారిన వెడలెను.

ఏతత్ శ్రుత్వా మహాతేజా నష్ట శోకః అభవత్ తదా

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్                  145

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా ఇదం వరం హర్షం అవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్ భూత్వా ధనురాదాయ వీర్యవాన్                  146

రావణ ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్

సర్వయత్నేన మహాతావృతః తస్య వధః అభవత్                              147

అగస్త్యమహర్షి ఉపదేశము వినంగానే శ్రీరాముని శోకము తొలగిపోయెను. వారు ప్రసన్నచిత్తముతో ‘ఆదిత్యహృదయము’ ధారణ చేసిరి.  సూర్యుని వైపు చూస్తూ ఈ జపము మూడు పర్యాయములు ఆచమనముచేసి నిశ్చలబుద్ధితో పఠించిరి. వారికి ఆనందము కలిగెను.  మహాపరాక్రమవంతుడగు శ్రీరాముడు పిమ్మట ధనుర్బాణములను గైకొని రావణుని వైపు నడిచెను. వారు అమితోత్సాహముతో రావణుని సంహరించుటకు దృఢ నిశ్చయముతో ముందుకు నడిచిరి.

అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహ్రుష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి                     148

అప్పుడు దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు ప్రసన్నుడై శ్రీరామునివైపు చూచెను. రాక్షసరాజగు రావణుని వినాశసమయము ఆసన్నమయినదని అర్థము చేసికొనెను. సంతోషముతో ఇట్లు పలికెను. రఘునందనా, ఇప్పుడు కార్యము త్వరితగతిని ముగింపుడు.

తదుపరి శ్రీరామునకు మరియు రావణునికి ఘోరముగా యుద్ధము జరిగెను. అప్పుడు మాతలి శ్రీరామునకు ఇట్లు చెప్పెను. మీరు ఇతనిని వధించుటకు బ్రహ్మాస్త్రము ఉపయోగించుడు. రావణుని వధకు సమయము ఆసన్నమైనది. లోగడ అగస్త్య మహర్షి ఇచ్చిన అస్త్రము ఇది. ఇది యుద్దమందు అమోఘమైనది. శ్రీరాముడు మర్మభేదియగు ఆ బ్రహ్మాస్త్రమును రావణునిపై ఉపయోగించెను. అది రావణునికి వక్షస్థలమున తగిలెను. ఆ బ్రహ్మాస్త్రము వేసిన తత్క్షణమే అది రావణుని హృదయము భేదించి తిరిగి శ్రీరాముని అంబులపొదిలోచేరెను.  దేవతలు పైనుండి పూల వర్షము కురిపించిరి.  పిమ్మట సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, లక్ష్మణుడు, మిత్రులు పరమానందభరితులైరి. అన్నమరణము విభీషణునికి అమిత దుఃఖము కలుగజేసెను. శ్రీరామచంద్రుడు విభీషణుని అనునయ వాక్యములతో ఓదార్చెను.

నాయం వినష్టో నిశ్చేష్టః సమరే చండ విక్రమః

అత్యున్నత మహోత్సాహః పతితో యమ శఙ్కితః                               149

విభీషణా, ఈ రావణుడు యుద్ధమున మిక్కిలి సమర్థుడు. ఇతను అసమర్థుడై చావలేదు. యితడు ప్రచండమైన పరాక్రమమును ప్రదర్శించెను. ఈతను యుద్ధభూమియందు అద్భుతమైన ఉత్సాహము ప్రకటించెను. ఇతనికి మృత్యువు అంటే భయములేదు. దైవికముగా యితడు యుద్ధమున జచ్చెను.

నైవం వినష్టాః శోచంతే క్షత్రధర్మ వ్యవస్థితాః

వృద్ధిమాశం సమానా ఏ నిపతంతి రణాజిరే                                   150   

ఎవడు తమ అభ్యుదయమునుగూర్చిన కోరికచే క్షత్రియ ధర్మమందు వ్యవస్థితులై యుద్ధమున అసువులుబాయుడురో అట్టి జనుల విషయమై శోకింపతగదు.

తదేవం నిశ్చయం దృష్ట్వా తత్వమాస్థాయ నిజ్వరః

యదిహానంతరం కార్యం కల్ప్యం తదనుచింతయ                          151

శాస్త్రము యొక్క ఇట్టి నిశ్చయమును తెలిసికొని, సాత్వికబుద్ధిని ఆశ్రయించుకొని నీవు నిశ్చింతగా ఉండుము. అంతియగాక, ఇకముందర చేయవలసిన ప్రేత సంస్కారముల గురించి ఆలోచింపుడు.

మహాప్రాక్రమవంతుడగు శ్రీరామచంద్రుడు ఇట్లు పలుకగా, అనతరము శోకతప్తుదయినా విభీషణుడు ఇట్లు పలికెను.

ఏషోహితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాన్తగః కర్మసు చాగ్ర్యసూరః

ఏతస్య యత్ ప్రేత గతస్య కృత్యం తత్ కర్తుం ఇచ్చ్చామి తవ ప్రసాదాత్               152

ఈ రావణుడు అగ్నిహోత్రియు, మహాతపస్వియు, వేదాంతవేత్తయు, యజ్ఞ యాగాది కర్మలందు శ్రేష్రుడును, శూరుడును, మహా కర్మఠుడును అయియున్నాడు. కావున మీ దయచేత నేనే మా అన్నయొక్క శ్రాద్ధకర్మ చేయదలచినాను.

అదివిన్న శ్రీరాముడిట్లు పలికెను. విభీషణా, వైరములు మరణమువరకే ఉందును. మరణించిన పిదప అన్ని వైరములు నశించును.  కావున నీవు ఇతని ప్రేత సంస్కారమును గావింపుము. శ్రీరామునిచే చంపబడిన దశముఖ రావణుని చూచి రావణుని భార్య విలపించ దొడంగెను.

ఇంద్రియాణి పురాజిత్వా జీతం త్రిబువనం త్వయా

స్మరద్భిరవ తత్ వైరం ఇంద్రియైరేవ నిర్జితః                                153  

మందాకినిదేవి విశాన్నవదనముతో ఇట్లనెను: నాథా, మొత్త మీరు ఇంద్రియములు జయిన్చియే ముల్లోకములు జయిన్చిటివి. ఆ వైరమును గుర్తుంచుకొని ఆ యింద్రియములే మీమీద పగతీర్చుకున్నవి.   

ప్రాణేస్వరా, నేను ఎన్ని మారులో ‘శ్రీరామచంద్రునితో విరోధము పెట్టుకొనకుడు’ అని చెప్పితిని. కాని నామాట వినరైతిరి. దాని ఫలితమే ఈనాడు ఇట్లు సంభవించినది.  

అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణః

భర్తః పర్యాగతే కాలే కర్తా నాస్తి అత్ర సంశయః                             154

ప్రాణనాథా, సమయము వచ్చినప్పుడు కర్తకు తన పాప ఫలితము తప్పక లభించును.

శుభకృత్ శుభం ఆప్నోతి పాపకృత్ పాపమశ్నుతే

విభీషణః సుఖం ప్రాప్తస్త్వం ప్రాప్తః పాపం ఈదృశీం                      155 

శుభకర్మలను ఆచరించువానికి శుభము జరుగును.  పాపకర్మలను ఆచరించువానికి పాపము జరుగును. అందువలననే శుభకర్మలుచేసిన విభీషణునికి సుఖం ప్రాప్తించినది. ఈ విధమైన పాపకర్మలు చేసినందువలననే రావణునికి దుఃఖం ప్రాప్తించినది.

మీ ఇంటియండు సీతకంటే సౌందర్యవంతమైన స్త్రీలు యెందరో కలరు. మీరు కామమునకు వశులై తెలిసికొనలేకుండిరి. మీరు ప్రపంచమును క్షోభపెట్టిరి. సాధుమహాత్ములను ఎందరినో హింసించిరి. వృథాగా సంహరించిరి. శతృవులను అహంకారముతో అవహేళన చేసిరి.  మీరు పెక్కురు కులకాంతలను, గురువులను, ధర్మపరాయణులైనవారిని, పతివ్రతలను విధవలను చేసితిరి.

ప్రవాదః సత్యమేవాయం త్వం ప్రతిప్రాయశో నృపః

పతివ్రతానాం నా కస్మాత్ పతంతి అశ్రూణి భూతలే                        156

మహారాజ, పతివ్రతల అశ్రువులు నేలమీదపడకూడదు. పడిన యడల ఆ అశ్రువులు వినాశమునకు దారితీయును. అది మీ విషయములో చక్కగా వర్తించును.  

రాజా, మీరు అహంకారముతో ముల్లోకములలోను మీవంటివారు లేరని విర్రవీగితిరి. కాని ఒక పరాయిస్త్రీని తస్కరించు నీచమైన కార్యమును ఎట్లుచేయగలిగితిరి.

కామక్రోధ సముత్థేన వ్యసనేన ప్రసంగినా

వివృత్తస్త్వత్ కృతేనార్థః సోయం మూలహరో మహాన్

త్వయాకృతమిదం సర్వం అనాథం రాక్షసం కులం                       157

కామక్రోధములా వలన ఉత్పన్నమైన క్రోధముతో  నిన్ను నీవు నాశనము చేసికున్నావు. అంతియగాక మమ్మల్ని సమస్త రాక్షస వంశమును అనాథులను చేసితివి.

మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం మమ పితుస్తథా

న కృతం వీర్యమత్తేన తస్యేదం ఫలమీదృశం                             158

మీరు మీ బలగర్వముచే మత్తెక్కియుంటిరి. అందువలననే మారీచుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మరియు మా తండ్రిచేప్పిన మాటలనూ వినకుండిరి. దాని ఫలితమే ఈ మీ వినాశమునకు కారణము.

కిం తేన విదితా దేవిలోకానాం స్థితితిరధృవా

దశావిభాగపర్యాయే రాజ్ఞాం వైచంచలాః శ్రియః                                 159  

అప్పుడామె సవతులీవిధముగా పలికిరి.  మహారాణి, ప్రపంచముయొక్క స్థితి అస్థిరము. అదిమీకు తెలినదేగదా.  పరిస్థితి మారినప్పుడు రాజుల సంపద స్థిరముగానుండదు.

తదుపరి విభీషణుడు మరియు ఇతర రాక్షసులు చితిపై వివిధ వస్త్రములను, పేలాలను ఉంచిరి. అప్పుడు విభీషణుడు చితికి నిప్పు అంటించెను. అటుపిమ్మట శ్రీరామచంద్రుడు మాతలిని సన్మానించెను. ఇంద్రుని రథమును ఆయన రథసారథి మాతలికి తిరిగి ఇచ్చెను.

అథోవాచ స కాకుత్థ్సః సమీప పరివర్తనం

సౌమిత్రం సత్వసంపన్నం లక్ష్మణం దీప్త తేజసం                        160

విభీషణమిమం సౌమ్య లంకాయాం అభిషేచయ

అనురక్తంచ భక్తం చ తథ పూర్వోపకారిణం                             161

అప్పుడు శ్రీరామచంద్రుడు తన సమీపముననున్న సౌమ్యుడు మరియు మహా బలసంపన్నుడయిన లక్ష్మనునితో ఇట్లనెను. లక్ష్మణా, నీవు ఇప్పుడు లంకాపురమునకు పొమ్ము. విభీషణునికి రాజ్యాభిషేకము గావింపుము. ఈ విభీషణుడు నా యందు మిక్కిలి ప్రేమ, భల్తి గలవాడు, మంచి మిత్రుడు మరియు మున్ముందు ఉపకారముచేయువాడు.  

పిమ్మట లంకాపురము ప్రవేశించిన లక్ష్మణుడు ఒక ఘటమును తీసికొని దానిని ఉత్తమ ఆసనముపై పెట్టెను. ఆ ఘటములోని జలముచే విభీషణునికి వేదోక్తవిధిని అనుసరించి లంకా రాజ్యపదమున అభిషేకము ఒనర్చెను. అంతట శ్రీరాముడు చేతులు జోడించుకొని మహా బలవంతుడైన హనుమంతునితో ఇట్లనెను. నీవు మహారాజు విభీషణుని ఆజ్ఞ గైకొనుము. లంకాపురము ప్రవేశింపుము. వైదేహి యొక్క క్షేమ సమాచారములను తెలిసుకొనుము. శ్రీరాముని మాటలుగా ఇట్లుచెప్పుము. సీత, విభీషణుని సహాయముతో రావణ సేనను, రావణుని సంహరించితిని.  సీతా, నిన్ను విడిపించుటకు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చితిని.  సముద్రము పై వారధిని నిర్మించితిని. లంకను చేరితిని. రావణుని సంహరించితిని. ఇట్లా అని శ్రీరాముడు నీకు చెప్పమన్నారు. రాక్షసులు ఆంజనేయుని సన్మానించెను.  లంకాపురమున ప్రవేశించెను. సీతమ్మను సమీపించెను. అప్పుడు మహా పతివ్రతాశిరోమణి, ధర్మపరాయణురాలగు సీతమ్మ ఆనందాశ్రువులు కారుచుండగా ఇట్లు చెప్పెను.

శ్లాఘనీయః అనిలస్య త్వం సుతః పరమ ధార్మికః

బలం శౌర్యం శ్రుతం సత్వం విక్రమో దాక్ష్యముత్తమం                     162

తేజః క్షమా ధృతిః స్థైర్యం వినీతత్వం న సంశయః

ఏతే చ అన్యే  చ బహవో గుణాస్త్వయ్యేవ శోభనాః                          163

ఆంజనీయ, మీరు వాయు పుత్రులు. మీరు స్తుతింపదగినవారు. పరమ ధర్మాత్ములు.  బలం శౌర్యం శాస్త్రజ్ఞానము సత్వం పరాక్రమము ఉత్తమదక్షత తేజస్సు క్షమ ధైర్యము స్థిరత్వము వినయత ఇంకను అనేకానేక ఉత్తమ గుణములు మీయందు కలిగి శోభిల్లుతున్నారు. ఇందు ఏమాత్రము సందేహము లేదు.  

తదుపరి హనుమంతుడు సీతఎదుట నిలబడి చేతులు జోడించుకొనేను. వినయముతో ఆనందముతో ఇట్లు చెప్పెను. అమ్మా, మీరు అనుజ్ఞ ఇచ్చినచో ఇంతవరకు మిమ్ములను ఎంతో హింస పెట్టిన రాక్షస స్త్రీలు, వారినందరినీ త్రుటిలో మట్టుపెడతాను.

ఇత్యుక్తా సా హనుమతా కృపణా దీన వత్సలా

హనూమంతమ్ ఉవాచన ఇదం  చిన్తయిత్వా విమృశ్య చ                       164

హనుమంతుడు చెప్పిన వాక్యములను విన్న కరుణామయి మరియు దీనవత్సల అగు సీతమ్మ బాగా విచారణ చేసి ఇట్లు చెప్ప దొడంగెను.

రాజసంశ్రయవశ్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయా

విధేయానాం చ దాసీనాం కః కుప్యేద్ వానరోత్తమ  

భాగ్య వైషమ్య దోషేణ పురస్తాద్ దుష్క్రుతేన చ                                    165

మయైతత్ ప్రాప్యతే సర్వం స్వక్రుతం హ్యుపభుజ్యతే

మైవం వద మహాబాహో దైవీహ్యేషా పరాగతి                                      166

కపిశ్రేష్ఠా, పాపం, వీరు రాజుయొక్క ఆశ్రమమందు ఉండుటవలన పరాధీనులైయున్నారు. ఇతరుల ఆజ్ఞను అనుసరించి వారు వారి వారి కార్యములు నిర్వర్తించెదరు. అట్టి దాసీ జనముపై నేను కోపగించలేను. నా పూర్వజన్మ కర్మననుసరించి నాకు ఫలితము లభించినది. ప్రాణులందరు వారి వారి కర్ముననుసరించియే సుఖ దుఖములను అనుభవించెదరు. కావున మహాబాహో, వీరిని చంపవద్దు.  నన్నుగూర్చి దైవనిర్ణయము ఇట్లే ఉన్నది.

న పరః పాపమాదత్తే పరేషాం పాపకర్మణాం

సమయో రక్షితవ్యస్తు స అంతశ్చారి త్రభూషణాః                          167 

ఇతరులకు హానిచేయువాడి పాపకర్మను ఉత్తముడు స్వీకరింపడు. ఆ హానిచేయువారి యడల పాపముతోకూడియుండు ప్రవర్తనము చేయడు. ఎందుకనగా  సాధుపురుషుడు తన సత్ ప్రవర్తనచేతనే శోభితుడగుచున్నాడు. ఆ సదాచారమే అతని భూషణము.

పాపానం వా శుభానం వా వధార్హాణామథాపి

కార్యం కారుణ్యం ఆర్యేణ న కశ్చిద్ న అఫరాధ్యతి                                     168

శ్రేష్ఠుడైనవాడు పాపియందును, పుణ్యాత్ముడియందును, వధింపయోగ్యమగు అపరాథము ఒనర్చినవాడియందును, అందరియడల దయ కలిగియుండవలయును. ఎందుకంటె అపరాథము ఎన్నడును చేయని ప్రాణి ఎక్కడా ఉండడు.

లోకహింసా విహారాణాం క్రూరాణాం పాపకర్మాణాం

కుర్వతామపి పాపని నైవ కార్యం అశోభనం                                     169

లోకులను హింసించువారు, సదా పాపమునే అనుసరించువారును అగు క్రూరస్వభావము కల పాపులకు కూడా అమంగళము చేయరాదు.

సీత ఇట్లుచేప్పగా జ్ఞానియగు ఆంజనేయుడు సీతమ్మతో ఇట్లు పలికెను. మీరు శ్రీరామచంద్రుని ధర్మపత్ని. అందువలన మీరు పలికిన పలుకులు మీకు సమయోచితముగానే ఉన్నవి. ఇక ఇప్పుడు మీ సందేశమును ఒసంగుడు. నేను శ్రీరాముని వద్దకు మీ సందేశమును చేర్చేదను. అప్పుడు సీతమ్మ హనుమంతునితో ఇట్లు పలికెను. నేను భక్తవత్సలుడైన నా ప్రభువును దర్శించదలచుకున్నాను.’  అనెను.

తదుపరి విభీషణుడు బహుమూల్యమగు వస్త్రములను ధరించినదియు, దీప్తిమతియు అయిన సీతమ్మను పల్లకీలో శ్రీరాముని వద్దకు తీసికెళ్ళెను. అప్పుడు చాలామంది రాక్షసులు నలువైపులనుండి సీతమ్మను రక్షించుచుండిరి. శ్రీరామచంద్రుడు ధ్యాన నిమగ్నుడైయుండెను. అయినను విభీషణుడు ఆనందముగా శ్రీరామునివద్దకు చేరి ఇట్లనెను. ప్రభూ, సీతమ్మ పల్లకిలో వచ్చినది అని చెప్పెను. అనంతరము శ్రీరాముడు విభీషణునితో ఇట్లు చెప్పెను.

న గృహాణి న వస్త్రాణి న ప్రాకారస్తిరక్రియా

నేద్రుశా రాజసత్కారా వృత్తమావరణం స్త్రియాః                              170

విభీషణా, గృహములు, వస్త్రములు, ప్రాకారములు, జనులను దూరముగా ఉంచుట, వంటి ఈ మాదిరి రాజ సత్కారములు, స్త్రీకి ఆచ్ఛాదనమును కలుగజేయదు. ఆమె సదాచారమే ఆమెకి నిజమైన ఆచ్ఛాదనము.

అందువలన సీత పల్లకి వదలి కాలినడకనే నావద్దకు వచ్చుగాక్. తదుపరి సీతమ్మ ఆ విధముగానే పల్లకి వదలి కాలినడకన తనవద్ద నిలుచుండెను. అప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మతో ఇట్లనెను. సీతా, నీవు ఆశ్రమములో ఒంటరిగాఉన్నప్పుడు రాక్షస రావణుడు నిన్ను ఎత్తుకొనిపోయెను. ఆ దోషము నాకు దైవ వశమున కలిగినది. దానిని మానవ ప్రయత్నముచే తొలగించుకొంటిని.

సంప్రాప్తం అవమానం యస్తేజసా న ప్రమార్జతి

కః తస్య పౌరుషేణార్థో  మహాతాప్యల్పచేతసః                                 171

సంప్రాప్తించిన అవమానమును తన తేజముచేజము, మరియు బలముచేతను తొలగించుకొనవలయును.   లేనియడల అట్టి మందబుద్ధిగలవానికి పౌరుషమువలన ఉపయోగము ఉండదు.

ఇప్పుడు నీ చరిత్రయందు సందేహము ఏర్పడినది. ఆ మాటలు విన్న సీతమ్మకు అమితమైన దుఃఖము కలిగెను. ఆమె ఖిన్నవదనముతో ఇట్లు చెప్పనారంభించెను.

న తథాస్మి మహాబాహో, యథా మాం అవగచ్ఛసి

ప్రత్యయం గచ్ఛ మే స్వన చారిత్రేణైవ తే శపే                                172

మహాబాహో, మీరు నాగురించి ఏమి ఊహిస్తున్నారో నేను అట్టిదాననుగాను. నన్ను విశ్వసింపుడు. నేను చరిత్రమీద ప్రమాణముచేసి చెప్తున్నాను. నేను సందేహిదగినంప దాననుగాను.

ఇట్లు చెప్తూ సీతమ్మ దుఃఖముతో కన్నీరుగారుస్తూ లక్ష్మణునితో ఇట్లనెను.  నా దుఃఖమునకు ఇదియే మందు. మిథ్యా కళంకముచే నేను జీవించియుండలేను.

ప్రణమ్య దేవతేభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ

బద్ధాఞ్జలిపుటా చేదమువాచాగ్ని సమీపతః                                    173

తదుపరి మిథిలేశుని కమార్తెయగు జానకి దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరించెను. చేతులుజోడించి అగ్నిదేవునికి నమస్కారముచేసేను. అనంతరము ఇట్లు పలికెను.

యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్

తథా లోకస్యసాక్షీ మాం సర్వతః పాతు పావకః                                   174 

నా హృదయము అన్నివేళలా శ్రీరామునియందు లగ్నమై యుండెను.  అగ్నిదేవుడు అన్నిధర్మములనుండి నన్ను రక్షించుగాక. అట్లుకానిచో నన్ను భస్మమొనర్చుగాక.

కర్మణా మనసా వాచా యథా నాతిచరామి అహం

రాఘవం సర్వ ధర్మజ్ఞం తథా మాం పాతు పావకః                                    175    

కర్మణా మనసా వాచా ధర్మజ్ఞుడగు రాఘవుడ్నిఅనుసరించినట్లయితే అగ్నికి ఆహుతిచేసిన ఈ శరీరమును అగ్ని రక్షించుగాక. అట్లుకానిచో నన్ను భస్మమొనర్చుగాక.  

ఆదిత్యో భగవాన్ వాయుర్దిశః చంద్రః తథైవచ

ఆహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథ్వీతథా

యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం                                     176

పరమాత్మయగు సూర్యుడు, దిక్కులు, చంద్రుడు, పగలు, రాత్రి, సంధ్యలు, భూదేవి, ఇతర దేవతలు నన్ను శుద్ధ చరిత్రతో కూడినదానినిగా ఎరిగినచో ఈ శరీరమును అగ్ని రక్షించుగాక. అట్లుకానిచో నన్ను భస్మమొనర్చుగాక. 

ఇట్లు చెప్పి వైదేహి అగ్నియందు ప్రవేశము చేసెను.  ఆ సమయములో విశ్రవుని పుత్రుడగు కుబేరుడు, యమధర్మరాజు, మహేంద్రుడు, వరుణుడు, ఈశ్వరుడు, బ్రహ్మ దేవుడు – అందరు లంకాపురమునకు వచ్చిరి. శ్రీరామచంద్రునితో ఇట్లు చెప్పిరి. శ్రీరామ, మీరు సమస్త జగత్తునకు సృష్టికర్త, జ్ఞానులలో శ్రేష్ఠులు, సర్వవ్యాపకులు. మరి ఇప్పుడు అగ్నిప్రవేశము చేసిన సీతమ్మను ఎలా ఉపేక్షించుచున్నారు? మీరే విష్ణువు. మీరు ఎలా తెలిసికోనుటలేదు? లోకపాలురీవిధముగా చెప్పగా, వారితో శ్రీరామచంద్రుడు ఇట్లు అనెను.

ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మకం

సోహం యశ్చ యతశ్చాహం భగవాంస్తద్ బ్రవీతుమే                                   177

దేవతలారా, నేను మనుష్యునిగా, దశరథుని పుత్రునిగా తలంచుచున్నాను. మహాత్ములారా, నేను వాస్తవముగా ఎవదనో, ఎచటినుండి వచ్చితినో, అడియంతయు మీరే నాకు తెలియజేయుడు.

శ్రీరాముడు ఇట్లు పలుకగా బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడగు బ్రహ్మదేవుడు ఇట్లు చెప్పెను. శ్రీరామ, మీరు నా సత్యమైన మాటలను వినుడు.

భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధః

ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య సపత్నజిత్                                178

మీరు చక్రధరులైన శ్రీమాన్ నారాయణదేవులు. ఏకకోర కలిగిన భూమిని భరించు వరాహదేవులు. భూత భవిష్యత్ శత్రువులను జయించువారలు.

అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చ అంతేచ రాఘవ

లోకానాం త్వాం పరోధర్మః విష్వక్సేనః చతుర్భుజః                                      179

రఘునందనా, మీరు నాశరహితమగు పరబ్రహ్మ. సృష్టి యొక్క ఆది మధ్యాంతములు  మీరే.  సత్యరూపమున విరాజిల్లుచున్నారు వారు మీరే. లోకముయోక్క పరమధర్మము మీరే. మీరే విష్వక్సేనుడు మరియు చతుర్భుజుడు.

శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః

అజితః ఖడ్గాద్రుగ్ విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః                                   180

మీరు శార్ఙ్గధన్వులు, హృషీకేశులు, పురుషుడు, పురుషోత్తముడు, ఎవరిచేతను జయిన్గాశాక్యము కానివారు, నందకము అను ఖడ్గమును ధరించిన విష్ణువు, మరియు అమితబలశాలియగు కృష్ణుడును మీరే.

సేనానీర్గ్రామణిశ్చ త్వం బుద్ధిః సత్వం క్షమాదమః

ప్రభవాశ్చాప్యయశ్చ త్వం ఉపేంద్రః మధుసూదనః                              181

మీరే దేవతలయొక్క సేనాపతియు, గ్రామముల అధిపతి మీరే. బుద్ధి, సత్వం, క్షమా, దమం అనగా ఇంద్రియనిగ్రహము, సృష్టి, ప్రళయము, --వీటికి కారణభూతులు మీరే. ఉపెంద్రులు, మధుసూదనులు రెడునూ మీరే.

ఇంద్రకర్మా మహేంద్రస్త్వం పద్మనాభో రణాంతకృత్

శరణ్యం శరణం చ త్వం ఆహుః దివ్యా మహర్షయః                     182

ఇంద్రియముల కర్మనొనర్చు  మహేంద్రులు మీరే. యుద్దమును సమాప్తముచేయు  పద్మనాభులూ మీరే. దివ్య మహర్షులుకూడా శరణుకై మిమ్మల్నే పిలుస్తారు.

సహస్రశృఙ్గో వేదాత్మా శతశీర్షో మహర్షభః

త్వం త్రయాణాం హి లోకానాం ఆదికర్తా స్వయం ప్రభుః                183

తమరు మూడు లోకములకును ఆదికర్త మరియు స్వయముగా ప్రభువు. వేలకొలది కొమ్ములు, వందలకొద్దీ శిరస్సులు కలిగిన వేదము అను మహావృషభము మీరే.

సిద్దానామపి సాధ్యానాం ఆశ్రయశ్చాసి పూర్వజః

త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకారః పరాత్పరః             184

సిద్ధులకు, మరియు సాధ్యులకు ఆశ్రయమిచ్చు మహనీయులు మీరే. పూర్వజులు మీరే. యజ్ఞము, వషట్కారము, ఓంకారము మూడు మీరే. మీరు శ్రేష్ఠులకు శ్రేష్ఠులు.  మీరే పరమాత్మ.

ప్రభవం నిధనంచాపి నో విదుః కో భవానితి

దృశ్యసే సర్వభూతేషు గోషు చ బ్రాహ్మణేషు చ                          185    

మీ ఆవిర్భావ తిరోభావములను యెవడున్ను అర్థము చేసికొనలేడు. మీ ఆదికూడా ఎవ్వరికీ తెలియదు. సమస్త ప్రాణులయందు, గోవులయందును, బ్రహ్మనిష్ఠులయందును ఉన్నది మరియు కనిపిస్తున్నది మీరే.

దిక్షు సర్వాసు గగనే పర్వతేషు నదీషు చ

సహస్ర చరణః శ్రీమాఞ్శతశీర్షః సహస్రద్రుక్                                         186

సమస్త దిక్కులయందు, గగనమునందు, పర్వతములయందు, నదీజలములయందు, ఉన్నది మీరే. మీకు వేలకొలది పాదములు, వందలకొలది శిరస్సులు, వేలకొలది నేత్రములు కలవు.

త్వం ధారయసి భూతాని పృథివీం సర్వ పర్వతాన్

అంతే పృథివ్యాః సలిలే దృశ్యసే త్వాం మహోరగః                                  187

మీరు ఈ సమస్త భూతములను, పృథ్వీని, సర్వ పర్వతములను ధరించుచున్నారు. భూమి అంతమైనప్పుడు, జలముపైన గొప్ప సర్పమగు శేషనాగు రూపమున కనిపించునది మీరే. 

త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవా గంధర్వ దానవాన్

అహం తే హృదయ రామ జిహ్వా దేవీ సరస్వతి                                 188 

రామా, మూడులోకములను, దేవ, గంధర్వ, దానవులను ధరించునది మీరే. పరమాత్మా, మీరు అందరిహృదయములను రామించువారు మీరే. నేను బ్రహ్మను, మీ హృదయమును. మీ జిహ్వే సరస్వతి.

దేవా రోమాణి గాత్రేషు బ్రహ్మణా నిర్మితాః ప్రభో

నిమేషస్తే స్మృతా రాత్రిః ఉన్మేషో దివసస్తతథా                              189

ప్రభూ, భ్రహ్మగా నేను సృష్టించిన దేవతలందరును మీయొక్క విరాట్ – శరీరమున రోమములు. మీరు కళ్ళు తెరిస్తే పగలు, మీరు కళ్ళు మూస్తే రాత్రి ఏర్పడుతాయి.

సంస్కారా స్త్వభవన్ వేదా నైతదస్తి త్వయా వినా

జగత్ సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం                              190

వేదములు మీ సంస్కారములు. మీరు లేనిచో ఈ జగత్తుయొక్క అస్తిత్వములేదు. విశ్వము అంతయు మీ దేహము.  భూమి మీ యొక్క స్థైర్యము.

అగ్నిః కోపః ప్రసాదస్తే సోమః శ్రీవత్స లక్షణః

త్వయా లోకాస్త్రయః క్రాన్తాః పురాస్వైర్విక్రమైస్త్రిభిః                                  191

కోపము మీ అగ్ని, మీ ప్రసన్నత్వము చంద్రుడు,  వక్షస్థలమున శ్రీవత్స లక్షణమును ధరించు శ్రీమహావిష్ణువు మీరే, మూడులోకములను పాదములచే ముల్లోకములను కొలిచిన వామనావతారము మీరే.  

మహేంద్రశ్చ కృతోరాజా బలిం బద్ధ్వా సుదారుణం

సీతా లక్ష్మీః భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః                           192  

మీరు మహావీరుడగు దైత్యరాజును బంధించి ఇంద్రుని ముల్లోకములకు రాజుని చేసిరి. సీతమ్మ సాక్షాత్ లక్ష్మీదేవి. మీరు విష్ణుదేవులు. మీరు సచ్చిదానంద స్వరూపులగు కృష్ణభగవానులు. మీరు ప్రజాపతి.  వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం

తదిదం నస్త్వయా కార్యం కృతం ధర్మభ్రుతాం వర                   193

ధర్మిష్టులలో శ్రేష్ఠుడవగు రఘునందనా, మీరు రావణసంహారము కొరకు మానవజన్మను ఎత్తిరి. మాయొక్క కార్యమును మీరు చక్కగా నేరవేర్చితిరి.

నిహతో రావణోరామ ప్రహృష్ఠో దివమాక్రమ

అమోఘం దేవ వీర్యం తే న తే అమోఘాః పరాక్రమాః                  194

శ్రీరామా, మీచే రావణుడు చంపబడ్డాడు. ఇక, మీరు ప్రసన్నపూర్వకముగా మీదివ్య ధామమునకు దయచేయుడు.  దేవా, మీ బలము అమోఘము. మీ పరాక్రమము వ్యర్థముకాదు.

అమోఘం దర్శనమ్ రామ అమోఘః స్తవ సంస్తవః

అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతో నరాభువిః                          195

శ్రీరామ,  మీ దర్శనమ్ అమోఘం రామ,  మీ స్తోత్రమ్ అమోఘము, మీ భక్త జనులు  భువి మీద అమోఘముగా ఉండగలరు అనుటలో ఇసుమంత సందేహము లేదు.

యేత్వాం దేవం ధృవం భక్తాః పురాణం పురుషోత్తమం

ప్రాప్నువన్తి తథా కామాని ఇహ లోకే పరత్ర చ                            196

మీరు పురాణ పురుషోత్తములు. పరమాత్మ. ఎవరు మీ ధ్యానముచేయుదురో వారికి కోరికలు ఇహ మరియు పరలోకముననూ తీరును.

ఇమం ఆర్షం స్తవం దివ్యం ఇతిహాసం పురాతనం

యేనరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః                       197   

ఇదియే పరమ ఋషి అయిన బ్రహ్మదేవుడు చెప్పిన దివ్య స్తోత్రము. ఇది పురాతన ఇతిహాసము. ఇది పఠించువానికి ఎన్నడును పరాభవము కలుగదు.

బ్రహ్మదేవుడు పలికిన ఈ శుభావచనములను విని అగ్నిదేవుడు సీతమ్మను ఓడిలోనిడుకొని చితినుండి పైకి లేచెను.

అబ్రవీత్ తు తదా రామం సాక్షీ లోకస్య పావకః

ఏషా తే రామ వైదేహీ పాపమస్యాం న విద్యతే                            198

అప్పుడు లోక సాక్షియగు అగ్నిదేవుడు శ్రీరామునితో ఇట్లనెను. శ్రీరామా, ఈమె మీ ధర్మపత్నియగు విదేహరాజకుమారి అయిన సీతమ్మ. ఈమె యందు ఏ పాపము, మరియు దోషమున్ను లేదు.

నైవ వాచా న మనసానైవ బుద్ధ్యా న చక్షుషా

సువృత్త వృత్తా శౌటీర్యం న త్వామత్య చరచ్ఛుభా                     199

ఈమె ఆచరణ అత్యుత్తమమైనది. ఈమె శుభలక్షణ. సీతమ్మ మనస్సు, బుద్ధి, వాక్కు, దృష్టి, వీటిద్వారా మిమ్మల్నితప్ప వేరొక పరపురుషుని ఆశ్రయించలేదు. ఈమె సదా మిమ్ములనే అనుసరించినది.  

పిమ్మట మహానుభావుడు అగు శ్రీరాముడు  అగ్నిదేవునితో ఇట్లు పలికెను.

అనన్య హృదయాం సీతాం మచ్చిత్త పరి రక్షిణీం

అహం అన్యవగచ్ఛామి మైథిలీం జనకాత్మజాం                       200

మిథిలేశనందినీ, మరియు జనక కుమారియగు సీతమ్మయొక్క హృదయము సదా నా మీదే లగ్నమైయున్నదని నాకు తెలియును. నేను ఆమె వేరుగాదు. ఆమె నా హృదయము.  నేను ఆమె హృదయము.   

కాని అందరి మనస్సులోని సందేహమును నిర్మూలమొనర్చుటకు ఈ విధముగా చేయవలసివచ్చినది. ఈ విధముగాచేప్పి శ్రీరాముడు ఆనందముతో మిన్నకుండెను. అప్పుడు మహేశ్వరుడు ఈ విధముగా పలికెను. శ్రీరామ, మీరు ధర్మాత్ములు. శ్రేష్ఠపురుషులు. మనుష్యలోకమున మీ తండ్రి దశరథుడే మీ గురువు. శ్రీరాముడు తండ్రి దశరథునికి నమస్కరించెను. అటుపిమ్మట ఇంద్రుడు నమస్కరించి, ‘శ్రీరామా, మీకోరిక ఏమో తెలుపుడు’ అనెను.

మమహేతోః పరాక్రాంతా యే గతా యమసాదనం

తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠంతు వానరాః                            201

దేవేశ్వరా, నా కొరకు యుద్ధమున పరాక్రమము చూపి మరణించిన ఆ వానరులందరూ తిరిగి బ్రతికి లేచుగాక.

అటుపిమ్మట గాయములతో విగత జీవులైపడియున్న ఆ వానరులందరూ, నిద్రనుండి లేచినవారివలె లేచికూర్చుండిరి. అదిచూసి మిగిలినవారందరూ ఆశ్చర్యచకితులైరి.   ఆ వానరులందరినీ రామలక్ష్మణులు తగు రీతిని సత్కరించిరి. అప్పుడు సిగ్గుతోనున్న సీతమ్మను తీసికొని లక్ష్మణునితో సహా పుష్పకవిమానమును (ఉత్తమ) ఎక్కెను. అప్పుడు సుగ్రీవునితో శ్రీరాముడు ఇట్లనెను.

యత్ తు కార్యం వయస్యేన స్నిగ్ధేన చ హితేన చ

కృతం సుగ్రీవ తత్ సర్వం పర్వం భవతా ధర్మభీరుణా                              202

ఒక మిత్రుడు ధర్మపూర్వకముగా యేమేమిచెయవలయునొ అది మీరు ఇంకొక మిత్రుడికి చేసితిరి. మీరు పరిపూర్ణముగా చేసితిరి. మీరు అధర్మమునకు భయపడువారుకారు.   

వానరరాజా, మీరు మీ సేనతో సహా కిష్కింధా పురమునకు శీఘ్రముగా పొండు.  మిత్రమా, విభీషణా, మీరు లంకలో రాజ్యము చేయండి . ధర్మపూర్వకముగా మెలగండి.

అంతటా సుగ్రీవుడు, మరియు విభీషణుడు చేతులు జోడించుకొని ఇట్లనిరి. ఆర్యా, మేమందరమూ అయోధ్య వచ్చెదము  మీ పట్టాభిషేకము కనులారా ప్రత్యక్షముగా చూచెదము. అమ్మ కౌసల్యకు నమస్కరించి ఆమె ఆశీస్సులు గైకొని తిరిగి వెళ్ళెదము.

అంతట శ్రీరామచంద్రుడు వారితో ఇట్లనెను.  ఇది నాకు అత్యంత ప్రియమైన విషయము. తదుపరి వారందరూ కుబేరుని విమానమైన ఉత్తమ ఆసనమైన పుష్పక విమానమునెక్కిరి.

అనంతరము కిష్కింధాపురము చూడంగానే సీతమ్మ పులకింపుతో ఇట్లనెను. మహారాజ, సుగ్రీవుని భార్య తారను, ఇతర వానరస్త్రీలను కూడా వెంటనిడుకొని వెళ్ళెదము. అంతట కిష్కింధాపురము చేరినపిమ్మాట విమానమును ఆపెను. వారిని తోడ్కొని వెళ్ళెను. పదునాలుగు సంవత్సరములు పూర్తి అయిన తదుపరి పంచమి తిథి యందు భరద్వాజుని ఆశ్రమమును చేరి ఆ మునికి నమస్కరించెను. మహాత్మా,  మీరు అయోధ్యగురించి విన్న సమాచారమును నాకు చెప్ప ప్రార్థన అనెను. మా తల్లులు కుశలమా? భరతుని క్షేమసమాచారములు ఎట్టివి? అని శ్రీరాముడు అడిగెను. దానికి ఆ ముని ఇట్లు చెప్పెను. శ్రీరామ, నీ సోదరుడు నీ రాకకై ప్రతీక్షించుచున్నాడు. మీ చరణపాదుకలు ఎదుట నిడుకొని రాజ్యము ధర్మముగా చేయుచున్నాడు. అయోధ్య అంతటా క్షేమముగా ఉన్నది. అక్కడి ప్రజలు, భరత, శతృఘ్నులు, మీ తల్లులు, మరియు ప్రజలు నీ రాకకొరకై నిరీక్షించు చున్నారు. అంతటా శ్రీరాముడు భారద్వాజ మునితో ఇట్లనెను. మహాత్మా నాకు వరమునివ్వకోరతాను. అందుకు ముని సమ్మతించెను. ఇక్కడి వృక్షములన్నియు సమయము కానప్పటికీ ఫలములు, పూలతో శోభిల్లుగాక. అంతటా అవి ఫల పుష్పాదులతో శోభిల్లదొడంగెను.

అంతట తన ప్రియమిృతడు హనుమంతునితో శ్రీరాముడు ఇట్లనెను. మిత్రమా, మీరు శీఘ్రముగా అయోధ్యకు వెళ్లి నా రాకను తెలుపురు అనెను. అంతేగాక శృంగవేరపురమునకువెళ్ళి గుహుని క్షేమసమాచారములు కనుక్కొనండి. మరియు భరతుని క్షేమమును నాతరఫున అడగకోర్తాను. నేను నా కార్యములో సఫలీక్రుతుడనై సీతా లక్ష్మణ సమేతముగా తిరిగివచ్చిన విషయము తెలుపుడు.

అంతట ఆంజనేయుడు తత్ క్షణమే వెళ్లి శ్రీరామ సీతలక్ష్మణులరాకను శృంగవేరపురము లోని గుహునికి తెలిపెను.  అంతట అన్నరాకకై క్రుంగి కృశించిన శరీరముతోనున్న భరతునికి శ్రీరామ సీత లక్ష్మణుల రాకనుగూర్చి తెలియజేసెను.

తమ్ ధర్మమివ ధర్మజ్ఞం దేహబంధమివాపరం

ఉవాచ ప్రాంజలిర్ వాక్యం హనుమాన్ మారుతాత్మజః                203  

మూర్తీభవించిన ధర్మమువలె కనపడు ధర్మజ్ఞుడైన భరతుని వద్దకు వెళ్ళిన ఆ పవనసుత హనుమాన్ చేతులుజోడించి ఇట్లనెను.

శ్రీరాముడు రావణసంహారమొనర్చి సీతాలక్ష్మణ మిత్రసమేతముగా అయోధ్యవచ్చు చుండెను. ముందుగా మీకు ఈ విషయము తెలుపమని నన్ను పంపెను. దానికి పరమానందముచెంది భరతుడిట్లనెను.   

కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతిమాం

ఏతి జీవంతం ఆనందో నరం వర్షశతాదపి                               204

మనుజుడు జీవించి ఉండినచో ఎప్పుడో ఒకప్పుడు ఆనందము పొందును. శత వర్షములపిదప కూడా ఆనందము ప్రాప్తించును. ఇట్టి ఆర్యోక్తి వాస్తవమని నేడు నాకు తెలియుచున్నది.

హనుమంతునిద్వారా శ్రీరాముని శుభాగమనము వార్తవిని భరతుడు మిక్కిలి ఆనందించెను. భరతుడు ఆనందముతో చేతులుజోడించుకొని హనుమంతునితో ఇట్లనెను. ‘చాలా కాలము తరువాత నా కోరిక నెరవేరినది’ అనెను. శతృఘ్నునిఒతొ ఇట్లనెను. నగరమంతా శోభాయమానముగా అలంకరించండి. పూజలు చేయండి.

అంతట విమానమునుండి సీతాలక్ష్మణ మిత్ర సమేతముగా  దిగిన అగ్రజుడయిన శ్రీరాముని పాదాభివందముచేసి ఆనందముతో ఆలింగనము చేసికొనెను. ఉచితరీతిని గౌరవ సత్కారములు అందరికినీ చేసెను.  శ్రీరాముడు ఆనందముతో అనుజుడు భరతుని ఆలింగనము చేసికొనెను. తత్తదుపరి భరతుడు సుగ్రీవుని ఆలింగనము చేసికొనెను.  భరతుడు సుగ్రీవునితో ఇట్లనెను.  

త్వం అస్మాకం చతుర్ణాం వైభ్రాతా సుగ్రీవ పంచమః

సౌహృదాజ్జాయతే మిత్రమపకారోరి లక్షణమ్                                   205

మిత్రమా సుగ్రీవా, మేము ఇప్పుడు అయిదుగురు అన్నదమ్ములము. నువ్వు అయిదవవాడివి. స్నేహపూర్వకముగా ఉపకారముచేయు మిత్రుడు సహోదరుడికంటే ఎక్కువ.  అపకారముచేయుట శతృవు లక్షణము.

తత్తదుపరి భరతుడు విభీశానునితో ఇట్లనెను. రాక్షసరాజా, మా అన్నగారైన శ్రీరాముడు మీ సహాయముపొంది రావణసంహారము అనే మహా దుష్కర కార్యమును చేసెను. ఇది చాల మంచి విషయము.  అనంతరము శ్రీరాముని పాదుకలను తెచ్చెను. వాటిని శ్రీరాముని పాదములకు స్వయముగా తొడిగెను. ఆ తరువాత చేతులు జోడించి రామచంద్రునితో ఇట్లనెను. ప్రభూ, మీరు అప్పగించిన రాజ్యమును మీకు తిరిగి మీ చరణములయందు సమర్పించుచున్నాను. అటుపిమ్మట శ్రీరాముని ఆజ్ఞనుపొంది పరమోత్తమమగు ఆ పుష్పక విమానము తిరిగి కుబెరునివద్దకుచేరెను.  అగ్రజా, మీ పట్టాభిషేకమును సమస్త అయోధ్య ప్రజలు దర్శించుగాక. ఇదియే మా అభిలాష.

యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా

తావత్ త్వమిహ లోకస్య స్వామిత్వ మనువర్తయ                     206

ఎంతవరకు నక్షత్రమండలము పరిభ్రమించుచుండునో, ఎంతవరకు ఈ భూమండలము ఉండియుండునో, అంతవరకూ మీరీ ప్రపంచమునకు ప్రభువులై విలసిల్లుదురుగాక.

ఇంద్రుడు పచ్చని రంగుగల గుఱ్ఱములు లాగు రథముపై ప్రయాణముచేయును. అట్లే ఒక శ్రేష్ఠమైన రథముపై కూర్చొని తన నగరమునకు పోయెను. నగరము ప్రవేశించి తల్లులైన కౌసల్య, సుమిత్ర, మరియు కైకేయిల పాదములకు ప్రణమిల్లెను. అనంతరము వశిష్ఠమహర్షి శ్రీరాముని బ్రాహ్మణ మంత్రాలతో సింహాసనముపై ఆశీనుని చేసెను. వశిష్ట, వామదేవ, జాబాలి, కాశ్యప, కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయులను  ఎనిమిదిమంది స్వచ్ఛ సుగందిత జలముతో సీతాసహిత శ్రీరామచంద్రునకు అభిషేకము చేసిరి.   

ఛత్రం తస్య చ జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం

శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః

అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః                                      207

పిమ్మట శ్రీరామునకు శత్రుఘ్నుడు అందమైన శ్వేతఛత్రమును పట్టుకొనియుండెను. ఒకవైపు వానరరాజగు సుగ్రీవుడు తెల్లటి వింజామరమును పట్టుకొనియుండెను.  ఇంకొకవైపు చంద్రకాంతితో మెరయు చామరమును పట్టుకొని రాక్షసరాజగు విభీషణుడు వీచుచుండెను.

అథ సా వాయుపుత్రాయ తం హారమసితెక్షనా

తేజోధృతిర్యశో దాక్ష్యం సామర్థ్యం వినయోనయః

పురుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నేతాని నిత్యదా                            208

అపుడు మనోహరమైన నేత్రములుగల సీతమ్మ తేజస్సు, ధృతి, యశస్సు, చాతుర్యము, శక్తి, వినయము, నీతి, పురుషార్థము, పరాక్రమము, సద్బుద్ధి—అను ఈ సద్గుణములతో సదా విలసిల్లు వాయుపుత్రుడైన హనుమంతునకు తన కంఠమందలి ముత్యాల హారమును ఒసంగెను.

అంతట విభీషణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, ఇంకా అనేకమంది వీరులందరినీ శ్రీరామచంద్రుడు ఉచితరీతిని సత్కరించెను.  అంతట వారందరూ ఆనందముతో వారి వారి దేశములకు వారి వారి సేనతో వెడలిరి.     

రాజ్యం దశ సహస్రాణి ప్రాప్య వర్షాన్ రాఘవః

శత అశ్వమేధానాజహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్                      209

శ్రీరాముడు రాజ్యమును పొందినతదుపరి పడునొకండువేల సంవత్సరములు పరిపాలించెను. నూరు అశ్వమేథయజ్ఞములను ఆచరించెను. ఆ యజ్ఞములకు ఉత్తమ అశ్వములు విడువబడెను.  మరియు ఋత్విక్కులు భూరిదక్షిణలుపొందిరి. 

న పర్యదేవన్ విధవా చ న వ్యాలకృతం భయం 

న వ్యాధిజం భయం చాసీద్ రామే రాజ్యం ప్రశాసతి                          210

శ్రీరాముని రాజ్యకాలమున భర్తను పోగొట్టుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉండెడిది. సర్పములు, మొదలైన విషజంతువుల భయము లేకుండెను. రోగచింతన ఉండెడిది కాదు.

నిర్ద్యురభవల్లోకో నానర్థం కశ్చిద్ అస్పృశత్

న చ సమ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే                           211   

శ్రీరాముని రాజ్యములో దేశమునందు దొంగలభయముగాని, దోపిడిదారులయొక్క బెడద గాని వినిపించెడిదికాదు. అనర్ధకరములైన కార్యములను చేయుటకు యెవ్వడు సాహసింపడు. పిల్లలకు వృద్ధులు ప్రేతకార్యములను చేసెడివారుకాదు.  

సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరః  అభవత్ 

రామమేవ అనుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం                            212

ప్రజలందరూ చాలా సంతోషముగా ఉండిరి. అందరు ధర్మపరాయణులై ఉండిరి.  శ్రీరాముని పైనే ప్రజలు దృష్టిని ఉంచుతూ, ఒకరు మరియొకరికి కష్టమును కలిగించకుండిరి.

ఆసాన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః 

నిరామయా నిశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి                             213

శ్రీరాముడు రాజ్యముచేయునప్పుడు జనులు వేలకొలది సంవత్సరములు జీవించు చుండిరి.  గొప్ప సంతానము కలిగియుండిరి. వారికి రోగము, శోకము ఉండెడిది కాదు.

రామో రామో రామఇతి ప్రజానామ భవన్ కథా

రామభూతం జగత్ అభూత్ రామే రాజ్యం ప్రశాసతి                                 214

శ్రీరాముడు రాజ్యమేలుతున్న కాలములో ఎక్కడ చూసినా ‘రామ రామ రామ’ అని రామ నామమే వినబడుతుండెడిది. రాజ్యమంతా రామ నామముతో మ్రోగిపోవుచుండెడిది.

ఆసాన్ ప్రజా ధర్మపరా రామే శాసతి నానృతాః

సర్వ్ లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః                 215

శ్రీరాముడు రాజ్యమేలుతున్న కాలములో ప్రజలందరూ ధర్మ నిరతులై ఉండిరి.  అసత్యము చెప్పకుండిరి. సర్వులు ఉత్తమలక్షణములతో శోభిల్లుతుండిరి. అందరు ధర్మమునే ఆశ్రయించుకొని యుండిరి.

ధర్మ్యం యశస్య మాయుష్యంరాజ్ఞాం చ విజయావహం

ఆదికావ్యమిదం చార్షం పురా వాల్మీకినా కృతం                                216

ఇది ఆదికావ్యమయిన రామాయణము. ఇది పూర్వము వాల్మీకి మహర్షి రచియించినది.

ఇది ధర్మమును, కీర్తిని, బలమును, ఆయుస్సును వృద్ధినొందించును.  ఇది రాజులకు విజయము చేకూర్చును.  

శృణోతి య ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం

శ్రద్ధ దానో జితక్రోధో దుర్గాణ్యతిత రత్యసౌ                               217

ఎవడు ఈ కావ్యమును శ్రద్ధాపూర్ముగా వినునో అట్టివాడు క్రోధమును జయించును. ఘోర సంకటములను సహితము దాటివేయగలుగును.                           

ఆదిదేవో మహాబాహుః హరిః నారాయణః ప్రభుః

సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠః శేషోలక్ష్మణ ఉచ్యతే                           218

సాక్షాత్తు ఆదిదేవుడును, మహాబాహువును, పాపహారియు, ప్రభువును అగు నారాయణుడే రఘుకుల తిలకుడు అగు శ్రీరాముడు. ఆదిశేషువే లక్ష్మణుడు. అని చెప్పబడును.

ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభం చ          

శ్రోత్రస్య మే తన్నియమేన సద్భిరాఖ్యాన మోజస్కరం వృద్ధికామైః               219

ఈ కావ్యము చదివిన లేక విన్నవారికి ఆయుస్సు, ఆరోగ్యము, కీర్తి, మరియు సోదరప్రేమ వృద్ధి చెందును.  ఇది ఉత్తమబుద్ధిని ఒసంగును. ఇది మంగళకరము. ఈ ఇతిహాసమును నియమపూర్వకముగా శ్రద్ధగా శ్రవణము చేసిన సమృద్ధిని ఒసగును.  


Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana